కొన్ని పరిమితులు
1. సమాచారం తగినంతగా అందక, నా గ్రంథాన్వేషణ అసంపూర్తిగా మిగిలిపోవడంతో నేను ఎక్కువగా యూరప్, అమెరికాల్లో లభించినదానితో సరిపెట్టుకున్నాను; అందువల్ల ఇతర ప్రాంతాల సంస్కారానికి కొంత అన్యాయం జరిగినట్టే. ఈ విషయంలో ముఖ్యంగా ఆఫ్రికా పట్ల భయంకరమైన వర్ణవివక్షలాంటిది తీవ్రంగా పొడచూపుతుంది.
అందువల్లే చాలామంది పాశ్చాత్య శాస్త్రకారుల్లో వర్ణవివక్ష కనబడుతుంది. ఆఫ్రికాకు చెందినదిగా ప్రాచీన ఈజిప్ట్ నాగరికతను గుర్తించడంలోనూ, పాశ్చాత్య నాగరికతలో ఈజిప్ట్ వారసత్వాన్ని అంచనా వెయ్యడంలోనూ వారి అజ్ఞానం బైటపడుతుంది. తొలినాటి గ్రీస్ ఎంత ప్రగతిని సాధించినా, అదంతా అంతకు మునుపు అయిదువేల ఏళ్ళ ఈజిప్ట్ నాగరికతకు కొనసాగింపేనని ప్రొ. జార్జ్ ఎం. జేమ్స్ “The Stolen Legacy” అనే తన పుస్తకంలో మనకు స్పష్టం చేస్తాడు. (అలాగే ఈజిప్ట్ సాంస్కృతిక ప్రగతికి దోహదపడిన ఆఫ్రికా సంప్రదాయం గురించి “The African Origin of Civilization: Myth or Reality?”, “Civilization or Barbarism” అనే పుస్తకాల్లో డా. షేఖ్ ఆంటా డియోప్ వివరణ కనబడుతుంది. Legrand Clegg రాసిన వ్యాసం The First Invaders, Journal of African Civilizations, సంపుటి 3, సంచిక 1, ఏప్రిల్ 1981 పు. 15, కూడా చూడవచ్చు. సుమారు 40 వేల ఏళ్ళనాడు ఆఫ్రికాయిడ్ గ్రిమాల్డీ జాతివారు యూరప్‌నుంచి నియాండర్తాల్ ప్రజలను పారదోలడంతో చరిత్ర మొదలవక మునుపే ఆఫ్రికా సంప్రదాయాలు యూరప్ సంస్కృతిలోకి వచ్చిచేరాయి. ఆ విధంగా చరిత్ర పూర్వదశలోనే ఆఫ్రికా నాగరికత యూరప్‌కు ఎగుమతి అయిందని పై పుస్తకం 17 పుటలో చూడవచ్చు). ఈజిప్ట్‌లో విద్యాభ్యాసం చేసిన ప్రముఖుల్లో థేలీజ్, పైథాగొరస్, పార్మెనిడీజ్, జెనో, హిరాక్లిటస్, డెమోక్రిటస్, సోక్రటీజ్, ప్లేటో, అరిస్టాట్‌ల్ తదితరులున్నారు.10
2. చదువరుల పరిచయార్థం “కార్మికులూ, వైజ్ఞానిక తత్వశాస్త్రం, తాత్విక వికాసంలోని ముఖ్యదశలు” అనే రెండు ప్రారంభ అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయంలోనే కార్మికులను ప్రస్తావించడంలో నా ఉద్దేశం వారిలో ఆసక్తిని ప్రేరేపించడానికే గాని, ఇతరుల ఆసక్తిని తగ్గించడానికో, ఇతరుల విషయంలో గతితార్కిక భౌతికవాదం అప్రస్తుతమనటానికో కాదు. చాలామంది కార్మికులు గతితార్కిక భౌతికవాదాన్ని ఒక శాస్త్రంలాగా చదవకుండా, దాన్ని గురించి తాము తెలుసుకున్నదంతా అంత ముఖ్యం కాదని భావిస్తారు; శాస్త్రజ్ఞులేమో దానికి మితిమీరిన ప్రాధాన్యం ఉందనుకుంటారు.
3. ఈ పుస్తకంలో, ముఖ్యంగా పూర్వవైజ్ఞానిక, విజ్ఞాన విరోధక ధోరణుల గురించిన అధ్యాయాల్లో మతాల ప్రస్తావన ఉంది. మతాల్లోని తాత్విక అంశాలూ, మతాలని పాలకవర్గాలు అణచివేతకు ఉపయోగించడమూ వివరించబడ్డాయి. తాత్విక అంశాలూ, ఈశ్వరతత్వమూ తదితర విషయాలకు సంబంధించినంతవరకూ మతం మూఢనమ్మకాల్లో పాతుకుని ఉంటుంది; విజ్ఞానశాస్త్రంతో మతానికి తీవ్రమైన విభేదాలున్నాయి. ఈ విషయంలో కొందరు మతపెద్దలకూ, శాస్త్రవేత్తలకూ కూడా అభ్యంతరాలుండవచ్చు. “విజ్ఞానానికి మతంతో పనిలేదు; మతం లేకుండానే అది తన పని చేసుకోగలదు…ఎన్ని సమస్యలున్నప్పటికీ విజ్ఞానమూ, మతమూ సహజీవనం చెయ్యవలసిందే”.11
ఈ పుస్తకంలో నేను మతాల్లోని తాత్విక అంశాలనూ, దోపిడీవర్గాలు దాన్ని అణచివేతకు ఉపయోగించిన పద్ధతులనూ మాత్రమే విశ్లేషించాను; ఇది పాక్షికమూ, అసంపూర్ణమూ కూడా. ఎందుకంటే బౌద్ధమూ, ఇస్లాం, క్రైస్తవ, యూదు (యుద్ధమూ, శాంతి గురించిన ఐసయా ప్రస్తావన) మతాల్లోని నైతికనిబంధనలు చాలావరకు ఆదిమ జన సముదాయాల్లోని సమసమాజ ధోరణులనీ, మైత్రీ భావనలనీ తలపిస్తాయి. ఒకవిధంగా ఇవన్నీ ఆధునిక సాముదాయక సమాజానికి దారితీసినవే. ఎంగెల్స్ చెప్పినట్టుగా “తొలినాటి క్రైస్తవ మత చరిత్రలో ఈనాటి కార్మిక పోరాటాన్ని పోలిన విషయా లుండడం గమనించదగ్గది”.12 బైబ్‌ల్‌లో పాల్ లేఖలలోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఆయన “వీటిలో కొన్నిటిని చూస్తే ఈనాటి అంతర్జాతీయ కార్మిక సంస్థకు చెందినవారెవరో ముందుచూపుతోనూ, ఉత్సాహంతోనూ రాసినట్టనిపిస్తుంది” అన్నాడు.13 ఎందుకంటే మతవిశ్వాసం కలిగిన లక్షలాది ప్రజలు అణ్వస్త్రాల ఉత్పత్తిని నిలిపివెయ్యాలనీ, పీడనకు లోనవుతున్నవారికి విముక్తి లభించాలనీ కోరుకోవడం సామ్రాజ్యవాద ప్రభుత్వాలకు కాస్త కంటగింపుగా ఉంటుంది. ఏది ఏమైనా సాంప్రదాయక మతవిశ్వాసాల ప్రధాన వైఖరీ, మతాధిపత్య సంస్థల ధోరణీ పరస్పరం వ్యతిరేకంగా అనిపిస్తాయి. పీడకుల, వారి దోపిడీ ప్రభుత్వాల సిద్ధాంతాలకూ, అభిరుచులకూ, విలువలకూ సమాజంలోని వ్యక్తులందరూ లోబడి ఉండాలనే విషయంలో అభిప్రాయభేదాలుంటాయి. ఒకవంక మతసంస్కరణకు దారితీసి (దీనివల్లే భూస్వామ్యవ్యవస్థకు బదులుగా పెట్టుబడిదారీ విధానం మొదలయింది) విముక్తిని బోధించే ఈశ్వరవాదమూ, మరొకవంక మత ఛాందసమూ పరస్పరం వ్యతిరేకమైనవి; తీవ్రమైన సామాజిక సంక్షోభం పొంచి ఉందని ఈ వైరుధ్యం సూచిస్తుంది.
సామ్రాజ్యవాదంలో ప్రతిరోధ శక్తులు తీవ్రతరమౌతూ ఉంటే, సాముదాయక, విముక్తి పోరాట ధోరణులు మతరూపాల్లోనే కొనసాగుతాయి; కాని అవి కోట్లాది ప్రజల్లో ధర్మయుద్ధాలకూ, అంతర్ దృష్టి కలిగిన సాయుధ పోరాట ప్రవృత్తికీ ప్రేరణలనిస్తాయి. ఈ ధోరణి వల్ల వారి మధ్య ఉండే కొన్ని ప్రతిబంధకాలు తగ్గుతాయి. తమవంటి ఉద్దేశాలే కలిగి, మతవిశ్వాసాలు లేనివారితో సహకరించేందుకు వెనకాడకుండా చేస్తాయి. దీనికొక ఉదాహరణ; సామ్రాజ్యవాద ప్రభుత్వ విధానాలకూ, పరిశుద్ధ క్రైస్తవ మతపు నైతిక నియమాలకూ మధ్య సంఘర్షణ విస్తృతమౌతున్న పరిస్థితిలో చాలామంది మతం వేపుకే మొగ్గుతారు. వామపక్ష భావాలు ఎక్కువగా ఉన్నవారికైతే “భూతల స్వర్గ నిర్మాణానికి జరిగే విప్లవ పోరాటాల్లో పీడిత శ్రామిక వర్గాల మధ్య ఐకమత్యం ఉండడం ముఖ్యం; పరలోకంలో స్వర్గమేదో ఉందని శ్రామికులకు ఏకాభిప్రాయం ఉండడం అంత ముఖ్యం కాదు”.14
4. ఈ పుస్తకంలో మతాన్ని గురించిన వర్ణన పరిమితంగా ఉండట మొకటే కాదు; ఆధునికయుగాన్ని మినహాయిస్తే, తత్వశాస్త్రానికి మహిళలు చేసిన కృషి గురించిన ప్రస్తావన కూడా తక్కువగా కనిపిస్తుంది. ప్రాచీనకాలం నుంచీ ఎందరో స్త్రీలు తత్వశాస్త్రంలో చెప్పుకోదగ్గ కృషి చేసినప్పటికీ అదంతా ఇతరులకు ఆపాదించబడుతూ వచ్చింది. వారిని తలుచుకోవడంగాని, గుర్తింపునివ్వడంగాని, వారు చేసినదాన్ని భద్రపరచడంగాని జరగనేలేదు. సమాజంలోని ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ, స్త్రీలు తత్వవేత్తలుగా ఎదగడానికి చాలా కష్టాలు పడవలసివచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలోనూ, దానికి వారసత్వంగా వచ్చిన వర్గ సమాజంలోనూ పురుషాధిక్యత మితిమీరడంతో చరిత్రలో గొప్ప తత్వవేత్తలుగా పురుషులకే ఉన్నత స్థానం లభించడంలో ఆశ్చర్యంలేదు; దాన్ని బట్టి స్త్రీల సహజ సామర్య్థాన్ని అంచనా వెయ్యలేము. మానవజాతిలో సగంకన్నా తక్కువ జనాభాకున్న నైపుణ్యానికీ, విజయాలకూ మాత్రమే గుర్తింపు లభిస్తోంది; అంటే వైజ్ఞానిక తత్వశాస్త్రం అవగాహనా, నానాటికీ మారుతున్న ప్రపంచంలో దాని ఉపయోగమూ ఆటంకపడి తగ్గినట్టే. స్త్రీల సైద్ధాంతిక వికాసానికి అవరోధాలన్నీ తొలగిపోయి, తత్వశాస్త్రంలో జరిగిన ప్రగతికి లింగ వివక్ష అడ్డుతగలడమనేది ఒక చారిత్రాత్మక తప్పిదంగా మిగిలిపోవాలి. అప్పుడే తత్వశాస్త్రానికి రావలసిన గుర్తింపు వచ్చి, అదొక విస్తృతమైన మానవ విజయంగా నిలవగలుగుతుంది.
References:
1. Morris R. Cohen, quoted in Hollinger, Morris R. Cohen and the Scientific Ideal, p.150.
2. Ibid
3. Marx, Introduction to Critique of Hegel’s Philosophy of Right, quoted in Korsch, Marxism and Philosophy, p.73
4. Mao, “Talks on Questions of Philosophy”, in Schram, Chairman Mao Talks to the People, p.230
5. Lenin, quoted in Hyman, The Tangled Bank, p.434
6. Mao, “On the Correct Handling of Contradictions among the People”, Selected Works, Vol.5, pp.409-410
7. Joseph Dietgen, quoted in Lenin, Materialism and Empirio-Criticism, in Selected Works, Vol.11, p.391
8. Hegel, Lectures on the History of Philosophy, Vol.1, p.6
9. Cohen and Nagel, An Introduction to Logic and Scientific Method, p.390
10. Williams, “The Stolen Legacy: Greek Plagiarism of Dynastic Egyptian Doctrines”, Journal of African Civilizations, Vol.3, No.1 (April 1981), PP. 31-37
11. Frank Cardinal Konig, remarks at New York University luncheon, New York Times, Sept. 29, 1981
12. Quoted in A.P.Khazdan, “F.Engels on the Origin of Christianity”, Soviet Studies in Philosophy, Summer 1971, p.82
13. Ibid
14. Lenin, “Socialism and Religion”, Selected Works, Vol.11, p.661
ఉపోద్ఘాతం
ఈ ఉపోద్ఘాతాన్నీ, “కార్మికులూ, వైజ్ఞానిక తత్వశాస్త్రం, తాత్విక వికాసంలోని ముఖ్యదశలు” అనే మొదటి రెండు అధ్యాయాలనూ కలిపి, గతితార్కిక భౌతికవాదానికి పరిచయంగా భావించాలి. తత్వశాస్త్రం జటిలమైన విషయం కనక సుదీర్ఘమైన ఈ పరిచయం వల్ల కొన్ని ప్రాథమిక సమస్యలు తొలగవచ్చు. దీనివల్ల చరిత్రానుసారంగా చేసిన విశదీకరణ సమంజసంగా అనిపిస్తుంది. అంతేకాక గతితార్కిక భౌతికవాదాన్ని విపులీకరించే ముందు దానికి కొంత స్పష్టత ఏర్పడుతుంది.
ఆనాటి, ఈనాటి తత్వవేత్తలూ, తత్వశాస్త్రాల గురించిన ప్రజాభిప్రాయాలు తత్వవేత్తల గురించిన ప్రజాభిప్రాయాలు రకరకాలుగా కనిపిస్తాయి. చాలాకాలంగా కన్‌ఫ్యూషియస్, గౌతమబుద్ధుడు, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాట్‌ల్ తదితరులందరినీ భయభక్తులతో, ఎంతో గౌరవనీయులుగా, జ్ఞానానికీ, ఉత్తమ సంస్కారానికీ ప్రతీకలుగా ఆరాధించడం జరుగుతోంది. తత్వచింతనకై ప్రాణాలర్పించినవాడుగా సోక్రటీస్ బోధనలను ఉదహరిస్తారు. ఆయన తన సాటి నాగరికులను మందలిస్తూ, ప్రేరేపిస్తూ, చెవినిల్లు కట్టుకుని పోరుతూ, వారే కనక తొందరపడి తనవంటివాణ్ణి కోల్పోతే ఆ స్థానాన్ని మరెవరూ భర్తీ చెయ్యలేరని వారిని హెచ్చరిస్తూ ఉండేవాడు.1
మరొకవంక తత్వవేత్తలను (అందులోనూ వృత్తిరీత్యా తత్వచింతన చేసేవారిని) ఈసడించే ధోరణి కూడా ఒకటుంది. అలాంటివారిని లోకజ్ఞానం లేనటువంటి అయోమయ జీవులనడానికి నక్షత్రాలను లెక్కపెడుతూ బావిలోకి జారిపడ్డ థేలీజ్ ఒక ఉదాహరణ. కొందరు దొంగస్వాములూ, అన్నీ తెలిసినట్టు బుకాయించేవారూను. “మౌనముద్ర దాలిస్తే తత్వవేత్త; జుట్టు పెంచుకుని, శాలువ కప్పుకుంటే వేదాంతి” అని రోమన్లు వెటకారం చేసేవారట.2 (పదహారో శతాబ్దానికల్లా తత్వవేత్తలకు అపకీర్తి పెరిగింది. ఎవరినైనా తత్వవేత్త అంటే అతనొక కపటసన్యాసి అనో, ఎందుకూ కొరగాడనో, వదరుబోతు అనో, మోసగాడనో, ఆటపట్టించదగిన దిష్టిబొమ్మ అనో అర్థం ఏర్పడిపోయింది జియొర్దానో బ్రూనో రాసిన Cause, Principle and Unity నుండి, పుట 6364) తత్వవేత్తలు భౌతికశాస్త్ర పరిజ్ఞానం లేని దద్దమ్మలనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే ప్రముఖ భౌతిక శాస్త్రజ్ఞుడైన లార్డ్ రూథర్‌ఫర్డ్ ఇంగ్లీష్ తత్వ్తవేత్త సామ్యూల్ అలెగ్జాండర్‌తో “మీరు ఎల్లకాలమూ చెపుతూ వస్తున్నదేమిటి? వట్టి ఊకదంపుడేగా?” అన్నాడట.3 మరికొందరికి తత్వవేత్తల ధోరణి శుష్క వేదాంతంలా అనిపిస్తుంది. తాను సామ్యూల్ జాన్సన్‌తో సరితూగలేనని ఒప్పుకుంటూ ఆలివర్ ఎడ్వర్స్డ్ “జాన్సన్‌గారూ, మీరొక తత్వవేత్త. మీలా ఉండటానికి నేనూ లోగడ ప్రయత్నించానుగాని నా ఉల్లాస ధోరణి మధ్యలో తన్నుకొస్తూ ఉంటుంది, ఏం చెయ్యను?” అన్నాడట.4 జర్మన్ కవి హైన (Heine) తత్వవేత్తలను వాజమ్మలంటూ వెక్కిరించాడు
“నెత్తినొక కుళ్ళాయీ, ఒంటిన చిరుగుల చొక్కా
లోకరీతిని గురించి ఉండదేమీ లెక్కా డొక్కా”5
మూడు దశాబ్దాలుగా సోక్రటీస్ ఒరవడిలో ఆరితేరిన ఎం.ఆర్ కోహెన్ “వ్యవహారదక్షుడైనవాడు సృజనాత్మక సాంస్కృతిక జీవితాన్ని కించపరుస్తాడనీ, వాటికై పాటుపడేవారి లక్షణమల్లా లేనిపోని భేషజమో, పటుత్వం లేకపోవడమో” అనీ అంటాడు.6
తత్వవేత్తలపట్ల ఉండే ఇటువంటి నిరసన యావత్తూ తత్వశాస్త్రం యదార్థ జీవితాన్ని పట్టించుకోదనే భావనతో ముడిపడినది. హెగెల్ చెప్పినట్టుగా “తత్వజ్ఞానశాస్త్రమంతా నైరూప్య భావనలూ, నేల విడిచిన సామువంటి సామాన్యసూత్రాలేనన్న ఈసడింపు సహజంగా అందరికీ ఉంటుంది. ఇంద్రియాల ద్వారా మనం పొందే అనుభవాలూ, స్పృహా, సహజాతమూ, రోజువారీ జీవితానుభవాలూ వగైరాలన్నీ మాత్రం నిశ్చితమైనవిగా, ఖచ్చితంగా అనిపిస్తాయి”.7
వ్యంగ్య రచయిత అంబ్రోస్ బియర్స్ లెక్కన “తత్వశాస్త్రమంటే ఎక్కణ్ణుంచీ బయల్దేరని, ఎక్కడికీ చేరని అగమ్యప్రస్థానం”.8 అలాగే మరొకరు తత్వశాస్త్ర ధోరణిని వెక్కిరిస్తూ “తత్వశాస్త్రం ఆదిలోనే మొదలై ఎవరో ఒకరి ఆలోచనలలో అంతమౌతుంది” అన్నారు. బెర్ట్రండ్ రసెల్ తత్వశాస్త్రాన్ని భ్రాంతితో అపరిపక్వమైనదిగా పేర్కొన్నాడు. “తత్వశాస్త్రమంటే స్పష్టంగా ఆలోచించటానికి చేసే మొండి ప్రయత్నం అంటారు. నా లెక్కన అది మిథ్యాభాసంతో ఆలోచించేందుకు మహా తెలివైన ప్రయత్నం…బుద్ధి వికాస క్రమంలో తత్వశాస్త్రం ఒకానొక దశ మాత్రమే; మానసిక పరిపక్వతతో దానికి సరిపడదు”.9
తత్వశాస్త్రమంటే ఇలాంటి తక్కువ అభిప్రాయం ఉండటానికి కారణం సామాన్య ప్రజల స్పష్టమైన అవగాహనే; వారి అజ్ఞానం కాదు. తత్వశాస్త్రంలో ఎక్కువగా కనబడేవి పడికట్టురాళ్ళవంటి భావనలూ, స్తనశల్య పరీక్షలూ, పదాడంబరమూ, వికృతభావాలూ మొదలైన అవలక్షణాలే. వీటిని గురించి పట్టించుకునే కొద్దిమంది అమెరికన్లలో తత్వశాస్త్రమంటే ఈ “అవలక్షణాలే”నన్న అభిప్రాయం బలపడింది. ఆసక్తి ఉన్న అతి కొద్దిమందికి కూడా తత్వశాస్త్రం ఒక విజ్ఞానశాస్త్రమనే సంగతి తెలియదు. శాస్త్రీయమైన గతితార్కిక భౌతికవాదం గురించిగాని, దాని జ్ఞానసంపద గురించిగాని ఖచ్చితమైన, సమగ్రమైన అవగాహన మరింత తక్కువమందికి ఉంటుంది; యూఎస్‌ఎస్‌ఆర్‌లోనూ, పీప్‌ల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోనూ జరిగిన పరిణామాలు దానికి సంబంధించినవేననీ వారికి తెలియదు.
వైజ్ఞానిక తత్వశాస్త్రం
“విజ్ఞానంలోని సత్యం అన్నిటినీ ప్రకాశవంతం చేసి ఆనందం చేకూర్చగలిగిన కాంతిపుంజం; దాని వెచ్చదనంలో అన్నీ ఒకేసారిగా వికాసం చెందుతాయి; జీవితపు లోతుల్లోని విస్తృత అంశాలన్నీ విశదం అవుతాయి” అన్నాడు హెగెల్.10 వైజ్ఞానిక తత్వశాస్త్రం అంటే గతితార్కిక భౌతికవాదం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ప్రకృతిలోనూ, సమాజంలోనూ, ఊహల్లోనూ ఉండే సామాన్య అంశాల సమాహారం. ఈ సార్వజనీనతే దాని పరిధీ, ప్రత్యేకతా కూడా. దానికీ ఇతర శాస్త్రాలకూ ఉన్న తేడా కూడా అదే. తక్కినవన్నీ ప్రత్యేక శాస్త్రాలు కనక వాటి పరిధి కాస్త తక్కువగా ఉంటుంది.
గతితార్కిక భౌతికవాదమే వైజ్ఞానికతత్వశాస్త్రం అని నొక్కిచెప్పే మార్క్సిస్ట్ లెనినిస్ట్‌లవంటివారు దాన్ని నిరంతరమూ పరిష్కృతం చెందుతూ ఉండే శాస్త్రంగా ఉపయోగించుకుంటారు; గుడ్డి నమ్మకాలను ఎన్నడూ అనుసరించరు. “మనం విజ్ఞానాన్ని తప్ప దేన్నీ నమ్మరాదు; దేని మీదా గుడ్డి నమ్మకాలు పెట్టుకోకూడదు”11 అన్నాడు లెనిన్. ఆయనింకా ఇలా అన్నాడు “కళ్ళు మూసుకుని దేన్నీ విశ్వసించమని అడగం; ప్రతివారూ తమ బుద్ధి నుపయోగించుకుని ప్రతిదానికీ సాక్ష్యముందని స్వయంగా నిర్ధారించుకోవాలి”.12
జంతువుల, మనుషుల శరీరాల్లో రక్తప్రసరణం జరుగుతుందని తెలియజెప్పినవారిలో ముఖ్యుడు విలియం హార్వే; అతను శాస్త్ర అధ్యయనానికి తన పుస్తకాన్ని అంకితమిస్తూ వైజ్ఞానిక దృక్పథం కలిగిన తత్వవేత్తలందరికీ ఎల్లప్పుడూ సమతౌల్యంతో కూడిన విశాలభావాలుండాలని అన్నాడు. “సత్యాన్వేషణకై తహతహలాడే నిజమైన తత్వ్తవేత్తలు తమకన్నీ తెలుసునని ఒక్కనాటికీ అనుకోరు; ఎవరినుంచైనా, ఎక్కణ్ణుంచయినా సరే కొత్త సమాచారం లభిస్తే స్వీకరిస్తారు. ప్రాచీనులనుంచి అందివస్తున్న కళలూ, విజ్ఞానమూ అన్నీ పరిపూర్ణమైన వనుకునేంత సంకుచిత దృక్పథం వారి కుండదు. ఆ విషయాల్లో ఇతరులు కూడా కృషి చేసి, తమ నైపుణ్యం చూపగలరనే నమ్మకం వారికి ఉంటుంది. అంతేకాదు; వారిలో చాలామందికి ప్రస్తుతం మనకు తెలిసినదాని కంటే తెలుసుకోవలసినదే చాలా ఎక్కువని అనిపిస్తుంది. తత్వవేత్తలెప్పుడూ ఇతరులు చెప్పినదే నమ్ముతూ, తాము తెలుసుకుంటున్న విషయాలపై తమ నమ్మకాన్నే కోల్పోయేంత అస్వతంత్రులుగా ప్రవర్తించరు”.13
వైజ్ఞానిక తత్వశాస్త్రం ఎంతో రూపరహితమైనదీ, సామాన్యతలతో కూడినదీ అయినప్పటికీ దాన్ని గూఢంగానూ, అర్థంకానిదిగానూ వర్ణించకూడదు. “తత్వశాస్త్ర రచయిత ఏదో నిగూఢమైన, గంభీరమైన శైలిలో రాస్తూ పోతే అదంతా అర్థంలేనిదిగా తయారవుతుంది”.14 గాంభీర్యం ఉన్నంత మాత్రాన స్పష్టత లోపించాలనిలేదు; అసలు తేటదనం కలిగినదే నిజంగా గంభీరమైన శైలి. “చదవనేర్చిన పాఠకులందరికీ బోధపడని తత్వరచనలు ఎందుకూ కొరగానివని మా ఉద్దేశం. రచయిత తాను సరిగ్గా అర్థం చేసుకున్న విషయాలను డొంక తిరుగుడుగా కాకుండా సరిగ్గా వివరించడం అసాధ్యంకాదు. తమ పాండిత్య ప్రకర్షతో తత్వశాస్త్రాన్ని వక్రీకరించేవారు రాస్తున్నప్పుడు వివరణ కన్నా గందరగోళమే హెచ్చుగా ఉంటుంది”.15
తేలిక శైలిలో రాస్తున్నంత మాత్రాన విషయం వెంటనే అర్థమౌతుందనీ అనలేం. జటిలమూ, నైరూప్యమూ అయిన విషయాలను ఎంత సులభశైలిలో రాసినప్పటికీ ఒకటి రెండుసార్లు చదవవలిసిరావచ్చు. వాటిని ఆచరణలో పెడితే తప్ప పూర్తిగా అర్థం కాకపోవచ్చు కూడా.
గతితార్కిక భౌతికవాదం గురించిన రచన భౌతికవాద, గతితార్కిక లక్షణాలు కలిగినదై ఉంటుంది. దాని మూలాలు చారిత్రక భౌతికవాదంలో ఉంటాయి. అది రాయబడ్డ దేశంతో దానికి కొంత ప్రత్యేక సంబంధం ఉంటుంది; ఎందుకంటే మొత్తం విషయంలో అదొక సమగ్రమైన భాగం; ఒక సాంస్కృతిక రంగపు చరిత్ర. అదొక ఉత్తేజకరమైన, ఆసక్తికరమైన గాథ; కళాత్మకంగా పరిపూర్ణమైన, వైజ్ఞానిక సాహిత్యరచన. (హెగెల్ రాసిన “తర్కం” అనే గ్రంథాన్ని ఎంగెల్స్ “గతితార్కిక కవిత”గా అభివర్ణించాడు Dialectics of Nature, పుట 224) అందులో తర్కమూ, ఆవేశమూ ఉంటాయి; వైజ్ఞానిక ధోరణి ఉంటుంది; ప్రస్తుత వర్గ సమాజపు చివరి దశల్లో సోషలిజం కోసమని పోరాడుతున్నవారితో ప్రత్యేకమైన ప్రమేయం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉన్నట్టయితే గతితార్కిక భౌతికవాదం గురించిన రచన “అరుణోదయంలాగానూ, అడవిలో రివ్వుమని ఎగిరే బాణంలాగానూ, చలికాలం ముగిశాక విచ్చుకునే మొగ్గలాగానూ అనిపిస్తుంది”.16
References:
1. Plato, Apology, 30/31, in The Trial and Death of Socrates, p. 100
2. Oates, The Stoic and Epicurean Philosophers, p. 441
3. Hutchins, “The Scientist’s Morality”, Minority of One, Nov. 1963, p. 26
4. Dunham, Man Against Myth, p. 3
5. Heinrich Heine, quoted in Sigmund Freud, “A Philosophy of Life”, in Peterson, Essays in Philosophy, p. 341
6. Cohen, American Thought: A Critical Sketch, p. 37
7. Hegel, Lectures on the History of Philosophy, Vol.1, p. 24
8. Bierce, The Devil’s Dictionary, p.139
9. Russell, Unpopular Essays, pp. 45, 55
10. Quoted in Kauffman, Hegel, p. 453
11. Mao, “On the Draft Constitution of the People’s Republic of China”, Selected Works, Vol. 5, p.146
12. Quoted in Lewis, Marxism and the Open Mind, p. xvii
13. William Harvey, An Anatomical Disquisition on the Motion of the Heart and Blood in Animals, quoted in Bunge, Metascientific Queries, p. 209
14. Whitehead, An Introduction to Mathematics, p. 170
15. Engels, Dialectics of Nature, p. 335
16. Lu Hsun, “A preface to Pai Meng’s ‘The Children’s Pagoda’ ”, Selected Works, Vol. 4, p. 252