- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మన కళ్ళకు కనబడే ప్రపంచమూ, సంఘటనలే మనకు యదార్థం. మన శరీరానికి ఏ రాయో తగిలితే కలిగే బాధ వల్ల రాయి యదార్థత మరింత బాగాతెలుస్తుంది కూడా. స్పర్శ ద్వారానో, గాయంవల్లనో రాయి గురించి మనకు కలిగే అవగాహనతో రాతికి సంబంధమేమీ లేదు. చైతన్యం (కాన్షస్‌నెస్) ఉన్న ప్రాణులన్నిటికీ ఈ వ్యక్తిగతమైన (సబ్జెక్టివ్) అవగాహన ఉంటుంది. వస్తుపరమైన యథార్థత (ఆబ్జెక్టివ్ రియాలిటీ) అనేదానికీ, మన చైతన్యానికీ సంబంధం లేదని లెనిన్ అన్నాడు. మనుషుల ఉనికికి వారి చైతన్యం కారణం కాదనీ సమాజంలో వారి ఉనికి వల్లనే వారికి చైతన్యం ఏర్పడుతుందనీ మార్క్స్ అన్నాడు. మార్క్సిస్టులు కాని ఐన్‌ష్టయిన్ వంటి మేధావులు కూడా యథార్థానికీ మన చైతన్యానికీ సంబంధమేదీ లేదని అంగీకరించారు.
పదార్థమూ, జీవపదార్థమూ ఎలా పరిణామం చెందాయో తెలుసుకుంటే ప్రాణులకు ఈ చైతన్యం ఎలా కలిగిందో అర్థమవుతుంది. మెదడూ, నాడీమండలమూ విపరీతంగా అభివృద్ధి చెందిన మనిషిజాతికి ఈ అవగాహన అత్యున్నతస్థాయిలో ఉంటుంది. మనిషి తల్లి కడుపులో పిండ దశలో ఉండగానే చైతన్యం, స్పృహ అనేవి ప్రాథమిక స్థాయిలో మొదలవుతాయి. పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇవి ఎక్కువై, వ్యక్తిగత, వస్తుగత యదార్థతలకు తేడా లేకుండా పోతుంది. మన దేశపు వేదాంత ధోరణి అతిగా తలకు పట్టించుకుంటే మానసిక చైతన్యమే యథార్థమనీ, మనకు కనబడే లోకమంతా మిథ్య అనీ కొందరికి అనిపిస్తుంది.
ఎంతటి మిథ్యావాదులైనా మెదడు కూడా విశ్వంలోని పదార్థరాశిలో ఒక భాగమేనని ఒప్పుకుంటారు. మనసు, లేదా బుద్ధి అనేదానికి మెదడుతో సంబంధం లేదనే ఒక ప్రతిపాదన ఉంది. దీనికి ఇంతవరకూ సరైన రుజువేదీ దొరకలేదు. మెదడుకు “వెలపల” రూపొందిన భావనలేవీ కనబడవు. మెదడు గురించి నిరంతరంగా సాగుతున్న పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన నిజాలు బైటపడుతున్నాయి. మెదడులోని కోటానుకోట్ల నాడీకేంద్రాల మధ్య ప్రసారమయే ఎలక్ట్రిక్ సందేశాలూ, మెదడులో తాత్కాలికంగా విడుదల అయే రసాయనిక పదార్థాలూ రకరకాల భావనలు కలగజేస్తాయని తెలుస్తోంది. ఇదంతా సరిగ్గా అర్థం అయేలోపలే తొందరపడి పెద్ద ప్రతిపాదనలు చెయ్యడంవల్ల ఉపయోగం ఉండకపోగా మరింత అయోమయం పెరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రతిపాదనకు ఆధారాలన్నీ వ్యక్తిపరమైన భావనలే.
మెదడూ, కొన్ని రకాల ప్రాణులకు ఉన్న నాడీమండలమూ ఎప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో రూపొందాయో విజ్ఞానం చెపుతుంది. ఈ సందర్భంలో 450కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన భూమి మీద మనుషులు పుట్టి 20 లక్షల సంవత్సరాలే అయిందని గుర్తుంచుకోవాలి. అంటే మనిషికి తన మెదడు ద్వారా లభిస్తున్న స్పృహ ఏర్పడని కోట్లాది సంవత్సరాల క్రితం నుంచీ పదార్థం (మేటర్) అనేది ఉంటూనే ఉంది. మనిషి మెదడులోని కణజాలం ఆలోచనకూ, జ్ఞాపకశక్తికీ, వివేచనకూ తోడ్పడుతుంది కాని అది కూడా పదార్థంతో రూపొందినదే. నిర్జీవపదార్థానికి వర్తించే భౌతికసూత్రాలన్నీ దానికీ వర్తిస్తాయి. విశ్వంలోజరుగుతున్న సంఘటనలను గమనిస్తే పదార్థం గురించిన అవగాహనకన్నా పదార్థమే ప్రాథకమికమైనదీ, మౌలికమైనదీ అని తెలుస్తుంది.
నిజమైన ఆధునిక సంస్కృతి, లేక కల్చర్ భౌతికశాస్త్రంవల్లనే కలుగుతుందని రిచర్డ్ ఫేన్‌మన్ అన్నాడు. ఈనాటికీ ప్రపంచంలోని మతాలన్నీ ఆటవికలక్షణాలతో నృత్యం చెయ్యడం చూస్తూంటే అది నిజమనిపించకమానదు. మూఢనమ్మకాలూ, వికృతమైన ఆచారాలూ, నిరూపించనవసరంలేని ప్రతిపాదనలూ ఈ మతాలకు ఆధారాలు. ఒకవంక సమాజాన్ని దోపిడీచేస్తూ దానికి గురి అయినవారి బలహీనతలని ఉపయోగించుకుంటూ అందుకు కారణాలని “పర”లోకంలోచూపించే మతప్రచారకులు ఎలాంటివారో మామూలుగా అందరికీ తెలియదు. రకరకాల జంతువుల తలల దేవుళ్ళతో కొన్ని మతాలూ, సంగీతమూ, కార్టూన్లూ తమకు విరుద్ధమనే మతాలూ, కష్టాలతో ప్రాణంమీదికొచ్చినవారిని దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ప్రేమతో కాపాడతాడనే మతాలూ ఇలా ఎవరిదారినవారు ప్రజలని శాయశక్తులా భ్రమపెడుతూ ఉంటారు. ఇంతకన్నా”ఆధునిక” పద్ధతిలో అయోమయం సృష్టించే తత్వవేత్తలూ ఉన్నారు.
మతాల ప్రచారాన్నీ, ఆధ్యాత్మికవాదులనీ పక్కన పెడితే నిజమైన జీవపరిణామం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి నిజాయితీతో ప్రయత్నించవచ్చు. శాస్త్రపరిశోధనలు ఈ పద్ధతిలోనే జరుగుతూ వస్తున్నాయి. శాస్త్రీయంగా ఈ నాడు నిరూపితమైన సిద్ధాంతాలకి అడ్డుతగిలే ఫలితాలు ఎదురైనప్పుడల్లా ఆ సిద్ధాంతాలని మార్చుకోక తప్పదు. ఇందులో ప్రవచనాలని గుడ్డిగా నమ్మే ప్రసక్తి ఉండదు. ఐన్‌ష్టయిన్ అంతటివాడే మొదట్లో క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలని ఆమోదించలేదు. ప్రస్తుతం విజ్ఞానం పదార్థాన్నీ, వికిరణాలనీ (రేడియేషన్) విశ్లేషణ ద్వారా అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. విద్యుత్తుగల కణాలని పార్టిక్‌ల్ ఆక్సిలేటర్లలో పరిగెత్తించి ఒకదాని కొకటి ఢీకొనేట్టు చేసి విశ్వం ఆవిర్భావానికి దారితీసిన బిగ్ బేంగ్ పెద్ద పేలుడు పరిస్థితులను కృత్రిమంగా సృష్టిస్తున్నారు. ఆ విధంగా విడుదల అయిన విపరీతమైన శక్తివల్ల అతి తక్కువ జీవితకాలం కలిగిన కొన్ని సూక్ష్మకణాలు ఎలా ఉత్పత్తి అవుతాయో గమనించడం వీలవుతుంది. ఇప్పుడు కనబడుతున్న విశ్వాంతరాళంలోని పదార్థరాశికి ఇటువంటి లక్షణాలు ఎలా కలిగాయో ఈ పరిశోధనలవల్ల తెలిసే అవకాశముంది. బరువూ, విద్యుత్తూ కూడా లేని న్యూట్రినో కణాలూ, కంటికి కనబడని డార్క్ మేటర్ అనబడే “అదృశ్య” పదార్థరాశీ వగైరాల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా “ఎందుకు” జరిగిందనేది పట్టించుకోకుండా “ఎలా” జరిగిందని పరిశోధిస్తున్నారు.
గట్టిగా ప్రయత్నిస్తే తప్ప కనబడని సంఘటనలు అంతరిక్షంలో ఎన్నెన్నో ఉన్నాయి. మహా ఉత్పాతం కలిగిస్తూ పేలిపోయే నక్షత్రాలూ, వాటినుంచి ప్రసారం అయే అతి తీక్షణమైన కిరణాలూ, ఎక్కణ్ణించి వస్తున్నాయో అంతుచిక్కని గామా, ఎక్స్ రేల ప్రసరణమూ, ఊహించరానంత దూరాన ఉండి, అతివేగంగా బొంగరాల్లా తిరిగే క్వేజార్లూ, పల్సార్లూ ఇలా వింతలెన్నో జరుగుతూనే ఉన్నాయి. వీటి తీవ్రతతో పోలిస్తే మనం వీటిని గమనిస్తున్నామో లేదో అనే విషయం ఏ మాత్రమూ అర్థంలేనిదిగా అనిపిస్తుంది. గమనికకు గురి అవుతున్న ఇవన్నీ ఎలా ఆవిర్భవించాయో తెలుసుకుంటూ, గమనించడం అనే శక్తి మనకు అసలు ఎలా అబ్బిందో కూడా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాదు. దీనివల్ల మనకున్న అపోహలు చాలామటుకు తగ్గే అవకాశం కూడా ఉంది.
ఇది పూర్తిగా “ఆత్మ మాత్రమే నిజం, దానికి పుట్టుకా, చావూ లేవు” అనే సిద్దాంతాన్ని చావిదెబ్బ తీస్తోంది. ఆత్మల గురించీ, దేవుడి గురించి మాట్లాడేవారు వాదనకు ఒప్పుకోరు. దేన్నీ ప్రశ్నించరాదంటారు. దానివల్ల మరింత మూర్ఖత్వం పెంచుకోవడం తప్ప ఒరిగేదేమీ లేదు.
పదార్ఠము లేనిదే స్పృహ లేదు. ఎవరి బుద్ది ఎలాంటిది, ఎవరి కర్మ ఎలాంటిది అనే ప్రశ్నలకు పూర్వజన్మ సుకృతమనే పాతచింతకాయ పచ్చడే ఇంకా సమాధానం అనుకోవడం మూర్ఖత్వం. పదార్థ సంక్లిష్టత ఇంకా లోతుగా అర్థమయ్యేకొద్దీ వీటి అన్నిటిని తెలుసుకోవచ్చు.
మంచి వ్యాసం అందించిన రోహిణీప్రసాద్ గారికి కృతజ్ఞతలు.
–ప్రసాద్
http://blog.charasala.com