‘వ్యాకరణం’ మానవీయ శాస్త్రాలకు అత్యంత ప్రాధమిక అంశమూ కీలక అంశమూ అని విశ్వసించిన కాలం నుంచి వ్యాకరణశాస్త్ర అభ్యాసం, బోధన రెండూ అవసరమా అన్న విచికిత్స కొనసాగుతున్న సందర్భంలో తెలుగు వ్యాకరణాలను పునస్సమీక్షించుకొంటున్నాం.

వ్యాకరణం ప్రాభవం క్షీణించి భాషాశాస్త్రం వెలుగులో విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖలు నూత్న మార్గాలు అన్వేషిస్తున్న వర్తమానం యిది. తెలుగు భాషా సాహిత్యాలను పునరు మూల్యాంకనం చేస్తూ వున్న సమకాలీన సాహిత్య సందర్భంలోనూ మనం వ్యాకరణం గురించి సంభాషించుకొంటున్నాం. భాషా రాజకీయాలు నిర్దిష్టతను సంతరించుకున్న అనుభవం మనకుంది. తత్వశాస్త్రమైనా వ్యాకరణమైనా సాహిత్యమైనా స్థలకాలాలకు అతీతమైన అమూర్త విషయాలు కావు. సమాజం, సంస్కృతి, భాష ఇత్యాది విషయాలను వివేచించే క్రమంలో ప్రాదేశికత (స్థలం), కాలిక స్పృహ అన్న ద్విధాకృత సంబంధాలను విస్మరించలేం. తెలుగు భాషాజాతీయోద్యమం విజయం సాధించి తెలంగాణ జాతీయోద్యమం కొనసాగుతున్న కాలంలో భాషాసాహిత్యాల పునర్‌ మూల్యాంకనం తప్పకుండా ఒక రాజకీయ పఠనానికి దారితీస్తుంది.
ఈ పత్రంలో మాండలికాలు అన్న పదబంధం బదులు ప్రాదేశిక భాషలు అన్న పారిభాషిక పదబంధం ఎదురవుతూ వుంటుంది. మాండలికం అన్న భావనలో ఒక విధమైన హైన్యత వ్యక్తం అవుతుంది. ఆధునిక విలువల కారణంగా భాష ఆత్మగౌరవ విషయమని గుర్తిస్తున్నాం. మాండలికాలను భాషలు అనడం పట్ల భాషావేత్తలకు భిన్న అభ్యంతరాలున్నాయి. సాంప్రదాయిక నిర్వచనాల పరిధిలో ప్రాదేశిక వ్యవహారాలు భాషలు కాకపోవచ్చు. భాష పునర్‌ నిర్వచించబడడమే దానికి మార్గం. నిర్మాణవాద భాషాశాస్త్రవేత్త ఫెర్డినాండ్‌ డి. ససూర్‌ ప్రకారం సంజ్ఞల వ్యవస్థ భాష. సంజ్ఞలు నిర్దిష్ట సమాజంలోని సంస్కృతి ఉత్పత్తులు. అందువల్ల వాటి విభిన్నత ఆయా సంస్కృతుల మీద ప్రాదేశికతల మీద ఆధారపడి వుంటుంది. భిన్న ప్రాదేశిక సంస్కృతులున్న చోట ప్రామాణిక భాష ఒక సౌకర్యమే తప్ప పరిష్కారం కాదు. మాండలికాలు ఒక భాష యొక్క ఉపాంగమని భావిస్తే మాండలికాలు అర్థం కావాలి. తెలంగాణ, రాయలసీమ భాషల్లో వున్న రచనలు అర్థం కాకపోవడం వల్ల వాటికి అనువాదాలు అవసరం అవుతున్న దృష్ట్యా అవి ‘భాషలు’ అవుతున్నాయి. ఆకారణంగా మేము ప్రాదేశిక భాషలని వ్యవహరిస్తున్నాం.

రచయిత కేంద్రంగా కావ్య పఠనం తెలుగు పాఠక ప్రపంచానికి నవీనమైనది కాదు. రచన, పాఠకుడు యిద్దరే పఠనక్రియలో మిగలాలని నవ్యసంప్రదాయవాదులు, ఆధునికానంతర వాదులు చేసిన సూచన కన్న ముందే చిన్నయసూరి బాలవ్యాకరణం అధ్యయనంలో సూత్రకేంద్ర వివేచన ఆది నుంచీ ప్రవర్ధితమైంది. వ్యాకరణ గ్రంథాలు అన్నీ కొన్ని మినహాయింపులతో సూత్ర ప్రధాన చర్చ, పఠనం జరిగింది. యిది ఎంతో నవీనమైన అంశం. బాల ప్రౌఢవ్యాకరణాల గురించి సుదీర్ఘ వివేచన జరగడం వ్యాకరణ విశిష్టతను వ్యక్తం చేయడమే కాదు అవి బహుళ పఠన సంభావ్యతకు ఆకరాలు అన్న సారాన్ని ప్రకటిస్తున్నాయి. అందువల్ల, వ్యాకరణాలను పునఃసమీక్షించడమంటే వాటిని నిర్దిష్ట సందర్భంలో కొత్త దృక్పథాల నుంచి పరిశీలించడమని అర్థం. భాష, వ్యాకరణం అన్న రెండు ముఖ్యమైన విషయాలు అమూర్త విషయాలు కావన్న ఎరుక అందరికీ వుంది. తెలంగాణ ప్రాదేశిక దృష్టి నుంచి వ్యాకరణశాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ పత్రం.

వ్యాకరణాలు సాధారణంగా నిర్దేశాత్మక వ్యాకరణాలు. అంటే ఉచ్చారణ, సదసంయోజనం, వాక్యవిన్యాసం వంటివాటిని నిర్దేసిస్తాయి. అందుకు భిన్నమైన వ్యవహారాన్ని వ్యాకరణ దోషాలుగా పరిగణిస్తాయి. ఒక విధమైన భాషానియతివాదమే నిర్దేశాత్మక వ్యాకరణం.

వ్యాకరణానికి వస్తువు కావ్య భాష. భాషాశాస్త్రానికి వస్తువు ప్రామాణిక భాష. ప్రాదేశిక భాషలైన తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలను ‘మాండలికాలు’ కేటగిరిలో చేర్చి అనుషంగిక విషయాలుగానే పరిగణించారు. మాండలికాల పరిశీలనలోనూ వృత్తిపదాలదే సింహభాగం. వ్యాకరణం వ్యాకరించిన కావ్య భాషలో కూడా కవిత్రయం వాడిన భాష తప్ప ఆధునిక వ్యవహారం కాదు. ఆధునిక కాలంలో రచించిన బాలవ్యాకరణంలో పరిశీలనాంశం వేయేండ్ల కాలం నాటి భాష కావడం దాని ప్రాసంగికత రాహిత్యానికి హేతువు. కావ్య భాష పఠనానికి వ్యాకరణం ఉపయుక్తం అవుతుందని విశ్వసించినా అనేక కావ్యాలలోని మాండలికాల ప్రయోగాలు యిప్పటికీ పరిశీలనకు నోచుకోకపోవడం వల్ల ప్రాదేశికవాదం వ్యాకరణాలను అనుమాన దృష్టితో పరిశీలించే పరిస్థితి ఏర్పడింది.

వ్యాకరణశాస్త్రం ఆవిర్భావం ఎలా జరిగిందో పరిశీలించడం వల్ల ఎంతో ఉపయోగం వుంది. వేద పఠనం, మంత్రపఠనం పవిత్రమైనవీ, దివ్యమైనవీ అన్న అధిభౌతిక భావన వుంది. వాటి ఉచ్చారణలోనూ, యజ్ఞాల నిర్వహణలోనూ తప్పు జరిగితే ప్రమాదం. అది ఉచ్చరించిన వారి మీదే ప్రతికూలంగా పని చేసే అవకాశం ఉందని భయం వుండేది. ఆ అవసరం నుంచి ఆరు వేదాంగాలు రూపొందాయి. అవిః శిక్ష, జ్యోతిషము, కల్పము, నిరుక్తము, ఛందస్సు, వ్యాకరణము. ‘’వ్యాక్రియతే అనేనేతి వ్యాకరణమ్‌ -దీనిచే శబ్దములు వ్యాకరింపబడును. ప్రకృతి, ధాతు, ప్రత్యయ విభాగము నిరూపింపబడును. శబ్ద స్వరూపము స్పష్టపరుచబడును'’ (రామచంద్రుడు 1974ః ృ) అని ఆచార్య పుల్లెల రామచంద్రుడు వివరించారు. వేదాలు, మంత్రాలు ఉచ్చరించే సమయంలో తప్పు దొర్లకుండా సంస్కృత శబ్ద స్వరూపం, ధాతు, ప్రత్యయం, విభక్తి వంటివి తెలుసుకోవడం అవసరం. అంటే ఒక నిర్దేశిత ఉచ్చారణ లేదా ప్రామాణిక ఉచ్చారణ అన్నది ఏర్పడడానికి వ్యాకరణం ఉద్భవించింది. అదే శిష్ట వ్యవహారంగా ఆ తరువాత పరిణామం చెందింది. సంస్కృత వ్యాకరణకర్తలు భాషకు పరిణామ స్వభావం వుంటుందని అంగీకరించారు. పాణిని నుంచి వరరుచి వరకు జరిగిన భాషా పరిణామాన్ని పతంజలి పరిగణించాడు. ఆ తరువాత వచ్చిన చాలా మంది వైయ్యాకరణులు భాషలో నిరంతరం సంభవించే మార్పుల్ని పరిశీలనకు స్వీకరించారు. బాలవ్యాకరణ కర్త దృష్టిలో మాత్రం భాష స్థిరమైంది. కవిత్రయం వారి భాషాయనకు ప్రమాణం. అందుకు భిన్నమైన ప్రయోగాలు ఆయన దృష్టిలో దోషాలు. ప్రామాణిక భాషపట్ల కూడా ఆయనకు ఆదరణ వుండేది కాదు. అది కేవలం గ్రామ్యము. అంటే గ్రామీణ వ్యవహారమని అర్థం.
వ్యాకరణం శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే ట్రాఫిక్‌ పోలీస్‌ వంటిది. ట్రాఫిక్‌ పోలిసింగ్‌ లాంటిదే భాషాపోలీసింగ్‌. ఒక సారి పోలీసింగ్‌ ఆరంభమైనదీ అంటే అది అన్నింటిని నియంత్రించడమే కాదు సెన్సార్‌ కూడా చేస్తుంది. అందుకే వ్యాకరణ సూత్రాల రచనకు ప్రాదేశిక భాషలు అనర్హం అన్న నిషేధాన్ని భాషా పర్యవేక్షణ (లింగ్విస్టిక్‌ పోలీసింగ్‌) చేస్తూ వచ్చింది. అది ఉచ్చారణ సరిదిద్దడమన్న సదాశయంతో మొదలై ప్రాదేశిక యాసల్ని రద్దు చేసే దిశగా పయనించింది. యాస కూడా భాషే అన్న కాళోజి నిర్వచనం వ్యాకరణశాస్త్రం యొక్క ఎజెండాకు వ్యతిరేకమైంది. అయినా వ్యాకరణ రాజకీయాలు పరిశీలించాలంటే ఈ కింది శ్లోకం చూద్దాం.

యద్యపి బహు నాధీషే
తథాపి పఠ పుత్ర వ్యాకరణమ్‌
స్వజనః శ్వజనో మాభూత్‌
సకలం శకలం సకృత్‌ శకృత్‌

అన్న సంస్కృత శ్లోకం కూడా ఉచ్చారణ ప్రాధాన్యతను బోధిస్తుంది. దీని గురించి ఆచార్య రవ్వా శ్రీహరి ‘’ వ్యాకరణం చదవకపోతే శబ్ద స్వరూపం సరిగా తెలియదనీ, అందువల్ల ఉచ్చారణాదుల్లో పొరపాట్లు చేసే అవకాశముందనీ అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి ప్రతి విద్యార్థీ తప్పకుండా వ్యాకరణం చదవాలనీ దీనిసారాంశం'’ (శ్రీహరి 1996ః ృఒ) అని వివరించారు. ఉచ్చారణలో క్రమశిక్షణను ఈ శ్లోకం సంకేతిస్తుంది. అయితే ప్రామాణిక వ్యవహారాన్ని కూడా అది నిర్బంధం చేస్తుంది. ప్రాదేశిక భాషలలో కొన్ని వర్ణాలు, ద్వనులు వుండవు. ఉదాహరణకు తెలంగాణ భాషలో ‘ల’ మాత్రమే వుంటుంది. ‘ళ’ వుండదు. ‘ఎవరు! రా?’ అన్న ప్రామాణిక వాక్యాన్ని తెలంగాణలో ‘ఎవల్లుల్లా?’ అంటారు. దీనికి పదమధ్యమంలోనూ పదాంతంలోనూ రకారం లకారంగా మారడం తెలంగాణలో కనిపిస్తుంది. ప్రామణిక వ్యవహారమే సరైనదని విశ్వసిస్తే తెలంగాణ ఉచ్చారణలన్నీ తప్పులుగా తోస్తాయి. ఆకారణంగా తెలంగాణ ఉచ్చారణను తరగతి గదుల్లో సరిదిద్దే కార్యక్రమం మొదలైంది. తెలంగాణ విద్యార్థులు క్రమంగా మాతృభాష ఉచ్చారణను పరిత్యజించి ఆంధ్ర ఉచ్చారణను అలవర్చుకొన్నారు. యిది వ్యాకరణ రాజకీయాల ఫలితాలలో ఒకటి.

చారిత్రకంగా పరిశీలిస్తే ఉచ్చారణ స్పష్టత వల్ల బహుళ ప్రయోజనం వుంది. వేదాలు పొరపాటుగా ఉచ్చరించ కూడదన్న దైవిక భావన ప్రాధమికం. అది పారమార్ధిక ప్రయోజనం. లౌకిక ప్రయోజనాలు అనేకం వున్నాయి. ఉచ్చారణ ప్రాధాన్యత, భాష మీద సాధికారికత ప్రాచ్య పాశ్చ్య దేశాలలో చారిత్రక పాత్ర పోషించింది. అందమైన, స్పష్టమైన ఉచ్చారణ కులీన వర్గాల ఆదరణకు కారణమైంది. వేద మంత్రాలు, సంస్కృతం అధ్యయనం చేసిన వ్యక్తి ఉచ్చారణ విశిష్టమైంది. అది పాలకులను పాలితులను మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. ఉచ్చారణ విశిష్టత, భాష మీద సాధికారికత ద్వారా కులీన వర్గాల ఆదరణ పొందవచ్చని మధ్య యుగాల కాలం నాటి బ్రిటన్లు విశ్వసించేవారు. ఆధునిక కాలంలో ఇంగ్లీషు మీద ప్రభుత సాధించి ఉన్నతావకాశాలు పొందవచ్చని అమెరికాలోని మధ్యతరగతి పంథొమి్మదో శతాబ్దంలో నమ్మేవారని కర్ల్‌ డబ్ల్యూ. డికేమా వివరించారు. అందుకే వ్యాకరణం పాఠ్యాంశాల్లో విధిగా చేర్చాలన్న డిమాండు ఆ సమాజాల్లో వుండేది. ప్రధానంగా మధ్యతరగతి ఆవిర్భావం వ్యాకరణం వికసించడానికి ఇంగ్లీషు భాషా సమాజాల్లో కారణమైంది. వారికి వ్యాకరణం ఒక అభివృద్ధి సాధనమైంది.

భాష కేవలం భావ వ్యక్తీకరణ సాధనమే కాదు. అది అణచివేత సాధనం కూడా అన్న ఎరుక ఆధునికానంతరవాదం అందించింది. అయితే అది ఆధిపత్య సాధనమే కాదు ఊర్ధ్వముఖ చలనానికి కూడా తోడ్పడుతుందని యూరోపియన్లు, భారతీయులు గుర్తించారు. అందుకే సంస్కృతం విముక్తి (మోక్షం) కలిగిస్తుందని విశ్వసించిన వారే దాన్ని యితరులు చదవకుండా నిషేదించారు. అందువల్ల భాష కేవలం భావవ్యక్తీకరణ
మాధ్యమం అన్న నిర్వచనం నిర్వికల్ప భావన మాత్రమే. అయితే సంస్కృతం, ప్రాకృతం వంటి భాషల్లో ప్రభుత కలిగివుండడం పాలకుల ఆశ్రయం పొందడానికి ఉపయోగపడడం చరిత్రలో మనం ఎరుగుదుము. గ్రాంధికంలో రాయని, మాట్లాడని వారిని చిన్నచూపు చూడడం మన సారస్వతంలో నమోదైవుంది. గ్రాంధికమే కావ్య భాషని నమి్మనవారూ వున్నారు. నమ్మకం విశ్వాసంగా కూడా మారిందని డికేమా అమెరికన్ల నుద్దేశించి చేసిన వ్యాఖ్య మనకూ వర్తిస్తుంది. నేడు మన సమాజంలో ఇంగ్లీషు వస్తే సదావకాశాలు ఉపలబ్దం అవుతాయని అనుకుంటున్న వాస్తవం వుంది. వ్యాకరణంలోనూ సంస్కృతంలోనూ పట్టుసాధించని వారికి విద్యారంగంలో ఎటువంటి అగౌరవం అనుభవమౌతుందో అందరికీ ఎరుకే.
తెలుగులో చిన్నయసూరి వ్యాకరణం రాయడానికి కూడా యిలాంటి ఒక చారిత్రక కారణం వుంది. వైయ్యాకరణుడు, లాక్షణికుడు, కవి, అనువాదకుడు అయిన చిన్నయసూరి బాలవ్యాకరణం రాయడానికి ముందు తెలుగులో వ్యాకరణాలు వున్నప్పటికీ అవి సమగ్రమైనవి కావు. చిన్నయ సూరి కవిత్రయం వారి ప్రయోగాలను పరిశీలించి సంస్కృత వ్యాకరణాల వెలుగులో సూత్రరచన చేశారు. బాలవ్యాకరణం ఉద్దేశం కావ్య భాష పరిశీలన, కావ్యపఠనంలో పొరపాట్లు జరగకుండా చూడడం వరకే. ఉచ్చారణ పొరపాట్ల పట్ల బాలవ్యాకరణానికి ఆసక్తి లేదు. అప్పటికే సంస్కృత భాషాపఠనం వల్ల కొన్ని వర్గాలు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమాజం మీద ఆధిపత్యం వహించి వున్నాయి. చిన్నయసూరికి సంస్కృత వ్యాకరణం ఎంత ప్రేరణ కలిగించాయో ఆంగ్లేయుల పాలనలో ఇంగ్లీషు ప్రభావం అంతే కీలకంగా ఆయన మీద పని చేసింది. ఇంగ్లీషు చదివిన వారికి విశేష గౌరవం, అపారమైన ఉద్యోగావకాశాలు దొరుకడం వారి అనుభవంలో వుంది. సంస్కృతం, తెలుగు చదివన వారికి కూడా అవకాశాలున్నాయి. అయితే మద్రాసు ప్రెసిడెన్సీలోని మద్రాసు యూనివర్శిటిలో ఇంగ్లీషు బోధనామాధ్యమంగా వుండేది. తెలుగు బోధించడానికి అనువైన భాష ఏదీ అన్న చర్చ నుంచే గ్రాంధిక వ్యవహారిక భాషా సంఘర్షణ ఆవిర్భవించింది.
సూరి కావ్య భాషకు రాసిన వ్యాకరణం ఆ తరువాత బోధనారంగంలో తిరుగులేని ఆధిక్యతను సాధించింది. వ్యాకరణం అధ్యయనం మధ్యతరగతి బ్రాహ్మణుల్ని విశేషంగా ఆకర్షించింది. కావ్య రచన చేయని వారికి పండితులుగా గుర్తింపు లేని కాలమది. ప్రతివ్యక్తి విద్యాసంపన్నుడు అని గుర్తించబడాలంటే వ్యాకరణం, ఛందస్సు తప్పని సరి. అందువల్ల, కావ్య రచనలో వ్యాకరణ దోషాలు లేకుండా వుండడానికి, గణబద్దంగా కవిత్వం చెప్పడానికి వ్యాకరణం, ఛందస్సు అనివార్యమైనవి. ఆంగ్లవిద్య గడించి ఉన్నతావకాశాలు
పొందగలిగే అవకాశం వున్నప్పటికీ అందుకు తగినన్ని కళాశాలలు, బడులు ఉండేవి కావు. 1857 తరువాత మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో తక్కువ సంఖ్యలో పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు పాఠశాలలు మున్సిపాలిటీ స్థాయిలో ఆవిర్భవించాయి. వాటిలో స్థానిక భాషల్లోనే విద్యాబోధన జరిగేది. అందువల్ల మధ్యతరగతి నుంచి విద్యావంతులుగా ఎదిగినవారు ఆ సంస్థల్లో అధ్యాపకులుగా చేరడానికి ఆసక్తి కనబరిచేవారు. వాటిలో నియుక్తం కావడానికి సంస్కృత భాషా సాహిత్యాలు నేర్చుకొని వుండడం అర్హత. అందువల్ల చిన్నయసూరి బాల వ్యాకరణం విద్యారంగంలో ఆధికార స్థానం పొందింది. రామాయణం, భారతం, పురాణాలు వంటి వాటిల్లో ప్రవేశం వుండడ మొక్కటే సరిపోయేది కాదు. వ్యాకరణం సమగ్రంగా తెలిసినవారినే పండితుడని గౌరవించేవారు.
తెలంగాణ భాషా వ్యవహర్తలకు బాలవ్యాకరణం అధ్యయనం చేయడం ద్వారా లేదా తెలుగు అధ్యయనం చేయడం వల్ల రాజ్యం ద్వారా ప్రయోజనం ఒకనగూర లేదు. తెలంగాణా హైదరాబాదు రాజ్యంలో వుండేది. యిక్కడ ఉర్దూ మాధ్యమిక భాష. పాఠశాలలు, కళాశాలలు అన్నీ ఉర్దూ మాధ్యమంతో నడిచేవి. యిక్కడి ప్రజల భాష తెలంగాణ. అయితే తెలంగాణ మీద ఉర్దూ, పార్శీ, మరాఠీ భాషల ప్రభావం వుంది. అధ్యయన భాషగా ఆంధ్ర భాషను తెలుగు భాష పేరుతో స్వీకరించడానికి గొప్ప పోరాటం చేయాల్సి వచ్చింది. గ్రంథాలయోద్యమం అందులో కీలకమైంది. గురజాడ, గిడుగులు వ్యవహారిక భాషోద్యమం సాగిస్తున్న కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఉర్దూ అధికార భాష. అధ్యయన భాషకూడా. అందువల్ల భాషోద్యమం రాజ్య వ్యతిరేక పోరాట రూపంలో 1940 తరువాత గానీ రాలేదు. వ్యవహారిక భాషోద్యమం, గ్రాంధిక భాషోద్యమం వల్ల లబ్దిపొందింది మద్రాసు ప్రెసిడెన్సీలోని కోస్తాంధ్రులే. తెలంగాణవారికి వాటివల్ల కలిగిన ప్రయోజనం స్వల్పం.

తెలంగాణ ప్రాంతంలోని ఆధునిక కవులకు సంస్కృతంతో అనుబంధం ఉంది. అందువల్ల తెలంగాణ ప్రాంతంలోని బ్రాహ్మణులు, యితర అగ్రవర్ణాలు రాయలసీమ (ఆంధ్రలో భాగం)లోనూ ఆంధ్రలోనూ మద్రాసులోనూ చదువుకునేవారు. వారే కవిత్వం రాసేవారు. గోలకొండ కవుల సంచిక అందుకు ప్రబల ఉదాహరణ. తెలుగు భాష, కావ్యభాష రెండూ కోస్తాంధ్రా సాహిత్యకారుల వికాసానికి ఎంతో తోడ్పడ్డాయి. ఆ ప్రాంతవాసులు సాంస్కృతికంగా ఆధికులై విరాట్‌ రూపం ప్రదర్శిస్తున్న కాలంలో తెలుగు కోసం తెలంగాణవాసులు పోరాటం చేయాల్సి వచ్చింది.

ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తరువాత తెలుగు విద్యారంగంలో వ్యాకరణం
మరింత ఆధిక్యత సాధించింది. వ్యాకరణం ప్రామాణిక భాషను తెలంగాణ మీద రుద్దింది. విద్యార్థులకు ఉదాహరణలుగా బోధించిన అనేక శబ్దరూపాలు తెలంగాణా వాసులకు అపరిచితమైనవి. తెలంగాణ విద్యార్థులు మాతృభాషను కొల్పోవడానికి ఉచ్చారణను సరిదిద్దే కర్తవ్యం వ్యాకరణకర్తలు స్వీకరించడం ఒక కారణం.
వ్యాకరణ గ్రంథాలు ఆంధ్ర ప్రాంతంలోని రెండు జిల్లాల వ్యవహారానికి రూపసాధన చేసి చూపించాయి. రెండు మండలాల వారి భాషకు సూత్ర రచన జరిగింది. యితర ప్రాదేశిక భాషలకు సూత్ర రచన జరగలేదు. దానిక కారణాలు రెండుః ఒకటి ప్రాదేశిక వ్యవహారాలను మాండలికాలని నిమీ్నకరించడం. రెండు, ఆయా ప్రాంతాల నుంచి వైయ్యాకరణులు లేకపోవడం, వున్నా వారికి సంస్కృత వ్యాకరణం మీద తప్ప మిగతా వాటి మీద గౌరవం లేకపోవడం. ప్రధాన స్రవంతి వ్యాకరణాలు ప్రాదేశిక శబ్దరూపాలను వ్యాకరణ బాహ్యాలుగానూ కొన్ని అపవాదులకు నిదర్శనాలుగానూ వినియోగించుకుంది. వ్యాకరణ గౌరవం వాటికి దక్కకపోవడం రాజకయ క్రమంలో ఒక భాగమని అంటే అభ్యంతర పెట్టక్కర్లేదు.
వ్యాకరణం నేర్చుకోవడం అంటే భాషను గురించిన విశేషాలను నేర్చుకోవడమని అర్థం. వ్యవహర్త తన సొంత భాష గురించి నేర్చుకోవడానికి వ్యాకరణం తోడ్పడాలి. ప్రాదేశిక భాషా వ్యవహర్తలకు మాత్రం వ్యాకరణం ఆ విధంగా సహకరించడం లేదు. అందుకు అది పరాయి భాషకు సంబంధించింది కావడమే. ప్రాదేశిక భాషల శబ్దస్వరూపం, ధాతు, ప్రత్యయ విభజన, నియమం, రూఢీ, వ్యవహారం, జాతీయాలు ప్రత్యేకమైనవీ ప్రామాణిక భాషకూ కావ్యభాషకూ సంపూర్ణంగా విభిన్నమైనవి కావడం వల్లనే ప్రాదేశిక భాషా సాహిత్యాల అర్థం ప్రామాణిక భాషావ్యవహర్తలకు బోధపడడం లేదు. ఉత్తరాంధ్ర భాషలో వున్న సాహిత్యం యితర భాషావ్యవహర్తలకు అర్థం కాకపోవడానికి ఉచ్చారణ భేదం ఒక్కటే కారణం కాదు. రాయలసీమ భాషలో వున్న ‘మాదిగోడు’ కతలు కూడా యితర భాషా వ్యవహర్తలకు అర్థం కాలేదు. అదేవిధంగా తెలంగాణా భాషలో వున్న ‘కక్క’, ‘సిద్ధి’ ‘సూర’, ‘పురుడు’ వంటి నవలలు యితర భాషా వ్యవహర్తలకు అర్థం కాకపోవడానికి ఉచ్చారణ, యాస ఒక్కటే హేతువు కాదు. ప్రాదేశిక భాషల స్వరూప స్వభావాల్ని వివరించే విస్తృతి వ్యాకరణం సాధించకపోవడమే వ్యాకరణశాస్త్రం పరిమితి.

సమాజమూ, భాష నిరంతరం చలనంలో వుంటాయనీ, అందుకు అనుగుణంగా వాటి పరిశీలనాపద్ధతులు కూడా మారాలని తెలంగాణా ప్రాదేశికవాదం కోరుతుంది. ప్రామాణిక భాషను సైతం గ్రామ్యమని చిన్నబుచ్చే బాలవ్యాకరణం తెలంగాణ భాషకు తావివ్వదని గుర్తిస్తూ వ్యాకరణం యొక్క సర్వాధిపత్యాన్ని నిరాకరిస్తుంది. ప్రాదేశిక భాషలకు బాల వ్యాకరణం స్థాయిలో ఆధునిక వ్యాకరణ సూత్రరచన చేయడానికి వ్యాకరణాలను పునస్సమీక్షించడం అవసరమని గుర్తిస్తుంది. భాషాశాస్త్రం కూడా ప్రాదేశిక భాషల పట్ల తగినంత శ్రద్ధ కనబరచలేదన్నది గుర్తిస్తూనే వ్యాకరణశాస్త్రాన్ని విస్తరింప చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రాదేశిక భాషాశాస్త్రాల్ని అభివృద్ధి చేసుకోగలమని, తద్వారా భాషా స్వరూపాన్ని మరింత సమగ్రంగా తెలుసుకోవడం వీలవుతుందని ప్రాదేశిక వాదం బలంగా విశ్వసిస్తోంది.

ఉపయుక్త గ్రంథాలుః
1. రామచంద్రుడు పుల్లేల (అను) (1996) ముందుమాట వాక్యపదీయం, ప్రథమ భాగం, హైదరాబాదు; తెలుగు అకాడమీ
2. గోపాలకృష్ణమూర్తి బూరుగల (1996) వ్యాకరణాదర్శము హైదరాబాదు నీల్‌కమల్‌ పబ్లికేషన్స్‌
3. Dykema Karl W. (1944 ) ‘Do We Need to Teach Grammer ‘ The School
Review, vol.52, No.8 (oct,pp 470-476)

(’తెలుగు వ్యాకరణములు - పునస్సమీక్ష’ అన్న అంశం మీద హైదరాబాదు విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ సదస్సు (సెప్టెంబరు, 2007)లో సమర్పించిన పత్రం.)

10 అభిప్రాయాలు

  1. Sambaiah Gundimeda 07 అక్టోబర్ 2007 , 1:21 am

    వ్యాకరణం పేరుతో, ఉచ్చారణ పేరుతో ఆంధ్ర ప్రదేశ భాషాధిపత్యం, తెలంగాణ ప్రాదేశిక భాషను మాండలికంగా మభ్యపెట్టి, ప్రాదేశికపర సహజ వ్యక్తికరణను నియంత్రించిన తీరును చాలా స్పష్టంగా చెప్పేరు. భాష వ్యాప్తి రాజకీయంలో యిమిడిన/దాక్కున్న ఆర్ధిక ప్రయోజనాలు, ఒక కుల ఒక వర్గ ఒక ప్రదేశ ఆధిపత్యం రేఖామాత్రంగానైనా విస్పష్టం చేశారు. తెలంగాణ ప్రాదేశిక భాషకు తగిలించిన మాండలిక శృంఖలాలను చేదించాలని, ఒక సర్వసత్తాక భాషగా గుర్తింపు కావాలనే ప్రజాస్వామ్యబద్దమైన వాదనను చాలా శక్తివంతంగా చెప్పారు.

    సాంబయ్య గుండిమెడ

  2. Rakesh 27 అక్టోబర్ 2007 , 3:55 am

    రవన్నా, శ్రీనన్నా నమస్తే.
    చాన మంచి topic గురించి రాస్తున్నరు!

    తెలంగాణ భాష అనేది ప్రత్యేకమైన భాష అని చెప్పుకొనేందుకు ఎన్నో ఆధారాలున్నై.
    కర్ణాటక రాష్ట్రంలసూత ఎన్నో భాషలున్నై. కానీ ఎక్కడికక్కడ వాండ్ల వాండ్ల భాషాసాంస్కృతుల పరిరక్షణ ఉన్నదిగన్కనే భాషలు స్వల్పతేడాలున్నా ఒక్కకాణ్ణే ఉన్నరు.
    తుళు, హవ్యక, కొంకణి, మాడీ వగైరాలు. ఐతే, లిపి అందరికి లేదు. చాలా భాషలను కన్నడ లిపిలల్లనే రాస్కుంటండ్రు.
    ఇగమరి ఒక్క భాషనే కాక, ఒక్క లిపివాడేటోల్లు వేర్వేరు రాష్ట్రాలల్ల ఉంటాండ్రు.
    అట్లనే, మల్ల హిందీభాష లిపిలనే కనీసం అయిదారు రాష్ట్రాలల్ల ఉండేటోల్లు వాల్ల వాల్ల భాషలను రాస్కుంటుండ్రు.
    మరాఠీ భాష లిపి చూస్తె అచ్చం హిందే. కాని ఒకట్రెండు అక్షరాలు (ళ, ఱ) హిందీల లెవ్వు.

    అసలు history తెలిసినోల్లకు తెల్సినమాట ఏందంటే, తెలంగాణరాజ్యంల తెలంగాణభాష ఎప్పటిసందో అధికారభాషే…….
    ఆంధ్రోల్లు మద్రాసుల ఉన్నప్పుడే ఈప్రాంతపోల్లెందరో దేశవ్యాప్తంగా పేరుగాంచిండ్రు.
    మాకుతెలిసిన శానమంది బొంబై, గ్వాలియర్, పూనా, బరోడా, ఇందోర్ సంస్థానాలల్ల ఆస్థానవైద్యులుగా, నేతగాండ్లుగా, వంటవాళ్ళుగా, పురోహితులుగా స్థిరపడి ఎన్నోతరాలైంది.
    వాల్లందరి ఇంటిపేరు ఒక్కటే…….. అదే… “తేలంగ్” లేదా “తేలంగి”.
    you can serch “orkut.com” or google to locate lacs of TELANG people spread across the country & world!!

    మరి వాల్లభాషకు “ప్రత్యేక” భాషగా గుర్తింపు “ప్రత్యేక తెలంగాణ” రాష్ట్రమైతేగాని రాదా ఏంది??

    మన దేశంలనే అధికారికంగ తమకొక “భాష” అన్న గుర్తింపు పొందిన తెగలవారు, ప్రాంతాలవారు చాన ఉన్నరు. మీకొక web-site లింకు ఇస్తున్న.
    http://www.languageshome.com

    ఇక్కడ మీరు భారతీయ భాషల గురించి తెల్సుకోవచ్చు.

    ఐతే,గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటున్నది.
    “ANGIKA AWADHI BAGELKHANDI BHOJPURI BISHNUPRIYA BUNDELKHANDI MAITHILI MARWADI”
    ఇవ్వన్నీ రాష్ట్రమేలేని ఎన్నో భాషలు.
    ఐతే, వాటికీ అవి మాట్లాడే వాళ్ళున్నరాష్ట్రపు భాషకూ పెద్ద తేడా లేదన్నదీ చూడాచ్చు.
    కొంకణీ, మరాఠీ భాషలలోని ఎన్నో పదాలు, వాటి ఉచ్చారణా దాదాపు ఒక్కతీర్గనే ఉంటయి. కాని, దేనికదె భాషగా గుర్తింపున్నది.

    కనుక తెలంగాణ ప్రాంతపు భాష కూడా “ప్రత్యేక” మైనదని తెలియజేయాలంటే -తెలంగాణ ప్రాంతపు భాషలో ఒక అర్థాన్ని communicate చేసేందుకు popular గ వాడుతున్న ఒక పదానికి, ఆంధ్రలో అదే అర్థాన్ని communicate చేసేందుకు popular గ వాడుతున్న పదానికి గల తేడాలను సామ్యాలను గుర్తిస్తూ పోవాలె.

    అట్లనే -
    ఒకే పదం రెండు జాగలల్ల విభిన్న అర్థాలనిస్తె అవిగూడ సేకరించాలె.(విపరీత / విపత్కర అర్థాలుగూడ ఉన్నయి)
    ఉదాహరణకు:
    ఆంధ్రవాల్లకు “జెల్ల” నిస్తమంటె, తెలంగాణ వాల్లకు “ఠోంగు” ఇచ్చినట్టు
    తెలంగాణోనికి జెల్లలిస్తె, కమ్మగ పులుసొండుకోడా?
    మా పిల్లగాడు టేబుల్ “దొబ్బు”మంటె(నూకుడు), వాని దోస్తులు నవ్విండ్రట.
    వాల్లకు దొబ్బుడంటె, ఎత్తుకచ్చుడట!
    మరదే ఆంధ్ర పిల్లగాడో, పిల్లనో మనోల్లతో, “మీ బుల్లి ఫోటో బావుంది” అన్నా, “నాకు ఈ హీరో పిచ్చ ఇష్టం” అన్నా,మరి తెలంగాణోల్లు ఏమంటరు?
    “దెంకపోవుడు” అన్నపదాన్ని తెలంగాణలో “పారిపోవుడు” అన్నఅర్థానికి వాడ్తరు.
    గట్నే పల్లెల్లో examination pad లను పరీక్ష వట్టలు (అట్ట కు గ్రామ్యం) అంటారు.
    అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ వాడితె ఎన్ని తిప్పలు మరె.

  3. డా. మిద్దే. చెన్న కేశవ మూర్తి 01 సెప్టెంబర్ 2008 , 3:30 am

    సోదరా,

    సంస్కృత వ్యాకరణం, ఆధునిక వ్యాకరణం, భాషాశాస్త్రం, ఆంధ్ర, తెలంగాణా మరియూ రాయలసీమ భాషాసంస్కృతుల గురించి క్లుప్తంగా విశ్లేసించావు. భాషాశాస్త్రానికి వస్తువు ప్రామాణిక భాష అయితే, ఆధునిక భాషాశాస్త్రవేత్తలు అప్పటినుంచి ఇప్పటి వరకు వచ్చిన వ్యాకరణాంశాలోని ప్రధాన మార్పులను గుర్తించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.

  4. Rakesh 02 సెప్టెంబర్ 2008 , 6:46 am

    తెలంగాణ భాషలోనిపదాలకు, మిగతాప్రాంతాలభాషకు తేడాలు తెలుసుకోవాలనే వారికోసం, తెలంగాణపదకోశం, వ్యాకరణం, సామెతలు వగైరాల పుస్తకాలు రాబోతున్నాయి.(త్వరలో..)
    ఉదాహరణకోసం ఒక్క “బ” అక్షరంపైన గల “కొన్ని” తెలంగాణపదాలను దిగువన చూడండి.
    ——————

    బండి పయ్య
    బండి రొప్పుడు
    బండ్లు
    బక్క పానం
    బగ్గ (బాగ కు త్రిక సంధి)
    బట్కాయించుడు
    బట్ట చీరిక
    బట్టపేగులు
    బట్టలు
    బట్టిగొట్టుడు
    బత్తి
    బత్తిసలు
    బత్తీసలు, బచ్చీసలు (పేర్లు, దండలు)
    బద్ది
    బనాయించుడు
    బబ్బెర్లు
    బయాన
    బరిగె
    బరిబత్తల
    బరివాతల, బరివి(త, బరిబత్తల
    బరుకుడు
    బర్కతు
    బర్బాదు
    బర్ర
    బర్రె
    బర్రెలు / బర్లు
    బర్సులు-బర్సులు
    బలివీ(టికి
    బాంచెను
    బాంవక్కల డబ్బ
    బాగాలు, ఛాలియ, బాగంవక్కలు, బాంవక్కలు
    బాయి / భావి
    బారాన
    బావన్లు
    బాశింగెం
    బాసన్లు
    బిజను
    బిత్తిరోడు, బిత్తిరితనం, బిత్తిరిబుద్దులు
    బిన్నమవుడు
    బిలిబిలి అవిడు
    బిశాది
    బీంబోసుడు (నేతపనికి సంబంధించిన)
    బీమారవుడు
    బీరిపోవుడు
    బుక్కా గులాలు
    బుక్కాఫక్కీర్
    బుక్కుడు
    బుగులు
    బుగ్గలు (బెలూన్లు)
    బుచ్చివి, బుచ్చిది
    బుడ బుక్కలు
    బుడుమకాయ
    బుదరకిచ్చుడు
    బురబుర పండు
    బుర్రకాయ్ (ఈతనేర్సుకునేటప్పుడుగట్టే ఎండవెట్టిన ఆన్గెపుకాయ్)
    బువ్వ
    బూగలు (డ్రాగన్-ఫ్లై)
    బూరుపొక్కలు
    బూరువీకుడు
    బేజారవుడు (Pronounce “జ” As in “జల్లెడ,జీరో)
    బేడం (ఇది వేరె, గొల్లెం వేరె)
    బేసనన్నం
    బేసన్
    బైలు
    బొండిగ, బొండిగె
    బొంత, బొంతపురుగు
    బొంతపురుగు
    బొందలగడ్డ స్మశానం
    బొందలు
    బొందవెట్టుడు,
    బొంబై-మిటాయి, బూరు బూరు-మిటాయి
    బొక్క
    బొగ్గుల పొయ్యి, కట్టెల పొయ్యి
    బొచ్చెడు
    బొత్త
    బొల్ల బొల్ల ఏడ్సుడు
    బోకెడు, బొక్కెడు (త్రికసంధి; బొక్కెన పరిమాణమంత) బానెడు
    బోనం
    బోర్లబొక్కల
    బోర్ల-బొక్కల
    బోలుపేలాలు
    భక్షాలు
    భరడా
    భాండీ
    భూ-శన్గలు (లిట్రల్లీ.. గ్రౌండ్-నట్స్)

  5. తాడేపల్లి 05 సెప్టెంబర్ 2008 , 5:55 am

    మాండలికాల్ని భాషలుగా ప్రచారం చెయ్యడం పూర్తి అనాలోచిత చర్య. ఇది ఎవరినీ బాగుచెయ్యదు. తెలంగాణలో కొంతమందికి కోస్తావారిమీద ఉన్నఅకారణమైన కసినీ, ఎవరూ ఏమీ అనకుండానే తమకు తామే లోలోపల పొందుతున్న ఆత్మన్యూనతా భావాన్ని తృప్తిపరచడం మినహాయిస్తే. ఇది ఒక జాతిగా మనందరి (తెలుగువారి) ఉమ్మడి అంతర్జాతీయ హోదాకు, సాంస్కృతిక వారసత్వానికీ ప్రమాదకరం కూదా !మనం “ఎనిమిది కోట్లమందిమి” అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. “ఏ మాండలికానికి ఆ మాండలికం ప్రత్యేక భాష” అని ప్రచారం చేస్తే అందరమూ తలో మూడు కోట్ల జనాభాతో అంతర్జాతీయ వేదికల మీద దేనికీ కొరగాకుండా, ఎవరూ మనల్ని పట్టించుకోకుండా సర్వనాశనమై పోతాము. మనకంటే చాలా తక్కువ జనాభా ఉన్న భాషలకు మన కన్నా పెద్దపీట వేస్తారు. అసలు మనది భాషే కాద్ని, తమిళంలో ఒక భాగమనీ ప్రచారం చేస్తున్నారు తమిళులు. సరే ! వాళ్ళు ఎప్పట్నుంచో మన పట్ల శత్రుత్వం వహించి ఉన్నారు కాబట్టి ఆశ్చర్యం లేదు. కానీ మన భాష మీద మనమే ఇలాంటి ప్రచారం..దాని కోసం ఒక రిసెర్చి పేపరు…థూ ! చాలా అసహ్యం వేస్తోంది. ఈ పేపరు ఈ జాతి రాసుకున్న సూయిసైడు నోటులా ఉంది.

    ఏమిటయ్యా ! ఈ దారుణమైన ఆలోచనలు. ప్రాంతీయ పిచ్చిలో ఇంత వొళ్ళు మర్చిపోతారా ? ఇంత బండబారిపోతారా ? ఇంత క్రూరత్వం ఎలా చోటుచేసుకుంది మీలో ? కూర్చున్న కొమ్మే నరుక్కుంటారా ? రాజకీయ గుర్తింపు కోసం ఆఖరికి భాషనే బలి చేస్తారా ? ఈ పది జిల్లాల్లో మీకు మంచీ చెడూ చెప్పేవాళ్ళే లేకుండా పోయారా ? మీకు కోస్తావాళ్ళంటే అంత కక్ష ఉంటే రండి, మమ్మల్ని నరకండి,చంపండి, అంతేకానీ భాషని నాశనం చెయ్యకండి !

    మీరు చేస్తున్న తప్పేంటో మీకు తెలిసే రోజు, మీరు పశ్చాత్తాపపడే రోజు తప్పకుండా వస్తుంది.

  6. తాడేపల్లి 05 సెప్టెంబర్ 2008 , 5:58 am

    ఇలాంటి పనికిమాలిన విధ్వంస చర్యలు కాకుండా తెలుగు జాతికి పనికొచ్చే నిర్మాణాత్మకమైన పనులేమైనా చెయ్యండి.

  7. Rakesh 06 సెప్టెంబర్ 2008 , 5:51 am

    శబ్బాష్ తాడేపల్లీ…

    ఇగ తెలంగాణనువ్యతిరేకించేందుకు దిక్కుమొక్కున్న ఒక్కపార్టీగూడ లేదనిగుర్తించినోల్లే నీలెక్క భాషా, భాషా అని మాట్లాడ్తున్నరు.

    ఆకలితో / వివిధరకాల ఇతరసమస్యలతో సస్తున్న(సంపబడుతున్న) తెలంగాణవాడు భాషాదినోత్సవాల ప్రచారకులతోని ఎట్లమాట్లాడ్తడో “అల్లం నారాయణ” గారిరచన జ్యోతి archivesలో చదువుకోండి.

    తెలంగాణవచ్చినంక తెలుగుకు ఎంతగుర్తింపుదేవాల్నో అంతదెచ్చెందుకు ఎందరో మొందరవడ్తరు (పెద్దబంకూరు తవ్వకాలు, కోటిలింగాల నాణాలతోనేగద తెలుగుకు ప్రాచీనత గుర్తిస్తున్నరు..) శాతవాహనులంటేనె, తెలంగాణవాండ్లని మొన్నటికిమొన్న ఆంధ్రాప్రాంతం వారే ఐన పూజ్యులు, FAMOUS HISTORIAN వకుళాభరణం రామకృష్ణ గారు TV5 కార్యక్రమంలో తెలియజేసింది!!
    మీరు దానిరికార్డింగ్ చూడాలనుకుంటె చెప్పుండ్రి.

  8. Rakesh 06 సెప్టెంబర్ 2008 , 6:27 am

    ANGIKA AWADHI BAGELKHANDI BHOJPURI BISHNUPRIYA BUNDELKHANDI MAITHILI MARWADI

    ఇవ్వన్ని భాషలా?
    లేకుంటె, రాష్ట్రమేలేని మాండలికాలా?

    చ్చి చ్చి … థూ థూ గదా…. అన్నిటికన్ని మాండలికలాను పట్టుకోని కొందరు భారతీయులు భాషలని చెప్తున్నరా? పిస్స లెక్కలు గాదా?

    తెలంగాణ భాషను 100% మాండలికమే అంటె, ఈ కిందిపదాలు “కొద్ది / అతికొద్ది” యాస తేడాతో మీరు కూడా వాడుతున్నరనుకోవాల్నా?
    అందాజకు
    అంబటాల్ల
    అంబలి, అంబటాల్ల
    అంబాడుడు
    అగ్గువ
    అట్కెన
    అణగవెట్టుడు
    అముడాలోల్లు
    అయితారం
    అర్ర
    అర్రాజు
    అర్సోడు
    అలసందలు
    అలాయ్-బలాయ్
    అలుకుగర్ర
    అలుకుడు
    అలుకువిడుస
    అలుముకునుడు
    అలువలు
    అల్కగ
    అల్చింతకాయ
    అల్చిప్ప
    అల్ల-మురబ్బ

    అవు
    అవుర-తిట్టుడు
    అవులెతనం
    అవుసలాయన
    అవ్వల్ తరీక, అవ్వల్ దర్జ
    అవ్వల్ పని
    అవ్వైజా”జు”
    అశం
    అశేది పాపం
    అసుంటి ,గసుంటి
    ఆగం
    ఆఠాణ
    ఆయిల్ల
    ఇండ్లల్ల
    ఇండ్లు
    ఇమానం, ఇమానంగ
    ఇర్కటం
    ఇర్శోడు
    ఇల్ల పీట
    ఇల్లుటం
    ఈగం
    ఈగుడు
    ఈడుదులు

  9. Rakesh 09 సెప్టెంబర్ 2008 , 6:31 am

    మన అఖండభారతావనిలో ఎన్నిభాషలు విలసిల్లాయో ఈ క్రిందిలింకుల ద్వారా తెలుకోవచ్చు.
    వివిధప్రాంతాల ప్రాదేశికభాషలనూ, వాటిలో కొన్నింటి “ఉద్భవానికి / ప్రాభవానికి” పూర్వోత్తరకారణాలనూ కొంతవరకు తెలుసుకొనవచ్చు.

    www.ciil.org/Main/Languages/Lang-Family/indian.htm

    www.ciil.org/Main/Languages/Lang-Family/map2.htm

    www.ciil.org/Main/Languages/Lang-Family/map1.htm

    www.ciil.org/Main/Languages/Lang-Family/map2.htm

    భారతీయభాషలపట్ల పరిశోధనలు ఇంకాచాలా జరగాల్సివుంది.
    భాషలపట్ల మమకారంగలవారు, భాషాధ్యయనమే వృత్తిగావున్నవారు ఎన్నోప్రాంతాలలోని ప్రాదేశికభాషలను పరిశోధించి, వెలికితీసేప్రయత్నం చేయాలి.
    (ఉదా: మహారాష్ట్రలోని ధుళేజిల్లాలో 33గ్రామాల్లోని 16వేలకుపైబడినప్రజానీకం మాట్లాడేభాష, ప్రస్తుతానికి “OTHERS” Category కిందనే పరిగణిస్తున్నారు)

  10. Rakesh 15 సెప్టెంబర్ 2008 , 5:50 am

    సేకరించిన మరికొన్ని పదాలు:

    ఉంకుచెండి
    ఉంకోపాలి
    ఉంగుటం
    ఉండమాను
    ఉండి
    ఉండుట్ల
    ఉకుమ, ఉక్మ
    ఉగల్దాను
    ఉట్టి
    ఉట్టిగట్టుడు
    ఉట్టిగొట్టుడు
    ఉడుకన్నం
    ఉడుకుడుకు,
    ఉత్తగ / ఉత్తుత్తి / ఉత్తుత్తగ
    ఉత్తపున్నానికి
    ఉన్క
    ఉప్పరిపని
    ఉప్పుడువిండి
    ఉబ్బరింపు, ఉమ్మరిచ్చు, ఉడ్కపోత, ఉమ్మెరపోర
    ఉల్లంగికాయ
    ఉశిల్లు, ఉసుల్లు
    ఉశ్కె, ఉశ్క
    ఊకె
    ఊకోవెట్టుడు
    ఊదువత్తులు
    ఊరవిశ్క
    ఊరిచ్చుకుంట
    ఎగేసుడు
    ఎనుములు/గొడ్లు
    ఎర్క
    ఎర్రలు
    ఏరాలు/ఏరాండ్లు,
    ఒక్క తీరుగ
    ఒక్కపొద్దు
    ఒడిశి పాయె
    ఒత్తుడు
    ఒర్రకు (ఒర్లకు / హొర్లకు)
    ఒర్సుక పోవుడు
    ఒళక్కాలు
    ఓనగాయలతొక్కు
    కంక బొంగు
    కండెలు
    కందగడ్డలు
    కందిలి
    కంబం
    కక్కెర గండోలె తినుడు / అగడు వడ్డట్టు తినుడు,
    కచ్చ”లం
    కట్క (కిటికీలయి, దర్వాజలయి)
    కట్టెల మోపు, గోడకు మోపు
    కట్టెలు
    కడ(వ(కు
    కడాశర్కర, నౌవ్వదు
    కమాను
    కమ్మలు
    కరియలు, గరిజెలు
    కరెంటు బుగ్గ
    కశ్కె
    కశ్కెలు, కసరుగాయలు
    కస్కం పిస్కం అవుడు (తాయి -మాయి అవుడు)
    కాంట (పిన్నీసు ) also can be used for లారి కాంట
    కాకెంగిలి
    కాజా - గుండి
    కావలింత
    కావ్రం, మస్తీ
    కిల్లర కిల్లర నవ్వుడు
    కీశ (కీసలు)
    కీశుపిట్ట (విజిల్, కీశుపిట్ట లెక్క ఒర్రుడు)
    కుంచ, కుంచాలు, కుంచెడు
    కుత్క, కుత్కె
    కుల్ల కుల్ల లేక కుల్లం కుల్లా
    కెలికినట్ట్లు
    కైకిలి
    కొంకి
    కొంకి కట్టె
    కొంచవోవుడు (Pronounce “చ” As in “చమురు, చక్కని, చల్ల)
    కొత్తలు
    కొప్పెర
    కొర్రాయి
    కొలుసుడు
    కొశ్శగ
    కొష్టం, కొట్టం
    కొస్సకు, కొసకు
    కోతికొమ్మ
    కోదండం
    కోయీత
    కోలదిప్పుడు
    కోలలు
    ఖానిగి, మర్కజి బళ్ళు
    గంజి
    గంజు, దండె గంజులు
    గంటె
    గందా
    గంప-గుత్త
    గచ్చకాయలు
    గచ్చు
    గట్క
    గడాంచ, గడువంచె
    గడీలు
    గడ్డపార
    గత్తరిబుద్దులు
    గదువ(
    గప్ప గప్ప గుద్దుడు
    గమ్మతుముచ్చట
    గలీజు
    గలుమ
    గలువ(, గలుమ
    గల్ల గురిగి
    గార్వం (గార్వాల గడ్డపారలు)
    గావు
    గిచ్చుడు
    గిరిగిల్ల
    గిరివి
    గిర్క, గిరుక
    గిర్నివట్టిచ్చుడు
    గీరెలు
    గీస్కపోవుడు
    గుంజ
    గుంజుడు
    గుండ్లు
    గుచ్చుకునుడు
    గుడాలు
    గుడ్డేలుగు
    గుడ్లువెట్టిజూసుడు
    గుత్త బేరం
    గుత్తవట్టుడు
    గున గున
    గునుగుడు (గులుగుడు)
    గునుగుపూలు
    గుమ్మి
    గుమ్మెడు
    గురుగులు
    గూనపెంకలు
    గెచ్చుకు-గెచ్చువెరుగుడు
    గెదువు(డు
    గై, గైయి (కంక గై)
    గైరు-మత్లబు
    గొంగడి
    గొట్టు పదాలు
    గొడిశెలు, బాడిశెలు
    గొడ్లు
    గొర్ర గొర్ర గుంజుడు
    గొర్రెలు / గొర్లు
    గోందు, బంక
    గోకుడు
    గోగుపూలు
    గోడిసెలు
    గోనె తట్లు
    గోపెం
    గోరం
    గోలీలాట / గోటీలాట
    గోలెం
    గోశికట్టుడు, గోచి
    గోస
    గోసవుచ్చుకునుడు
    గౌండ్లల్ల
    గౌండ్లు
    గౌండ్లోల్లు
    గౌర
    గౌశన్లు, గలేపులు
    గ్యాంచునూనె
    గ్రాచారం, గాశారం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)