డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఆకాశంలో ఉండే స్వర్గం గురించీ, కాళ్ళ కింద ఉండే నరకం గురించీ అనాదిగా కాకమ్మ కబుర్లు వింటునే ఉన్నాం. విజ్ఞానం వికసించని యుగంలోమనవాళ్ళు గంధర్వ, ఖేచర, కిన్నెర, కింపురుషుల గురించి చెప్పినట్టే (వీరిలోమానవమాత్రులు కానివారెవరో ఇప్పుడు సరిగా తెలియదు) ప్రపంచ నాగరికత లన్నిటిలోనూ అపోహలుండేవి.

జీవాలంటే ఏమిటో, అవి ఎన్ని రూపాలు ధరించి అంతరించిపోయాయో, ఏయే పరిస్థితుల్లో ఎటువంటి శరీరలక్షణాలు కలిగి ఉంటాయో ఊహించగలిగినది ఆధునిక విజ్ఞానశాస్త్రం ఒక్కటే. కాబట్టి ఇటువంటి చర్చలో బూజుపట్టిన భావనలకు స్థానం ఉండదు.

జీవపరిణామం భూగ్రహం మీద ఎలా జరిగి ఉంటుందో తమకు తెలిసినంత మేరకు అర్థం చేసుకోవడానికి ఆధునిక మానవులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. భూమి రూపొందిన తొలి 100 కోట్ల సంవత్సరాల కాలంలో ఆకాశంనుంచి వచ్చి పడే ఉల్కలూ, భూగోళం లోపల రగులుతున్న మేగ్మా, లావాల వేడిమీ వగైరాల ఉత్పాతాల కారణంగా జీవరాశి ఆవిర్భవించగలిగిన పరిస్థితులు ఏర్పడలేదు. ఆ తరవాత జరిగిన సంఘటనల గురించి శాస్త్రవేత్తలు ఊహించగలిగారు. నిర్జీవ పదార్థానికీ, సేంద్రియ (ఆర్గానిక్‌) పదార్థానికీ తేడా ఉంటుందనీ, తొలి జీవకణాలనేవి పునరుత్పత్తి సాధించగలిగిన జీవరసాయనిక కణాల కలయిక వల్లనే ఏర్పడ్డాయనీ, ఆ విధంగా మొదటగా తయారైన జీవకణాల “సూప్‌” ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కుంటూ గత 300 కోట్ల సంవత్సరాలకు పైగా కొనసాగుతూ వస్తోందనీ మనకు తెలుసు. ఇటువంటి కణాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భూమిమీద రూపొంది ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తారు.

అలా కాకుండా ఇవి ఆకాశం నుంచి ఉల్కలూ, తోకచుక్కల రూపంలో వచ్చిపడ్డాయనే సిద్ధాంతం కూడా ఉంది. దీన్ని ఫ్రెడ్‌ హోయ్‌ల్‌ అనే బ్రిటిష్‌ శాస్త్రవేత్తా, విక్రమసింఘ అనే సింహళ పరిశోధకుడూ ప్రతిపాదించారు. (మన దేశానికి చెందిన ఖగోళవేత్త జయంత్‌ నారళీకర్‌కు ఫ్రెడ్‌ హోయ్‌ల్‌ గురువు). విశ్వాంతరాళంలో కొన్ని రకాల జీవరసాయనిక కణాలు తేలుతూ ఉంటాయనీ, అవి గడిచిపోయిన యుగాల్లో తక్కిన గ్రహాలమీద రాలినట్టే మన వాతావరణంలోకి ప్రవేశించగా అనుకూల పరిస్థితులవల్ల ఇక్కడ నిలదొక్కుకో గలిగాయనీ వీరి ఉద్దేశం. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. మన సౌరకుటుంబంలో మరెక్కడా జీవరాశి ఉన్న దాఖలాలు లేవు. భూగ్రహం అనేది మన పాలిట ఒక స్పేస్‌షిప్‌ వంటిది. మనం ఏకాకులం.

మనకన్నా సూర్యుడికి సమీపంలో ఉన్న శుక్రగ్రహం మీద ప్రాణులు ఉండవచ్చని మొదట్లో అనుకునేవారు. అది అసాధ్యమనీ, విషప్రాయమైన కార్బన్‌ డయాక్సైడ్‌ అక్కడి వాతావరణంలో వేడిమి బైటకు రాకుండా భయంకరమైన పరిస్థితులని సృష్టించిందనీ ఆధునిక పరిశోధనవల్ల తెలిసింది. సూర్యుడి సరసనే ఉన్న బుధగ్రహం తన చుట్టూ తాను తిరగదు కనక దాని మీద ప్రాణులు బతికే అవకాశం లేదు. ఎందుకంటే వాతావరణం మాట ఎలా ఉన్నా, ఒక వైపు భరించరాని వేడిమీ, రెండో వైపు విపరీతమైన చలీ ఉంటాయి. శాస్త్రవేత్తలు ఎంతో నమ్మకం పెట్టుకున్న అంగారకుడి మీద కూడా నిరాశే ఎదురయింది. ఎన్ని అంతరిక్ష నౌకలను పంపి అక్కడి మట్టిని పరిశీలించినా ఏమీ లాభం లేకపోయింది. అక్కడి గురుత్వాకర్షణ బలహీనంగా ఉండడంతో వాతావరణం పలచబడిందనీ, ధ్రువప్రాంతాల్లోనూ, నేల కిందా మంచూ, నీరూ ఉన్నప్పటికీ ఉపరితలం మీద మాత్రం, బాక్టీరియా, నాచు మొదలైనవి ఉన్న దాఖలాలు ఏవీ ఇంతవరకూ కనబడలేదు.

అంగారకుడికన్నా సూర్యుడికి దూరంగా ఉన్న గురు, శని గ్రహాలు వాయువుల కుప్పల వంటివి కనక అక్కడ ఉపరితలం అనేదే లేకపోవచ్చు. కానీ బ్రహ్మాండమైన సైజులో ఉన్న ఈ పెద్ద గ్రహాల గురుత్వాకర్షణకు లోబడి వాటి చుట్టూ పరిభ్రమించే అనేక ఉపగ్రహాలున్నాయి. గురుగ్రహానికి అతి పెద్ద ఉపగ్రహమైన గనీమీడ్‌ ఒక మంచుముద్ద వంటిది. సౌరకుటుంబంలో దీనికన్నా పెద్ద ఉపగ్రహం లేదు. దాని చుట్టూ 75 కిలోమీటర్ల మందాన మంచు పేరుకుని ఉంటుంది. మరొక పెద్ద ఉపగ్రహమైన కేలిస్టో కూడా అంతే. ఇంకొక ఉపగ్రహం యూరోపా మీద గడ్డకట్టిన పల్చని ఆక్సిజన్‌ పొర ఉందనీ, మంచు అడుగున నీటి సముద్రాలున్నాయనీ శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.

శని చుట్టూ తిరిగే టైటన్‌ కూడా పెద్దదే. నారింజ రంగు మేఘాలు కమ్మి ఉండే ఈ వింత లోకం గురించిన పూర్తి వివరాలు తెలియవు. దీని కేంద్రం సాంద్రమైన రాతితో తయారై ఉండవచ్చు. దానిమీద ఎక్కువ మోతాదులో నైట్రొజెన్‌, కాస్త తక్కువగా ఈథేన్‌, మెథేన్‌, హైడ్రొజెన్‌ సయనైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ మొదలైన వాయువులుంటాయనీ, భూమిమీద నీరు ప్రవహించినట్టుగా అక్కడ ఈథేన్‌, మెథేన్‌లు ద్రవరూపంలోనూ, మంచు రూపంలోనూ ఉంటాయనీ అంచనా. అవి ఆర్గానిక్‌ పదార్థాలే కనక విపరీతమైన చలికి తట్టుకోగలిగిన బాక్టీరియా ఏదైనా ఆక్సిజన్‌ బదులుగా వాటిని పీల్చి బతుకుతుందేమో. చెప్పుకోవటానికి ఇదంతా “మన” సారకుటుంబమే అయినా ఈ దూరాలు చాలా పెద్దవి. వాయేజర్‌ అనే కృత్రిమ ఉపగ్రహం సౌరకుటుంబం వెలపలి అంచులకు 27 ఏళ్ళ తరవాత, ఇప్పుడిప్పుడే చేరుకుంది. అది ఏనాటికైనా జీవరాశి ఉన్న సుదూర గ్రహాలకు చేరుకుంటే అక్కడివారికి అర్థం అయే పద్ధతిలో భూమి గురించీ, మనుషుల గురించీ కొంత సమాచారాన్ని సందేశాల రూపంలో అందులో భద్రపరిచి పంపారు.

సూర్యుడివంటి ఇతర గ్రహాలు మన పాలపుంత గేలక్సీలో లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో కొన్నిటి చుట్టూ భూమిలాగే తగుమాత్రం దూరంలో పరిభ్రమించే గ్రహాలు ఉండే ఉంటాయనీ, వాటిలో కొన్నిటిమీదనైనా జీవరాశి పుట్టుకకు అనువైన వాతావరణం ఉండకపోదనీ శాస్త్రజ్ఞులకు తెలుసు. నిజానికి క్రీస్తుకు పూర్వం ఏడో శతాబ్దపు గ్రీక్‌ తత్వవేత్తలనాటినుంచీ ఇటువంటి ఊహపోహలు ఉంటూనే ఉన్నాయి. క్రీ.శ.1600 ప్రాంతాల ఇలాంటి భావనలను ప్రచారం చేసినందుకుగాను రోమన్‌ మతాధికారులు జియొర్దానో బ్రూనో అనే శాస్త్రవేత్తను సజీవదహనం కూడా చేశారు. ఇరవయ్యో శతాబ్దంలో ఫ్లయింగ్‌ సాసర్ల గురించిన హడావిడి కొంతవరకూ ఇటువంటి నమ్మకాల ఆధారంగానే జరిగింది. అంతరిక్షంనుంచి భూమిమీదికి నిత్యమూ ప్రసారం అవుతూ ఉండే రేడియో తరంగాల ఘోషలో “బుద్ధిజీవులు” బైటినుంచి పంపుతున్న సందేశాలేవైనా ఉన్నాయేమో ననే అన్వేషణ కూడా జరుగుతోంది.

జీవరాశి మాట ఎలా ఉన్నా భూమివంటి గ్రహాలేవైనా అంతరిక్షంలో కనబడుతున్నాయా అనే ప్రశ్నకు గత పదేళ్ళుగా అవుననే సమాధానం లభిస్తోంది. ఇన్ని శతాబ్దాలుగా మనుషులకు ఉన్న ఈ నమ్మకానికి ఇటీవలనే ప్రత్యక్షమైన సాక్ష్యాలు లభించడం మొదలయింది. గ్రహాలు నక్షత్రాల కన్నా బాగా చిన్నవి. అవి స్వయంగా వెలగవు. మహా అయితే నక్షత్ర కాంతిని ప్రతిఫలిస్తాయి. మనకూ ఆ నక్షత్రానికీ ఉన్న దూరంతో పోలిస్తే వాటి మధ్యనుండే దూరం బాగా తక్కువ. అందువల్ల నక్షత్రపు తీవ్రమైన వెలుగులో నిస్తేజమైన గ్రహాన్ని ఇంత దూరాన్నుంచి పసికట్టడం చాలా కష్టం. ఇటువంటి పరిశీలనల్లో మనకు కనబడేదల్లా నక్షత్రపు కదలికలోని కొద్దిపాటి తేడా. దీన్నర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ పనికొస్తుంది. ఒక బరువైన వస్తువుకు తాడు కట్టి ఎవరైనా గుండ్రంగా తిరగడం మొదలుపెడితే వస్తువు పెద్ద వలయాకారకక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. వేగంగా తిరుగుతున్న వస్తువును గుంజుతూ తిరుగుతున్న మనిషి కూడా ఉన్నచోటే నిలకడగా నిలవలేక కొద్దిగా చిన్న వృత్తాకార పరిధిలో కదులుతూ ఉంటాడు. తిరుగుతున్న వస్తువుతో పోలిస్తే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బరువున్న మనిషిమీద వస్తువు ప్రభావం తక్కువగానైనా కనబడుతూనే ఉంటుంది. నక్షత్రం విషయంలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది. దాని గురుత్వాకర్షణకు లోబడి గ్రహం ఒకవంక బ్రహ్మాండమైన కక్ష్యలో తిరుగుతూ ఉండగా నక్షత్రం కూడా చిన్నపాటి నాట్యం చేస్తూ ఉంటుంది. దూరం నుంచి చూస్తున్న మనకు ఆ నక్షత్రం కాసేపు చేరువవుతూ, కాసేపు దూరమవుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. గ్రహం ఆచూకీని పరోక్షంగా పసికట్టేందుకు మనకున్న మార్గం ఇదే.

మనకేసి వస్తున్న రైలు వేస్తున్న కూత హెచ్చు శ్రుతిలోనూ, మనను దాటగానే తగ్గు శ్రుతిలోనూ వినబడడాన్ని డాప్లర్‌ ప్రభావం అంటారు. మనకేసి వస్తున్న రైలుబండి వేగం శబ్దవేగానికి తోడవడంతో ప్రతి సెకండుకూ మన చెవులను తాకే శబ్దతరంగాల సంఖ్య పెరిగినట్టనిపిస్తుంది. హెచ్చు శ్రుతికి కారణం అదే. దూరమవుతున్నప్పుడు రైలుబండి వేగం శబ్దతరంగాల ఫ్రీక్వెన్సీని తగ్గించినట్టవుతుంది. కాంతికిరణాల్లో తక్కువ ఫ్రీక్వెన్సీ గల తరంగాలు ఎర్రగానూ, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నవి నీలంగానూ కనబడతాయి. నక్షత్ర కాంతిని స్పెక్ర్టం రూపంలో విశ్లేషించినప్పుడు కనబడే ఈ రంగుల తేడాలవల్ల నక్షత్రం కదులుతోందని మనకు తెలుస్తుంది. ఇటువంటి విశ్లేషణల ద్వారా 250కు పైగా గ్రహాల గురించిన సమాచారం తెలిసింది. ఇవన్నీమన పాలపుంతలోని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నవే. ఇది భౌతికవాదులు నమ్మదగిన సమాచారం; కట్టుకథ కాదు.

8 అభిప్రాయాలు

  1. mallikarjuna rao 07 అక్టోబర్ 2008 , 10:07 am

    చాలా బాగుంది ఇంకా మంచి విషయాలు తెలుపగలరు. ధన్యవాదములు

  2. Chandra Sekhar 11 అక్టోబర్ 2008 , 5:03 am

    రోహిణీప్రసాద్ గారూ, మంచి వ్యాసానికి ధన్యవాదాలు. మేటర్, ఏంటీమేటర్ గురించి వివరాలు తెలియజెయగలరు.

  3. Dr.P.M.Rao. 19 జనవరి 2009 , 7:31 am

    On 8-1-09 Hindu papaer K.S.RAJGOPAL wrote-CO2 detected on a distant planet. says possiblity of extra terrestrial life. Life is present in CO2 using CO2 eg.clostridium tetani. we can’t say life does mean only human beings. The expected intelligence as per the necessity is present among other lives.The same is present while developing in the womb of mother to a foetus.After taking birth the culture and other type of educations are tought to child by his elders.Trainings for animals too will show difference from animal to animal.If at all we think life as humans taking oxygen and leaving CO2-what about plants which use CO2 and release O2.In deadly poisons (which are poisonous to humans) also there are some lives dwelling.Some were discovered and some are going to be discovered.Though ages past the human being who is now seen is not present the life of that age gave origin to the present human beings.As such their survival intelligence brought the present status to man. ఏది ఏమైనా వ్యాస రచన బాగుంది.సైంటిస్టులవి ఊహాగానాలూ అపోహలే అయినా పదార్థాలకు ఉన్న గుణము ఎప్పటికీ మారదనుకోవటం పొరబడట మేమో?అలాగే జీవులలో మనమే మేథావుల మనుకునే కన్నా బతుకు తెరువుకు జీవించటానికి వలసిన తెలివి ఏ జీవ జాతికైనా వుంటుంది.బొగ్గు పులుసు వాయువూ ప్రాణులను పోషిస్తోందని తెలిపేదే మొక్కల ఉనికి,కొన్ని రకాల బ్యాక్టీరియా ఉనికి.కొత్త కొత్త జీవులని కనుక్కుంటున్నారు.విజ్ఞాన శాస్త్రం రోజు రోజుకీ అభి వృద్ధి చెంది ఆవిష్కరింప బడుతోందని గమనించ గలరు.

  4. Dr.P.M.Rao. 23 మార్చ్ 2009 , 3:50 am

    19-3-2009 Hindu papaer says-The sterile tubes taken into space has collected the climate bacteria present in space found some varieties of bacteria.They are able to survive in space too where high temperatures and radiations are present.This experiment is done by Indian Scientists.By this we have to understand what we may not be knowing and undiscovered is also present and we should not think that we know every thing and start telling science to every body.Simultaneously we have to say-”At present this is known science.In future it may change as per the new discoveries(Inventions?)There is no hard and fast Rule in science.TRy to look into tomorrow!”.

  5. Dr.P.M.Rao. 25 మార్చ్ 2009 , 8:14 am

    క్షమించాలి.ఇంగ్లీషు పేపర్లో ఎక్కడ చదివిందీ గుర్తు లేదు.అయితే-”ఆంధ్రజ్యోతి” 18-3-2009 5వ.పేజీలో ఈ విషయం రాయబడి వుంది-గ్రహాంతర జీవులున్నాయ్! ఇస్రో పరిశొధనలో వెల్లడి.భూమికి 40 కిలోమీటర్ల పైన కొత్త బాక్టీరియా సమూహాల గుర్తింపు. భూమి మీద జీవులన్నిటికీ మూలాలు విశ్వంలోనేనా? పూణే,మార్చి 17;భూమి మీద తప్ప ఈ విశాల విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా? ఇప్పుడు ఉందనే సమాధానం చెప్పక తప్పదు.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జరిపిన ఓ అరుదైన ప్రయోగంలో భూమికి 40 కిలోమీటర్ల ఎగువన మూడు కొత్త బాక్టీరియా సమూహాలను కనుగొన్నారు.భూమి మీద అలాంటి బాక్టీరీయా ఆనవాళ్లు లేక పోవడంతో వాటిని గ్రహాంతర జీవులుగానే పరిగణించాలి.గ్రహాంతరవాసుల ఉనికి కోసం ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం వందల కోట్ల ఖర్చుతో భారీ ప్రయోగాలు చేపడుతున్నాయి.ఇదే సమయంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కేవలం బెలూన్ సాయంతో చేసిన ప్రయోగం సంచలనమైంది. ఈ ప్రయోగంలో హైదరాబాద్ కే చెందిన టాటా ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి (టి ఐ ఎఫ్ ఆర్ ) బెలూన్ సెంటర్ ,సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీ సి ఎం బీ) పరిశొధకులు పాలు పంచుకోవడం మనకెంతో గర్వ కారణం.ఏమిటా ప్రయోగం?ముందుగా హైడ్రోజెన్ గ్యాస్ నింపిన బెలూన్ సాయంతో ఇస్రో శాస్త్ర వేత్తలు 459 కిలోల బరువున్న సాంకేతిక పరికరాలను బెలూన్ సాయంతో భూమికి 41కి.మీ ఎత్తుకు తీసుకెళ్లారు.ఇందులో పూర్తిగా స్టెరిలైజ్ చేసిన 16 స్టీలు పాత్రలుంటాయి.భూమి నుంచి బెలూన్ దూరంగా వెళ్తున్న క్రమంలో రకరకాల ఎత్తుల్లో వాయు నమూనాలను సేకరించారు. ప్రయోగం పూర్తయ్యేవరకు పరికరాలన్నీ ద్రవీకరించిన నియాన్ తో నింపిన కంటెయినర్ లోనే వుంటాయి. అలా బెలూన్ గరిష్ట ఎత్తులకు చేరుకున్నాక వాటిని మళ్లీ పారాచ్యూట్ సాయంతో భూమికి తీసుకు వచ్చారు.-ఏంతెలిసింది? మొత్తం నమూనాల్లో 12 రకాల బాక్టీరియా ,ఆరు రకాల శిలీంద్ర సమూహాలను సీసిఎంబి ఎస్ సీ సీ ఎస్ లోని పరిశొధకులు గుర్తించారు.వీటిలో తొమ్మిది రకాల బాక్టీరియాల్లో 16 జతల ఆర్.ఎన్.ఎ పోగులతో ఉన్న జన్యు క్రమం ఉంది. భూమి మీద ఉన్న బాక్టీరియాతో పోల్చితే .. వీటి జన్యు క్రమం 98శాతం సరిపోలింది. ఇక మిగిలిన మూడు రకాల బాక్టీరియా సమూహాల పీవీఏఎస్-1,బీ 3 డబ్ల్యూ22,బీ8డ్బ్ల్యూ22 మాత్రం పూర్తిగా కొత్త జీవులు.వీటిలో ఒక్క దానికి జాని బ్యాక్టర్ హోయెలీ అని నామ కరణం చేశారు. మిగతా రెండు రకాల బాక్టీరియాలకు బాసిల్లస్ ఇస్రోనెన్సిస్ ,బాసిల్లస్ ఆర్యభట్ట అని పేరు పెట్టారు.నిజంగా కొత్తస్ జాతులేనా?ప్రయోగ సమయంలో భూమికి సంబంధించిన ఎలాంటి జీవం కూడా ప్రయోగ పరికరాల దరిదాపుల్లోకి చేరకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్ట్రాటో స్పియర్ లోనే ఈ నమూనాలు లభ్యమైనట్టు ప్రయోగ పరికరాలు నిర్ధారిస్తున్నాయి. పైగా.. ఈ బాక్టీరియాలకు అతి నీల లోహిత రేడియే ధార్మికతను తట్టుకునే శక్తి ఉంది. గ్రహాంతర జీవులు ఉన్నాయనడానికి ఈ ప్రయోగాల ద్వారా ఆథారాలు లభించాయి.ఇక..భూమి మీద జీవులన్నింటికీ మూలం ఎక్కడ ఉంది? ఇన్ని జీవుల సృష్టికి ఆద్యమైన ఆ జీవ మూలం ఏమిటి?అనే విషయాలను ఈ పరిశొధనలు నిర్ధారించ లేకపోయినా..ఆ వాదనలకు బలం చేకూర్చే ఆధారాలను సంపాదించి పెట్టాయి. దీన్ని బట్టి నేను చెప్పేడేంటాంటే- ప్రస్తుతం మనం చెప్పేవన్నీ మిడి మిడి జ్ఞానంతో కూడుకున్నవి. yet we hjave to un earth the truth.So,the Lamark theory of evolution is also to be considered may be truth;not only the Darwin’s theory.These are all views of different intellectuals.Don’t finalise the truth said in science.Say that till today this is being in our beleif.

  6. Dr.P.M.Rao. 23 మే 2009 , 9:18 am

    హైందవ పురాణాలు వేదాలూ ఎప్పుడో రాయటం పూర్తయ్యింది.ఇప్పుడు సైన్సు విశ్లేషణ
    ద్వారా మనము వాటిలో కాకమ్మ కబుర్లేవో నిజాలేవో నిగ్గు తేలుస్తున్నాం. సైన్సు రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కి నిన్న చెప్పింది నేడు కాదంటోంది. వేద ప్రమాణాలను మార్చేటందుకు లేదు గావున అక్కడే నిలిచాయి. భూమి వెలుపల జీవ రాశి విషయంలోనూ భూమి పై జీవ రాశి విషయంలోనూ సైంటిస్టులు రోజుకో కొత్త విషయం ఆవిష్కరిస్తున్నారు. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో భూమి పై జీవరాసి మరిన్ని కోట్ల వెనుక నుంచి ఉన్నట్లు ప్రతిపాదించారు సైంటిస్టులని రాశారు.పరిశోధనలు జరుగుతున్నాయి. రేపు ఏమని చెబుతారో తెలీదు.మానవులకు తొలి జీవి కోతులు కాదనీ స్పాంజి మన అందరికీ పూర్వీకులని తేల్చారు.రేపు మరో విధంగా చెప్పచ్చు.హేతుబద్ధంగా ఆలోచించి సైన్సు చెప్పేది మనం నమ్ముతున్నాం. కాని , భూమి పుట్టి ఎన్నో ప్రళయాలను చూసింది. ఆ వివరాలన్నీ మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. అలాటప్పుడే హేతువాదీ మన వేదాలలోని ప్రమాణాలను బట్టి అవే నిజమని నమ్మక తప్పదు.నాడు కట్టు కథలగా చెప్పినవి నేడు సైన్సు ఆవిష్కరణలతో విడ్డూరం అనిపించేవి నిజమై కూచుంటున్నాయి.వైర్ లెస్ ,టెలిఫోను,టి.వి.లు ఇవన్నీ నాటి కథలు నేడు సత్యాలై కూచున్నాయి.ప్రతి జీవ నిర్జీ వాల్లోనూ ఆత్మనీ జీవాన్నీ చూడ్డం హైందవం.సూర్యుడు,చంద్రుడు,కొండలు,నదులూ అన్నిటికీ మానవ రూపాలిచ్చి కొలవటం ఉంది.చెట్టు కూడా జీవమనీ ఒక రూపం కల్పించి దానిలో ఉండే గుణాలను కథల రూపంలో చెబుతారు.వస్తురూపంలో నిర్జీవాలుగా కనిపించే వాటిలో జీవాన్ని చూడ్డం నేటి శాస్త్రజ్ఞులకి ఏదోలా అనిపించినా-నీరు మనిషి ప్రాణం నిలబెడుతోందంటే దాంట్లో ఏదో జీవం ఉండే ఉంటుంది.సూర్యుని వల్ల మనం పొందే లాభాలవల్ల ఆ సూర్యునిలో ఏదో చిచ్ఛక్తి ఉంది అని నిరూపించి దేవునిగా కొలిచారు. ఇదంతా ప్రతి వస్తువు యొక్క గుణ గణాలను తెలిపేవిగా గుర్తుంచుకునే విధంగా ఉల్లేఖించారు.సప్తాశ్వ మారూఢం అంటే ఏడు రంగుల గూర్చి చెప్పడం-అలాగే సూర్యునికి భార్యలుగా ఛాయా దేవి(నీడ),సంధ్య-(ఉదయ సాయంత్ర వేళలను)భార్యలుగా చెప్పారు.అది భవిష్యత్తులో మనుష్యులు మరువకూడదనే అలా చెప్పారు.ద్వాదశాదిత్యులు-12 మంది సూర్యులు లేరు గాని ఉన్నట్టే ఒక్కోనెలకీ ఒక్కో సూర్యుని గా 12 నెలలకీ పేర్లు పెట్టుకున్నారు.మానవ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకీ కార్యా కార్య విచారణ చేసుకుంటూ శోధించి వారు చెప్పినవన్నీ అక్షర సత్యాలే! కొంచెం ఆలోచిస్తే రచయిత గ్రహించ గలరు.ఇకపోతే మనం (నేనూ ) ఎందుకు మన వేదాలనీ పురాణాలనీ తూష్ణీ భావంతో చూస్తున్నామంటే;దానిలో మానవత్వం కనుమరుగై మానవులందరూ సమానమనే భావన లుప్తమవటం,దానికీ ఏవో గత జన్మల కథలను ఆపాదించటం,భవిష్య జన్మలగూర్చి చెప్పటం అవేవీ మన కనులకు కనిపించని వవటం; యివన్నీ మనిషిని హేతువాదునిగా మార్చాయి.కొంచెం ఆలోచిస్తే చీమలు-చాలా చిన్న జీవి పిపీలికం తెలివైనది కాదని మనం అన లేము.అవి సృష్ట్యారంభం నించీ మన కన్నా ముందుగా భూమి మీద మనుగడ సాగిస్తున్నాయి.చదువరులు ఆలోచించ గలరు.

  7. Dr.P.M.Rao. 25 మే 2009 , 10:21 am

    Every generation imagines itself to be more intelligent than the one that went before it, and wiser than the one that comes after.

  8. Dr.P.M.Rao. 24 జూన్ 2009 , 8:03 am

    ఆంధ్రజ్యోతి-24.6.2009.న్యూస్ -160 కోట్లకు పూర్వమే భూమిపై జీవం!వాషింగ్టన్,జూన్క్ 23.భూమిపై జీవం ఆవిర్భావం 160 సంవత్సరాల క్రితమే జరిగిందని కర్టిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పరిశోథకుల బృందం గుర్తించింది.ఇంతకు ముందు జరిపిన పరిశోధనల్లో కేవలం 40 నుంచి 60 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించినట్లు పరిశోధకులు గుర్తించారు.భారత్ లోని వింధ్య పర్వత సానువులనించి సేకరించిన శిలాజాలను పరిశీలించి వారు ఈ నిర్ధారణకు వచ్చారు.అంటే .. గత్ అంచనాలతో పోల్చితే దాదాపు 100 కోట్ల సంవత్సరాలకు ముందే భూమిపై జీవం ఆవిర్భవించినట్లు తాము నిర్థారణకు వచ్చినట్లు పరిశోథనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రాస్ ముస్సెన్ పేర్కొన్నారు. తేడా వుంటే..వందేళ్లు,వెయ్యేళ్లు ఉండాలి కాని ..మరీ ఇలా వంద కోట్ల సంవత్సరాలు తేడా రావటమేమిటి అని ఆశ్చర్య పోతున్నారా?సేకరించిన శిలాజాలను ప్రయోగశాలకు తరలించేంత వరకు వాతావరణ ప్రభావం వాటిపై ఏ మాత్రం ఉండకుండా జాగ్రత్తలు తీసు కోవాలి.ఆ తరవాత ప్రయోగ శాలలో కూడా మిగిలిన శిలాజాలతో ఎక్కడా కలుషితం కాకుండా చూడ్డం ప్రధానమని రాస్ తెలిపారు. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవడంతోపాటు అత్యాధునికమైన సీసం డేటింగ్ పద్ధతిని ఉపయోగించి శిలాజాల వయసు నిర్ధారించామని ఆయన వివరించారు. క్షమించాలి ఈ విషయం జత చేస్తున్నాను. సత్యమేవ జయతే!

Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)