అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
నేను మాత్రం
తలుపు తెరిచి ఇల్లు విడిచి
ఎక్కడికో దూరంగా
కొండదాటి కోనదాటి
వెన్నెల మైదానంలోకి
వెళ్ళి నిలుచున్నాను.

devarakonda_tilak_2.jpg

ఆకాశం మీద అప్సరసలు
ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు
వారి పాదాల తారామంజీరాలు
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
వారు పృథు వక్షోజ నితంబ భారలై
యౌవన ధనుస్సుల్లా వంగిపోతున్నారు.

నన్ను చూసిచూసి కిలకిల నవ్వి ఇలా అన్నారు
చూడు వీడు
అందమైన వాడు
ఆనందం మనిషైనవాడు
కలల పట్టుకుచ్చులూగుతేన్న కిరీటం ధరించాడు
కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు
ఎర్రని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు
ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు
జీవితాన్ని ప్రేమించినవాడు జీవించడం తెలిసినవాడు
నవనవాలైన ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు
ఇతడే సుమీ మన ప్రియుడు,నరుడు, మనకి వరుడు

జలజలమని కురిసింది వాన
జల్వారింది అమృతంపు సోన
దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను
దుఖాన్నీ చావునీ వెళ్ళిపొమ్మన్నాను
కాంక్షా మధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను
జీవితాన్ని హసన్మందర మాలగా భరించాను
జైత్రయాత్ర పథంలో తొలి అడుగు పెట్టాను.

అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు
అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని!

- దేవరకొండ బాలగంగాధర తిలక్
1962

6 అభిప్రాయాలు

  1. kottapALI 01 జూన్ 2007 , 12:26 pm

    ఇది ప్రచురించేందుకు మీరు అనుమతి తీసుకున్నారా?

  2. narasimham 02 జూన్ 2007 , 3:03 pm

    ఈ పద్యం లో ఉన్న ప్రగతిపర అంశం ఏమిటో పండితులు వివరించగలరు. గతంలో అభ్యుదయ సాహిత్యంగా చలామణీ అయిన విషయాలు ప్రస్తుతం క్షుద్ర సాహిత్యం కావచ్చు.

  3. Raghothama Rao C 07 జూన్ 2007 , 9:38 am

    ఈ కవిత కంటే కఠినోపనిషత్తునో, శవం కవితనో అచ్చు వేసివుంటే బావుండేది.

  4. venkat 13 జూన్ 2007 , 1:20 am

    మీ కవిత బాగుంది

  5. g sekhar 13 మే 2011 , 2:53 am

    సర్ చాలా బాగా రాసారు

  6. krishna 29 సెప్టెంబర్ 2011 , 4:54 am

    అద్బుతం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)