తస్లీమా నస్రీన్, జర్నలిస్టులపైన భౌతిక దాడిని ఖండించండి!

హైదరాబాదు లో 9-8-2007 వ తేదీన ప్రెస్ క్లబ్బు లో పుస్తక ఆవిష్కరణ సభకు వెళ్ళిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పైన మజ్లిస్ కార్యకర్తలు, ఎమ్మెలేలు భౌతికంగా దాడి చేశారు. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన జర్నలిస్టులు, ఫోటోగ్రాపర్లను గాయపరిచారు. ముస్లిం మత ఛాందసత్వం తలకెక్కిన మజ్లిస్ కార్యకర్తలు ఇలాంటి హేయమైన దాడికి పాల్పడటం సభ్యసమాజం తలవంచుకోవలసిన విషయం.

మక్కామసీదులో బాంబుపేళ్ళులపై నిరసన తెలియజేసిన పాతబస్తీ ప్రజలను కాల్చిచంపిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు నగరం నడిబొడ్డులో ఒక రచయిత్రికి, స్త్రీ కి రక్షణ కల్పించలేకపోయారు. కాంగ్రెసు పార్టీకి నాయకత్వం వహించే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తమ బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైయ్యారు. ఈ సంఘటన మతోన్మాదమనే తీవ్రమైన సమస్యను మనముందుకు తెస్తుంది. అత్యంత నికృష్టంగా కాంగ్రెసు ప్రభుత్వం బాధితురాలైన బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్ పైన పోలీసు కేసు కూడా పెట్టింది. తస్లీమా మళ్ళీ హైదరాబాద్ వస్తే చంపుతామన్న మజ్లీస్ నాయకులను బెయిల్ పైన విడిచిపెట్టింది.

గతంలో ఆర్.ఎస్.ఎస్, బిజేపీ హిందూమతోన్మాదులు చిత్రకళాకారుడు యం.ఎఫ్ .హుస్సేన్ పైన దాడిచేశారు. మతోన్మాదం, ఛాందసవాదం అనేవి ఏ మతంలో వున్నా అవి మానవసమాజానికి ప్రమాదమే. మెజార్టీ మతోన్మాదం ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా మైనార్టీ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తోంది. ఎందుకంటే మెజార్టీ మతోన్మాదంలో ప్రభుత్వాలు, పాలకవర్గాలు, పోలీసులు, పారామిలటరీ శక్తులు పాల్గొంటాయి. ముంబాయి మతకల్లోలాల్లో అప్పటి శివసేన ప్రభుత్వం మరియు మహారాష్ట్ర పోలీసులు హత్యాకాండలో పాల్గొన్నారని సాక్ష్యాధారాలతో సహా శ్రీకృష్ణ కమీషన్ బయటపెట్టింది. అలాగే గుజరాత్ లో బిజేపీ ప్రభుత్వం, ఆర్ .ఎస్. ఎస్ మరియు పోలీసులు ముస్లింల ఊచకోతలో పాల్గొన్నారని మానవహక్కుల సంఘాలు తేల్చాయి.

హైదరాబాదు కి ఉన్న సుదీర్ఘ మతకల్లోలాల చరిత్రను దృష్టిలో పెట్టుకొని మనం చాలా అప్రమత్తం వుండాలి. హైదరాబాదు లో విభిన్న సంస్కృతుల, విభిన్న భాషల జీవనశైలిని కాపాడుకోవాలి. సాహిత్యకారులు, కళాకారులు ఉద్యమకారులను ఆహ్వానించే నగరంగా గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ప్రజాస్వామికవాదులు, ప్రవాసభారతీయులు, అంతర్జాతీయ కార్మికులు, దళితులు, విధ్యార్ధులు, రచయిత, రచయిత్రులు, కవులుగా తస్లీమా నస్రీన్ మరియు జర్నలిస్టులు పైన జరిగిన దాడిని ఖండించవలసినదిగా విజ్ఞప్తి చేసున్నాం. అన్నీ మతాలలో వున్న మతోన్మాదాన్ని ప్రజాపోరాటాల ద్వారా ఓడించవలసినదిగా విన్నవిస్తున్నాం.

సంతకాలు చేసిన వారు :

డా. పిల్లల మర్రి రాములు , సీనియర్ లెక్చరర్ , తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటి,
డా. దార్ల వెంకటేశ్వరరావు , సీనియర్ లెక్చరర్ , తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటి,
డాక్టరు కొడవటిగంటి రోహిణీప్రసాద్
జాన్ హైడ్ కనుమూరి
ఆరి సీతారామయ్య
ప్రవల్లిక రాజేష్
అట్లూరి విజయ
రామాచంద్రమౌళి
సుధాకర్
కె. శ్రీనివాస్
గాంధీ
విద్యా
ఉమేష్ వర్మ
శ్రీధర్ రావు దేశ్ పాండే
డా. భారతి ( గీతాంజలి )
చుక్కా శ్రీనివాస్
విజయ్
ప్రశాంత్
సాజీగోపాల్

2 అభిప్రాయాలు

  1. ram 07 సెప్టెంబర్ 2007 , 8:26 pm

    తస్లిమాపై దాడిని నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను.తస్లిమా గొప్ప రచయిత్రా?కాదా? అనేది కూడా అనవసరం. కాని ముస్లిం మతాన్ని ఏమేరకు కించపరచింది అనేది తెలుసుకోవాల్సి ఉంది. మతంలోఉన్న లొసుగులను విమర్శించడం కించపరచడం కాదని మనం గమనించాలి. భారతమాతను నగ్నంగా చిత్రించిన ఎమ్ ఎఫ్ హుస్సేన్ పై హిందువులు చేసిన దాడిని , తస్లిమా పై జరిగిన దాడిని సమంగా చూడడడం న్యాయంగాలేదు. అట్లని హుస్సేన్ వంటివాళ్ళు తప్పు చేస్తే దాడి చేయాలని కూడా నా ఉద్దేశం కాదు.అటువంటి వారిపై కోర్టుకు వెళ్ళి శిక్షింపచేస్తే ,కోర్టులో వాదనలు జరిగి
    అటువంటి నేరాలు మరొకరు చేయకుండ ఉంటారు.

  2. ram 09 సెప్టెంబర్ 2007 , 9:50 pm

    తస్లిమాపై మరికొంత గుర్తొచ్చి రాస్తున్నాను.
    ఆమె రాసిన “లజ్జ” అనే నవలను నేను చదవలేదు.బంగ్లాదేశ్ లో హిందువులకు జరుగుతున్న అవమానాలగురించి, వారిపై ముస్లింలు చేసనుదురాగతాలు ,దాడుల గురించి తన “లజ్జ” అనే నవలలో వివరించిందని పత్రికల్లో చదివినట్లు గుర్తు.అలాగే ముస్లిం మతంలోని చందస భావాలను కూడాఖండించినట్లు చదివాను. హిందూ మతంలోని చాందస భావాలను పూర్వకాలంనుండి విమర్శించి , అపఖ్యాతి పాలైన వారెందరో హిందువులున్నారని కూడా చదఇవాను. ఇటీవలి కాలంలో కూడా హిందువులు ఎందరో (హేతువాదులు) మతగ్రంధాలలోని పలు అంశాలను విమర్శించడం కూడా మనం చూశాం. కాని వారిపై హిందువులు ప్రతివిమర్శలు చేశారు కాని భౌతిక దాడులు చేయలేదు. అట్లని హిందువుల్లో మతోన్మాదులు లేరని నావుద్దేశం కాదు. కాని ముస్లిమ మతోన్మాదులను విమర్శించాల్సి వచ్చిన ప్రతి సారి కొందరు అప్రస్తుతంగా హిందూ మతోన్మాదాన్ని ముందుకు తెస్తుంటారు. ఆ పద్దతి సరికాదు . నాకు తెలిసినంత వరకు హిందూమతంలో ప్రజాస్వామ్యం అనే పదం ఉపయోగించక పోయినా , ఇతరమతాల్లో లేని ప్రజాస్వామ్యం ఉందని నిస్పక్ష పాతంగా బేరీజు వేసే వాళ్ళకు తెలుస్తుంది.
    తస్లిమాపై జరిగిన దాడి జరిగిన తెల్లారి బుర్ఖాలో ఉన్న ఒక ముస్లిం మహిళ మతోన్మాదులను ఖండించడాన్ని తెల్లారో,మర్నాడొ జెమినీ టీవీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో చూపించారు. ఒకవేళ ఆ ఇంటర్వ్యూను చూసివుంటే తదుపరి మతోన్మాదులు ఆమెపై కూడా దాడికి ప్రయత్నించి ఉంటారని నానమ్మకం. ఆవిషయం ఎన్క్వైరీ చేయంచాల్సి ఉంది. మతాలగురించి వివరించేటప్పుడు ఎంతో నిస్పక్ష పాతాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని నాఅభిప్రాయం.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)