ప్రజాస్వామిక విలువలతో జీవించే హక్కుకోసం ఉద్యమించండి!
ఆగష్టు 20వ తారీకు ఉదయం, విశాఖపట్టణం వాకపల్లి గ్రామంలో గ్రేహౌండ్స్ పోలీసులు దాడిచేసి ఇళ్ళలోకి జొరబడి పదకొండు మంది ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలకు పాల్పడారు. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం పాంగి శ్రీదేవి (22), పాంగి బరసు (30), పాంగి సిత్తాయి (28), కొర్ర చిలకమ్మ (38), వంతాల చిట్టమ్మ (45),…
కొర్ర అరి సోబి (28), పాంగి అందె (30), వంతాల రేందొ (25), కొర్రా కుమారి (22), పాంగి లక్ష్మి (22), కొర్రా జానకమ్మ (22) లపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. పచ్చి బాలింతని కనికరమైనా చూపకుండా శ్రీదేవి అనే మహిళపైన బలత్కారం చేసారు. సభ్యసమాజం తలవంచుకునేటట్టుగా, ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టుగా రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం మానవహక్కులను కాలరాస్తుంది. అత్యాచారాలకు పాల్పడ గ్రేహౌండ్స్ పోలీసులను వెనకేసుకొస్తోంది. నోరిప్పి నిజాలు చెబితే భర్తను కాల్చిచంపుతామని పాంగి శ్రీదేవి అనే ఆదివాసీ మహిళను పోలీసులు బెదిరించారు. మరి ఇన్ని అకృత్యాలు జరిగినా, హొమ్ మంత్రి జానారెడ్డి, డిజీపీ ఏమీ జరగలేదని ప్రకటనలు ఇస్తున్నారు. మావోయిస్టులను వెతికే నెపంతో ఉత్తరాంధ్ర, తెలంగాణ , రాయలసీమ గ్రామాలలో భయానక పరిస్థితిని సృష్టించి బూటకపు ఎన్ కౌంటర్లు, మానభంగాలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పాల్పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నక్సలైట్లను కాల్చి చంపడానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో డి.జి.పీ వ్యాస్ ఆధర్వంలో “గ్రేహౌండ్స్” అనే పారామిలటరీ ఫోర్సును మొదలుపెట్టారు. అంతులేని డబ్బు, ఆయుధాలు, అదుపులేని అధికారాలు కట్టబెట్టారు. న్యాయస్థానాలు, చట్టసభలకి జవాబుదారీ లేనీ రాజ్యాంగ యేతర శక్తిగా గ్రేహౌండ్స్ అవతరించింది. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఎన్ కౌంటర్ల అనే అణచివేత విధానాన్ని గ్రేహౌండ్స్ పోలీసులతో కొనసాగిస్తున్నారు. అరకులో దుబాయి బాక్సైటు కంపెనీ కోసం, ఎస్.కోటలో జిందాల్ కంపెనీ కోసం ఆదివాసీలను ప్రభుత్వం నిర్వాసితులను చేస్తోంది. ప్రత్యేక ఆర్థిక మండలు, బహుళ జాతి కంపెనీల కోసం గ్రేహౌండ్స్, సాల్వాజుడుం పేరులతో స్త్రీలపై లైంగిక అత్యాచారాలు, హత్యలు, దమనకాండ సాగిస్తున్నది.
అలనాడు మన్నెంలో స్వాతంత్ర పోరాటకాలంలో బ్రిటిషు దురాక్రమణదారులు దాడులు చేసి గిరిజన గూడెలను, అటవీసంపదను కొల్లగొట్టారు. వేలాది ఆదివాసీలను హత్యచేసారు. నేడు ప్రభుత్వాలు పెంచిపోషిస్తున్న గ్రేహౌండ్స్ పారామిలటరీ శక్తులు గిరిజన గూడేలపై దాడిచేసి, అమాయక ఆదివాసీ మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నాయి. ప్రజలచేత ఎన్నుకోబడ్డామనే కాంగ్రెసు ప్రభుత్వం నేరస్థుల కొమ్ము కాస్తుంది. ఇది నిజంగా ప్రజాస్వామమా లేదంటే ప్రజాస్వామిక హక్కులు కాలరాసే ఫాసిస్టు రాజ్యమా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
భ్రష్టుపడుతున్న సమాజంలో మన కళ్ళముందు జరుగుతున్న అకృత్యాల పట్ల మనం ఎలా స్పందించాలి? అణచివేతకు గురవుతున్న ఆదివాసీలు , దళితులు పక్షాన మనం నిలబడగలుగుతామా? అన్యాయాలను నిలదీయగలుగుతామా? పాలకవర్గాల దుర్మార్గ విధానాలను ప్రశ్నించగలుగుతామా? మధ్యతరగతి మౌనాన్ని వీడగలుగుతామా?
మానవతావిలువలను నమ్మే సగటు మనుషులుగా, రచయితలు, రచయిత్రులు, కవులు, దళితులుగా, విద్యార్ధులుగా, ప్రవాసభారతీయులుగా, ప్రజాస్వామ్యవాదులుగా గిరిజన మహిళలపైన గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచారాలను, దుర్మార్గాలను ఖండిస్తున్నాం. నిందితులను వెంటనే అరెస్టుచేసి, న్యాయవిచారణ జరిపి కఠినంగా శిక్షించవలసినదిగా డిమాండ్ చేసున్నాం. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న గ్రేహౌండ్స్ పారామిలటరీ ఫోర్సును రద్దుచేయాలి. ప్రజాస్వామిక వాదులంతా యీ దారుణాన్ని ముక్తకంఠం తో ఖండించి, ప్రభుత్వ అణచివేత విధానాలు, పోలీసు అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించవలసినదిగా విన్నవిస్తున్నాం.
డా. కొడవంటిగంటి రోహణీప్రసాద్, రచయిత
పి. సత్యవతి, ప్రముఖ కథా రచయిత్రి
ఆరి సీతారామయ్య, కథా రచయిత
చుక్కా శ్రీనివాస్
గుర్రం సీతారాములు
సాంబయ్య గుండిమెడ
నారాయణ స్వామీ , కవి
అజయ్ ప్రసాద్, కథా రచయిత
అబ్దుల్ మన్నన్
డి.పి. రెడ్డి
జాన్ హైడ్ కనుమూరి
సౌమ్య బాలకృష్ణ
గాంధీ
విజయ్
ప్రశాంత్
సాజీగోపాల్
గ్రేహౌండ్స్‌ను రద్దు చేయాలి : కె.బాలగోపాల్
పాడేరు, సెప్టెంబర్ 8 (ఆన్‌లైన్): రాష్ట్రంలో గ్రేహౌండ్స్ పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని, చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఈ విభాగాన్ని రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె.బాలగోపాల్ డిమాండ్ చేశారు. వాకపల్లి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అఖిలపక్ష ఐక్య వేదిక నిర్వహిస్తున్న నిరాహారదీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రేహౌండ్స్ పోలీసులు మావోయిస్టుల వేట పేరుతో సామాన్యులపై కూడా దాడులు చేస్తూ కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు సాగించిన అత్యాచారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకూ వారిని ఎందుకు అరెస్టు చేయలేదని బాలగోపాల్ ప్రశ్నించారు.
కనీసం ఆ రోజు వాకపల్లి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులు ఎవరనేది కూడా అధికారులు వెల్లడించకపోవడం చూస్తే ప్రభుత్వానికి ఆదివాసీలంటే ఎంత చులకన భావం వున్నదో అర్థ్ధం అవుతున్నదని విమర్శించారు. వాకపల్లి ఘటనలో దోషులు అరెస్టు అయ్యేంత వరకూ ఆందోళన కొనసాగించాలని, అందుకు తమ పూర్తి మద్దతు వుంటుందని బాలగోపాల్ ప్రకటించారు. జిల్లా పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు టి.శ్రీరామమూర్తి, మానవ హక్కుల వేదిక జిల్లా ప్రతినిధి వి.కృష్ణ, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు తదితరులు శిబిరంలో పాల్గొన్నారు.