- తుమ్మల దేవరావ్, నిర్మల్, అదిలాబాద్ జిల్లా.

బిడ్డా నాలేగ!
ఏ లోకాలకెల్తివిరా
మా కడ్లకు పట్టపగలే సుక్కలు సూపెడ్తవి
మా గుండెల్ని పారలతో నిలువెల్లా కోతవెడ్తివి
నడుమంత్రం పాణంబోతె
మా ముసలి పాణాల్ని కానెదోళ్ళు మన్నుపోసెదోళ్ళు

నా అయ్యా!
నువ్ ఏ పొద్దుల్లో పొడుస్తావని ఏడ్పుమానుకుందు
ఏ చీకటి ఎలుతురు పురుగైనవని ఎతుకుదు
ఏ దిక్కుల్లో నెలవంక అయ్యావని నోరుమూద్దు
ఏ పువ్వువై పూశావని కంట్లో ఒత్తులేసుకుని సూసుకుందు
బతికినట్లే బతికి నడుమత్రం బదులాయిస్తిని
కళ్ళుమూసి
పాణం కుతి తీరకముందే పట్నమంచమెక్కితివి

నా తండ్రీ!
మా కళ్ళలో కన్నీళ్ళు కత్తులై ఏలాడుతున్నాయి
మా గుండెల్లో బాద అగ్నిగుండమై మండుతుంది
కడుపుకోయ్త రంపంలా కోయవట్టె
నోట మాటలేక పిసమనుషులమైతిమి
కుతితీరలేదని కన్న పేగులు మొత్తుకోవట్టే
చిల్లులుపడ్డ మట్టి కుండైంది మనసు
కన్నీళ్ళు దోసిట్లో దేవేసుకుని మనసు నింపుకుంటి

నా చిలుక!
రేపట్నుండి ముసలి కుంపటిని ఎవరు ఆర్పుతారు
చాతకాని ఈ గాలి పీనుగల్ని ఎవరు సాకుతారు
పాచిమెతుకుల్ని మా మొఖంమీద కొట్టెదెవరు
పొద్దుగూకి శిమ్మట్లు అరుస్తున్నప్పుడు చిన్నబోయిన
శికటి కొట్టంలో దీపం పెట్టేదెవరు

బిడ్డా నాల్యాగ!
ఖొర్రాయిల్లేని పాతపొయిలో
నువు కాలిన పిడకోలే కనిపిస్తున్నావూ
శూపులు ఏలని పండ్లతోటలో
నిన్నిపుడు చెట్టిడిసిన శిలుకోలే యాడని ఎతుక్కుందు
నూఋఎళ్ళ పేగు బంధం పుట్తుక్కున తెగిపోయె
యిగ బతుకంతా నీ మొఖమెరుగని
మా మొఖాల్లో
ఫుట్టెడు జీవకశిపి సతాయిస్తది బిడ్డా!

***
కన్న పేగుబదువు మమకారాల పొత్తిళ్ళ దాహాన్ని
కాల్చలేం, తూల్చలేం,
అది నిరంతరాత్మల ప్రవాహం.

3 అభిప్రాయాలు

  1. pruthvirajvarma 02 ఏప్రిల్ 2008 , 10:26 pm

    చాలా బాగుందిమీరూ నిర్మల వాసులు కావడం విశెషము.

  2. surendra nath 19 ఏప్రిల్ 2008 , 3:18 am

    చాలా బాగా వునది. దీనిని కాపీ చెయ్య్దనీకి వీలుకలిపించ గలరు. అన్ని విషయాలు చాలా బాగా వున్నవి.

  3. ramnarsimha 19 నవంబర్ 2010 , 2:38 am

    మీ కవిత చాలా బాగుంది.
    మీకు అభినందనలు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)