- ఖాజా
ఏ కులమని నను వివరమడిగితే
ఏమని చెప్పుదు లోకులకూ
లోకులకు పలుగాకులకూ
దుర్మార్గులకూ ఈ దుష్టులకూ- …………………………………….
ఇంటిలోపలను యిల్లు గట్టుకొని
మంటలోపల రాటం బెట్టుక
కంటిలోపల కదురు బెట్టుకొని
ముక్కులోపల యేకు బెట్టుకొని
చేతిలో బాక చేతికి తీసుక
నారాయణ యను నరము తీసుకొని
అష్టాక్షరియను తడిక వేసుకొని
పంచాక్షరి యను పంచదీసుకొని
తకథిమ తకథిమ గుబదెబ గుబదెబ
ఏకిన కులమే మా కులము
ఏకిన ఏరులు పీకిన పిందెలు
లోకమంతనొక పాపము జేసుక
ఏకిన కులమే నా కులము
(దూదేకుల సిద్దప్ప తత్వం)
ఏ అవమానానికి ప్రతిగా చెప్పాడో, ఏ ప్రశ్నకు సమాధానమిచ్చాడో కానీ - సిద్దప్ప కులం గురించి ప్రశ్నలనెదుర్కొన్నాడని అవమానింపబడ్డాడని - మాత్రం దీనివల్ల అర్ధం అవుతుంది. పోతులూరి వీరబ్రహ్మం వద్ద శిష్యరికం చేసిన సిద్దప్ప - కులమత అంతరాలను, విద్వేషాలను సామాజిక అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించాడు. తన తత్వాలలోను, వచనాలలోనూ ఇదే విషయాన్ని బోధించాడు. ప్రచారం చేశాడు.
దాదాపు మూడు శతాబ్దాల కిందట దూదేకుల సిద్దప్ప చెప్పిన తత్వం ఇది. ‘ ఏ కులమని నను వివరమడిగితే’ అనడంలో ‘మీదేకులం’ అని ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానంగా సిద్ధప్ప చెప్పిన ఈ వాక్యం రెండు శతాబ్దాలు గడిచాక ‘మీదేకులమన్న ప్రశ్న’ వెలయించి చివాలున లేచిపోవుచో - బాకున కుమ్మినట్లుగున్’ అన్న జాషువా పద్యం కూడా ‘ ఇదే ప్రశ్నకు’ సమాధానం. అంటే రెండువందల ఏళ్ల తర్వాత కూడా సమాజం పరిస్థితిలో, నిచ్చెనమెట్ల వ్యవస్థలో ‘గౌరవాల’ స్థాయిలో ఏ మార్పూలేదని మనం అర్ధం చేసుకోవచ్చు.
దూదేకుల సిద్ధప్పకు జాషువాకు ఎదురైన ప్రశ్నే మళ్లీ ఇరవయ్యో శతాబ్దపు చివర్లో మళ్లీ మద్దూరి నగేష్‌బాబుకూ ఎదురైంది. అందుకే నగేష్‌బాబు ‘మీరేవుట్లు’ కవిత వొచ్చింది.
“మేం ఎవరిమైతే మీకెందుకంట?
మేము ఏవుట్లమైతే మీకెందుకంట?
మా కులమేందో తెలియకపోతే మీకు తిన్నది అరగదా?
మా పుటకేందో తెలుసుకోకపోతే మీ తూరుపు తెల్లారదా?'’
(మద్దూరి నగేష్‌బాబు - మేరేవుట్లూ…?)
అంటే మారుతున్న కాలంతో పాటుగా ‘మీదేకులం’ అన్న ప్రశ్న పదునుదేరింది తప్ప పాతబడలేదు మాసిపోలేదు. ఆయాకులాలకు, ఆయా అవమానిత దళిత జాతులకు ప్రతినిధులుగా ఈ ముగ్గురు కవులు గొంతు విప్పారు. అంటే మొత్తం జాతి పొందుతున్న అవమానానికి, తలెత్తుకునే స్థితిలేని సామాజిక అణచివేతకు ఈ కవితలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
మనుషులంతా కులాలుగా, మతాలుగా, జాతులుగా విడిపోయి తప్ప కలిసి బతకలేని స్థితి భారతీయ సమాజంలో వుంది. ఇది ఈనాటిది కాదు. ఆర్యజాతి భారతగడ్డమీద అడుగుపెట్టినపుడు జరిగిన వేర్పాటు. ఈ కుట్రపూరిత వేర్పాటు వాదానిది ఊసరవెల్లి తత్వం. ఇది స్థానాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి తన ఉనికిని, స్వభావాన్ని మార్చుకుంటుంది. కాలంమారినా స్థితిమారినా స్థలం మారినా, మతం మారినా అంటరానితనపు ముద్ర దళితుల్ని వెంటాడుతూనే వుంది.
శతాబ్ధాల కింద హిందూ, దళిత, బహుజనులు ఇస్లాంలోకి మతం మార్చుకున్నారు. అలా మతం మారడానికి ముందు వీరు నవారునేత, బట్టలనేత, గుర్రాలు కాయడం, పరుపులు కుట్టడం, గుంటమగ్గం నేత వంటి వృత్తులమీద ఇతర తక్కువహోదా కలిగిన కులవృత్తులమీద ఆధారపడి బతికేవారు, హిందూ అణిచివేత నుంచి వెలివేతలనుంచి బయటపడాలని కలలు గన్న వీరికి ఇస్లాం మతం కొత్త వెలుగులా కనిపించింది. ఆకర్షించింది. మతం మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈమత మార్పిడివల్ల తమకేదో అద్భుతం జరగబోతుందని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. అణచివేత, అవమానం అలాగే మిగిలాయి. పెద్దమార్పులేదు.
కొత్తమతంలో వీరంతా దూదేకులయ్యారు. అనుకున్నంత హోదా, గౌరవం దక్కక అయోమయస్థితిలో మిగిలిపోయారు.
మతం మారిన తర్వాత వీరి రోజువారి జీవనంలోనూ, వేషంలోనూ, భాషలోనూ, ఆహారపు అలవాట్లలోనూ పెద్దమార్పులు చోటుచేసుకోలేదు. పూర్తి ముస్లింలుగా వీరిలో మార్పులు (muslimisation) జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో సూఫీ ప్రవక్తల ప్రభావంతో దర్గాలకు, జెండా చెట్లకు మొక్కులు చెల్లించుకునే దళిత బహుజనులు అనేకమంది వున్నారు. ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేని కొన్ని ఊర్లలో ఉర్సులు, పీర్ల పండగలు జరిపే దళిత బహుజన కుటుంబాలున్నాయి. అంటే మతం మారకపోయినా వీరు ముస్లిం సంప్రదాయాలను, ఆచారాలను పాటించడం చూడవచ్చు. హలాల్ చేయనిదే మాంసం ముట్టని దళిత బహుజనులూ వున్నారు. అయితే వీరు హిందువులుగా తమ మతంలోని ఆచారాలను పాటిస్తూ ముస్లిం - ఆచారాలనూ అలవరచుకున్నారు. దసరా పండుగ చేసినట్టే పీర్ల పండగనూ చేసుకుంటున్నారు.
ఇదే స్థితి దూదేకుల్లోనూ ఉంది. అంటే సరళీకరించిన ముస్లిం ఆచార వ్యవహారాలను పాటించే దూదేకులు - హిందూ సంస్కృతి నించి కూడా పూర్తిగా బయటపడలేదు. అందుకే పీర్లపండుగనూ దసరాను దూదేకులు ఒకేరకంగా జరుపుకునే స్థితి ఉంది. నిజమైన ఏకత్వాన్ని, పరమత సహనాన్ని స్నేహభావాన్ని దూదేకుల జీవితం ప్రతిబింబిస్తుంది.
దూదేకులకు భూమి, విద్య, సొంత ఆస్తి, సాంఘిక హోదా లాంటివేమీ లేవు. రెక్కల కష్టం మీద బతికే అట్టడుగు స్థాయి వర్గంగా, ముస్లిములలో రెండో తరగతి వారుగా దూదేకులు సామాజిక అణచివేతకు గురవుతున్నారు. దూదేకటం, పరుపులు కుట్టడం, నవారునేత, బ్యాండు సన్నాయి మేళం వాయించటం, సోడాలు అమ్మటం, టైలరింగ్, మెకానిక్ పనులు, వ్యవసాయ కూలీ వంటి సామాజిక గౌరవం దక్కని అల్పాదాయ వృత్తులపై ఆధారపడి బతుకుతున్నారు.
చదువులోనూ, ఉద్యోగ, రాజకీయ రంగాల్లోనూ దూదేకులు వెనుకబడి ఉన్నారు. 1960 ల తర్వాత మొదటి తరం చదువుకోవటం మొదలుపెట్టింది. అయితే ఈ చదువులు వీళ్లను గుమస్తాలు, టీచర్ల స్థాయిని మించి ముందుకు తీసుకెళ్లలేదు. ఇంజనీర్లు, డాక్టర్ల వంటి వారు దూదేకుల కులంలో వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇక ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. స్థాయిలో ఒక్కరు కూడా లేరు. పారిశ్రామిక వేత్తలు, క్యాపిటలిస్టులు భూతద్దంతో వెదికినా దొరకరు. రాజకీయాల్లో జెండాలు మోసేవారుగా, ఉద్యమాలలో బ్యానర్లు కట్టేకవాళ్లుగా తప్ప పదవులకు, ప్రాతినిధ్యానికి వేల మైళ్ల దూరంలో వున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన బి.సి.’బి’ రిజర్వేషన్ కూడా దూదేకుల విద్యా, ఉద్యోగ, ఆర్ధిక స్థాయిలో పెద్దగా మార్పు తేలేకపోయింది. ముఖ్యంగా మిగతా బి.సి.లతో పోటీలో దూదేకులు వెనుకబడిపోక తప్పలేదు.
బ్రాహ్మణీయ రచయితలు, సినిమా రంగం దూదేకులను పింజారీ వెధవలు చేసింది. ముస్లిం సమాజం వీళ్లను లథాఫ్‌లను చేసింది.
ఇక తెలుగు సాహిత్యంలో దూదేకుల కవులు, రచయితలు పద్యరచనా కాలం నుంచీ వున్నప్పటికీ వారు సాధారణ బ్రాహ్మణీయ సాహిత్య వొరవడిలోనే రాయక తప్పలేదు. ఆధునిక కవుల్లో దిలావర్, ఖమ్రొద్దీన్, యాకూబ్ వంటి వారు తెలుగు కవిత్వంలో తమదైన స్థానాన్ని నిలుపుకున్నారు. అసలు సాహిత్యంలోకి ప్రవేశించే కవులుగా, రచయితలుగా నిలబడ్డమే కష్టమైన స్థితిలో సమకాలీన కవిత్వం రాసి తమదైన ముద్రను సాహిత్యంపై వేయగలిగారు. కానీ - స్వంత అస్థిత్వాన్ని మాత్రం సాహిత్యంలో ప్రవేశపెట్టలేకపోయారు.
దళిత సాహిత్యంలో వివిధ కులాలు తమ ప్రత్యేక అస్థిత్వాల గురించి ప్రశ్నించడం మొదలైన తర్వాత - దూదేకులు కూడా తమ జీవన వాస్తవాలను సాహిత్యంలో ప్రతిబింబించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇన్నేళ్లుగా సాహిత్య గౌరవానికి నోచుకోని దూదేకుల జీవితంలోని అనేక కోణాలను సాహిత్యానికి పరిచయం చేశారు.
“ఏకుతున్న దూది పింజెలు పింజెలుగా విడిపోయి
అమ్మముఖం ముందు గాల్లో ఎగురుతుంటే
చంద్రుని ముందు మబ్బుతునకలు తారట్లాడినట్లుంటుంది
పత్తిచేళ్ల మధ్య దూదితీసిన పత్తిగింజైపోయిన
నా ముసలి తల్లి
కవానేలాడదీసి దారాన్ని లాగుతూ దూదేకుతుంటే
నా నరాల్నెవరో వీణతీగలు చేసి మీటుకుంటున్నట్టుంటుంది'’
(ఖాజా – మా…)
1995 ఫిబ్రవరిలో వెలువడిన ఈ కవిత దూదేకుల కష్టాన్ని సాహితీ పటం మీద ఆవిష్కరించింది. దూదేకుల జీవితానికి, శ్రమకు సాహిత్య గౌరవాన్ని కల్పించింది.
“పగిలిపోయిన సర్కారు దవాఖానా కళ్లద్దాల్లోంచి -
వణుకుతున్న ముడతలు పడ్డ చేతులతో మా అమ్మ
చినిగిన చొక్కాలకు మాసికలూ - బొంతలకు అతుకులూ కుడుతుంటే
నా గుండెకెవరో మిషను కుట్టేస్తున్నట్టుంటుంది
పరుపులు కుట్టీ కుట్టీ అలసిపోయిన అమ్మ
కటికనేలమీదలా నడుంవాల్చి కునుకుదీస్తే
కాబూలీవాడి అప్పు కల్లోకొచ్చి
లాగిపెట్టి తన్ని లేపుతుంది.
(ఖాజా – మా…)
దూదేకులు సామాజికంగా, ఆర్ధికంగా దీనమైన స్థితిలో వున్నారు. శ్రమను నమ్ముకొని బతుకుతున్నారు. చాలీచాలని సంపాదనతో కనీసం మూడుపూటల తిండి దొరక్క దరిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. అప్పుల పాలైపోయి బికారులుగా దిగజారిపోతున్నారు.
ఈ పరిస్థితులను దూదేకుల కవిత్వం బలంగా వ్యక్తీకరించింది. ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా తమమీద కొనసాగుతున్న అణచివేతను ప్రశ్నించింది. ఇస్లాం మతంలో అసలు కులమే లేదని చెప్తూనే దూదేకులను తక్కువగా చూసే, ఎగతాళి చేసే ‘మోలీసాబ్’ల మోసాన్ని నిలదీసింది. తమ సాంస్కృతిక వెనకబాటును చూసి ఈసడించుకునే ‘ఛాందస’వాదులను - తమ పేదరికాన్ని చులకన చేసే నవాబులనూ దూదేకుల కవిత్వం కాలర్‌పట్టి నిలదీస్తుంది.
సామాజిక - సాంస్కృతిక దృష్టి
దూదేకుల కవిత్వం తమ సాంస్కృతిక - సామాజిక వెనకబాటును కవిత్వీకరించింది. ఒక సామాజిక సమూహంగా తమ అస్థిత్వ సమస్యను, ఒక కులంగా ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను, మతంలోని వారిగా ఎదుర్కొంటున్న అవమానాలను దూదేకుల కవిత్వం ఎజెండా మీదకు తెచ్చింది
.
“చెబితే నమ్మరేమో కానీ చెప్పుకుంటే మీ ముందు
పలచనై పోతామని భయం
పెంటు సాబు, ఉద్దండు, దస్తగిరి, నాగులు, చిన ఆదాం
లాలు, పెదమౌలా, చినమౌలా, షేకు శ్రీనివాసు
బేతంచర్ల మొయిను, పాటికట్ట మల్సారు - ఇవే కదా మా పేర్లు'’.
(యాకూబ్ - అవ్వల్ కలిమ)
ముస్లిమీయతను పూర్తిగా సంతరించుకోలేక పోయిన దూదేకుల అంతర్మధనాన్ని ఈ కవితలో యాకూబ్ వ్యక్తికరించిన తీరు అద్భుతమైంది. ముస్లింలమని ఎంతో ‘గాంభీర్యం’గా చెప్పుకునే దూదేకులు, ముస్లింల నుంచి ఎదుర్కొనే వివక్షను బయటికి చెప్పలేక లోలోపలే దుఃఖిస్తున్నారు. హిందూపేర్లతో, హైందవ సంస్కృతిని ఆచరిస్తూ ముస్లింలుగా వుంటూ రెండు సంస్కృతుల మధ్యా నలిగిపోతున్నారు.
“షేక్, సయ్యద్, పఠాన్ - మీ దర్పాల హోదాల ఖాందాన్ల
పేర్లుచెప్పి మమ్మల్ని దగ్గరికైనా చేరనిచ్చారా!
లద్దాఫ్, దూదేకుల, కసాబ్, పింజారీ………
వృత్తిని కులమై కరిచిన కాలపు గుర్తులమయ్యాం.'’
(యాకూబ్ - అవ్వల్ కలిమ)
భారతీయ కులసమాజపు ప్రభావంతో ముస్లిములు కూడా ఇక్కడ హెచ్చుతగ్గులుగా విడిపోయి వున్నారు. షేక్, సయ్యద్, పఠాన్‌లు అష్రాఫ్ (ఉన్నత వర్గం)గా చెలామణి అవుతుండగా లద్దాఫ్, నఫ్రూ, గొడారి, కాసి వంటి కులాలన్నీ అజ్లాఫ్ (కిందివర్గం)గా ఉన్నత ముస్లిం సమాజానికి దూరంగా - అంటరానివారుగా వుంటూ అవమానాలు ఎదుర్కొంటున్నారు.
” ఈ లోకాకులన్నీ నన్ను ఏకాకిని చేసి
ఏకుల్లో తొక్కిస కథ యిది
మసీదుని నాలుగు గుమ్మటాలతో భాగించినట్లు
అందర్నీ పోగులుగా కలిపినేసిన మతం తానుని
ఎక్కువ తక్కువ ముక్కలుగా చింపిన
మను ముల్లాల సంగతి యిది.
అందరూ సమానమేనని చెప్పిన అల్లాకళ్లలో కారం కొట్టి
నా నిచ్చెనమెట్లను తెగనరికి
నన్నో మరుగుజ్జుగా మలిచిన
మోసపు మోలీసాబ్‌ల నమ్మక ద్రోహమిది'’
(ఖాజా - ఏకేకులం - 1)
అల్లా ప్రతిపాదించిన ‘ఇస్లాం’ కులాలకు అతీతమైనది. అసమానత్వానికి, కులవ్యవస్థకు చోటులేని ఇస్లాంకు ఇక్కడి ముల్లాలు మనువాదులై కులజాడ్యాన్ని అంటించారు. అందరూ సమానంగా వుండాల్సిన చోటు కొందర్ని తక్కువ వాళ్లను చేసి అట్టడుగుకు నెట్టివేసిన ముల్లాలను, మనువులుగా పోలుస్తున్నాడు కవి.
దూదేకుల్లో దేశం గర్వించదగిన కళాకారులున్నారు. ముఖ్యంగా నాదస్వర సామ్రాజ్యాన్ని ఏలిన షేక్ చినమౌలానా వంటి విద్వాంసులు, బుర్రకథా పితామహుడు నాజర్ వంటి కళాకారులు దూదేకుల కులం నుంచి ఎదిగిన ప్రముఖులు. నిజానికి దూదేకుల కులంలో నాదస్వర విద్వాంసులు అనేకమంది వున్నారు. ముఖ్యంగా దేవాలయాల్లో, పండుగలు, దేవుళ్ల ఊరేగింపుల్లో, పవళింపు సేవల్లో, మేల్కొలుపు సేవల్లో దూదేకుల విద్వాంసుల నాదస్వరాలాపన ఎంతో ప్రాముఖ్యత కలిగి వుంది. అదే సందర్భంలో వీరిపై అవహేళన, అణచివేతకూడా ఉంది.
“నేను లేకుండా
నా మట్టికాళ్లీ గుళ్లలోకి నడవకుండా
నాజుమ్మా స్నానాల దూదేకుల కంపులేకుండా
నా ఎంగిలి పీకల సుప్రభాతాలు లేకుండా
ఇక్కడ ఏ దేవుడికీ కనీసం మెలకువైనా రాదు
వాడి పవళింపు సేవకోసం
పాటను పన్నీటి జల్లును చేసింది నేను
వాడి ఉత్సవ ఊరేగింపుల కోసం
గాలి తిత్తినై
రాగాల పరిమళంగా పరుచుకునేదీ నేనే'’
(ఖాజా - ఎంగిలి పీక)
డాబు కోసం, దర్పంకోసం దూదేకులు - ఉర్రూతలూగటం లేదు. ఇవాళ ఎలా గడుస్తుందోనన్న దిగులుతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉర్దూ - అరబ్బీలు నేరవడానికి, ఐదుపూటల నమాజ్‌లకు అసలు అవకాశమే లేని స్థితిలో అస్లీ ముస్లింగా మారలేనందుకు దుఃఖపడాల్సిన అవసరమేలేదు.
“నా దూదేకులతనాన్ని షోహర్ ఆపాదించుకోనప్పుడు
అస్లీ ముస్లిం ముద్రని మాత్రం నేనెందుకు భరించాలి?
దారిద్య్రం నా కలల్ని - ఆకలి కాలాన్ని మింగేస్తుంటే
దుఃఖ జంఖానాలో ఎక్కెక్కిపడ్డ నాబచ్‌పన్
పరుపులు కుట్టడమే నేర్చుకుంది
నేర్చుకోలేని ఉర్దూ అరబ్బీల గురించి
నేనెందుకు దుఃఖించాలి'’
(షాజహానా - లద్దాఫ్ని)
ఆర్ధిక పేదరికంతో పాటుగా దూదేకుల్లో సాంస్కృతిక వెనుకబాటు తనం వుంది. ఈ వెనకబాటు కారణంగా వీరిలో, సగం ముస్లిమీయ సంస్కృతి సగం హిందూ సంస్కృతి ఉంది. వేషం, భాష, ఆచార వ్యవహారాలన్నింటిలో ఈ సంయుక్త సంస్కృతి కనిపిస్తుంది.
ఈ దేశంలో నిజమైన లౌకికవాదులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్లు దూదేకులే. ఎందుకంటే ముస్లిం - హిందూ సంస్కృతుల సమ్మేళనంగా వుంటూ ఈ రెండూ మతాల మధ్య దూరాన్ని చెరిపేసేరు. ‘హిందూ - ముస్లిం భాయి భాయి’ అన్న నినాదం అస్లీ ముస్లింలకు, బ్రాహ్మణ హిందువులకు నినాదం మాత్రమే కానీ - దళిత బహుజనులకు, దూదేకులకు ఇదే జీవనసూత్రం అయింది. ఈ సూత్రమే గ్రామీణ ప్రాంతాల్లో వీరిని ఐక్యంగా వుంచుతుంది.
ముస్లింలోనూ - హిందువుల్లోనూ ఉన్నత వర్గాలుగా, కులాలుగా అధికారాలను, హోదాను, గౌరవాలనూ అనుభవిస్తున్న వారికి ఈ సంయుక్త జీవన సూత్రం శత్రువైంది. అంటరానిదైంది. అందుకే దూదేకులు ముస్లింలలో కింది తరగతివాళ్లుగా మిగిలిపోయారు. దీన్నే దూదేకుల కవులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్థిక దృష్టి
ఆర్థిక దృష్టి కోణం నించి పరిశీలిస్తే దూదేకుల పరిస్థితి దళిత, బహుజనుల కన్న వందలరెట్లు దిగజారిపోయింది. తినటానికి, కనీసం కడుపునిండా తిండిలేక, ఉండటానికి ఒక గూడైనా లేక దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారు. చిన్న చిన్న వృత్తులమీద ఆధారపడి చాలీచాలని సంపాదనతో బతుకును తప్పనిసరై అలా నెట్టుకొస్తున్నారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తులకు, చిన్న పరిశ్రమలకు కనీసం నిలువనీడలేక పోయింది. ముఖ్యంగా కాయర్ పరిశ్రమ దేశవ్యాప్తంగా వున్న పరుపుల మార్కెట్‌ను ఆక్రమించగా కులవృత్తిగా దూది ఏకి పరుపులు కుట్టే దూదేకులు ఇవాళ పైసా సంపాదన లేక దిక్కులేని వారుగా నడిబజార్లో నిలబడ్డారు. దుర్భరమైన పేదరికంతో, ఆకలితో అలమటిస్తున్నారు.
“సెంచురీ నా కంచంలోంచి అన్నం ముద్దని తన్నుకుపోయింది
పాలిష్ట్ స్పాంజి పిల్లో
నా గొంతుమీద తన సుతిమెత్తని చేతులుంచి నులుముతుంది
నా ఊపిరిచుట్టూ ఒక ఉచ్చు
దేశ సరిహద్దుల్లో పాతిన ముళ్ల కంచెలా బిగుసుకుంటుంది.
నైపుణ్యం నిండిన నా చేతివేళ్లమీద
ఒక విదేశీ ఫోమ్ పాదం నాడా బూట్లతో నృత్యం చేస్తుంది
పగలని పత్తికాయలా
నా కవాను తీగల్లో ఒక అత్యాధునిక అపశృతి
పంటికింద పలుకురాయిలా తగులుతుంది’
(ఖాజా - నరం తెగిన కవాను)
ఎన్నో తరాలుగా నమ్ముకున్న వృత్తి ఇవాళ ఎందుకూ పనికిరాకుండా పోయింది. విదేశీ కాయర్ ఉత్పత్తులు మార్కెట్‌ను ఆక్రమించేశాయి. దూదికి, దూదిపరుపులకు విలువ లేదు. కొనేవారు లేరు. సామ్రాజ్యవాదం కొట్టిన ఈ చావుదెబ్బకు దూదేకులు కకావికలమయ్యారు. కనీసం రెండుపూటలా తిండి కూడా దొరకని స్థితిలో మరింత పేదరికంలోకి జారిపోయారు. అయినా ఇది ఎవరి దృష్టికీ రాలేదు.
దూది పరుపులకు మార్కెట్‌లో కాలం చెల్లిపోయినట్లే, గోళీసోడాలకూ కాలం చెల్లింది. సోడాలమ్ముకొని బతికే దూదేకుల సాయెబులను, కిన్‌లే, బిసిలరి, లెహర్‌పెప్సీ సోడాలు చావుదెబ్బకొట్టాయి. ఇక టైలరింగ్ పనిచేసేవారిని ‘రెడీమేడ్’ తొక్కేసింది. మొత్తం నమ్ముకున్న వృత్తులన్నీ ప్రపంచీకరణ దెబ్బకు నిల్వలేకపోగా- దూదేకులు పొట్ట చేతపట్టుకుని కొత్త వృత్తులను వెతుక్కుం టున్నారు. వ్యవసాయకూలీలుగా, తాపీపనివాళ్లుగా, రిక్షా, ఆటో రిక్షాతోలే వారిగా, డ్రైవర్లుగా కొత్త అవతారాలెత్తుతున్నారు.
“నిన్నటి దాకా
నాచీనీ పళ్లెంలో అన్నం ముద్దైన తెల్లదూది
ఇవాళ నాకళ్లలో ఘనీభవించిన తెల్లపోరైంది
నాబతుక్కొక ఆమీ అయిన ఊతకండె
పాతడబ్బాల్లా నన్ను సాచి తన్నింది
సుతిమెత్తని దూదేకిన చేతులతోనే
ఇప్పుడు సుతారి పనిలో గమేలా మోస్తూ -
అందమైన చమ్కీ పరుపులు కుట్టిన చేతులతోనే
ఇప్పుడు ఇటుకలు పేర్చి
మట్టిపోసీ దిమ్మెస కొడుతూ -
(ఖాజా - నరం తెగిన కవాను)
ఇక చదువుకున్న వర్గం వాళ్లలో అధికభాగం టీచర్లుగా ఎదుగుతున్నారు. అక్కడక్కడా చిన్న ఉద్యోగాల్లో కొందరు స్థిరపడుతున్నా చదువుకున్న వారిలో కూడా ఎక్కువమంది ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటున్నారు.
మొత్తంగా దూదేకుల సంఖ్య రాష్ట్రంలో 50 లక్షల వరకూ ఉండగా ఆర్థికంగా అత్యంత దుర్భరమైన స్థానంలో వున్నవారు 90% పైమాటే. అందుకే దూదేకుల కవులు తమ ఆర్థిక దుస్థితిని, ప్రపంచీకరణ కారణంగా దిగజారి పోతున్న దూదేకుల దౌర్బల్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కవిత్వీకరిస్తున్నారు.
దూదేకుల స్త్రీల దృష్టి
ముస్లిం స్త్రీలు మతపరంగా దుర్భర స్థితిలో వుంటే దూదేకుల స్త్రీలు మతంతో పాటు కులపరంగా కూడా దుర్భరస్థితిని ఎదుర్కొంటున్నారు. ముస్లిం స్త్రీలు ముస్లిం పురుష సమాజం నుంచి వివక్షనూ, అణచివేతనూ ఎదు ర్కొంటూ, హిందూమతం నుంచి ఛీత్కారాలను, దాడులను ఎదుర్కొం టున్నారు. కాగా దూదేకుల స్త్రీలు ముస్లిం సమాజంలో స్త్రీ పురుషుల నుంచి వివక్షనూ, అణచివేతనూ ఎదుర్కొంటూ హిందూ సమాజం నించి అవమానా లను ఎదుర్కొంటున్నారు.
“పరుపులు కుట్టీ కుట్టీ అలసిపోయిన అమ్మ
కటిక నేలమీదలా నడుం వాల్చి కునుకుదీస్తే
కాబూలీ వాడి అప్పు కల్లోకొచ్చి లాగిపెట్టి తన్ని లేపుతుంది'’
(ఖాజా – మా…)
అంటరానితనం మినహా మూడురూపాయలు అప్పుకట్టలేక అవమానించబడ్డ మహదేవమ్మకు, దూదేకుల తల్లులకు పెద్ద తేడాలేదు. పేదరికం, అవమానం రెండిట్లో ఏదిముందో - ఏదివెనుకో తెలియదు గానీ దూదేకుల స్త్రీలను ఈ రెండూ కలిసి మరింత లోతుకి తొక్కేస్తున్నాయి.
దూదేకుల స్త్రీలు రీతి రివాజులు తెలియని వారుగా, ఉర్దూ రాని వారుగా, ఖురాన్ తెలియని వారుగా ముస్లిం సమాజం నుంచి అవమానించబడుతున్నారు.
“కానరాని అశక్తతతో కళ్లెమై
నా నోటిని బిగించి పట్టుకుంటుంది
రెప్పల కొమ్మల్లోంచి వీచిన వాళ్ల సుడిగాలుల చూపుల్లో
నేనో దూదిపింజనై హాలు హాలంతా
ఉన్నచోటి నుంచే గిరికీలు కొట్టబడతాను
వచ్చోరాదో - నా ఉర్దూ పరిజ్ఞానం మీద
వాళ్ల కుతూహలాల ప్రావీణ్య ప్రదర్శన జరిగి
ముఖాల్లో పరిహాస ఫలితాల తేల్చేసాక
తెగించి - బయటకు రాలేని మొహమాటపు నీటిచుక్కలు
కంటికోనల్లో ఇరుక్కుని అచ్చం నాలాగే అల్లాడతాయి'’
(షాజహానా - లద్దాఫ్ని)
దూదేకుల స్త్రీల దుస్థితి ఇంతదాకా సాహిత్యం పట్టించుకోలేదు. సమాజానికి దూదేకుల్ని పట్టించుకునేంత పెద్ద మనసూలేదు. జ్ఞానమూలేదు. ఇటు ముస్లింల నుంచి అటు హిందువుల నుంచి, పురుషుల నుంచి దూదేకుల స్త్రీలు తక్కువగా, చులకనగా చూడబడుతున్నారు. చదువులేక, విజ్ఞానం లేక, మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోలేక వెనకబడిపోతున్నారు.
మొత్తంగా దూదేకుల సమాజం, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల న్నిటి మీద ఐక్యంగా పోరాడాల్సి ఉంది. తమ మూలాలను సంస్కృతిని ప్రతిబిం బించే సాహిత్య సృజన చేయాల్సి వుంది. దూదేకుల కవిత్వానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఖాజా, యాకూబ్, షాజహానా, యండి యాకూబ్‌పాషా, దిలావర్ వంటి కవులు ఈ కోణపు కవిత్వానికి, సాహితీసృజనకు వాకిలి తెరిచారు. ఈ దిశలో మరింత మంది దూదేకులు తమ ప్రత్యేక అస్థిత్వాన్ని చాటుకునేందుకు, చరిత్రను నిర్మించేందుకు కవిత్వం రాయాల్సి ఉంది. భవిష్యత్తు సాహిత్యం దూదేకుల జీవన మూలాలను, సంస్కృతిని ప్రతిబింబిం చాల్సి వుంది.
ఈ కులజాడ్యం ఎంత విషతుల్యమంటే ఇందులో ఏ కొంచం మంచి వచ్చినా అదీ విషంగా మారిపోతుంది. పెద్ద విషభాండంలో పాలచుక్క మార్పు తేనట్టు, ఈ హిందూ కులజాడ్యం ఇస్లాంకు, క్రిస్టియానిటీకి కూడా అంటుకుని అవికూడా విషతుల్యమయ్యాయే తప్ప హిందూ కులవాదంలో మార్పు తెలేకపోయాయి. ముస్లిములుగా మారి దూదేకులయ్యారు. కిరస్తానీలుగా మారి మాల క్రైస్తవులు, మాదిగ క్రైస్తవులు అయ్యారు. ఈ రెడ్లు, కమ్మలూ క్రైస్తవులుగా మారినా వారి సాంఘికహోదా సూచించే రెడ్డి, రావులని పేర్ల వెనుక చేర్చుకుంటూనే వున్నారు.
–ఫ్రసాద్
http://blog.charasala.com
“మీదేకులం? మీదేమతం?” అని నా బ్లాగులో నేను రాయాలనుకొన్న వ్యాసం ఇక నేను రాయక్కర్లేదు. మీ ఈ వ్యాసంలో అణువణువునా నా ఆలోచనల ప్రతిబింబాల్ని చూసుకొన్నాను. మీ కవితలు గుండెల్ని పిండేసాయి. ఇంత వివరంగా వ్యాసాన్ని రచించినందుకు మీకు నా కృతజ్ఞతలు!
“ఆపదలోని మానవుడిపై అమృతం వర్షించే కరుణాంతరంగమే మతానికైనా, మానవత్వానికైనా సుక్షేత్రం కాగలదు. నిరుపేదలను ఆదుకోవటం వల్ల ముక్కోటి దేవతలను సందర్శించిన దానికంటే మించిన మోక్షం.ఆత్మతృప్తి కలుగుతాయి.(వార్త సంపాదకీయం 30-3-2003) ఇటీవల ఓ జిల్లా కేంద్రంలో నూర్ బాషాలు అంటే దూదేకుల కులస్థుల సమావేశం జరిగింది. హాజరయిన పెద్దలు “మనం ముస్లిములమా?హిందువులమా?” అనే మీమాంసంలో పడి రసవత్తరమయిన చర్చ జరిపారు. ఉర్దూ భాష నమాజురాకపోవటం వలన ముస్లిములు తమను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ పిల్లలకు తమ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి ముందుకు రావడంలేదని కొందరు ముస్లిం దూదేకుల వారు వాపోయారు. మాకు తెలుగు మసీదులు కావాలన్నారు. నిజంగా హిందూ దేవుళ్ళను నమ్ముకొని తిరుపతికి పోయి గుండు చేయించుకొచ్చినా, సాయిబుల పేర్లుండటం వలన హిందువులు కేటాయించి చూస్తున్నారనీ, షేక్ శ్రినివాసరావు, షేక్ పద్మావతులు గూడా హిందువుల ఆదరణకు నోచుకోవటం లేదని, మరికొందరు హిందూ దూదేకులవారు బాధపడ్డారు. మన విలువ పెరగాలంటే దూదేకుల సిద్ధప్పను తలదన్నే తాత్వికులతో పాటు ప్రత్యేక పూజారులు, పురోహితులు కావాలన్నారు. వేటపాలెం దగ్గర మా మందంతా క్రైస్తవ మతం పుచ్చుకొని హాయిగా ఉన్నాం. చర్చిలో మమ్మల్ని ముందు వరసలో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు మాకు ఉర్దూ బెడదలేదు. కులం గొడవాలేదని షేక్ ఏసుపాదం, షేక్ దానియేలు లాంటి క్రైస్తవ దూదేకుల వాళ్ళు సెలవిచ్చారు. పైగా త్వరలో స్వంత చర్చి కడతారట. నూతిలో పడతావా? పాతర్లో పడతావా? అన్నట్లయింది సమావేశం. ఎవరి మతాన్ని వారు సమర్ధించుకున్నారు. మనమంతా ఒక కుల పోళ్ళం కాబట్టి మనకందరికీ ఒకే మతం ఉండాలని కొందరు పిడివాద దూదేకులు వాదించారు. ఎవరి మతం ఎవరు విదిచిపెడతారు? ఎవరి మతం వారిదేనని కొందరు ఉదారవాద దూదేకులు ఎదురు తిరిగారు. ఆహా! ఏమీ లౌకికవాదం! ఎంతటి అద్భుతమీ భిన్నత్వంలో ఏకత్వం! సకల మతాల సారాలను ఆచారాలను తనలో ఇముడ్చుకొని సర్దుకొని చక్కగా పోతున్న దూదేకుల ఐకృత వర్ధిల్లాలని కొందరు సెక్యులర్ దూదేకుల వారు అరిచారు. అన్ని మతాల వాళ్ళూ మనల్ని కరివేపాకుల్లాగా వాడు కొని అవతల పారేస్తున్నారు. వెనుకపడిన కులాల జనాభాలో 4 శాతం ఉన్నాం. ఎప్పుడన్నా మనకు ఎమ్మెల్యే పదవిచ్చారా? ఒక్క దూదేకుల వాడైనా ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యాడా? ఆర్ధికాభివృద్ధి లేకుండా ఈ మతాలెందుకు? అని కొందరు హేతువాద దూదేకులు ఆక్రోశించారు.
దూదేకటం అనే వృత్తి పోయింది. ఇప్పుడెవరూ ఆ వృత్తి చేయటం లేదు. ఇక మీదట ఆ వృత్తినే చేసి బ్రతికే అవకాశమూ లేదు. ఇంకా ఆ వృత్తి పేరుతోనే కులం పేరు ఎందుకు? మన కులానికి మరేదయినా మంచి పేరు పెట్టాలని కొందరు సంస్కరణవాదులు మాట్లాడారు. కూటికీ గుడ్డకూ రాని బ్యాండు మేళాలు,సన్నాయి వదిలేసి సాంకేతిక విద్యలు చదవాలనీ, ప్రభుత్వాన్ని భూములడగాలనీ కొందరు కమ్యూనిస్టు దూదేకులవారు డిమాండ్ చేశారు. బంతికే రావద్దంతే విస్తరాకు తెమ్మన్నట్టుంది మీ వ్యవహారం. ఏదో ఒక మత గుంపులో చేరితే తప్ప బెదురు తీరని బడుగు జీవులం మనం. ఏమతంలో చేరితే మన పేదరికం అంతరిస్తుంది? ఏ మతంలో చేరితే మన పిల్లల భ్వష్యత్తుకు భధ్రత కలుగుతుంది? ఏ మతంలో చేరితే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మనల్ని హృదయ పూర్వకంగా కలుపుకుంటారు? మనం దాడిచేసేవాళ్ళం కాదు ఎప్పుడూ దాడులకు గురవుతున్న వాళ్ళం. ఇప్పుడు కావలసింది మన ఆత్మల రక్షణ కాదు. మన ప్రాణాలకు భౌతిక రక్షణ, ఆర్ధిక రక్షణ, సాంఘిక రక్షణ, ఏ మతంలో దొరుకుతుంది? కుల విచక్షణ చూపకుండా మానవతాభావంతో కరుణ రసాన్ని కురిపించి మనపట్ల సమ గౌరవం చూపే మతమేది? ఆ మనవతా మత మేది? అంటూ కొందరు సభ లోనే అన్వేషించారు. కానీ ఫలితం కానరాలేదు. ఓదార్చేకొద్దీ ఏడ్చే బిడ్దల్లాంటివే కష్టాలన్నారు. కణత తలగడ కాదు. కల నిజం కాదు. కుల మత రహితం కాకపోయినా వాటి ప్రసక్తి లేని లౌకిక భారతం ఓ మంచి ఆశే. మానవ మత భారతం చక్కటి అభిలాషే. కానీ అది ఎన్నటికీ నిజంకాని కల అని కులమతాల నెత్తుటి చరిత్ర నిరూపించింది. రిజర్వేషన్లు లేనిదే ఎక్కిరాలేని జాతులు, రిజర్వేషన్ల కోసమే కొనసాగింపబడుతున్న కులాల లెక్కలూ, రాజ్యాంగ బద్దం కాగా ఇక కులమత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం ఎలా సాధ్యం? రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది. ఇప్పుడు కుల మత సంఘాల పేరుతో గిరులు గీసుకొని కంచెలు కట్టుకొని స్వకీయ రక్షణ. పరపీడన సిద్ధాంతాలతో సాగిపోతున్న నరహంతక ముఠలు ఎన్నని చెప్పగలం? భారతీయ సమాజం కుల మతాల విభజన వల్ల మానసికంగా చిందర వందరై పోయింది. కుహనాఇక్యత వర్ధిల్లుతోంది. మానవత్వాన్ని, ప్రోది చేసి మనందరినీ నిజంగా ఐక్యపరిచే సాధనం మానవతావాదమే. దేవుడి పేరుతో స్ధాపించబడిన కులమతాలు మానవ ఐక్యతకు, మానవ సౌభాగ్యానికి బాటలు వేయాలంటే మతదురభిమానాపు పొరలు కప్పిన వారి కళ్ళల్లో మానవత్వపు కరుణా కాంతులు నిండాలి. హత్యలు చేసే చేతులు పదిమందికి అన్నం పెట్టాలి. ఆస్తులు, ప్రాణాలు, మానాలు దోచుకునే దుర్మాగులు పరోపకారులుగా మారాలి. ఇలా మనుషుల్ని కారుణ్యమూర్తులుగా మలచలేని మతాలు వ్యర్ధం. మానవత్వాన్ని కాలరాచే మతాలు మన పాలిట శాపాలు. మతాలకు మానవత్వమే గీటురాయి.
రెహమతుల్లా గారు,
అసలు వ్యాసం కంటే మీ వ్యాఖ్యే బావుంది. చాలా బాగా చెప్పారు.
రహమతుల్లాగారి వ్యాసం చాలా బాగుంది.
ఏమిటి ఈ రహమతుల్లా దుఖం. ఎవరికోసం ఈ బోధనలు.అయ్యా! మానవతావాదీ కొంచెం కళ్లు తెరిచి వివేచనతో ఆలోచించు. దూదేకుల వారికి నువ్వు బోదించె మానవతా వాదం కంటే ముందు జీవనాధారం కావాలి. వారికి గుర్తింపు గౌరవం కావాలి. ఇవ్వాన్నీ వదిలేసి బోధనలేమిటి తండ్రీ..!నీకు తోడు రఘోత్తమరావు వంత..
దీపకాచార్యా
దూదేకుల వారికి జీవనాధారం గుర్తింపు గౌరవం కావాలి అనేదే వ్యాస సారాంశం.మానవత్వం వద్దంటూ నీ ఏడుపు ఏమిటి బిడ్డా?
రహమతుల్లా దళిత గోవిందం వ్యాసం కానీ, ఇక్కడ రాసిన …(తొలగించబడినది)……మీ అభిప్రాయంగానీ రెండిట్లో హిందూత్వం పట్ల భక్తికనిపిస్తుంది. సరే భక్తి వుంటే వుంది కానీ ప్రస్తుత ఐడెంటిటీ వుద్యమాల పట్ల ద్వేషం, తీవ్ర వ్యతిరేకత వుంది. వాటిపట్ల చులకన భావం వుంది. ఇతను ముస్లింపేరు పెట్టుకున్న మనువు…జాగ్రత్త.
—————————-
.
గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.
- ప్రజాకళ మిత్రులు
—————————-
గమనికలోని విష యాలుగమనించి సభ్యతగా నేరుగా అంశం మీదనే ఎవరి అబిప్రాయం వారు చెబితే బాగుంటుంది.వ్యక్తిని విమర్శించటం తిరిగి అనిపించుకోవటం వల్ల అసలు సంగతి మరున పడిపోతున్నది.
అనర్ధాలకు దారి తీస్తున్న అనైక్యత
దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటేలోటా? ఎంతమాత్రం లోటు కాదు. ఒకే రకం ఈకలు గల పక్షులు ఒకేచోట చేరతాయంటారు. ఈ మద్య “పరుపులుకుడతాం” అంటూ కవ్వాను బద్ధ భుజాన వేసుకుని తిరుగుతున్న ఇద్దరు మనుషులు నా కంటబడ్డారు. ఎంతో కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న పరుపు కొనుగోలు ప్రతిపాదన వాళ్ళను, చూడగానే మంజూరయ్యింది. పరుపు కుట్టడం పూర్తయ్యాక మీరు ‘దూదేకుల సాయిబులేనా?’ అని అడిగాను, “కాదండీ బాబూ,మేముకాపులం మాది ఏలూరు” అని జవాబిచ్చారు.
కులంగాదు, తలంగాదు కురవోళ్ళ పిల్ల దయ్యమై పట్టినట్లు, కాపులు గూడా దూదేకుతున్నారే అనిపించింది.
తురకలు లేని ఊళ్ళో దూదేకుల వాడే ముల్లా అంటుంటారు. దూదేకుల వాళ్ళు కూడా లేని ఊళ్ళో ముల్లాపని ఏమోగానీ దూదేకేపని మాత్రం ఏదో ఒక కులపోళ్ళు నెత్తిన వేసుకొని చేస్తుండటం వల్ల “కులవృత్తి” సిద్దాంతం దెబ్బతిని పోయింది.
టర్కీ(తురక) భాష మాట్లాడే వాళ్ళను పూర్వం తురక వాళ్ళు అని ఉంటారు. కాని ఇప్పుడు ఉర్దూ మాట్లాడే ముస్లిములందరినీ ‘తురకోళ్ళు ‘
అంటున్నారు. సర్వీస్ కమీషన్ పరీక్షల్లో కూడా ఇదే మాట ప్రయోగించారు. దూదేకుల సాయిబుల్నీ, మామూలు సాయిబుల్నీ వేరు చేసి ఇలా రెండు పేర్లుతో పిలుస్తున్నారు. “తురకా దూదేకుల పొత్తులో మురిగీ ముర్దార్” అనే సామెత ఉంది. “కాకర బీకర కాకు జాతారే?” అంటే దూబగుంటకు దూదేకును జాతరే అని ఇద్దరు దూదేకుల వాళ్ళూ సంభాషించుకున్నారట. బావి తవ్వితే భూతం బయట పడ్డట్లు లోతుకు పోయే కొద్దీ కొత్త సంగతులు బయట పడుతున్నాయి.
మరోచోట మసీదుకో బోర్డు తగిలించి ఉంది. భూత ప్రేతాలను వెళ్ళగొడతామనీ, తాయిత్తులు కడతామనీ ఉంది. అక్కడే కాదు ఇంకా చాలా చోట్ల ఈ రకం బోర్డులు చూశాను. మీ సంగతి ఏంటి బాబూ అని అడిగితే మాది సున్నీ గ్రూపు అన్నారు. తబ్లిక్ జమాఅత్,జమాఅతె ఇస్లామీ, అహ్లెహదీస్… వీటితో మాకు సంబంధం లేదు. మేము కొన్ని దర్గాలను సందర్శిస్తాము. అందులో ఉన్న మహనీయులు మా తరపున అల్లాకు సిఫారసు చేస్తారు అన్నారు. మహానుభావుల చేత సిఫారసు చేయించుకోవటం తప్పుకాదు. అల్లా దగ్గర పనులు తొందరగా జరుగుతాయి. మీరు మంచిచోట పోస్టింగ్ కావాలంటే రికమండేషన్ చేయించుకోవటం లేదా? అలాగే ఇది గూడా. అందుకే మేము జెండాలెత్తుతాము. పెద్దల పండగలు చేస్తాం అన్నారు. మతంలో బలవంతం లేదు. ఎవరిష్టం వారిది అన్నారు.
ఓ సాయిబుగారు నాకు ఉర్దూ రానందుకు చాలాసిగ్గుపడిపోయారు. ఆయన భాషాభిమానం ఎంత గొప్పదంటే ఖురాను ఉర్దూలోనే అవతరించిందట. బావిలోని కప్పకు గానుగ ఎద్దుకూ అవే లోకాలు అన్నట్లు ఉర్దూ పిచ్చి పట్టిన వాళ్ళకు మరో సంగతి తలకెక్కదు.
” భాషలు ఆయా ప్రాంతాలకు సంబంధించినవి. అయితే దైవ ధర్మం విశ్వవ్యాప్తమైంది. అన్ని భాషల ద్వారా దైవ ధర్మం వ్యాపించాలి.” అంటుండగానే, మరో సాయిబుగారు “ఫలానా వూళ్ళో మీ కేడర్ వాళ్ళు చాలా మంది ఉన్నారండీ” అన్నారు. “ఇస్లాంలో చేరిన తరువాత అంతా ఒకే కేడర్ అవుతారు. ఇంకా ఎందుకీ భేదాలు?” అన్నాను. “రంగాహత్యానంతరం జరిగిన దౌర్జన్యకాండలో నువ్వు సాయిబువైతే ఉర్దూలో మాట్లాడు అని దూదేకుల సాయిబుని తన్నారుగదా? మీకు మాకు తేడా లేదా?” అన్నాడాయన.ఉర్దూ రాకపోతే సాయిబు అని అటు తురకసాయిబులు ఇటు హిందువులు కూడా నమ్మటం లేదు.గూని వీపు నయం కాదు లెమ్మని నేను మౌనం వహించా. ఇంకో సాయిబుగారు నా వివరాలన్నీ అడిగి ” ఈ దూదేకుల వాళ్ళంతా ఒక ముస్లిం తండ్రికి హిందూ తల్లికీ జన్మించిన సంతానమండీ” అన్నాడు. కన్ను కైకలూరులో కాపురం డోకిపర్రులో అన్నట్లయింది నాపని.
ఎంతగా ధర్మ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ రెండు రకాల సాయిబులూ కలిసి పోవటం లేదు. ఏమిటి దుస్థితి అని ఒక ముస్లిం నాయకుడిని అడిగాను”. గోంగూరలో చింతకాయ వేసినట్లు, గోకి దురద తెచ్చుకున్నట్లు వీళ్ళతో మాకెందుకండీతంటా? బయటి వాళ్ళకు చెప్పుకోవటం నయం” అన్నాడు. సాయిబుల పిల్లల్ని చేసుకొని వాళ్ళలో కలిసిపోగూడదా ఎందుకీ అదగస్తపు బతుకు అని ఒక దూదేకుల శ్రీ వారిని అభ్యర్ధించాను. “అమ్మో ఇంకా ఏమయినా ఉందా? మనం బ్రతకడానికేనా? అడుగడుగనా లధాఫ్, లధాఫ్ అని ఎత్తి పొడవరూ?” అని ఎదురు బెదిరించాడు.కులము,భాషలతోటే గుర్తింపు, కలయిక వుందన్నమాట.మరి ఈ బాస రాని సాయిబుల్ని ఆదుకునేది ,కలుపుకునేది ఎవరు?
దూదేకుల సిద్దప్పకి దూదేకను రాదంటే లోటా? ఆయనకి దూదేకటం రాకపోయినా బ్రహ్మం గారి తత్వాలు పాడుకుంటూ బాగానే బ్రతికాడు. తులసి కడుపున దురదగొండిలా పుట్టాడని అతని తల్లితండ్రులు తిట్టి పోశారు. కులం తక్కువ వాడు కూటికి ముందా అని బ్రహ్మంగారి కొడుకులు (కంసాలీలు/విశ్వబ్రహ్మణులు) తన్ని తరిమేశారు. కానీ అతనికి తురకం (ఉర్దూ భాష) రాలేదని ఎవరూ తన్నినట్లు దాఖలా లేదు. కనీసం దాన్నొక లోటుగా కూడా ఎంచలేదు.ఆయన మాత్రం “ముట్టున బుట్టిందీ కులము” అని తెలుగు తత్వాలే పాడాడు.
లింగిపెళ్ళీ మంగి చావుకొచ్చినట్లుంది దూదేకుల వాళ్ళ వ్యవహారం. చక్కగా సాయిబుల పేర్లు పెట్టుకుని సంఘంలోకెళితే, అసలు సిసలు సాయిబు (ఉర్దూ జబర్దస్తీగా మాట్లాడే మహారాజు) ఎదురైనప్పుడల్లా వచ్చీరాని భాషలో నంగినంగిగా మాట్లాడి, వంగి దండంపెట్టి వెళ్ళి పోవాల్సి వస్తోంది.మీరు ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా పోతున్నారని అసలుదాంట్లో (ఉర్దూలో) పసలేదని చప్పడిస్తుంటారు.భాషవేరేగానీ భావమొక్కటేనంటాడు దూదేకులాయన. నీవు ఖానా అంటావు. నేను అన్నం అంటాను అంటాడు.ఇంత మాత్రానికే ఇదైపోవాలా అంటూ ఇదైపోతాడు.
ఇటీవల ‘పింజారీ వెధవ ‘ అనేతిట్టు టీ.వీ. సీరియల్స్ లో సినిమాల్లో విపరీతంగా వినబడుతోంది.బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన ఇటీవల “పింజారీ” అనే పుస్తకంగా ప్రచురించాడు. పుస్తకం చదివి వెనుకాముందూ తెలుసుకున్న వారు తమ తిట్ల నిఘంటువుని కొద్దిగా సవరించుకొన్నారట. కానీ ఇంకా కన్నూ మిన్నూ కానని దురహంకారంతో కులగజ్జితో భాదపడుతున్న సంభాషణా రచయితలున్నారు. “ఓరీ రజక చక్రవర్తీ” అంటే అంత పెద్ద పేరు మాకెందుకు దొరా? మీకే ఉండనివ్వండి అన్నాడట.అనటం తిరిగి అనిపించుకోవటం మన దేశంలో అనాదిగా ఉంది. “ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం” వచ్చిన తరువాత ఆయా కులాల పేర్లతో వారిని సంభోదించటానికే జంకారు.ఇప్పుడు రెడ్డి, నాయుడు, చౌదరి, రాజు, గుప్తా, శర్మ, గౌడ ల్లాగా వాళ్ళతో పాటూ మాల, మాదిగ అనే తోకల్ని సగౌరవంగా, సమధీటుగా తగిలించుకొని దళితులు ఎదురు తిరిగి నిలబడితే, గుడ్లు మిటకరించి చూస్తున్నారు కానీ ఆతోకలతో పిలవచ్చా పిలవ కూడదా, పిలిస్తే ఎమవుతుందో అనే భయంతో మిన్నకుండా ఉన్నారు. ఒకనాడు అవమాన సూచికగా తిట్టుకు ఆలంబనగా ఉన్న కుల నామం ఈనాడు కబడ్ధార్ అని హెచ్చరించే స్థాయికి ఎదిగింది. రేపు పాదాభివందనం చేయించు కుంటుంది. అలాగే బాసరాని పింజారులు ,లద్దాఫులు క్రుంగిపోవద్దు, నొచ్చుకోవద్దు. వృత్తిని కోల్పోయిన దూదేకుల వాళ్ళెంతో మంది ప్రస్తుతం ఆర్ధికంగా బలహీనులే. కానీ గొప్ప ఆశయాలతో కృషి చేస్తే పదిమందికి వెలుగు చూపే చక్రవర్తులుగా “నూర్ భాషా”లుగా మన్నన పొందుతారు.
ఆ మధ్య ఓ కాపులామెను ఇంట్లో పిండి దంచటానికి రమ్మంటే తురకోళ్ళ ఇంట్లో పని చెయ్యనని తిరస్కరించింది. సరే, కూలి పని చేసుకునే ఈ కాపులామె దృష్టిలో తురకసాయిబులు సంపన్నులైనా అంటరాని వాళ్ళు కాబోలులే అనుకొని అవసరం మరొకరి చేత తీర్చుకున్నాం. ఇంకోచోట అప్పటిదాకా సాలీలకు అంట్లుతోమిన ఓ తురకసాయిబులామె మాకు తోమను పొమ్మంది. మేము తక్కువ రకం సాయిబుల మట. మా ఇంట్లో కూలిపని చెయ్యటం తప్పట! ఆయనగారు జిల్లా కలెక్టర్ అయినా సరే వాళ్ళిచ్చే కూలీ నా కొద్దు చాకలోళ్ళ ఇంట్లో అయినా పని చెప్తాను గానీ దూదేకుల వాళ్ళింట్లోపని చెయ్యను అని తెగేసి చెప్పింది. సరే, ఇక చేసేదేముంది? మా పనులు మేమే చేసుకుంటున్నాం. ఉర్దూ రాని దూదేకుల వాళ్ళ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా వుంది.రజక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంజయ్య, చాకలి వాళ్ళు తన ఇంట్లో బట్టలు ఉతకటానికి నిరాకరించారని గతంలో వాపోయిన సంఘటన గుర్తొచ్చింది. ఇది స్వంతకులంలోనే అంతర్గత సమస్య.
పరిస్థితి ఇలా ఉంది. తల పండిన పెద్దలు, ముస్లిం పండితులు ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.ఈ చేదు అనుభవాలను చాలా మంది ఎదుర్కొని ఉంటారు. నేటికీ సమాజంలో కొనసాగుతున్న ఈ రుగ్మతల పట్ల సంఘ సంస్కర్తలు శ్రద్ధ చూపడం అవసరం.
ఈ మధ్య మా అపార్ట్ మెంట్లలోకి ఒక సాయిబుల కుటుంబం చేరింది.మాది పొదిలి అంటూ మంచిగా మా ఆవిడను పరిచయం చేసుకుంది. మాయింటి పేరు నూర్ బాషా అని తెలియగానే ఆవిడ ముఖం రంగు మారి పోయింది.”వాళ్ళు వేరు మేము వేరు ” అని పని గట్టుకొని అందరికీ చెప్పింది.”ఇద్దరూ సాయిబులేగా” అంటే “కాదు మేము తురకసాయిబులం వాళ్ళు దూదేకుల సాయిబులు, వాళ్ళకు ఉర్దూ రాదు మాకు ఉర్దూ వచ్చు, వాళ్ళకు మాకు చాలా తేడా వుంది” అని చెప్పిందట.విశాఖపట్నంలో ఇంత నాగరికత గల ఊళ్ళో ఈనాడు ఈ కుల ఫీలింగ్ ఉండదు అన్న నాభావన కరిగిపోయింది.ఆవిడ కొడుకు ఒక డాక్టర్ .కేరళ క్రిస్టి యన్ నర్సును ఆదర్శ వివాహం చేసుకొన్నాడు.ఆయనకు లేని కులం పట్టింపు ఈమెకుంది.పక్క అపార్ట్ మెంట్ లోని సాయిబులామె అప్యాయంగా కలుపుకొమె పలకరిస్తుంటే ,ఈమె కులం కోసం బిగుసుకు పోతుందేమిటీ? ఈమెకేమయ్యిందీ?అనుకునేవాళ్ళం.
కొన్ని రోజుల క్రితం చీరాల నుండి మా చుట్టాల్లో ఒకామె వచ్చింది.ఇద్దరూ చాలా సేపు ఆప్యాయంగా ఉర్దూలో మాట్లాడుకున్నారు.చివరికి మా చుట్టం “పొదిలావిడ మన కులమే .ఆవిడ మాకు చుట్టం” అని తేల్చింది.
అరెరే, మాకులం దానివై వుండీ,క్రిస్టియన్ కోడలిని పెట్టుకొనీ ,తురక సాయిబులమంటూ ఎంత పోజు కొట్టావే ముసలమ్మా అనుకొన్నాం.
The 2011 census must be caste-based.
the BCs and OBCs who together constitute over 35% of population.
The caste-wise census began first in 1881 and ended in 1931. From 1941 it was given up. opponents say caste-wise census will go against the goal of abolishing caste system, will go against the constitution and encourage casteism. But the constitution speaks only about the abolition of untouchability and not the caste.
If the govt. wanted to abolish caste why nothing was done during the past 61 years of “independence” to eradicate caste?
Even Dalits need subcaste census.even among Muslims, Christians and Sikhs the caste does exist.
Backward Muslims: Madigas in AP and Karnataka have been complaining of step-motherly treatment. Similar caste-wise demands of Dalits must be met. Backward Muslims have been crying for separate reservations. That means even among Muslims and Christians there is need for caste-wise enumeration.
The 2011 census operation must go for caste-wise details
కొత సంచర కావ లి
రహమతుల్ల గారు మీరు చెప్పిన వాక్యలు చూస్తుంతె మత మర్పిదు లకు
ప్రొస్థహము చెసినత్లు ఉన్నది దయ చెసి అల మత్లదకంది