- శిఖామణి

ప్రిన్స్ డయానా చిన్నప్పటి ఫోటోలా
హొళీనాటి రంగుల హేలలా
ఈ హేలీ పుట్టాల్సింది ఏ హవేలీలోనో కదా!

తోకచుక్క పేరు పెట్టుకున్న
ఈ పగటిచుక్క
ఏపాలపుంతలోనో మెరవాల్సింది
చూసి చూసి మా మాలపుంతలో ఎందుకు పుట్టినట్టో
పేదవాని గుడిసెమీద విరబూసిన
ఏడురంగుల మింటిపువ్వులా
రాబోయే దళితుల రాజ్యాధికారానికి
ఇది విజయపతాక కాదు కదా!

మిగలపండిన పనసతొనలను
జుంటితేనెలో ముంచి తీసినట్టున్న ఈ పాపాయి
మా చేదుబతుకులను
తీపిచేయడానికి వచ్చిన
పంచదార చిలకా?

కువకువలాడే గువ్వపిట్టిలాంటి ఈ కివి
చిన్నప్పుడు ఆటలాడుకోవడానికి బొమ్మల్లేవని
పెద్దయ్యాక వాళ్ళమ్మకు ప్రభువిచ్చిన
ప్రాణం ఉన్న బార్బీబొమ్మ కాదుకదా!

అల్లా సాక్షిగా అల్లారుముద్దుగా
కన్నకొడుకును కంటిపాపలా ప్రేమించిన హుస్సేన్ బి
కొడుకును తిట్టిడానికి నోరురాక
ఇప్పుడు కొడుకు కడుపున కూతురుగా పుట్టి
’దున్నపోతా’ అని మురిపెంగా తిడుతోందా!

కవులైవుండి
కత్తివాదర లాంటి వాక్యాలు రాయగలిగి
గొంతుల్లో గంధకపు గనులుండి
అర్థాంతరంగా కలాలుమూసేసిన ఈ అమ్మానాన్నల చేత
మళ్ళీ అఆ అలీఫ్ బేలు దిద్దించడానికొచ్చిందా ఈ పిల్ల?

కోపగించినపుడు ఈ కొంటెకోణంగిని
కృష్ణదేవరాయలు చూడలేదుగాని
అముక్తమాల్యదలో బ్రహ్మరాక్షసి పద్యాన్ని
ఇంకెంత అందంగా రాసేవాడో!
పిల్లల్ని కంప్యూర్ ఇంజనీర్లుగా
అమెరికాకు ఎగుమతిచేసేసి
మిగిలిన విశ్రాంతి విరామసమయాన్ని
తెలుగు భాషోద్యమంకోసం ఖర్చుచేస్తున్న వారిని చూసి
పేద దళితులకా తెలుగు చదువులన్నట్లు
ఈ పిల్ల ఇంగ్లీషు నవ్వు నవ్వుతోంది!

ఇన్నాళ్లూ తామే పెద్ద ఆరిందలమని భ్రమసినవాళ్ళు
ఈ పిల్లతో కాసేపు ఆడి ఆడి అలసి సొలసి
ఇన్నాళ్ళకు తామెంత పసివాళ్లమో తెలుసుకున్నారు

గదిలోని బొమ్మలన్నీ ఒకొక్కటీ మోసుకొచ్చి
హాల్లో గుట్టపోసి
ఏ బొమ్మకా బొమ్మను
ఎక్కడికక్కడ కీళ్లువిడదీసి
మళ్ళీ అతకడానికి ప్రయత్నిస్తుందీ పిల్ల
అప్పుడప్పుడు మనల్ని మనం కూడా
ఒక్కోసారు విప్పదీసుకుని
మళ్లీ మళ్లీ నిర్మించుకుంటే ఎంత పరిపూర్ణత!

( వినోదిని – ఖాజాల గారాల పట్టి హేలి భెవిన్ కోసం )

డాక్టరు కె. సంజీవరావు ( శిఖామణి )
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

11 అభిప్రాయాలు

  1. aneka 02 జూన్ 2007 , 1:25 am

    తెలుగు దళితకవుల్లో ఒకరకమైన పేరు” సంపాదించుకున్న” కవుల్లో శిఖామణి, కత్తి పద్మారావు వంటి వాళ్ళు ప్రతి చిన్న విషయానికీ స్పందించి కవిత్వం వ్రాస్తారు. కానీ, సుమారు రెండు దశాబ్దాలుగా జరుగుతున్న మాల- మాదిగల ” వర్గీకరణ సమస్య” పై కవిత్వం వ్రాయడనికి కనీస ప్సందనే కరువయ్యిందా…? అది అంత ప్ర్ధధాన సమస్య కాదా…? ఇది గోడ మీద పిల్లి వాటం కాదా…? ఈ కవులకున్న నిబద్దతను ఎలా అర్థం చేసుకోవాలి?

  2. naanu 02 జూన్ 2007 , 1:11 pm

    కవుల నిబధ్ధత ఫలాన దాని మీద రాసారా లేదా అన్న దాన్నుంచి తెలియదు. వాళ్లిద్దరూ మాలలు. ఇంతదాకా స్పందించని మాదిగలు కూడా వున్నారు. ఏబిసిడి ని సమర్ధించే మాలల్ని దుమ్మెత్తి పోస్తున్న మాదిగలూ వున్నారు. వాళ్లంతా కనిపించడాం లేదా! మాదిగల పేరు చెప్పి వారి జాతి గౌరవాన్ని తాకట్టు పెడుతున్న మాదిగ నాయకులు , కవులు, కవయిత్రుల నిబధ్ధతను తేల్చు ముందు. తర్వాత శిఖామణిని, కత్తి పద్మారావుని నడి బజార్ట్లోకి లాగుదాం!

  3. Thullimalli Wilson Sudhakar 03 జూన్ 2007 , 6:04 am

    శిఖామణిగారు గొప్పకవి.తెలుగుజాతి గర్వించదగ్గ మహాకవి.ఒక వర్గీకరణనో, ఒక వివాదాన్నో దృష్టిలో వుంచుకుని శిఖమణిగారిని విమర్శించడం ఎంత అన్యాయం.విమర్శించేవారికేమితెలుసు ఆయన ఎంతోమందికి స్పూర్తి అని. ఒకసాధారణ వ్యక్తి కలం బలంతో ఒక మహాకవిగా కితాబులందుకుంతున్నప్పుడు, ఒక ఎండ్లూరిగాని, ఒక శిఖామణి గాని దళిత జాతికీ,తెలుగు జాతికీ ఎంత గర్వకారణం?

    తుల్లిమల్లి విల్సన్ సుధాకర్,బెంగలూరు

  4. Raghothama Rao C 07 జూన్ 2007 , 9:42 am

    కవి, కవిత్వం వంకదార్లు పడితే పాఠకుల స్పందన ఏమిటో ఇక్కడ తెలుస్తోంది.

  5. Deepakacharya 14 జూన్ 2007 , 3:34 am

    వంకరదారుల ఆలోచనలున్న పాఠకుల స్పందన వంకరగానే వుంటుంది. శిఖామణి నిఖార్సైన దళితకవి. “అనేక” మంది మాదిగకవులకు మాదిగ స్పృహ వున్నట్లు శిఖామణికి మాల స్పృహ లేకపోవటం తప్పుకదా!రఘోత్తములకు ఇది వంకరగా అనిపింస్తుందికదా!ఎలా చచ్చేదిరా బగమంతుడా!

  6. umamaheswara rao c 14 జూన్ 2007 , 12:05 pm

    Yes, reconstruction is needed.That is possible only by cultural revolution with right perception of exploitation and history and also with the possession of reflexes aganst those forces which numb your action and your impersonal,universal outlook.A people’s poet neednot be dictated.A poet of Sikhamani’s genre will raise above these disputes and despise the petty antogonism existing between the two for wonderful tomorrow and let ‘raboye dalithula rajyathikarapu vijaya pathaka’ flutter.

  7. Raghothama Rao C 17 జూన్ 2007 , 5:23 am

    కవిత్వంలో దళితం, అదళితం, బ్రాహ్మణం అనే రకాలు నాకు తెలియవు ఆచార్య గారు. కవిత్వాన్ని గంతల్లోనుండి తప్ప సూటిగా చూడలేకపోవడమే నేటి ఫ్యాషనేమో. అలాగే కానివ్వండి.

  8. Deepakacharya 21 జూన్ 2007 , 3:41 am

    కాలం మారింది రఘోత్తమా! నువ్వు నేను కూడా మారాలి. ఇవాళ కులం తప్పని సరి చర్చనీయాంశం. ఇన్నాళ్లుగా మనమే సాహితీవేత్తలం అని విర్రవీగాం. ఇవాళ రకరకాల కులాలనించి వచ్చిన కవులు కవిత్వానికే కొత్త నిర్వచనాలు రాస్తున్నారు. వారిని చూసి మనమూ నేర్చుకుందాం. తప్పులేదుకదా. మనకు తెలిసింది, మనకు అర్థమయ్యేది, మనగొప్పాను పొగిడేది మాత్రమే సాహిత్యం అనుకుంటే మనం కూపస్థ మండూకాల కింద లెక్క. మారే కాలంతో మనమూ మారాలి. కొత్త విషయాలను , ప్రష్నలను స్వీకరించాలి.మంచి ఎక్కడున్నా ఆస్వాదించాలి.శుభం భూయాత్..

  9. Raghothama Rao C 04 జులై 2007 , 7:59 am

    మంచి ఎక్కడున్నా ఆస్వాదించాలి అన్నారు. నేనూ అదే చెబుతున్నా. మంచి కవిత్వం ఎక్కడున్నా ఆస్వాదిస్తాను, కులాలకతీతంగా. కానీ కుల కవిత్వం పేరుతో వస్తున్నదంతా కవిత్వమనడం అంత సమంజసంగా లేదు.

  10. Deepakacharya 05 జులై 2007 , 3:59 am

    కులాల గురించి మట్లాడిన ప్రతిసారీ మనం మాదిగలను , మాలలను అంటున్నాం కానీ ఇవాళ ఎవరికీ తెలియకుండా మనం కీలు బొమ్మలుగా మారిపోతున్నాం.ఎక్కడి వరకో దేనికి మా రాయల సీమను తీసుకోండి. మొత్తం ఒకేకులం అందరి మీదా ఎక్కిసవారీ చేస్తుంది. తిరుమలలో బ్రాహ్మలు బానిసలైతే రెడ్లు పెత్తందారులైనారు. ఎవరి స్థానం ఏమిటో మనం తెలుసుకునే లోగానే మనకింద నేల మాయమై పోతుంది. అవకాశాలు లేని కులాలు మాట్లడ్డాంలో తప్పేముంది. వీళ్లను చూసి మనంకూడా మనకులాల వెనకబాటు గురించి రాయడం నేర్చుకోవాలి. కనీసం మాయవతి ఇచ్చిన స్పూర్తిని తీసుకుని అయినా మనం కులాల చర్చని ఆహ్వానించాలి. లేకపోతే దళిత కులాలతోపాటు కనిపించకుండా పోయే జాబితాలో మనం కూడా చేరిపోతాం.

  11. umamaheswara rao c 11 జులై 2007 , 1:21 am

    What a poser! The maintainance of status quo is finding expression in the one of the downtrodden! What a reaction Mr. Deepakacharya! Long back I have seen a film by Mr. Mrinal Sen. In that a cluster of people march with a banner- ‘Capitalists of all countries, unite!’ What a parody!

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)