- జ్వలిత

సగటుది సామాన్యమయినది నా మనసు
నా బలం బలహీనత కూడా నా మనసే
వర్జీనియాటెక్ అయినా విజయవాడయినా
శ్రీలక్ష్మీ, లక్ష్మీసుజాత ఎవరయినా
ప్రేమ-హింస రూపమెత్తింది అహాలను తృప్తిపరచలేదనేగా!

బిగ్‌బ్రదర్స్ షోలో జాత్యహంకారం ముందు
వుదారత్వం విశాల పసిఫిక్ మహా సంద్రంలా ప్రదర్శించి
వైరస్ అవగాహన సదస్సులో ఆ పైత్యమేమిటి?
ఆంధ్రాలో సంతోషయినా పరదేశంలో చో అయినా

హంతకులు ఆకాశంలో నుండి ఊడిపడ్డారా?
దృతరాష్ట్రునిలా పుట్టుగుడ్డి కాదుగదా మనం
గాంధారిలా ఆపాదించుకున్న అంధత్వం మనది
చూపుకే కాదు మనసుకు మనకెందుకులే అని ఉపేక్ష

తిరుపతి ప్రసాదంలా మన ప్రేమలను
ఐ లవ్ యురా అంటూ ఎస్.ఎమ్.ఎస్.ల్లో
ప్రపంచమంతా ఎందరికయినా పంచే స్వేచ్ఛ మనకుంటే
మన మనసు అమీబాలా అనుక్షణం మారుతుంటే
ఆక్టోపస్‌లా అన్నివైపులా వేట మనదే
వైరస్‌తోపాటు హింసను పెంచే వటవృక్షాలు మనమే

ముద్దుల శిల్పా రిచర్డ్‌ల ప్రహసనాలకు మీడియా వుత్సాహం
వలసజీవుల హత్యలపై వెలుగుచూడని వుదంతాలపై
వెలికి తీయడానికి ఎందుకు వంధ్యత్వం
నాలుగుగోడల మధ్య తలలెత్తే చిరుమొలకలు
సామూహిక హింసారూపం దాల్చేలోపు మనదెంత?

సరసాదేవి గులకరాయినంటూ
ఏ కొండలు పిండి చేయాలని
ఆ నైతిక విలువల పతనంలో మనమెంత?

వెలుగుతున్న భారతంలా
పావురమై ఎగురుతున్న శాంతిలా
మనమది పండు ఘనీభవించి
చిదిమినా, చెరిపినా ఏమీ పట్టని
స్థితప్రజ్ఞత పొంది మనది కాదులే అనుకొంటే సరిపోయె.

2 అభిప్రాయాలు

  1. John Hyde 17 మే 2007 , 12:09 am

    జ్వలిత గారికి
    అభినందనలు.

  2. shivarati sudhakar 28 మే 2010 , 12:49 pm

    కవిత బాగుంధి జ్వలిత గారు..అభినంధనలు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)