- ముదిగంటి సుజాతారెడ్డి
వర్తమానకాలంలోని అస్తిత్వవాదాల్లో తమతమ అనుభవాల అభివ్యక్తీకరణం ప్రాధాన్యం కలిగివుంది. ఎవరి అనుభవాలను వాళ్ళే చెప్పుకోవాలి, మరొకరి అనుభూతులు సానుభూతులు మాకు అవసరం లేదు, మా పోరాటాన్ని మేం చేస్తాం అన్నది స్త్రీ దళితవాదాల్లో వ్యక్తమౌతున్నది.
అంటే అస్తిత్వవాదాల్లో ‘స్వానుభవ’ వ్యక్తీకరణం ఆ సాహిత్య అభివ్యక్తి నిర్వచనం! ఆ నిర్వచనంలోంచి వచ్చిందే ప్రాంతీయత, ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ చైతన్యం. ప్రాంతీయత, ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ చైతన్యం అనే పదాలు 1990 దశకం నుంచి ఇంకా చెప్పాలం టే 1995 ప్రాంతాల నుంచి సాహిత్యంలో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. సాహిత్య చర్చల్లో సాహిత్య చరిత్రల్లో మనం కొత్తగా వాడుతున్న పదాలు ఇవి. గత శతాబ్దపు ఆరంభం నుంచి తెలుగులో ఆధునిక సాహిత్యం ఆవిర్భవించింది. వ్యావహారిక భాషోద్యమం ఆధునిక సాహిత్యానికి ఒక ప్రామాణికభాషను ఇచ్చింది. కాల్పనిక సాహిత్యం అభ్యుదయ సాహిత్యం ప్రామాణిక భాషలోనే అవతరించాయి. కాల్పనిక సాహిత్యయుగంలో ఉన్నవ, చలం వంటి రచయితలు కథల్లో నవలల్లో వ్యవహారిక భాషకు దగ్గరగా ఉండే అంటే సరళ గ్రాంథికం కాని శిష్టజనుల నిత్యవ్యవహారానికి దగ్గరగా ఉండే భాషశైలిని వ్యాప్తిలోకి తెచ్చారు. తర్వాత కాలంలో సృజనాత్మక రచనలయిన కథ, నవలల్లో ఈ రచయితల బాటలోనే నడుస్తూ ప్రజల నిత్యవ్యవహారానికి దగ్గరగా ఉండే సజీవభాష, శైలినే రచయితలు పాటించారు.
అభ్యుదయ సాహిత్యయుగంలో వాస్తవికతకోసం యథార్థతను పోషించటం కోసం రచయితలు పాత్రోచితంగా మాండలికభాష, యాసలను వాడారు. చాసో, మాగోఖలే వంటి రచయతలు అట్లా ప్రాంతీయ మాండలికాలను తమ కథల్లో ప్రయోగించారు. 1960 దశకంలో వాస్తవికత, సామ్యవాద వాస్తవికత (సోషలిస్ట్ రియలిజమ్) కోసమోయే మో సంభాషణలనేకాక కథనంలో కూడా రచయితలు ప్రాంతీయ భాషయాసలను వాడటం ఆరంభమైంది. 1963 లో రావిశాస్త్రి ‘ఆరుసారా కథలు’లో సంభాషణల్లోనే కాక కథనంలోకూడా ప్రాంతీయ మాండలికాన్ని ప్రయోగించాడు. అతన్ని అనుసరిస్తూ బీనాదేవి రచనలు ప్రాంతీయ మాండలికంలో వచ్చాయి. ఈ రచయితల రచనలను అభ్యుదయ సాహిత్యంలో భాగంగానే విమర్శకులుపరిగణించారు.
గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకంలో మాండలిక భాషా ప్రయోగం చేసినా దాన్ని వ్యవహారిక భాషోద్యమానికి లక్ష్యంగా వ్రాయబడిన రచనగా పరిగణించటం జరిగింది. ప్రాంతీయ భాష, జీవిత చిత్రణలు పరిగణనలోకి ఆనాడు రాలేదు. అదే రావిశాస్త్రి విశాఖపట్నం మాండలిక ప్రయోగానికి విమర్శకులు మాం డలికప్రయోగం దర్జానే ఇచ్చారు. కాని ప్రాంతీయత, ప్రాంతీయస్పృహగా పేర్కొనబడలేదు. అభ్యుదయ సాహిత్యం తర్వాత 1970-80 మధ్యకాలంలో విప్లవసాహిత్యం తన ప్రాబల్యాన్ని చూపింది. ఉత్తరాంధ్ర విప్లవోద్యమం కాలంలో కారా, భూషణం, సువర్ణముఖి, అప్పల్నాయు డు, గౌరునాయుడు మొదలైన రచయితలు శ్రీకాకుళం మాండలికంలో అక్కడి ప్రజలసమస్యలను, పోరాటస్ఫూర్తిని చిత్రిస్తూ కథలు, నవలలురాశారు.
విప్లవోద్యమం అనతికాలంలో ఉత్తర తెలం గాణకు పాకింది. అల్లం రాజయ్య, బి.ఎస్.రాములు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, పి.చంద్ మొదలైన రచయితలు ఉత్తర తెలంగాణ ప్రజల వ్యథలను, పోరాట స్ఫూర్తిని చిత్రిస్తూ ఉత్తరతెలంగాణ మాండలికంలో కథలు, నవలలు వ్రాసారు. ప్రాంతీయ ప్రజల సమస్యలను, ప్రాంతీయ భాష, యాసల్లో వ్రాయబడిన ఈ సాహిత్యమంతా విప్లవోద్యమ సాహిత్యంగానే పరిగణింపబడింది. కాని ప్రాంతీయతాముద్ర పడలేదు. నాయని, కేశవరెడ్డి వంటి రచయితలు చిత్తూరు మాండలికాల్లో వ్రాసినా అవి ప్రధాన సాహిత్య స్రవంతిలో భాగంగానే చెప్పబడినాయి.
అంతకుపూర్వం 1930, 40 దశకాల్లో తెలంగాణ విమోచనోద్యమం కాలంలో తెలంగాణ ప్రాంత ప్రజల జీవితవ్యథలను, పోరాటాలను చిత్రిస్తూ తెలంగా ణ భాష యాసల్లో కథలు, నవలలు వచ్చాయి. ఆ సాహిత్యాన్నం తా అభ్యుదయమార్గంలో భాగంగానే తెలంగాణ విమోచనోద్య మ సాహిత్యంగా చెప్పుకుంటున్నాం. 1980 దశకాంతం వరకూ ప్రాంతీయత, ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ చైతన్యం అన్న పదాలు సాహిత్యచర్చల్లో ఎక్కడా వాడబడలేదు.1980ల్లో విప్లవోద్యమ సాహిత్యప్రాబల్యం తగ్గుముఖంపట్టి అస్తిత్వవాదాలు ముం దుకు వచ్చాయి. తమ అస్తిత్వం కోసం చేసే పోరాటమే అస్తిత్వవాదాల్లో ప్రధానాంశం. స్త్రీలు తమ అస్మిత అస్తిత్వాలకోసం జండర్ స్పృహతో చేసే పోరాటం స్త్రీవాదంగా, దళితులు తమ అస్మిత అస్తిత్వంకోసం వర్ణస్పృహతో చేసేపోరాటం దళితవాదంగా ఏర్పడ్డాయి. ఆయావాదాలు తమతమ భాష పలుకుబడులనూ, అభివ్యక్తీకరణాలను సృష్టించుకున్నాయి. ఈ అస్తిత్వవాదాల్లో స్త్రీలు దళితులు తమ ఉనికిని కాపాడుకోవడమే కాక వివక్ష ఉపేక్షలకు వ్యతిరేకంగా పోరాటం సాగించటం కనిపిస్తుంది. ఆధునిక సాహిత్యంలో వివిధయుగాల్లోని వాదాల్లో ‘సాహిత్య అభివ్యక్తీకరణ నిర్వచనం’లో భేదం కనిపిస్తున్నది.
కాల్పనికయుగంలో స్వేచ్ఛా సౌభ్రాతృత్వం సమానతభావాల ‘అనుభూతు’ల అభివ్యక్తీకరణం కనిపిస్తుంది. అభ్యుదయ సాహిత్యం తీసుకుంటే పీడితుల తాడితుల అణగారిన ప్రజల పరిస్థితుల మీద ‘సానుభూతి’ అభివ్యక్తీకరణం కన్పిస్తుంది. ప్రాచీన సాహిత్యంలో పురాణేతిహాసాలనుంచి పాత్రలను కథలనుతీసుకొని సత్యం నీతి ధర్మా ల వ్యాఖ్యానం బోధనల అభివ్యక్తీకరణం ఉంటుండేది. ఇక విప్లవ సాహిత్యం తీసుకుంటే పీడితుల తాడితుల అణగారిన ప్రజల్లో చైతన్యం ఆవిర్భావ వ్యక్తీకరణం కన్పిస్తుంది. వర్తమానకాలంలోని అస్తిత్వవాదాల్లో తమతమఅనుభవాలఅభివ్యక్తీకరణం ప్రాధాన్యం కలిగివుంది. ఎవరి అనుభవాలను వాళ్ళే చెప్పుకోవాలి, మరొకరి అనుభూతులు సానుభూతులు మాకు అవసరం లేదు, మా పోరాటాన్ని మేం చేస్తాం అన్నది స్త్రీ దళితవాదాల్లో వ్యక్తమౌతున్నది. అంటే అస్తిత్వవాదాల్లో ‘స్వానుభవ’ వ్యక్తీకరణం ఆ సాహిత్య అభివ్యక్తి నిర్వచనం! ఆ నిర్వచనంలోంచి వచ్చిందే ప్రాంతీయత, ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ చైతన్యం.
రచయిత కేవలం తనచుట్టూరా ఉన్న, తనుచూసే ప్రజలవ్యథను చెప్పేవాడు కాక, తన స్వానుభవంలోకి వచ్చిన వ్యథలను వ్యక్తీకరించేవాడుగా మారాడు. స్వానుభవ అభివ్యక్తీకరణం సాహిత్యనిర్వచనం కావటం చేత రచయిత తన కుటుంబం, వాడ, ఊరు, పట్టణం, ప్రాంతంలోని స్వానుభవాలను తన భాష, యాసల్లో వ్యక్తీకరిస్తున్నాడు. దాంతో ప్రాంతీయత, ప్రాంతీయ చైతన్యం, ప్రాంతీయ స్పృహ వర్తమాన తెలుగుసాహిత్యంలో ప్రధానాంశాలుగా ఏర్పడ్డాయి. స్త్రీ దళిత మైనారిటీవాదాల్లోను కూడా ప్రాంతీయత, ప్రాంతీయచైతన్య సం దర్భాలు ప్రాధాన్యం వహిస్తున్నాయి, ప్రభావితం చేస్తున్నాయి. ఇది పోగా ప్రాంతీయచైతన్యం తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవా దం ఆవిర్భావానికి కూడా కారణమైంది.
స్త్రీ దళితవాదాలు లింగ వర్ణ పరమైన వివక్ష ఉపేక్షలను ఎదిరిం చే భావజాలంతో ఆవిర్భవిస్తే తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవా దం తమ ప్రాంతంమీద జరిగే వివక్ష ఉపేక్షను ఎదిరించేవాదంగా ఏర్పడింది. వివక్ష ఉపేక్షల వ్యథ, బాధ, కసి, కోపం స్త్రీ దళితవాదా ల్లో వలెనే ఈ ప్రాంతీయ అస్తిత్వవాదంలో వ్యక్తమౌతున్నది. ప్రపంచీకరణంలో ఒక ధనికదేశం పేదదేశంమీద పెత్తనం చెలాయించడమూ, తన భాషా సంస్కృతులను రుద్దటం జరుగుతున్నది. దీనిమీద ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతున్నాయి. ప్రతిజాతి, ప్రతి ప్రాంతం, దేశం తన భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాలనీ, దోపిడినుంచి దూరం కావాలనీ తం డ్లాడుతున్నాయి. అయితే ఇది ఒక దేశం మరోదేశం మీదనే కాక ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం వెనుకబడిన మరో ప్రాంతం మీద కూడా జరుగవచ్చును. అప్పుడు అదే మాదిరిగా వ్యతిరేకత, నిరసనలు, తండ్లాట వ్యక్తం కావచ్చును.
తమ అస్తిత్వపోరాటం చేయవచ్చును. అదే తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ఆ వ్యతిరేకత నిరసనలే తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదంగా సాహిత్యంలో వ్యక్తమైంది. ఈ అభివ్యక్తీకరణం ప్రాంతీయమైన భాష పలుకుబడుల్లో కసి, కోపం, ఆవేదన, ఆకాంక్షల భావాలతో కూడిన క్రమబద్ధమైన రూపంలో జరుగుతున్నది. కవిత్వ, పాటలు, కథలు, నవలలు, దీర్ఘకవితలు, సాహిత్యవిమర్శలు వంటి వివిధ ప్రక్రియల్లో ఈ అభివ్యక్తీకరణం కనిపిస్తున్నది. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదం ఒక సంపూర్ణమైన వాదంగా వర్తమాన సాహిత్యంలో అవతరించింది. ప్రపంచీకరణమే ఒకవాదంగా పరిణమిస్తుందనుకు న్న తరుణంలో ఏకభిప్రాయం, ఏకసూత్రత లేకపోవటంవల్ల అది వీగిపోయి తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదం ప్రపంచీకరణ వ్యతిరేకతలోని లక్షణాలను పుణికిపుచ్చుకొని ముందుకువచ్చింది.
మీ వ్యాసం చాలా బాగింది, ఇలాంటి వ్యాసాలు ఇంకా ప్రచురిస్తారని ఆసిస్తున్నాను..
రాజు