* సారా ఉద్యమం గురించి…..
సారా ఉద్యమ వైఫల్యం స్త్రీలకొక నమ్మకద్రోహం… ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం మాత్రమే జరిగింది. ఇవ్వాళ సారా సర్వాంతర్యామి. కళాశాలల్లోకి, గ్రామాల్లోకి, మురికివాడల్లోకి విపరీతంగా విస్తరించి మహిళా సాధికారత అని మనం బాకా ఊదుకొనే అంశాన్ని చావుదెబ్బ కొట్టింది. గృహహింస పెరిగింది. నేరాలు పెరిగాయి. స్త్రీల మీద అధిక భారం పడింది. మనిషిని ఆలోచనకి, వివేకానికి దూరం చేసింది. ప్రస్తుతం జలయజ్ఞం సంగతేమో కాని సారా యజ్ఞం మాత్రం జయప్రదంగా జరుగుతోంది.
* ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన స్త్రీవాద ఉద్యమాలపై మీ అభిప్రాయం…
సంస్కరణోద్యమం స్త్రీలను మూఢాచారాల నుంచి నాలుగుగోడల చీకటి నుంచీ వెలికి తేవడానికి ప్రయత్నించింది. చదువుకొన్న భార్యగా మంచి తల్లిగా ఇంటి లెక్కలు చూసుకోగల తెలివిగల గృహిణిగా తయారుచేసే ప్రయత్నం చేసింది. జాతీయోద్యమం స్త్రీలు కొంతమందికి రాజకీయ చైతన్యం కలిగించింది. 1975 తరువాత మనదేశంలో ప్రాచుర్యంలోకి వచ్చిన స్త్రీవాద ఉద్యమం స్త్రీగా ఆమె శరీర ధర్మాల నుంచి ఆమె మేధో సంపద, ఆమె లైంగికాసక్తి, ఆమె స్పేస్ మొదలైన అనేక అంశాలను చర్చకు పెట్టింది. వ్యక్తిగతమంతా రాజకీయమేననీ, స్త్రీల అణచివేత మూలాలు పితృస్వామ్యవ్యవస్థలోనే ఉన్నాయనే సిద్ధాంతంతో ముందుకొచ్చింది.
* స్త్రీలు ఉత్పత్తిలో భాగం అవుతున్నా వారి సమస్యలు తొలగడం లేదు. పితృస్వామ్యం, వరకట్న దురాచారాలు, మహిళల అభివృద్ధికి ఆటంకాలవుతున్నాయి. సంస్కరణోద్యమం ఆచరణలో విఫలమౌతున్నది. ఈ సమస్యలకి పరిష్కారమేమిటి? భారతదేశంలోను, అమెరికాలోను గృహహింస పెరగడానికి కారణం ఏమిటి? తొలగించడంలో సాహిత్యం పాత్ర ఏమిటి?
ఉన్నత, మధ్యతరగతి వర్గాల స్త్రీలు ఇవ్వాళ చదువుకొని ఉద్యోగాల్లో కొచ్చారుగానీ, అడుగువర్గంలోని స్త్రీలు చిరకాలంగా ఉత్పత్తిలో భాగస్వాములే. కానీ అన్నిరకాల హింసలకీ, వివక్షలకీ వారే ఎక్కువ అందుబాటులో ఉంటారు. పై వర్గాల కులాల స్త్రీలకి కొంత భద్రత, రక్షణ ఉంటాయి. జీవనం కోసం తప్పనిసరిగా బయటికి వచ్చి తీరవలసిన వీళ్ళకి రక్షణ ఎటువైపు నుంచీ కూడా లేదు. స్త్రీలపై, దళితులపై సహజంగా పాతుకుపోయిన చిన్నచూపు, న్యాయపరమైన రక్షణ లేకపోవడం, ఇంకా వదిలిపోని ఫ్యూడల్ భావజాలజాడ్యం, ఇవన్నీ పనిగట్టుకొని కాపాడుకొన్నంత కాలం స్త్రీల పరిస్థితి ఇంతే. స్త్రీలు తమ స్థానాన్ని తాము స్థిరపర్చుకొనే ప్రయత్నం చెయ్యాలి. మాట్లాడాలి. అయితే అణిగి ఉండడాన్ని అలవాటు చేసిన వర్గాలు మాట్లాడడం మీద ఇన్నాళ్ళుగా అనేక ప్రత్యేక సదుపాయాలకు అలవాటు పడ్డ వాళ్ళకి ఒక అభద్రతతో కూడిన అసహనం ఉంటుంది. అప్పుడే ‘ఎక్కడ ఉండవలసిన వాళ్ళని అక్కడ ఉంచే’ ప్రయత్నం మొదలవుతుంది. స్త్రీలు సమానంగా చదువుకోవడం, సంపాదించడం, మాట్లాడడం, చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం, తమ స్పేస్‌ని సృష్టించుకోవడం మొదలైనప్పుడు ఈ అసహనం గృహహింస రూపంలో బయటపడుతుంది. ఉద్యోగభద్రత లేకపోవడం, బయటి వత్తిళ్ళ నుంచి విడుదల కోసం కూడా గృహహింస జరుగుతుంది. స్త్రీని తోటి మనిషిగా, స్నేహితురాలిగా గుర్తించే సంస్కారం అలవడనంతవరకూ పరిస్థితి మారదు. ఆల్కహాలిజం, వినిమయ సంస్కృతి కూడా దోహదకారులే. పెళ్ళి పట్ల, సహజీవనం పట్ల ,స్త్రీ పురుష సంబంధాల పట్ల ఇప్పటికింకా మారని భావజాలం కూడా గృహహింస తగ్గకపోగా, పెరడానికి కారణం. స్త్రీని తమకు చెందిన ఒక వస్తువుగా పరిగణించే స్వభావం ఉన్నంతకాలం వారిపై పెత్తనం, ఆధిక్యం ప్రదర్శించుకొనే క్రమంలో హింసా తప్పవు. ఈ పరిస్థితి మారాలంటే స్త్రీలు ఆర్థికంగా స్వతంత్రులై ఉండడంతో బాటు అందుబాటులో కొచ్చిన చట్టాలను ఉపయోగించుకోగలగాలి. సెంటిమెంట్లకి స్వస్తి చెప్పాలి. ముఖ్యంగా ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలైన టి.వి.., సంచలనాత్మక వార్తా కథనాలతో, ధారావాహికలతో అత్యధికంగా అమ్ముడుపోయే పత్రికలూ వాటి ధోరణి మార్చుకోవాలి. హింసించే భర్త పట్ల విధేయత తప్పు అని అర్థం కావాలి. మార్కెట్ సంస్కృతి అనేక హింసలకు మూలమౌతున్నది.
* మన సాహిత్యంలో రంగనాయకమ్మగారి పాత్రని ఎట్లా అంచనా వేస్తారు?
నేటి స్త్రీవాదానికి పునాదులు వేసినవాళ్ళు చలం, కుటుంబరావు, రంగనాయకమ్మలు… ఫెమినిస్టు సిద్ధాంతాలు పాశ్చాత్య దేశాలలో పుట్టినా, ఆంధ్రదేశంలో స్త్రీవాదం అనే మాట వినబడక ఎంతో ముందు స్త్రీల గురించి ఆవేదనపడినవాళ్ళు, వాళ్ళు… స్త్రీలు చైతన్యవంతులై, హక్కులు బాధ్యతలు కల పౌరులుగా మనుగడ సాగించాలనే ఆర్తితో తెలుగులో, అప్పుడు బహుళ ప్రాచుర్యంలో ఉన్న రచయిత్రులకి భిన్నంగా ఒక కొత్తచూపునిచ్చిన రచయితగా ఆవిడది తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం… స్త్రీల చైతన్యం గురించి ‘జానకి విముక్తి’ చేసిన చర్చ చాలామందిని ఆలోచింపజేసింది. ఆమె సునిశిత పరిశీలనాశక్తి కథని ఆడంబరరహితంగా చెప్పి ఆలోచనకు స్ఫూర్తినిచ్చే నైపుణ్యం ఇటీవల ఆమె వ్రాసిన ‘మురళీ వాళ్ళమ్మ’ కథలో చూడవచ్చు. ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన మంచి కథ.
* మహాశ్వేతాదేవి రచనలపై మీ అంచనా…
రచనకీ, ఆచరణకీ మధ్య అంతరంలేని మహా వ్యక్తి. ఆవిడ వ్రాసిన ‘ద్రౌపది’ కథ ఒక్కటి చాలు. హజార్ చౌరాసీమా, రుడాలీ వంటి రచనలు చదివినప్పుడు ఆవిడకు రావలసినంత అంతర్జాతీయ గుర్తింపు ఎందుకు రాలేదో అర్థం కాదు.
* ఆధునిక తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన రచయిత్రులు…
‘ముఖ్యమైన’ అనడం కన్నా బాగా వ్రాసిన, వ్రాస్తున్న అంటే బాగుంటుందేమో. అప్పుడు వ్రాసిన వసుంధరాదేవి, కల్యాణసుందరి, ఆచంట శారదాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, రామలక్ష్మి, డాక్టర్ శ్రీదేవి… ఇప్పుడు వ్రాస్తున్న ఛాయాదేవి, చాగంటి తులసి, ఓల్గా, కుప్పిలి పద్మ, సుజాతారెడ్డి, గీతాంజలి, కె. వరలక్ష్మి, ప్రతిమ, రుక్మిణి, చంద్రలత, జాజుల గౌరి, జూపాక సుభద్ర, వినోదిని, ఎస్. జయ… వీళ్ళంతా ఆధునిక తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన, చేస్తున్నవారే. అట్లాగే రేవతీదేవి, జయప్రభ, విమల, కొండేపూడి, ఘంటసాల నిర్మలలు, స్వరూపరాణి, షాజహానా, మహెజబీన్, హైమవతి, కె. గీత, శిలాలోలిత, సుజాతా పట్వారీ, ఎస్. జయ, అనిసెట్టి రజిత, ఆదూరి సత్యవతి మొదలైనవారు… ఫెమినిస్టు సాహిత్య విమర్శ చేస్తున్న కాత్యాయనీ విద్మహే, నిర్మొహమాట విమ్శకురాలు చూపు కాత్యాయని, తెలుగులో వ్యంగ్య హాస్య కాలమిస్టు మృణాళిని, స్త్రీవాదన్ని అద్భుతంగా ఆవిస్ష్కరిస్తున్న భూమిక పత్రిక .. వీరంతా వర్తమాన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నవారిలో కొందరు.
* ఫెమినిజం ఉద్యమంపై మీ అంచనా…
ఫెమినిజం ఒక ప్రాపంచిక తాత్త్విక దృక్పథం. దాని ఆధారంగా వచ్చింది ఫెమినిస్టు ఉద్యమం. స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత ఉండాలనీ, ఒక వ్యక్తి సామాజిక గుర్తింపు ఆ వ్యక్తి లింగాన్ని బట్టి నిర్ణయించరాదనేది ఫెమినిస్టు సిద్ధాంతం. పాశ్చాత్య దేశాలలో ఓటు హక్కు కోసం ప్రారంభమై, అనేక దశలు దాటి అనేక శాఖలుగా విస్తరించింది. ఏ ఫెమినిజమైనా స్త్రీలకి ఆర్థిక నిర్ణయాధికారం తన శరీరం మీద లైంగికత మీద తనకి అధికారం, జీవన నాణ్యతలను కోరుతుంది. ఫెమినిస్టులు ఆశించిన జీవన నాణ్యత స్త్రీలందరికీ వర్గ వర్ణాతీతంగా లభించలేదు. దిగువ మెట్ల మీది స్త్రీల జీవితాలు యధాతథంగానే ఉన్నాయి. ఫెమినిజం ఉన్నత, మధ్య తరగతి విద్యావంతులైన స్త్రీల ఉద్యమం అన్న విమర్శ ఉంది. ఫెమినిజం రచనలకే పరిమితం కాకూడదు. కార్యకర్తలను తయారుచేసి గ్రాస్ రూట్స్‌లోకి తీసుకెళ్ళాలి. స్త్రీలను సంఘటిత పరచగలగాలి. ఉద్యమం పూర్తిగా సమాజాన్ని మార్చిందని అనను కానీ చాలా ఫలితాలను సాధించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య మహిళల జీవితాలపై ఫెమినిస్టు సాహిత్యం ఏమైనా ప్రభావాన్ని చూపించిందా?
ఫెమినిస్టు సాహిత్యం ఉదృతంగా వచ్చిన 80 దశకంలో మెయిన్ స్ట్రీమ్ దిన పత్రికలు, వార పత్రికలు బాగా ప్రోత్సహించి ప్రచురించాయి. స్త్రీల ప్రత్యేక పేజీలలో స్త్రీవాద కవితలు, వ్యాసాలు ముమ్మరంగా వచ్చాయి. సాహిత్య పత్రికలు మేగజైన్ల కన్న దినపత్రికలకి పాఠకులెక్కువ కనుక ఆ కాలంలో సామాన్య మహిళను కూడా స్త్రీవాదం కొంత ప్రభావితం చెయ్యగలిగింది. ఇప్పుడు చర్చలు, వ్యాసాలు ప్రత్యామ్నాయ పత్రికలకే పరిమితమయ్యాయి. అంతేకాక అప్పటికన్న ఇప్పుడు చదువరుల సంఖ్య బాగా తగ్గింది. ఉన్న ప్రభావాన్ని కూడా తుడిచిపెట్టడానికి టి.వి. ధారావాహికలు మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో స్త్రీల పేజీలు, మార్కెట్ సంస్కృతి శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాయి. ఫరవాలేదు సామాన్య మహిళలని స్త్రీవాద సాహిత్యం బొత్తిగా ప్రభావితం చెయ్యలేదని చెప్పలేము. పుస్తకాలతో పరిచయం ఉన్నవాళ్ళు ప్రభావితమయ్యారనవచ్చు.
* కొత్త తరం రచయితలు కనిపిస్తున్నారు కానీ రచయిత్రులు కనిపించడంలేదు. ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారా? కారణాలు ఏమిటి?
తప్పకుండా ఏకీభవిస్తాను. నేటి యువతులని మూడు వర్గాలుగా విభజిస్తే మూడో వర్గంలో ఉన్న సమస్యలు చాలావరకు ఆర్థిక సామాజిక కుల పరమైనవి. చదువు, సరైన గృహవసతి, సాంఘిక భద్రత, న్యాయపరమైన రక్షణా లేని వర్గం, ఇంకా మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు, బాలింత మరణాలు, మగపిల్లల కోసం ఎక్కువమందిని కనడం, పోషకాహార లోపం, మగవాళ్ళ తాగుడు… ఇట్లా అభివృద్ధి వెలుగు తాలూకు క్రీనీడల్లో ఉన్న వర్గం… వీళ్ళు రాయలేరు. రెండవ వర్గం కింద మధ్య తరగతి. ఇక్కడ ఆడపిల్లలకి అనేక కట్టడులు. ఇల్లు, బడి, కాలేజి. ఇంట్లో పని. పెళ్ళి కోసం ఎదురు చూడడం. పుస్తకాలు, పేపర్లు, ఇంటర్నెట్ అందుబాటులో ఉండవు. జీవనోత్సాహం, ఆలోచనలు, స్నేహాలు, సమావేశాలు, ప్రయాణాలు, పరిశీలనలు, అందని విషయాలే. ఆడపిల్ల జీవన పరమావధి ఇంకా వివాహమే. ఆ వర్గం నుంచి వచ్చిన కిందటి తరం రచయిత్రులున్నారు. అప్పటి జీవన విధానం వేరు. ఇప్పటిది వేరు. పాఠశాలల్లో కాని కళాశాలల్లో కాని సృజనాత్మకతను ప్రోత్సహించే వాతావరణం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలే లేనప్పుడు గ్రంథాలయాన్ని ఆశించడం పేరాశే కదా. ఇక ప్రైవేటు విద్యాసంస్థలు మార్కులు తెచ్చుకొనే ‘ప్రొడక్ట్స్’ని తయారుచేసే ఫ్యాక్టరీలయిపోయాయి. విద్యార్థుల్లో సృజన్మాకతని ప్రోత్సహించగల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అతి ఖరీదైన సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో మాత్రమే ఉంది. ఇంటి దగ్గర వాతావరణం కూడా అంతంత మాత్రమే. వెలిగిపోతున్న భారత పుత్రికల నుంచి సాహిత్య సృష్టి అందుకే జరగడం లేదు. ఇక మొదటి వర్గం కెరియర్ మీద, తగిన వరుణ్ణి సంపాదించడం మీద దృష్టి నిలుపుతోంది. రచయితలకి కూడా పై బాధల్లో చాలావరకు ఉన్నా వారికి స్వతంత్రంగా బయటికి వెళ్ళి మిత్రుల్ని కలిసి చర్చలు చేసే వెసులుబాటు ఉంది. ఇంకా స్త్రీల విషయంలో వర్జీనియా ఉల్ఫ్ చెప్పిన స్వంత గది, స్వంత డబ్బు కలిగుండే అవకాశాలు లేవు. నిలబడి ఆలోచించగల స్థిమితం లేదు. అందుబాటులో ఉన్న కాలహరి టి.వి. యువతుల్ని తిరిగి స్టీరియోటైప్‌గా మారుస్తోంది. పాపులర్ పత్రికలు ప్రకటనలతో మెదళ్ళు తినేస్తున్నాయి. కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి.
* కథలపై ఉన్న ఆసక్తి రచయిత్రులకి కవిత్వంపై లేదేమో! కవయిత్రులను తయారుచేయడం ఎలా?
మంచి కవిత్వం రాసిన స్త్రీల కవులు అప్పుడూ ఇప్పుడూ చాలామందే ఉన్నారు. స్త్రీలను తయారుచేసినట్లు కవయిత్రులను తయారుచేయలేం. స్త్రీలు పుట్టరు తయారుచేయబడతారు. కానీ కవయిత్రులు పుడతారు, తయారవరు.
* తెలుగులో తొలి కథ వ్రాసింది బండారు అచ్చమాంబ అంటున్నారు కదా, అది గ్రాంథికంలో వ్రాసిన కథ కదా? అయినా గురజాడతో పోలికేమిటి?
తొలి కథ అన్నారే కానీ ఆయనతో పోలిక తేలేదు కదా! తొలి కథ బండారు అచ్చమాంబగారిదేనని అన్వేషి లలితగారు నిరూపించారు. గ్రాంథికంలో వ్రాసిన మాత్రాన అది కథ కాకుండా పోలేదు కదా… తొలి వ్యవహారిక భాషా కథగా గురజాడ కథని చెప్పుకోవచ్చు.
* అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి…
కార్మిక మహిళల హక్కుల కోసం ప్రారంభమైన మహిళా దినం కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారానికి వాడుకొనే స్థితికి దిగింది… ఇటీవల మా ఊళ్ళో ఒక యాభై కిట్టీ పార్టీ సంస్థలు కలిసి ఆడంబరంగా అంతర్జాతీయ మహిళా దినం జరిపి తంబోలా వంటివి నిర్వహించాయి. ఇక పాండ్స్ వంటి కంనీలు తమ లిప్‌గ్లాస్ ప్రకటనల్తో మహిళలకి శుభాకాంక్షలు చెబుతాయి. అయితే బాధ్యత గల కొన్ని మహిళా సంఘాలు స్త్రీ చైతన్య సమావేశాలు జరిపి వెండి అంచులను గుర్తు చేస్తున్నాయి. వేగంగా ముందుకుపోయే ప్రయత్నాన్ని అంత వేగంగానూ అడ్డుకొనే ప్రయత్నాలుంటాయి. అయితే వాటిని ఎదుర్కొని నెమ్మదిగానైనా ముందుకే పోతాంగాని, వెనక్కి పోమనేది చారిత్రక సత్యం.
* గృహకృత్యాలు విలువ కట్టడంలో స్త్రీవాదులకి స్పష్టత అవసరం…
ఆ విషయంలో స్త్రీవాదులు స్పష్టంగానే ఉన్నారు. కొన్ని పనులు హీనమైనవని, అవి స్త్రీల పన్లనీ, కొన్ని పురుషుల పన్లనీ అనడాన్ని స్త్రీవాదులు ఒప్పుకోరు. ఇంట్లో ప్రజాస్వామ్యం నెలకొల్పితే వీధిలో విధానసభలో కూడా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందంటారు. ఏ పని అయినా ఎవరైనా చేయవచ్చు వీలుని బట్టి, వీలు కల్పించుకొని. కుటుంబంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, ప్రేమ, స్నేహం ఉన్నప్పుడు పనులకు విలువలు కట్టే ప్రసక్తే రాదు…… it all depends on caring and sharing.
[…] * * * పి. సత్యవతిగారితో ఇంటర్వ్యూ రెండవ భాగం చదవండి […]
I am not sure where you’re getting your info, but good topic. I needs to spend some time learning more or understanding more. Thanks for wonderful information I was looking for this information for my mission.