అమెరికాలో ఉంటున్న అరుణతో ఛాటింగ్ చేస్తూ విరగబడి నవ్వుతోంది వసంత. పక్కన మ్యూజిక్ సిస్టంలో నుంచి వచ్చే పాట భూమిని అదరగొడుతోంది.

“అరగంట నుంచీ పిలుస్తున్నా… వినపడటంలా!'’ అని అరుస్తూ వచ్చి మ్యూజిక్ ఆపేసి, “పద… దోసెలు తిందువుగాని. అప్పుడే పదయింది. ఇంకెప్పుడు? ఆదివారమయితే అన్ని పన్లూ ఆపడమేనా?'’ అని కూతుర్ని కసిరింది వసుంధర.

“జస్ట్ హాఫెనవర్ మమ్మీ,'’ అంది వసంత.

“హాఫూ లేదు, అవరూ లేదు. పదపద అందరిదీ అయిపోయింది. నీకు పోసేసి ఆవిడ వంట మొదలేసుకుంటుంది. ఇవ్వాళ మీ నాన్నకి పెరుగు వడల మీద మనసైంది. నీకేం కావాలో మరి లంచ్‌లోకి త్వరగా చెప్పేస్తే ఓ పనైపోతుంది.'’

“ఏదో ఒకటి చేయించు మమ్మీ,'’ అంటూ వచ్చి టేబిల్ ముందు కూర్చుంది వసంత.

వంటావిడ వసంత ముందు ప్లేటూ పచ్చడీ పొగలు కక్కే సాంబారూ పెట్టి, దోసె పోసుకు రావటానికి వంటింట్లోకి పరిగెత్తింది. అయిదు నిమిషాల్లో అట్లకాడ మీదే దోసె పట్టుకొచ్చి, “తినమ్మా అదయినాక ఇంకొకటి వేస్తా,'’ అని మళ్ళీ స్టౌ దగ్గర నిలబడింది.

వసుంధర వచ్చి కూతురు ఎదురుగా కూర్చుని, “నీకు గురు వారం పెళ్ళిచూపులు ఫిక్స్ చేశాం. బుధవారం సాయంత్రం ఆరుగం టలకి, ‘ఊర్వశి’ బ్యూటీక్లినిక్‌లో అపాయింట్‌మెంట్ తీసుకున్నాను, ఫేషియల్ కోసం. ఆఫీసు నుంచి డైరెక్టుగా అటే వెళ్ళు. డ్రెస్సులేం ఉన్నాయో ఇప్పుడే చూసి పెట్టుకో. చీరె వద్దులే… డ్రెస్ వేసుకో. కాస్త మంచిది చూడు. విన్నావా? మళ్ళీ మరచిపోయా నంటావా? నీకు నెలరోజులుగా చెబు తున్నా, ఈ నెలలో ఒక సెలవు అడిగి పెట్టుకోమని.'’

అమ్మకి అడ్డు చెప్పటమూ, సవరణలు చెయ్యటమూ అసంభవం. ఆవిడవన్నీ ఆజ్ఞలే.

“సరే మమ్మీ.'’

“పద బీరువాలో మంచి డ్రెస్సులేం ఉన్నాయో చూద్దాం. లేకపోతే సాయం త్రం ఒకటి కొనుక్కొద్దాం. అప్పుడే లేవకు, ఇంకో దోసె వేసుకొస్తోంది ఉండు,'’ అని, “మళ్ళీ కంప్యూటర్ దగ్గర కూచోకు. తినంగానే బీరువా దగ్గరికి పద. చెవులకి ఏం పెట్టుకోవాలో, మెడలో ఏం వేసుకోవాలో, గాజులేం బావుంటాయో చూద్దాం,” అని - దోసె పళ్ళెం తీసెయ్య మని పనిపిల్లకీ, ఫ్రిజ్‌లో నుంచి బత్తాయి రసం తీసి వసంతకివ్వమని వంటావిడకీ ఒకేసారి ఆజ్ఞలు జారీచేసింది వసుంధర.

వంటావిడ తెచ్చిచ్చిన బత్తాయి రసం గడగడ తాగేసి, ‘ఇకపోనా?’ అన్నట్టు చూసింది వసంత.

“పద… బీరువా దగ్గరికి,'’ అని కూతుర్ని దాదాపు లాక్కుపోయి, చెవు లకీ, మెడలోకీ ఏం వేసుకోవాలో తనే ఎంపిక చేసిపెట్టి, ఒక డ్రెస్సు కూడా బయటికి తీసి, “దాన్ని బయటుంచు. మరోసారి ఇస్త్రీ చేయిస్తా,'’ అంటూ, “ఇక పో,'’ అని ఆమెని విడుదల చేసింది.

అమ్మ లంచ్‌కి పిలిచేదాకా హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. లంచ్‌కి అరగంట ముందు స్నానానికి పరుగెత్తి, ఆ పని కాస్తా ముగించి, భోజనం కానిస్తే, సాయంత్రం టీ దాకా మళ్ళీ అమ్మ కదిలించదు. ఆదివారం కదా వదిలేస్తుంది… అనుకుంటూ వసంత మళ్ళీ కంప్యూటర్ దగ్గర కూర్చొని అరుణతో, రవితో, నిర్మలతో ఛాటింగ్ మొదలుపెట్టింది.

అంతలో వసుంధర వచ్చి ఒక పసుప్పచ్చ కాగితం మీద, ‘బుధవారం సాయంత్రం అయిదింటికి బ్యూటీపార్లర్, గురువారం పొద్దున పదింటికి పెళ్ళిచూపులు,’ అని రాసి కంప్యూటర్ ఎదురుగా అతికించి వెళ్ళింది. వసంతకి పదిరోజులనాడే ఇరవై మూడో ఏడొచ్చింది. నాలుగు నెలలనాడు ఉద్యోగం వచ్చింది. మూడు నెలల కిందట ఇంజినీరింగ్ డిగ్రీ వచ్చింది. నాలుగు నెలలనాడు ఉద్యోగం రావటం అంటే డిగ్రీ పాస్ అవకముందే క్యాంపస్ ఇంటర్వ్యూలోనన్నమాట. ఇప్పుడు పెళ్ళి సంబంధం వచ్చింది. అమ్మ దృష్టిలో చాలా ‘యోగ్యమైన సంబంధం.’

“మీ అమ్మకి నచ్చిందంటే ఇక తిరుగే లేదు,'’ అన్నాడు నాన్న.

ఫోటోలో కుర్రవాడు బాగానే ఉన్నాడు.

ఏ ఏ ఏ

“ఇదుగో… ఈ నాలుగు ఫోటోలూ చూడు. అందులో ఏది నచ్చిందో చూడు,'’ అంది అమ్మ.

“వాళ్ళకీ ఒక్కతే పిల్ల. చాలా బ్రిలియంట్. నీకులాగానే చిన్నప్పటినించీ ఇంగ్లీష్ మీడియం స్కూలు చదువు… ఆపైన ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంకు… క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగం… మొహంలో మంచి స్పార్క్ ఉంది. మాకయితే ఈ సంబంధం బాగా నచ్చింది,'’ ఏకకంఠంతో అమ్మానాన్నా ఒకే అమ్మాయికి ఓటేశారు.

“అవును. వాళ్ళకీ ఊళ్ళో ఇల్లుంది. ఆవిడే పిల్లని చదివించాలని వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుందిట. ఆయనది పెన్షనబుల్ జాబే… బాగానే సెటిల్ అయ్యారు. మనకీ కట్నం అక్కర్లేదు. పెళ్ళి గ్రాండ్‌గా చేస్తే చాలు. ఏమంటావ్?'’ అన్నాడు నాన్న.

సతీష్‌కి ఏం మాట్లాడాలో తెలీలేదు.

‘నీకు బైపిసీ వద్దు… నువ్వు చదవలేవు. ఎంపీసికి అప్లికేషన్ తెచ్చా… ఫిల్ చేశా కూడా… చూడు,’ అని నాన్న అంటే, ‘నాకు డాక్టరవాలని ఉంది నాన్నా,’ అనాలనుకుని, ‘పోన్లే అందులో సీటు రాకపోతే నాన్నకి కోపం వస్తుంది,’ అనుకుని ఎంపీసిలోనే చేరాడు సతీష్.

‘మాథ్స్‌కి నీకు నరసింహంగారి దగ్గర ఎక్‌స్ట్రా ట్యూషన్ పెట్టాను, వెళ్ళు,’ అంటే, సరేనన్నాడు.

“మీ అబ్బాయికి ఐఐటిలో సీటు వచ్చిందిటగా?'’ అని బంధువులు ప్రశంసిస్తే -

“మొదటినుంచీ గైడెన్స్ అంతా నాదే,'’ అన్నాడు నాన్న. ఒకటో క్లాసు దగ్గర్నుంచీ ఎం.ఎస్. దాకా తనదే గైడెన్స్. ఇక అమ్మేమో చదువుకునే పిల్లలు ఏం తినాలో… ఏం ఎక్సర్‌సైజులు చేయాలో… ఇలా ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. ఐఐటిలో చేరినా… అమెరికా వెళ్ళినా… అమ్మానాన్నా - చెవిలో ఇల్లు కట్టుకునే ఉండేవాళ్ళు.

ఒక్కగానొక్క కొడుకు కదా! వాళ్ళని ఏ విషయంలోనూ నొప్పించటం సతీష్‌కి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చెప్పినా తన మంచికే గదా! ఇప్పుడు తనింత మంచి పొజిషన్‌లో ఉండటం వాళ్ళ చలవ కాదూ! సరే, ఆ పిల్లనే చూద్దాం. ఇరవై మూడేళ్ళట. ఫోటోలో చూస్తే పదోక్లాసు చదివే కాన్వెంటు పిల్లలా ఉంది.

ఏ ఏ ఏ

“కట్నానిదేముందండీ వసుంధరగారూ… ఈ చేత్తో పట్టుకుంటే ఆ చేత్తో పోతుంది. అదేం వద్దు. మంచి మ్యారేజి హాల్ బుక్ చేయండి. ఏసీ తప్పనిసరిగా ఉండాలి. క్యాటరింగ్‌కి నంబర్ వన్ వాళ్ళని చూడండి. సరే, మీకు చెప్పేదేముంది… లాంఛనాలవీ ఏముంటాయో మీకు తెలుసు కదా… మా మర్యాదకి భంగం కాకుండా చూడండి.'’

ఏ ఏ ఏ

అర్ధరాత్రి ఫోన్ మోగుతుంటే కంగారుగా రిసీవర్ ఎత్తింది వసుంధర.

“ఏంటండీ! మీ అమ్మాయికంత పొగరు. అసలు ఒక్క మాట కూడా అర్థం చేసుకోదు. పనిరాదు సరికదా… నేర్చుకుందాం అని కూడా లేదు. నావల్ల కాదు… మూడు రోజుల నుంచీ అలిగి కూర్చుంది. ఇండియా పంపటం అంటే మద్రాసుకీ హైదరాబాదుకీ తిరగటమా?'’ సతీష్ గట్టిగా అంటుంటే, నిద్రమత్తు వదిలిపోయింది.

“దానికి ఫోనివ్వు, నే మాట్లాడతా,'’ అంది.

ఫోన్లో ఏడుపు, వెక్కిళ్ళు. ఏమైందో ఏమిటో!

ఈ మగపిల్లలు పైకి బాగానే ఉంటారు. లోపల ఉత్త మేడిపళ్ళు. ఏం బాధలు పెట్టాడో ఏమిటో… పదిలక్షలు వదిల్చారు, కట్నం వద్దువద్దు అంటూ.

అవతల ఫోన్‌లో వింటాడేమో ఏమన్నా అడిగితే.

“ఇప్పుడెంతయిందే టైము?'’ అంటూ, “సతీష్ ఆఫీసుకి వెళ్ళాక ఫోన్ చెయ్యి,'’ అని చెప్పింది. అలాగే చేసింది వసంత.

“ఏం చేసినా నచ్చదమ్మా. వాళ్ళమ్మ చేసినట్టు ఉండదట. పక్కలు దులప లేదంటాడు… కౌంటర్ తుడవలేదంటాడు… నన్నే బట్టలు మెషీన్‌లో వెయ్యమంటాడు… ఫ్రెండ్స్‌ని పార్టీలకి పిలుస్తాడు… వంటలు వండమంటాడు. హాయిగా ఇరవై వేలు తెచ్చుకుంటూ ఉండేదాన్ని… ఇట్లా అమెరికా తోలేశావు గదా! డ్రైవింగ్ లైసెన్స్ లేదు… పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదు. జైలు మమ్మీ… జైలు.'’

“అదేంటీ… అరుణ లేదూ అక్కడ, స్రవంతి లేదూ, ప్రమీల లేదూ - నువ్వొక్కదానివే ఉద్యోగం మానుకుపోయావా? మరి ఇంట్లో కాస్త పని చేయకపోతే ఎట్లా? అలవాటు చేసుకో?'’

“నువ్వెప్పుడన్నా నాచేత కాఫీ పెట్టించావా? ‘అడ్జెస్ట్ చేసుకో - అలవాటు చేసుకో,’ అని కొత్త మాటలు చెప్తావేంటి మమ్మీ. మీరంతా నాకే అడ్జెస్టయిపోయేవాళ్ళు కదా?'’

వసుంధర బుర్ర తిరిగిపోయింది. వెంటనే వియ్యపురాలికి ఫోన్ చేసింది.

ఆవిడ తన కొడుక్కి ఫోన్ చేసి, “ఆ పిల్లకి కాస్త పనిలో సాయం చెయ్యరా నాయనా… అమెరికాలో అంతా చేస్తారటగా?'’ అంది.

“నావల్ల కాదు మమ్మీ… నేనెప్పుడూ పని చెయ్యలేదు. ఇంట్లో పనిచేస్తూ కూర్చుంటే నా ఉద్యోగంలో పైకెట్లా వస్తాను. అసలు ఈ పన్లన్నీ చేసుకోవాల్సి వస్తోందనే నేను పెళ్ళికి ఇంత తొందరగా ఒప్పుకున్నాను. ఉద్యోగమూ చెయ్యక… ఇంట్లో పనీ చెయ్యక… ఆ మహారాణి ఏం చేస్తుందిట? నీకు తెలుసా? పక్కలో టెడ్డీబేర్ లేందే నిద్రపోదు.'’

ఆవిడ తిరిగి వసుంధరతో, “మా అబ్బాయికి ఫోన్ చేశాను వసుంధరగారూ! వాడొకటే గోల - మీ అమ్మాయి కనీసం కాఫీ మేకర్‌లో నీళ్ళు కూడా పొయ్యదట. ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటుందట. శుభ్రంగా ఇండియాలోనే ఇచ్చుకుంటే ఇంటి నిండా నౌకర్లుండేవాళ్ళు.'’

“అవునండీ. నిక్షేపంగా నెలకి ఇరవై వేలతో ప్రారంభమైన ఉద్యోగం మానుకుని వెళ్ళింది. నాదే ఈ తప్పంతా,'’ అంది వసుంధర, కోపం దిగమింగుకుంటూ.

అదే ఇండియాలో ఉంటే అసలేం చేస్తున్నదో ఒకసారి చూసి రావటానికన్నా ఉండేది కదా! ఒక పనిపిల్లని పంపి ఉండేది. ఉండీ ఉండీ ఆ కోపం అంతా తన తల్లి మీదికి తిరిగింది. వసంత పుట్టినప్పుడు పురుడు పొయ్యటానికి వచ్చింది. “దీంతో ఉద్యోగం ఎట్లా చేసుకుంటావ్? నే తీసుకుపోయి పెంచుతా. నాకు మాత్రం చేసే పనేముందీ ఇంటికాడ. కాలక్షేపంగానూ ఉంటుంది… నీకూ హాయిగా ఉంటుంది. అల్లుడిని కూడా అడుగుతాలే,'’ అంది.

ఇంటి దగ్గర ఎవరూ ఉండరు. ఎప్పుడూ పనికి ఒక పిల్ల ఉంటుంది, పసిదాన్ని ఎత్తుకోటానికి కూడా. అమ్మకి శ్రద్ధ ఎక్కువ. కంట్లో వత్తులు వేసుకుని మరీ చూస్తుందని, ‘సరే,’ నంది.

ఆరునెలల పాటు అమ్మ తన దగ్గరే ఉండిపోయింది. ఆ తరువాత వసంతని తీసుకు వెళ్ళిపోయింది.

పదేళ్ళు వచ్చేదాకా తనే పెంచింది. మంచినీళ్ళు ముంచుకు తాగడం, తాగిన గ్లాసు కింద పెట్టడం కూడా తెలీకుండా పెంచింది అమ్మమ్మ. ఎవరికైనా ఏదైనా చిన్నపని చేసి పెట్టొచ్చు అని కూడా తెలీకుండా చేసింది.

“నువ్వే దాన్ని బాగా చెడగొట్టావు,'’ అని ఫోన్‌లో తల్లి మీద బాగా అరిచింది వసుంధర.

“నేను పెంచింది పదేళ్ళు… నువ్వు పెంచింది పదమూడేళ్ళు. నేను పెంచినప్పుడది చిన్నపిల్ల. నువ్వు పెంచినప్పుడు ఊహ వస్తున్న పిల్ల. అయినా నేనెందుకు నీ కూతుర్ని పెంచాను? నాకు లేని చదువూ ఉద్యోగం నీకున్నాయనీ… నువ్వు స్వతంత్రంగా బతకాలనీ… పిల్లకూ ఉద్యోగానికీ నువ్వు న్యాయం చెయ్యలేవనీ. ఆ సంగతి అర్థం చేసుకో ముందు. వంట రాకపోతే వచ్చిన నష్టం ఏంలేదు. ముందు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరేటట్టు చెయ్… లేకపోతే పోయి అక్కడుండి వండి పెట్టు. మధ్యలో నా మీద అరుస్తావేమిటి?'’ అంది ఆవిడ.

“నీకు వంట చేసిపెట్టే పిల్లే కావాలంటే చదువుకున్న అమ్మాయిని ఎందుకు చేసుకున్నావురా?'’ అంది చివరకు సతీష్ తల్లి విసిగిపోయి.

“అదేంటమ్మా మొదట్నించీ మీరే కదా నాకేం కావాలో, ఎట్లా అయితే నేను సుఖంగా ఉంటానో చెబుతున్నారు. మీరు చెప్పినట్టే వింటున్నానా లేదా? మీరా అమ్మాయిని సెలెక్ట్ చేశారు. నేను సరే అన్నాను. నీకన్నీ తెలుసుకదా అనుకున్నాను,'’ అన్నాడు సతీష్.

“పూర్వంలాగా ఇప్పుడమ్మాయిల్ని నీకు వంటొచ్చా? ఇంటిపని చేస్తావా? అని అడగడం మర్యాద కాదు. అయినా ఎంతమంది పిల్లలు అమెరికా పోయి పన్లు నేర్చుకోటంలా? ఇదంతా ఎందుకుగానీ, అక్కడ ఇండియన్ రెస్టారెంట్లూ, ఇండియన్ గ్రాసరీ స్టోర్‌లూ బాగానే ఉన్నాయంట కదా… బయట తినండి కొన్నిరోజులు,'’ అంది సతీష్ వాళ్ళమ్మ.

“బాగానే ఉంది నీ సలహా. తిండి సరే… ఇల్లు కంపుకొట్టి పోతోంది,'’ అని విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు సతీష్.

ఏ ఏ ఏ

“అతన్తో నాకసలు ఫ్రెండ్‌షిప్ కుదరటంలేదే… టిపికల్ ఇండియన్ మిడిల్‌క్లాస్ మేల్,'’ అంది వసంత అరుణతో ఫోన్‌లో.

“ఎంగేజ్‌మెంటయ్యే దాకా మీకు ఒకరి గురించి ఒకరికేమీ తెలీదయ్యే, సరిఫికెట్ల గురించి తప్ప. మరి ఇలాగే ఉంటుంది. పోనీ కొన్నాళ్ళు ఇండియా పో,'’ అంది అరుణ.

“అది కూడా అయింది. పెళ్ళికి బోలెడు ఖర్చు పెట్టాట్ట… అప్పుడే టికెట్లు కొనటం తన వల్ల కాదట. చెప్పేశాడు.'’

అరుణకి ఏం చెప్పాలో తెలీటంలేదల్లే ఉంది. టెలిఫోన్ ఆ కొస నుంచి నిశ్శబ్దం…

“మంచి ప్రాజెక్టు చేస్తూ, మధ్యలో ఉద్యోగం వదిలేసొచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. ఇంకో ఆరునెలలు ఉంటే నేనే టీం లీడర్ అయ్యేదాన్ని. అసలు నన్ను వొట్టి హోమ్ మేకర్ కింద చూస్తాడు. నాకతనితో ఫ్రెండ్‌షిప్ కుదరడం అసంభవం అరుణా! అసలు అర్థం చేసుకునే గుణం లేదు. చిన్న సహాయం కూడా చెయ్యడు… నీకు తెలుసా? వంటమ్మాయి రాకపోతే, అమ్మ ఎక్కడికైనా వెడితే నేనూ నాన్నా బయటే తినేసేవాళ్ళం. హాయిగా సినిమాకి పోయేవాళ్ళం.'’

“మనకి మన అమ్మలూ నాన్నలూ శుభ్రంగా ఉండటం… అందంగా హుందాగా కనిపించటం… మంచి ర్యాంకులు తెచ్చుకోవటం నేర్పిస్తారు… పుట్టినరోజు పార్టీలు చేయటం… మంచి తిండి పెట్టడం… ‘మంచి’ మొగుణ్ణి చూడ్డం… వంటివన్నీ చేస్తారు. మనకు ఆలోచించే అవసరం కలిగేలా చెయ్యటం… స్వతంత్రంగా ఆలోచించగలిగే శక్తిని సమకూర్చడం… సమస్యలెదురైతే అదరక, బెదరక నిలబడే ఆత్మ విశ్వాసాన్నివ్వడం - ఇలాంటివేవీ వాళ్ళ దృష్టిలోకి రానేరావు. మనకి అన్నీ అమర్చినట్టే, మన బదులు వాళ్ళే ఆలోచించి పెడతారు. ఇప్పుడిది మరీ ఎక్కువైపోయింది. నువ్వే కాదు… సతీషూ అంతే. మీకేం కావాలో ఆలోచించుకోవాల్సిన అవసరమే ఇంతదాకా మీకు రాలేదు. అందుకే ఇట్లా ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిలలాడుతున్నారు. మీరిద్దరూ వెళ్ళి కౌన్సెలింగ్ తీసుకోండి. ఇక్కడ ఇదిచాలా మామూలు.'’

“ఏం కౌన్సెలింగో ఏమిటో… నిజం అరుణా! మా ఇంట్లో నేనెప్పుడూ టీ కప్పు కూడా కడగలేదు. కనీసం సింక్‌లో కూడా పడేసేదాన్ని కాదు. పనమ్మాయి నా చేతిలోంచి అందుకుని పోయేది. ఇక్కడేమో బాత్‌రూంలు కడగలేదని సతీష్ గొడవ! పోనీ తను కడగొచ్చు కదా ఎప్పుడైనా. అవన్నీ తప్పించుకోటానికే పెళ్ళి చేసుకున్నానని సిగ్గు లేకుండా చెప్పేశాడు.'’

“చూడు వసంతా! నా మాట విని మీరిద్దరూ కౌన్సెలింగ్ తీసుకోండి. అతను రానంటే నువ్వే వెళ్ళు. లేకపోతే డిప్రెషన్ వస్తుంది నీకు.'’

ఏ ఏ ఏ

“పాపని నేను తీసుకుపోతాను. దాన్ని పెంచటం నీవల్ల కాదు. నాకేం కష్టం ఉండదు. వంటమనిషి… పనికి పిల్ల… మీ నాన్నగారూ… నేనూ… ఇందరం ఉన్నాం. నీకు వర్క్ పర్మిట్లు వచ్చాయంటున్నావ్‌గా… ఉద్యోగం చూసుకో. లేకపోతే చదువుకో. మొదట్లో పాపం చాలా స్ట్రెస్ అయింది నీకు. పాపని మేం పెంచుతాం. నువ్వు హాయిగా జాబ్ చేసుకో, లేదంటే చదువుకో. సతీష్ ఇప్పుడు చాలా మారాడు, చూస్తున్నాంగా,'’ అంది అమ్మ.

“ఇంకో యువరాణిని తయారుచెయ్యండి,'’ అంటున్నాడు సతీష్.

అవతలవైపు సతీష్ తండ్రి కాబోలు ఫోన్‌లో ఉన్నాడు. స్పీకర్ ఆన్‌చేసి ఉన్నట్టుంది, వినబడుతోంది.

“పాపని వసుంధరగారితో పంపరా సతీష్. కొన్నాళ్ళు మేం కూడా చూసుకుంటాంలే… ఈ ఊరేగా. అచ్చంగా ఆవిడ మీదే వదలం,'’ అంటున్నాడు.

“ఇటు అయిదుగురు - అటు అయిదుగురు పదిమంది కలిసి పెంచండి. వండర్‌ఫుల్ నాన్నా. ఇప్పుడు కూడా మేం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పటం మానుకోరా? మమ్మల్ని కాస్తయినా ఆలోచించుకోనివ్వరా? వదిలెయ్యండి నాన్నా. ఇప్పటికైనా మమ్మల్ని కాస్త స్వతంత్రంగా మాదైన వ్యక్తిత్వంతో బతకనివ్వండి. మంచీ చెడూ ఆలోచించాల్సిన అవసరం మాకు రానివ్వండి… ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి,'’ అని ఫోన్ పెట్టేశాడు.

“ఏంలేదు - ఇద్దరూ పని చేసుకుంటే త్వరగా ఇల్లు కొనుక్కోవచ్చు,'’ అంటోంది వసుంధర.

“ఏదో చేస్తాంలే అమ్మా. నువ్వు కూల్‌గా ఉండు. సతీష్ వాళ్ళ నాన్నకి చెప్పింది విన్నావు కదా?'’ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసంత.

“ఇదేమిటీ?'’ ఆశ్చర్యంగా అనుకుంది వసుంధర. ఈ ఎదురుచెప్పడం అదివరకు లేదు మరి.

4 అభిప్రాయాలు

  1. nirmala 15 అక్టోబర్ 2007 , 2:03 am

    సత్యవతి కధ చాలా బావుంది. మన ఇంట్లో కే తొంగి చూస్తున్నట్టుగా వుంది.ఇప్పుడు కొత్తగా పేళ్ళి చేసుకున్న పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ సంమస్యలు వింటుంటే ఇంతకంటే తక్కువ సౌకర్యాలతో, చదువులతో,స్వేచ్చ తో, వివేకంతో కూడా మనమే ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నామనిపిస్తోది..అయితే ఈమాట మన వెనకటి తరమూ అనుకోవచ్చు.

    కొండేపూడి నిర్మల

  2. umamaheswara rao c 22 అక్టోబర్ 2007 , 1:42 pm

    Every human being, either male or female, by instinct tries to be assertive. It is the symbol of growth in children. In a way, by forceful methods of pampering, the parents and the practices of tradions are marring the natural development in children and making them handicapped in the process of evolution.Instead they should prepare chilren to face challenges of life and nature.It is shame on our society that still arranged marriages [by parens] are being practiced. This sorry state is well presented in identifiable atmos in the short story by our esteemed writer in interesting form.

  3. Sowmya 15 మే 2008 , 2:05 am

    కథ…బాగుంది…చివరి పేరా ముఖ్యంగా. కానీ… నాకు ఓ సందేహం…. చివరి ఘట్టానికీ దాని ముందు ఘట్టానికీ మధ్య ఇంకాస్త కథ ఉండొచ్చేమో అనిపించింది. అంటే…ఏమిటో…ఉన్నట్లుండి ఏదో సీను నుంచి క్లైమాక్స్ కి వచ్చేసినట్లు అనిపించింది. సలహాలు చెప్పేంతదాన్ని కాను…. ఏదో, నాకు అనిపించింది..ఇక్కడ వ్యాఖ్య రాసే సౌలభ్యం ఉంది కనుక చెప్పాను..అంతే…

  4. manohar 05 మే 2010 , 10:48 am

    బానే ఉంది, కానీ కొంత సత్య దూరంగా ఉన్నట్టుంది. ఎందుకంటే ముఖ్య నగరాల్లో ఉన్నవాళ్ళు తప్ప చాలావరకు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళలో మరో ఊరి వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. స్నేహితులతోనో , సహోద్యోగులతోనో వసతి చూసుకున్నప్పుడు అందరూ కలిసి పని చేసుకోవాల్సి వస్తుంది. అలా చాలా మంది మారుతున్నారు. నా స్నేహితుల్లో చాలామంది వంట పనీ,ఇంటి పనీ అలా నేర్చుకున్నవారే.

    నా అభిప్రాయం …

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)