- చలసాని ప్రసాద్

మనసు మూగబోయింది…

సహవాసి అస్తమించాడు. మనసు మూగబోయింది. అంతరంగం అంధకార బంధురమైంది. గుండెల్లో సుడిగుండాలు చెలరేగాయి. “O! death! death to a dove ” అన్నాడో ఇంగ్లీషు కవి. ‘ఏ నాటికైనా మానవజాతి మరణాన్ని జయిస్తుంది’ అన్నాడు మన మహాకవి. అందాకా ఈ వేదన మనని వీడదు.

నిజం చెప్పాలంటే సహవాసి నాకన్నా రెండేళ్లు చిన్న. అయినా తాను ముందుగానే సెలవంటూ వెళ్లిపోయాడు. ఎందుకని? ఏమో చెప్పలేం! దిగులు చెందడం మానలేం. సహవాసి విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు రాజకీయాల వైపు మొగ్గుండేది. చాలా ఆవేశపరుడు. అన్యాయం సహించేవాడు కాదు. ఆధునిక తెలుగు సాహిత్యం అంటే అపార అభినివేశం. తెలుగంటే వల్లమాలిన ప్రేమ. తెనాలి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ తెలుగులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గోల్డ్‌మెడల్ సాధించాడు.

తొలిదశలో సహవాసి ‘యువ’లో కథలు రాస్తూండేవాడు. రెండో దశలో అనువాదాలు విరివిగా చేశాడు. మూడో దశ లో ఈనాడు ఎడిటర్. చిట్టచివరి పదేళ్లు చక్కని తెలుగు సాహిత్య పునరుద్ధరణకి పూనుకున్నాడు. అందరూ మరచిపోయిన సాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చి (సమర్థతగల సంక్షిప్తీకరణ) సాహిత్యాభిరుచికి తోడ్పడ్డాడు. సహవాసికి జనం అంటే ఎంత ప్రేమో, జనకంటకుల పట్ల మంట. అందుకనే వాళ్ల కొలువు కూటాల కొలిమి మంటల్లో నిలబడలేకపోయాడు. డబ్బు అక్కర లేకుండా బతికే వనరులున్న వ్యవస్థలో సహవాసి ఇంకా ఎక్కువకాలం మనుగడ సాగించేవాడు. హైదరాబాధలో బతకలేక తాను చిన్ననాడు పుట్టి పెరిగిన తెనాలికి మారాడు. చాలాకాలంపాటు అంటే ఇంచుమించు 1950 దాకా తెలుగునాట సాహిత్య సాంస్కృతిక కళారంగాలకు కేంద్రం తెనాలి.

ఈ వికాస వీచికలకి కారణాలు పరిశోధించి తీరాలి. తాను తెనాలి వెళ్లాక ‘మనం నగరాల్లో ఉండలేం. మీరూ ఇక్కడి కొచ్చేయండి’ అన్నాడు ఆప్యాయంగా. తాను అలనాటి తెలుగు పుస్తకాల్లో మునిగిపోయాడు. ‘పేదరాసి పెద్దమ్మ’ కతల సంపుటి కావాలన్నాడు. పంపాను. అందే ఉంటుంది. కానీ అది అచ్చువేసే వ్యవధి మిగల్లేదు. సహవాసికి విశాఖ సాగరతీరం అన్నా, రావిశాస్త్రి గారి రచనాసాగరం అన్నా చాలా ఇష్టం. ‘రోగం కుదుటబడ్డాక విశాఖ వస్తా. రావి శాస్త్రిగారు లేకపోయినా మీరు, ఆయన తమ్ముడు సింహంగారు ఉన్నారుగా? చెట్టాపట్టాలేసుకుని విశాఖ వీథుల్లో తిరుగుదాం’ అన్నాడు ఎంతో ఆశ గా. కానీ ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయాడు. కోరికలు తీరకుండానే ఎంతమంది చనిపోవడం లేదు? రక్కసి కంపలాంటి పాలకుల చేతిలో ఎందరు ఉక్కిరిబిక్కిరైపోవడం లేదు. After all life is nothing but human Association.

వల్లంపాటికీ తనకీ ఒకే విధమైన రుగ్మత వచ్చిందని బాధపడుతూ కృష్ణాబాయి ఫోన్ చేసినప్పుడల్లా ‘నాకు తగ్గుతోందండీ. వల్లంపాటిదే మరీను.’ అని సహజధోరణిలో నిబ్బరంగా చెప్పేవాడు. కానీ ఇంత త్వరగా, వల్లంపాటిలాగే తనకీ ఇంత త్వరగా ముంచుకొస్తుందని ఎవరం అనుకోలేదు. హైదరాబాద్‌లో 60వ దశకంలో మేమంతా పబ్లిక్ గార్డెన్స్ పక్షులం. సాహిత్యం, సంస్కృతి, కళలు, రాజకీయాలు మాకు కొట్టినపిండి. వాద వివాదాలు వాడిగా వేడిగా జరిగేవి. ఆనాటి కేంద్ర బిందువు కృశ్చేవ్! నాకు గోపీచంద్ ఇష్టం. ఆయనకి జివి కృష్ణారావు. మా చర్చల తీవ్రత చూసినవారు మరునాడు ‘మేం చెట్టపట్టాలేసుకోవడం చూసి ముసిముసిగా నవ్వుకునేవారు. మళ్లీ విరసం ఏర్పాటుకి ముందూ అలాగే మేమంతా కలిసేవాళ్లం. ఆనాటి చర్చల కేంద్ర బిందువు నగ్జల్బరీ.

విరసం ఏర్పడిన నాడు 04-07-1970 చేరా, సహవాసిలాంటి ఆప్తులు చాలామంది విరసం ఫౌండింగ్ నాన్‌మెంబర్స్‌గా వుండిపోయారు. దీనికి తెలుగు ఏమిటనే చర్చ వస్తే ‘విరసం సంస్థాపక అసభ్యులు’ అని నామకరణం చేశాడు సహవాసి! విరసం ఏర్పడిన తర్వాత ‘విప్లవాగ్నులు’ పాట నా నోట విన్నాడు. ‘తెలుగు కవిత్వంలో ఈ పాట చిరస్థాయి గా నిలుస్తుంది’ అని పరవశమైపోయేవాడు. ఎక్కువగా కవిత్వం రాయకపో యినా తాను కవితాలోలుడు. వచనంలోనే కవితాత్మని సాధించాడు సహ వాసి. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ చదివి చాలామంది కమ్యూనిస్టులయినట్టు సహవాసి ఏడు తరాలు, రక్తాశ్రువులు, విముక్తి, ఉక్కుపాదం అనువాదాలు చదివి చాలామంది నక్సలైట్‌లయారు. అనువాదాల్ని అనువాదాల్లా కాకుండా మూలగ్రంథం చదివిన అనుభూతిని కలిగించిన సహవాసి మా మిత్రుడు అమరజీవి. నోరారా గలగలనవ్వే సహవాసి మరపురాడు.

ఒక్క అభిప్రాయం

  1. umamaheswara rao c 03 సెప్టెంబర్ 2007 , 7:59 am

    The more we know of Sahavasi, the more we love.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)