“మెజారిటీ ప్రజల స్వాతంత్య్ర కాంక్ష మైనారిటీ వర్గ ప్రజలలో అభద్రతను పెంచి వారి వలసకు దారితీసింది.”

కాశ్మీర్‌లో మన కర్తవ్యం

- కె.బాలగోపాల్

అవి దేశ విభజన రోజులు. ఉపఖండమంతటా -ముఖ్యంగా ఉత్తర, వాయవ్య, తూర్పు ప్రాంతాల లో నరమేధం జరుగుతున్నది. హిందూ, సిక్కు మూకలు ముస్లింలను, ముస్లిం మూకలు హిందువులనూ సిక్కులనూ నరుకుతున్నారు, సజీవంగా కాల్చి చంపుతున్నారు. ఇళ్ళు తగుల బెడుతున్నారు. స్త్రీలను రేప్ చేస్తున్నారు.

ఇంతటి హింసను ఉపఖండం అప్పటివరకు చూసి ఎరుగదు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన కాశ్మీర్ వెళ్లాడు. అక్కడి ప్రశాంతత చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న జమ్మూలోను, కొత్తగా ఏర్పడ్డ సరిహద్దుకు ఆవలనున్న పాకిస్థాన్‌లోనూ రక్తం ఏరులయి పారుతున్నా, కాశ్మీర్‌లో చిన్న మైనారిటీగా ఉన్న హిందువులు, సిక్కులు భద్రం గా ఉన్నారు. స్వల్పమైన మత ఘర్షణలు సహితం లేవు.

ఆ పెద్దాయన కాశ్మీరీలను అందుకు అభినందిస్తూ జమ్మూలో హింసను అరికట్టలేకపోయిన మహారాజా హరిసింగ్ గద్దె దిగి షేక్ అబ్దుల్లాకు అధికారం అప్పగించాలని పత్రికా ముఖంగా డిమాండ్ చేశాడు. ఆయన ‘హిందువుల ప్రయోజనాలను వ్యతిరేకించే కమ్యూనిస్టు’కాదు, త్రిపురనేని హనుమాన్ చౌదరి కంటే ప్రగాఢమైన రామభక్తి గలవాడు. ఆయనను మహాత్మా గాంధీ అంటారు. ఆ నాటి నుంచి ఈనాటి దాకా దేశంలో మత ఘర్షణలు ఎప్పుడూ జరగని అతి కొద్ది ప్రాంతాలలో కాశ్మీర్ ఒకటి. గడచిన నెలరోజులుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత మధ్య కూడ అమర్‌నాథ్ యాత్ర ఎప్పటిలాగే సాగింది, సాగుతున్నది.

యాత్రికులకు ఎప్పటిలాగే స్థానిక ప్రజల సహాయ సహకారా లు అందుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత సంఖ్య -దాదాపు 5 లక్షల మంది - అమర్‌నాథ్‌కు వెళ్లా రు. వాళ్లపైన దాడికాదు సరికదా ఎటువంటి అసౌకర్యమూ కలగలేదు. సినిమా షూటింగ్‌కు పోయిన తెలుగు సినిమా వారి మీద మాత్రమే పహల్గాంలో రాళ్లు పడ్డట్టున్నాయి. అయినా ‘నాలుగు లక్షల మంది కాశ్మీరీ పండిట్‌లు కాశ్మీర్‌లోయ వదిలిపెట్టి పోలేదా?’ అని హనుమాన్ చౌదరి అడుగుతున్నారు. నాలుగు లక్షల మంది పోలేదుగానీ రెండు లక్ష ల పైగా పోయిన మాట వాస్తవం. దీనికి కారణం హిందువుల మీద దాడులు జరగడం అనుకుంటే పొరబాటే.

1989లో మొదలైన మిలిటెన్సీ తన రాజకీయ ప్రత్యర్ధులను ఏరి ఏరి హతమార్చింది. అందులో కొందరు పండిట్‌లు ఉన్నారు. అత్యధికం నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన ముస్లింలున్నారు. కాశ్మీరీ ముస్లింలు గుంపులుగా పండిట్‌ల పైన దాడి చేసిన ఒక్క ఘటనా జరగలేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా కాశ్మీర్‌లో సైన్యం చేతిలోనూ మిలిటెంట్ల చేతిలోనూ ప్రభుత్వ అనుకూల సాయుధ బృందాల చేతిలోనూ చనిపోయిన వారి సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 50 వేల నుంచి 80 వేల దాకా ఉంది. అందులో పండిట్‌ల సంఖ్య 300 మించి లేదు.మిగిలిన వారంతా- ఎవరి చేతిలో చచ్చినా- కాశ్మీరీ ముస్లింలే.

మిలిటెన్సీ కాశ్మీరీ సంస్థల చేతి నుంచి పాకిస్థాన్ కేంద్రంగా గల ఇస్లాం వాద సాయుధ సంస్థ ల చేతిలోకి పోయిన తరువాత మిలిటెంట్లు మూకుమ్మడిగా నిరాయుధులను చంపిన ఉదంతాలు జరిగాయి, జరుగుతున్నాయి గానీ అంతకు ముందు అది కూడ లేదు. అయినప్పటికీ పండిట్‌లు పెద్ద సంఖ్యలో పారిపోవడానికి తమ భవితవ్యాన్ని గురించి ఏర్పడిన అభద్రతా భావం కారణం. లక్షల మంది వీధులలోకి వచ్చి ఇండియా-వ్యతిరేక నినాదాలిస్తున్నారు. కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలు ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థ కుప్ప కూలిపోయింది.

పండిట్‌లు కాశ్మీర్‌లోయ విడిచిపెట్టి పోవాలన్న పోస్టర్లు కొన్ని చోట్ల పడ్డాయి. దీనికి పండిట్‌లు భయపడటం సహజం. ఆ స్థితిలో ప్రభుత్వం వారికి భరోసా ఇచ్చి వుంటే పండిట్‌ల వలస జరిగి ఉండేది కాదేమో గానీ అప్పటి గవర్నర్ జగ్‌మోహన్ ఆలోచనారీతి ప్రస్తుత సంక్షోభానికి కారకుడైన గవర్నర్ సిన్హా ఆలోచనారీతి లాంటిదే. పండిట్‌లను ప్రభుత్వం కాపాడజాలదనీ వారి భద్ర త కోసం వారు లోయను విడిచిపెట్టి వెళ్లిపోవడం ఉత్తమమనీ రాష్ట్ర గవర్నర్ స్వయంగా ప్రకటించడం పండిట్‌ల భయాన్ని మరింత పెంచి భారీ వలసకు దారితీసింది.

ఈ వలస కాశ్మీరీలను కలవర పెట్టింది. హృదయనాథ్ జట్టో అనే కాశ్మీర్ పండిట్, రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఫ్తీ బహావుద్దీన్ ఫారూఖీలు కలిసి పండిట్‌లను వలస పోవద్దంటూ ఒక ప్రకటన జారీ చేశారు. వారిద్దరి నేతృత్వంలో వలసలను అరికట్టే లక్ష్యం గల ఒక కమిటీ ఏర్పడింది. కానీ దానిని గవర్నర్ జగ్‌మోహన్ సాగనివ్వలేదు. జట్టోకు జమ్మూలో ఒక నివాసం ఏర్పాటు చేసి విమానం టిక్కెట్టు కొనిచ్చి పోలీసు జీపు ఇంటికి పంపించి ఆయనను జమ్మూకు దాదాపు బలవంతంగా తరలించాడు.

జమ్మూ కు చెందిన బలరాజ్ పూరి అనే మానవహక్కుల వాది గవర్నర్ చర్యకు ఆగ్రహించి ఆయనను కలిసి ఎందుకీ పని చేశావని అడగగా, జగ్ మోహన్ చెప్పిన జవాబు ఏమిటంటే ‘కాశ్మీర్‌లో హిందువులూ ముస్లింలూ సఖ్యంగా బతికితే భారత సైన్యం మనో స్థయిర్యం దెబ్బ తింటుంది’ అని. వాస్తవాలు మనకు ఎంత అప్రియంగా ఉన్నా వాటిని గుర్తించడానికి నిరాకరించడం విజ్ఞత అనిపించుకోదు. వాస్తవాలు తెలుసుకోవడానికి ఓపిక లేక మన విశ్వాసాలనే సత్యాలుగా ప్రచారం చేసుకోవడం నాగరిక వైఖరి అనిపించుకోదు.

కాశ్మీర్‌లో కల్లోలం మొదలయినప్పటినుంచి బయటినుంచి హక్కుల బృందాలు తరచుగా ఆ రాష్ట్రానికి పోయి అక్కడి మానవ హక్కుల స్థితి గురించి నివేదికలు ప్రచురిస్తున్నాయి. ఆ బృందాలు జమ్మూలోని పండిట్‌ల శిబిరాలకు పోని సందర్భాలు అరుదు, వారి జీవనస్థితిగతుల గురించి ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టని సందర్భాలు అరుదు. హనుమాన్ చౌదరి నన్ను పేరు పెట్టి ప్రశ్నించారు కాబట్టి నేను పాల్గొన్న 6 నిజ నిర్ధారణ కమిటీల నివేదికల లో అయిదింటిలో పండిట్‌ల స్థితిగతుల గురించి వివరమైన ప్రస్తావన ఉందని చెప్పాలి. అయినప్పటికీ కాశ్మీర్ పండిట్‌లను పాలస్తీనా అరబ్బులతో పోల్చడం అర్థరహితం.

వారి భూమిని వారు వదిలిపెట్టడానికి ప్రేరణ అయిన అభద్రతకు కారణం పరాయివారు కాదు. పాలస్తీనాకు యూరప్‌లోని వివిధ దేశాలకు చెందిన బలవంతులు వేల సంవత్సరాలనాటి పిట్టకథను పట్టుకొచ్చి స్థానిక ప్రజల భూమిని ఆక్రమించుకొని వారిని తరిమేశారు. కాశ్మీర్‌లో జరిగిందది కాదు. మెజారిటీ ప్రజల స్వాతంత్య్ర కాంక్ష మైనారిటీ వర్గ ప్రజలలో అభద్రతను పెంచి వారి వలసకు దారితీసింది. పండిట్‌లు బ్రాహ్మణులు అవడం వల్ల వారిలో విద్యావంతులెక్కువ. చాలామంది ఢిల్లీనుంచి బెంగుళూరు దాకా మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే జమ్మూలోని శిబిరాలలో ఉన్నారు. కాశ్మీర్ వారి భూమే, వారు ఎన్నటికైనా వెనక్కి పోవలసిందే. అయితే అది మెజారిటీ ప్రజల రాజకీయ కాంక్షకు పరిష్కారం దొరికిన క్రమంలోనే జరగగలదు. ఆ కాంక్ష ఎంత బలమైనదో గడచిన నెలరోజుల ఘటనల నుండయినా మనం గ్రహించడానికీ గుర్తించడానికీ సిద్ధంగా ఉన్నామా? 8 కోట్ల తెలుగువారిలో గొప్ప పలుకుబడీ, ప్రాబల్యం ఉందని నిరూపించుకున్న నాయకులూ హీరోలూ బస్సులూ రైళ్లూ ఏర్పాటు చేసుకొని ఒక లక్ష మందితో మీటింగ్ పెడితే అది గొప్ప సభ అనుకుంటాం.

కాశ్మీర్ జనాభా హైదరాబాద్ జనాభాతో సమానం. (గ్రేటర్ హైదరాబాద్ కాదు, వట్టి హైదరాబాద్). అక్కడ గడచిన రెండు మూడు వారాలలో రెండుసార్లు ఏ ప్రత్యేకమైన ఏర్పాట్లూ లేకుండ కొండల నుంచీ కోనల నుంచీ రెండు మూడు లక్షల మంది జనం ఒక చోట పోగయి ఊరేగింపు తీశారు. ఇదంతా వంద ఎకరాల భూమి కోసం అనుకుంటే పొరపాటు. ఆ భూమి కేవలం ఒక సందర్భం మాత్రమే. అరవై సంవత్సరాలుగా అణచివేయబడ్డ ఆరాటం వ్యక్తీకరణకొక సందర్భం. భారత పాలకుల కౌటిల్యము, భారత సైన్యము వారి పైన ప్రయోగించిన అణచివేత అంతాయింతా కాదు.

మతోన్మాద మిలిటెంట్ల విచ్చలవిడి హింస తప్ప కాశ్మీర్‌లో వేరే ఏమీ లేదని ఆత్మవంచన చేసుకున్నంతకాలం ఈ అణచివేత గురించి ఆందోళన చెందవలసిన అగత్యం సగటు భారతీయులకు కలగలేదే మో. కాని ఇంక ఆ వైఖరి సాధ్యమా? వేర్పాటువాదం అని పేరు పెట్టుకున్నా, కాశ్మీరీ జాతీయవాదం అని పేరు పెట్టుకున్నా ఈ ఆరాటానికి ప్రధాన ప్రతినిధి హురియత్ కాన్ఫరెన్స్ అని కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని నమ్మే నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా సైతం ఒక టివి చానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొంటూ ఒప్పుకున్నారు.

తమ బోటివారు కష్టపడితే పదివేల మందిని సమీకరించగలమనీ హురియత్ కాన్ఫరెన్స్ పిలుపు లక్షల మందిని కదిలించగలదనీ అంగీకరించాడు. ‘మన వాడు’ అనుకునే ఈ నాయకుడి మాటలయినా మనకు వినబడతాయా? హురియత్ కాన్ఫరెన్స్‌ను ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా గౌరవించి వారితో ప్రజాస్వామికంగా వ్యవహరించే బదులు ఆ సంస్థను చీల్చి ఒక అనుకూల వర్గాన్ని తయారు చేసుకోవాలన్నది భారత ప్రభుత్వ వైఖరిగా ఉండింది ఇన్నాళ్లూ. దీనికి అమెరికా ప్రోత్సాహం ఉండింది. ముషార్రఫ్ సహకారం ఉండింది. దానితో హురియత్ కాన్ఫరెన్స్ పీడ విరగడయిందని భారత పాలకులు భావిస్తూ వచ్చారు.

అది భ్రమ అని గడచిన రెండు వారాల ఘటనలు రుజువు చేశాయి. అయినప్పటికీ మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనగానే అటువంటి ఆలోచనలే చేసే ప్రమాదం ఉంది. కాశ్మీరీల మనో భావాలకు జవాబు చెప్పకుండ అణచివేతతో, కాలయాపనతో దాటవేయడం 60 సంవత్సరాలుగా భారత ప్రభుత్వ విధానంగా ఉంది. దానికిప్పటికే ప్రజలు చాలా మూల్యం చెల్లించారు. ఇక నైనా సూత్రబద్ధమైన వైఖరి అవలంబించి ఏ పరిష్కారం సంబంధిత ప్రజలకు ఆమోదమైతే దానిని స్వీకరించమని మన పాలకుల పైన ఒత్తిడి పెట్టడం శాంతిని నిజంగా కాంక్షించే వారి కర్తవ్యం.

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేదీ: ఆగష్టు 26,2008

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)