పోలేపల్లి సెజ్ పేరిట పేదల నుంచి ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి వారికి అప్పగించే వరకు తాము పోరాటాన్ని కొనసాగి స్తామని ప్రజాగాయకుడు గద్ధర్ ప్రకటించారు. తాము చనిపోయినా తమ వారసులకు ఈపోరాటాన్ని అప్పగిస్తామని, ముఖ్యమంత్రి వై.ఎస్ స్వయంగా వచ్చి పేదలకు తిరిగి భూములను అప్పగిస్తున్నట్లు ప్రకటించే వరకు ఎవరు అడొడచ్చినా తమ పోరాటాన్ని మాత్రం ఆపలేరని ఆయన పేర్కొన్నారు.

జడ్చర్ల మండలంలోని పోలేపల్లి ఫార్మాసెజ్ బాధితులు నిర్వహిస్తున్న సత్యగ్రహ శిబిరాన్ని గద్ధర్ మంగళవారం సందర్శించారు. బాధితులతో కలిసి సెజ్‌కోసం ప్రభుత్వం తీసుకున్న పచ్చటి భూములు, అందులోని తోటలను పరిశీలించారు. అనంతరం ఫార్మా సెజ్‌లోని అరబిందో ఫార్మా పరిశ్రమ ముంగిట సెజ్ బాధితులతో కలిసి పోలేపల్లి ఫార్మాసెజ్‌కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ తనదైన రీతిలో నృత్యాన్ని చేశారు. ఒకవైపు పోలేపల్లి సెజ్ బాధి తుల బాధలను, మరోవైపు భూములను లాక్కోవడంలో ప్రభుత్వం, రాజకీయ నాయకులు చేసిన కుట్రలను ఆయన ఎండగట్టారు. ఈ సందర్బంగానే గద్ధర్ మాట్లాడుతూ పేదలకు ఉండే భూముల్లో వారు సాగుచేసి పంటలు పండిస్తారని, అదే ఫార్మాసెజ్‌లో అరబిందో లాంటి ఫ్యాక్టరీలు విషాన్ని పండిస్తాయని చెప్పారు. భూములు పంటలు పండించడానికి ఇస్తారా? విషాన్ని పండించడానికి ఇస్తారా? అని గద్ధర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. విషం పండించే ఫ్యాక్టరీలకోసం పంటల్ని పండించే పచ్చని పొలాలను నాశనం చేయడం మాన వత్వం అనిపించుకోదని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫార్మాసెజ్ పేరిట బడుగు వర్గాలకు చెందిన భూములను మాత్రమే ప్రభుత్వం తీసుకుందని, ఇది కావాలని చేసిన పనేనని వ్యాఖ్యానించారు. సెజ్‌లు ఏర్పాటు చేయ డానికి పేదల భూములే తప్పా పెద్దల పొలాలు ఎక్కడా దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనార్టీలకు గతంలో ప్రభుత్వం వారికి జీవనాధారంగా భీడు భూములను ఇచ్చిందని, పేదలు తరతరాలుగా ఆభూముల్లో పంటలు సాగుచేస్తూ ఆ భీడు భూములను తమ శేదంతో తడిపి పచ్చటి పొలాలుగా మార్చుకుంటే వాటిపై కన్నేసి పేదలను అణచివేసే ఉద్దేశ్యంతోనే ఆ భూములను లాక్కున్నారని ఆరోపించారు. ఫార్మాసెజ్ కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూములను తీసుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌కు అప్పగించారని, బాబు సలహాతోనే వై.ఎస్ రాజశేఖరరెడ్డి ఫార్మాసెజ్‌ను ఏర్పాటు చేశారని, ఈ వ్యవహారంలో చంద్రబాబు, వై.ఎస్‌లు కూడబలుకొని ఫార్మాసెజ్ పేరిట పేదరైతుల బతుకుల్లో నిప్పులు పోశారని ఆరోపించారు. ఈభూములను తిరిగి సాధించే వరకు తాము పోరాటాన్ని సాగిస్తామని గద్ధర్ ప్రకటించారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన రచయితలు, కవులు, కళాకారులు, విద్యా ర్థులతో పోలేపల్లి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి వై.ఎస్ స్వయంగా వచ్చి పోలేపల్లి పేదలకు భూమి పట్టాలు మళ్ళీ ఇచ్చే వరకు తమపోరు ఆగే ప్రస క్తేలేదని స్పష్టం చేశారు. ‘’ఈ పోరు ఎన్ని వందల ఏళ్ళయినా చేస్తాం.. మేము చచ్చిపోతూ మా పిల్లలకు కూడా ఈపోరు సాగించమని చెబుతా.. మా పిల్లలు, వారి పిల్లలు కూడా ఈపోరు సాగించేలా చూస్తాం.. అనుకున్నది సాధించే వరకు ఎంతకాలమైనా పోలేపల్లి పోరును ఆపే ప్రసక్తే లేదు..'’ అని గద్ధర్ ఈ సందర్బంగా పునరుద్ఘాటించారు. పోలేపల్లి సెజ్ ఉద్యమాన్ని మొదలు పెట్టిన పేదలను ఆయన అభినందిస్తూ వారు మొదలు పెట్టిన ఈ ఉద్యమం తప్పక విజయవంతమవుతుందని, వారి భూములు వారికి వస్తాయని ధైర్యం చెప్పారు. సెజ్ బాధితులు చేస్తున్న సత్యాగ్రహానికి గద్ధర్ సంఫీభావాన్ని ప్రకటించారు. అంతకుముందుగా సెజ్ బాధితులతో కలిసి సత్యాగ్రహ శిబిరంలోనే భోంచేసిన గద్ధర్ అరబిందో ఫ్యాక్టరీ ఎదుట గంటకుపైగా పాటలు పాడుతూ బాధితులతో కలిసి నృత్యం చేస్తూ తమ నిరసనను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గద్ధర్ తోపాటుగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు పాషం యాదగిరి, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఆకుల భూమయ్య, పోలేపల్లి సెజ్ వ్యతిరేక పోరాట కమిటి నాయకులు మధుకాగుల,సూరేపల్లి సుజాత,తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 30, ప్రభాతవార్త ప్రతినిధి
సౌజన్యం: వార్త

2 అభిప్రాయాలు

  1. srinivas olle 15 అక్టోబర్ 2008 , 5:04 am

    సార్ మీ వ్యాసాలు అన్నీ చధువుతాను చాల బాగుంటున్నాయి నాలాంటి విద్యార్టులకు చాలా ఉపయోగ కరంగా ఉంటున్నాయి. థాంక్యూ సర్

  2. Marthanda 12 జనవరి 2009 , 9:59 am

    ప్రైవేట్ పెట్టుబడులతో నడిచే మార్కెట్ వ్యవస్థలో నీతి నియమాలు ఉండవు. అందినంత దోచుకోవడమే ఇక్కడి నీతి. మార్కెట్ దోపిడీదారులకి పాలక వర్గం నుంచి పూర్తి సప్పోర్ట్ ఉంది. పేదవాళ్ళు ఇంటి స్థలం కొనడానికి డబ్బులు లేక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు పీకించి, ఆ స్థలం ఖాళీ చెయ్యించి ఆ స్థలాన్ని వేలం వేస్తారు సర్కారోళ్ళు. ఆ స్థలాన్ని డబ్బున్న వాడు కొనుక్కుని షాపింగ్ కాంప్లెక్సో, అపార్ట్మెంటో, ఆఫీసో కడతాడు. ఆ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోయిన పేదవాళ్ళు ఇంకో ప్రభుత్వ స్థలాన్ని వెతుక్కుని, మళ్ళీ అక్కడ కష్ఠ పడి గుడిసెలు కట్టుకోవాలి. వాటిని కూడా మళ్ళీ పోలీసులు పీకరని ఖచ్చితంగా చెప్పలేం. పల్లె ప్రాంతాలలో ఎస్.ఇ.జెడ్.ల పేరుతో మార్కెట్ దొంగలు పచ్చని వ్యవసాయ భూముల్ని కూడా ఆక్రమించుకోవడం కనిపిస్తుంది. భూములు కోల్పోయే రైతులకి సరైన నష్ట పరిహారం ఇవ్వరు, ఉద్యోగాలైనా ఇస్తామని అగ్రిమెంట్ రాయించరు. కార్పరేట్ దొంగలు పాలకవర్గం & పోలీసుల సప్పోర్ట్ తోనే లీగల్ గా భూములు ఆక్రమించుకుంటారు. నందిగ్రాం అయినా, కళింగనగర్ అయినా, పోలేపల్లి అయినా, ఇంకే గ్రామమైనా దాని మీద సెజ్ ఔత్సాహికుల కన్ను పడితే చాలు ఆ గ్రామాల ప్రజలు తమ భూములు ఎమైపోతాయో, తమ బతుకు తెరువు ఎమైపోతుందోనని భయపడుతూ బతకాలి. నందిగ్రాం వాసుల లాగ తిరగబడితే పోలీస్ కాల్పులు, రేపులు జరుగుతాయి.

Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)