- అగష్టస్ కనుమూరి, ఏలూరు
చూపు మందగించిపోయి
అవాంచనీయ కిరణాలేవో చొచ్చుకొస్తున్నాయి
మసకబారిన నేడులో కలలు జారిపోతున్నాయి
అక్షరాలు తడుముకుని పేర్చుకున్నా
అల్లిబిల్లిగా అల్లుకుపోతున్నాయి
పదాలుచేర్చుకొని కూర్చున్నా
అస్పష్టమై ఆవిరైపోతున్నాయి
ఇక్కడ
గాలి రాగమై
పచ్చనిచెట్ల ఆకులు లయలో
పక్షులకిలకిల రావాల గానాలు సాగేవి
నులివెచ్చని పులకింతల సుమ గంధాలు విరిసేవి
తొలిమలి సంధ్యల్లో సూర్యకాంతికిరణాలు బంగారంలా
మధ్యాహ్నాలు వెండిలా మెరుస్తూ నదిపై నాట్యమాడగా
పుడమి అణువణువు అనంత శక్తి నింపుకునేది
వెన్నెల వెలుగులో చల్లగా సుపరిమళాలతో పరవశిస్తుండేది
ఇప్పుడు
కళ్ళముందు దృస్యాలు కరిగిపోతున్నాయి
ఆశలు వసపక్షుల్లా ఎగిరిపోతున్నాయి
ఉత్సాహంతో కొత్తనీరు నింపుకుని ప్రవహించిన నది
పరివాహకపు పచ్చనిపైరులు
వనాలతో పల్లెలు సమసిపోతున్నయి
లోహాలోహాలమద్య
అధికోష్ణోగ్రతా అతిశీతోష్ణాలమద్య
గుండెల్లో గుబులు గొంతులోనే కుక్కుకుంటూ
నిరంతరంతిరిగే చక్రంలా
పాషాణ జనారణ్యంలో
రసాయన సమ్మిళిత పవనాలతో
యంత్రాలమద్య జీవకణయంత్రం తిరుగుతోంది
ప్రతిచోటా
ఆకాశహార్మాల
పరిశ్రమల పొగగొట్టాలు
విలాసంగా వదులుతున్న పొగలమద్యనుండి
ముద్దు మోముల కాంతుల జాబిల్లి చిన్నబోతున్నాడు
పొగబారి పొడిబారిన పిండారబోస్తున్నాడు
మిత్రమా!
పొలం గట్లపై పల్లెపదాలు పాడుదాం!
ఆహ్లాదం
ఆనందం
సంతోషం
ఉత్సాహం
ఉత్తేజం పంటకోద్దాం!
ప్రకృతికి ప్రమాణం పచ్చదనం నింపుదాం!
ఎదలుపొంగి సుధలునింపే మధుర స్మృతులు నూర్చుకుందాం!
నిర్మాణాత్మకంకాని వర్తమానంలో
మనుగడలేని భవిష్యత్తును నిలిపివేద్దాం!
కవిత బాగుంది. కానీ… అక్షర దోషాలు…టైపింగ్ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మంచి భావాలున్న కవితలు ప్రచురించడమే కాదు,వాటిని ప్రచురించేముందు ఎడిటింగ్, ప్రూఫ్ జాగ్రత్తలు కూడా తీసుకొంటే బాగుంటుంది.
దార్ల
కవి ఆవేదన, ఆలోచన చాలా బాగుంది. కాకపోతే చిన్న ఆలోచన, నా స్వంత అభిప్రాయం మాత్రమే. పొలం గట్లపై పల్లెపదాలు పాడుకుంటూ వుంటే ఆ తియ్యదనం చెప్పలేనిది. అల్లగని పల్లెపదాలు పాడుకుంటూ పొలంగట్లమీద వుంటూ వుంటే మనిషి మేథోసంపత్తికి, ఆలోచనలకు కార్యరూపం వుండదు.
కాబట్టి కవి చెప్పినట్లు “నిర్మాణాత్మకం కాని వర్తమానంలో మనుగడలేని భవిష్యత్తుకు” మంచి మార్గం కనుగొందాం. ప్రకృతికి ప్రమాణమైన పచ్చదనాన్ని పెంచుదాం.
ఆకాశ హార్మ్యాల మద్య పరిశ్రమల పొగగొట్టాలు వుండవసినదే. కాకపోతే అవి విలాసంగా వదిలే పొగమాత్రం మానవ మనుగడకు ముప్పులేని విధానాన్ని కనుగొందాం. మన మేథోసంపత్తికి సాధ్యంకానిది ఈ సృస్టిలో ఏదీలేదని నా అభిప్రాయం.
కవి ఆలోచనలతో ఏకీభవిస్తూ, కొత్త ఆలోచనలను సృష్టించుకుందాం.
శ్రీనివాస్ భీమా
అగస్య ఇందులొ టైపు చేయటము చాలా కస్టము గా ఉన్నది. నీ కవిత కి సలహా ఇచ్చె అంతటి వాడిని కాదు. నువ్వు చెప్పినట్లు “నిర్మాణాత్మకం కాని వర్తమానంలో మనుగడలేని భవిష్యత్తుకు” మంచి మార్గం కనుగొందాం. ప్రకృతికి ప్రమాణమైన పచ్చదనాన్ని పెంచుదాం. నేను వేటితొ ఏకీబవిస్తున్నాను.