పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఒక పంచాయతీ సమితి కేంద్రం లాల్ ఘడ్ లో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మామూలుగానే మన ప్రచార సాధనాలకు సుదీర్ఘకాలంలో, మెల్లమెల్లగా సాగే ప్రజాజీవనక్రమాలను గుర్తించే అలవాటు ఉండదు. నాటకీయమైన, తక్షణ, సంచలనాత్మక సంఘటనలను మాత్రమే గుర్తించే అలవాటు ఉంటుంది.

అందువల్లనే మన ప్రచారసాధనాలకు గత వారంరోజులుగా లాల్ ఘడ్ లో జరుగుతున్న సంఘటనలు కనబడుతున్నాయి, అది ప్రధాన వార్త అవుతోంది. ఆ సంఘటనలను పునాదిగా పెట్టుకుని అక్కడ హింస జరుగుతున్నదనో, మావోయిస్టులు ఆదివాసులను రెచ్చగొడుతున్నారనో, మానవ కవచాలుగా వాడుకుంటున్నారనో, మావోయిస్టులకు తృణమూల్ కాంగ్రెస్ సహకరిస్తున్నదనో, ఇదంతా 2011 ఎన్నికలలో అధికార మార్క్సిస్టు పార్టీని గద్దె దించే లక్ష్యంతో జరుగుతున్నదనో వార్తలూ, వ్యాఖ్యలూ వెలువడుతున్నాయి. అక్కడ పాలకపక్షంగా మార్క్సిస్టు పార్టీ చెప్పదలచుకున్న అబద్ధాలన్నిటికీ ప్రాచుర్యం దొరుకుతోంది. లాల్-ఘడ్ ప్రాంతాన్ని మావోయిస్టులు ఆక్రమించుకున్నారనీ, విముక్తి ప్రాంతంగా ప్రకటించుకున్నారనీ బూచి ప్రచారమవుతోంది. మావోయిస్టుల నుంచి ఆప్రాంతాన్ని విముక్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు కఠిన చర్యలు తీసుకోకతప్పదనే సూచనలూ సలహాలూ వినబడుతున్నాయి.

ఇంకా ఎక్కువగా పోలీసు, పారా మిలిటరీ బలగాలను వాడాలనీ, ఈ అరాచకాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలనీ వాదిస్తున్న వారు చూపుతున్న చికిత్స అసలు వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది గాని పరిష్కరించదు. ఎందువల్లనంటే అసలు అక్కడ సమస్యే ఆదివాసి ప్రజానీకం మీద పోలీసు అత్యాచారాలవల్ల మొదలయింది.

ఆ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి కనీసం గత ఎనిమిది సంవత్సరాలుగా ఉంది. ఐనా ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి సంచలనాత్మక వార్తలేమీ రాలేదంటేనే ప్రస్తుత సమస్యకు పూర్తి కారణం మావోయిస్టులు కాదని అర్థమవుతుంది. ప్రస్తుత ప్రజాందోళన ప్రధానంగా పులీసీ సంత్రాస్ బిరోధి జన సాధారణేర్ కమిటీ (పోలీసు అత్యాచారాల వ్యతిరేక ప్రజా సంఘం) నాయకత్వంలో నడుస్తున్నది. ఆ పేరును బట్టి చూసినా అక్కడి ఆందోళనకు మూలం పోలీసు అత్యాచారాలు మాత్రమేననే విషయం స్పష్టమవుతుంది. ఈ దేశంలో స్థానికులమీద అధికారం చలాయించడానికి ఒక ప్రజావ్యతిరేక సాధనంగా బ్రిటిష్ పాలకులు తయారు చేసుకున్న పోలీసు వ్యవస్థ 1947 తర్వాత కూడ యథాతథంగా కొనసాగుతోంది. తన పాత ప్రజావ్యతిరేక స్వభావాన్నే కొనసాగిస్తోంది. రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ ఏ రాజకీయ పార్టీలు అధికారానికి వచ్చినప్పటికీ ప్రజలమీద అత్యాచారాలు చేయడమే తమ పని అని పోలీసు వ్యవస్థ అనుకుంటున్నది. పోలీసు వ్యవస్థకు ఉన్న ఆ నమ్మకాన్ని, మితిమీరిన అధికారాన్ని అన్ని పార్టీల ప్రభుత్వాలు పెంచిపోషిస్తున్నాయి. కనుక ప్రభుత్వం తెల్లనిదయినా, నల్లనిదయినా ఎర్రనిదయినా, నీలందయినా ప్రజలమీద పోలీసు అత్యాచారాలు ఒకేరకంగా జరుగుతున్నాయి.
లాల్ ఘడ్ ప్రజల మీద పోలీసు అత్యాచారాలు ప్రత్యేకంగా జరగడానికి ఒక ప్రత్యేక సందర్భం కూడ ఉంది. దాదాపు 2005-06 నుంచీ కూడ ఆ ప్రాంత ఆదివాసులు మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నారని కోపంగా ఉన్న సిపిఎం కార్యకర్తలు, పోలీసులు లాల్ ఘడ్ ఆదివాసుల మీద దాడులు చేస్తున్నారు. నిజానికి బెంగాల్ లో సిపిఎం కార్యకర్తలు, పోలీసులు అనే రెండు మాటలకు పెద్ద తేడా లేదు. అనేక చోట్ల పోలీసుల వెంట సిపిఎం కార్యకర్తలు, లేదా సిపిఎం కార్యకర్తల వెంట పోలీసులు కలిసి వచ్చి ప్రజల మీద దాడి చేస్తారు. సిపిఎం హర్మద్ వాహిని అని ప్రత్యేకంగా ఒక హింసాముఠాను నడుపుతోంది.

ఆ దాడులు ఒక పక్కన సాగుతుండగానే ఇదే పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో సాల్బొని అనే చోట ఐదువేల ఎకరాల జిందాల్ స్టీల్ వర్క్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కు శంకుస్థాపన చేయడానికి 2008 నవంబర్ 2 న ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య వెళ్లారు. ఆ అధికార బృందం తిరుగు ప్రయాణంలో  మందుపాతర పేలింది. ఆ మందుపాతర పేల్చింది తామేనని మావోయిస్టులు బహిరంగంగా ప్రకటించినప్పటికీ, ఆ పేలుడు సాకుగా తీసుకుని ఆదివాసులకు బుద్ధి చెప్పాలని పోలీసులు, సిపిఎం – హర్మద్ వాహిని కార్యకర్తలు భావించారు. నవంబర్ 5న చోటో పెలియా, బడో పెలియా, బాష్బెర్, కాటా పహాడీ గ్రామాల మీద పోలీసుదాడులు మొదలయ్యాయి. ముఖ్యంగా చోటో పెలియా గ్రామంలో స్త్రీలమీద పెద్ద ఎత్తున అత్యాచారాలు జరిగాయి. ఆ దాడులలో ప్రజల మీద పోలీసులు జరిపిన అత్యాచారాల విషాద గాథలు బెంగాల్ పత్రికలలో హోరెత్తిపోయాయి. ఎంతమందిని నిర్బంధించారో, ఎంతమందిని చిత్రహింసలు పెట్టారో, ఎంతమంది స్త్రీలపై అత్యాచారాలు చేశారో లెక్కలేదు. పార్థసారథి రాయ్, కౌస్తవ్ డే, అమితాబ్ భట్టాచార్య వంటి సామాజిక శాస్త్రవేత్తలు, పత్రికారచయితలు ఆ విషాదగాథలన్నిటినీ సన్హతి డాట్ కామ్ (www.sanhati.com) అనే వెబ్ సైట్ మీద చాల వివరంగానే ప్రకటించారు.
న్యూయార్క్ లోని సుప్రసిద్ధ సోషలిస్టు పత్రిక మంత్లీ రివ్యూ నడిపే వెబ్ జైన్ లో కౌస్తవ్ డే రాసిన వ్యాసం చదివితే లాల్ ఘడ్ లో పోలీసుల అణచివేత కింద ప్రజాజీవితం ఎంత దుర్భరస్థితికి చేరిందో అర్థమవుతుంది. “స్థానికులతో జరిపిన ఏ కొద్దిపాటి సంభాషణల్లోనైనా అర్థమయ్యేదేమిటంటే పోలీసుల భయోత్పాతం లేకుండా ఒక్కరోజు కూడ గడవని మరో ప్రపంచం అక్కడ రాజ్యమేలుతున్నదని. అక్కడి ఆదివాసులు ప్రతిక్షణం భయంలో బతికే పరిస్థితి కల్పించడానికే వ్యవస్థలోని అన్ని స్థాయిల సంస్థలూ పనిచేస్తున్నట్టున్నాయి. అలా అయితేనే ఆ ఆదివాసులు తమ అభివృద్ధి గురించి ప్రశ్నించాలని కలలో కూడ అనుకోవడం మానివేసి, ఈ రోజువారీ పోలీసు అత్యాచారాలూ హింసలూ లేకపోతే చాలునని అనుకునే పరిస్థితి వస్తుంది.”
అటువంటి భయంకరమైన, దుర్మార్గమైన అత్యాచారాల నేపథ్యంలోనే 2008 నవంబర్ రెండోవారంలో పోలీసు అత్యాచారాల వ్యతిరేక కమిటీ ఏర్పడింది. పోలీసులు ప్రజలమీద చేసిన అత్యాచారాలకు క్షమాపణ చెప్పాలనే 13 డిమాండ్ల పత్రాన్ని ఆ కమిటీ ప్రకటించింది. లాల్ ఘడ్ నుంచి పోలీసులను తరిమేశారు. మళ్లీ పోలీసులు తమ గ్రామాల మీద దాడి చేయకుండా రోడ్లు తవ్వేశారు. గ్రామాలకు రక్షణ కల్పించుకున్నారు, కాపలాలు కాశారు. ఒకరకంగా స్వయంపాలన స్థాపించుకున్నారు. ఆ స్థితిలో స్థానిక అధికారులు కమిటీతో చర్చలు జరిపారు. కొన్ని వెసులుబాట్లు కల్పించారు. క్రమంగా ఆందోళన పొరుగు జిల్లాలయిన బంకురా, బీర్భూమ్ లకు పాకింది. కమిటీ కేవలం పోలీసు అత్యాచారాలకు వ్యతిరేకంగా పనిచేయడం మాత్రమే కాక స్థానిక అభివృద్ధి కార్యక్రమాలలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ అవినీతికి పాల్పడినది స్థానిక సిపిఎం నాయకులే కావడం వల్ల మళ్లీ సిపిఎంకు అది కంటగింపయింది. కమిటీ నాయకత్వాన తమ అభివృద్ధి పనులను తామే నిర్వహించుకుంటామని ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను కూడ ఆదివాసులు ప్రకటించుకున్నారు. ఒకవైపు ప్రజా ఉద్యమంలో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో, ప్రజాస్వామిక, ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహం అమలవుతుండగానే అటువైపునుంచీ ఇటువైపునుంచీ కూడ హింస, దాడులు, ప్రతిదాడులు, హత్యలు, ప్రతీకార హత్యలు జరగడం పెరిగిపోయింది.

మొన్నటికి మొన్న లాల్ ఘడ్ లో పోలీసు స్టేషన్ ను, స్థానిక సిపిఎం నాయకుని భవనాన్ని, సిపిఎం స్థానిక కార్యాలయాన్ని విధ్వంసం చేసిన ఘటనలలో వందలాదిమంది ఆదివాసులు ఉద్రేకంగా పాల్గొన్నారంటే ఆ భవనాలు, వ్యవస్థలు ఎంతగా దోపిడీ పీడనలకు ప్రతీకలుగా నిలిచాయో, వాటిని బద్దలు కొట్టడానికి ప్రజలు ఎంత విస్తృతంగా ముందుకొచ్చారో అర్థమవుతుంది.
ఆ ఘటనలు జరగడానికి వారంరోజుల ముందు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన తొమ్మిది మంది విద్యార్థుల బృందం లాల్ ఘడ్ ప్రాంతంలో రెండు డజన్ల గ్రామాలలో పర్యటించి ఒక నిజనిర్ధారణ నివేదికను విడుదల చేసింది. “మేం లాల్ ఘడ్ వదిలే సమయానికి అక్కడి ప్రజాపోరాటం తీవ్రతరమవుతోంది. ప్రజలు తమ ప్రధాన శత్రువుగా భావిస్తున్న సిపిఎంను, పోలీసులతో సహా ఆ ప్రాంతం నుంచి తరిమేశారు. మేము అక్కడి ప్రజలలో పెద్దఎత్తున ఉత్సాహోద్రేకాలు చూశాం. తాము వోట్లు అడగడానికి వచ్చే ఏదో రాజకీయపార్టీ పావులం కాదనీ, తాము తమదయిన ఒక సంస్థ సభ్యులమనీ ప్రజలు భావించడం మేం చూశాం. వాళ్లు రాజ్యహింస భయం లేని ఒక స్వేచ్ఛాయుత జీవనాన్ని గడుపుతున్నారు. తమ సొంత అభివృద్ధి పథకాలను అమలు చేసుకుంటున్నారు. ‘మా జీవితంలో మొదటిసారి స్వాతంత్ర్యాన్ని చవిచూస్తున్నాం’ అని ఎన్నో గ్రామాల్లో ప్రజలు మాతో అన్నారు. వాళ్ల పోరాటం తరతరాలుగా సాగుతున్న దోపిడీకీ, మోసానికీ, హింసకూ, భయోత్పాతానికీ వ్యతిరేకంగా ఎక్కుపెట్టినది. ఆ రకంగా అది ఒక చారిత్రక పోరాటం. ఎంతో మంది బైటి పరిశీలకులు ‘అరాచకం’గా పిలుస్తున్న ఈ పోరాటం ఒక నిజమైన స్వాతంత్ర్య పోరాటమని మేం దృఢంగా విశ్వసిస్తున్నాం.”

జిందాల్ లకు ఐదువేల ఎకరాలను కట్టిపెట్టడానికి తహతహలాడుతూ, చుట్టుపట్ల ప్రజలను భయోత్పాతంలో ముంచడానికి ప్రయత్నిస్తున్న బుద్ధదేవ్ ప్రభుత్వం ఒకవైపునా, తమ అభివృద్ధికి తామే బాధ్యులు కావాలని ప్రయత్నిస్తున్న ఆదివాసులు మరొకవైపునా ఉన్న లాల్ ఘడ్ చిత్రం ఇది. హింస – అహింసల కళ్లద్దాల లోంచి చూస్తే అది అర్థం కావడం కష్టం.
– ఎన్ వేణుగోపాల్

5 అభిప్రాయాలు

  1. kcube varma 08 జులై 2009 , 8:45 pm

    లాల ఘడ అంతరంగాన్ని చూపారు. కుహనా అహింసా వాదులకు చెంప పెట్టు.

  2. ravindra aitham 20 జులై 2009 , 10:26 am

    ఇన్ని సంవత్సరాల సి.పి.యమ్. పాలనలొ ఆదివాసి ప్రజలు ఎంతగా బాధలకు గురి అయ్యారొ ఇప్పుదు ప్రపంచానికి తెలుస్తుంది , వారికి చెందవలసిన ప్రయొజనాలు సి.పి.యమ్ కార్యకర్థలు దిగమింగారు , ఆ రాష్త్రాన్ని అన్ని విధాల అధొగతి పాలు చెసారు

  3. […] జిందాల్ లకు ఐదువేల ఎకరాలను కట్టిపెట్టడానికి తహతహలాడుతూ, చుట్టుపట్ల ప్రజలను భయోత్పాతంలో ముంచడానికి ప్రయత్నిస్తున్న బుద్ధదేవ్ ప్రభుత్వం ఒకవైపునా, తమ అభివృద్ధికి తామే బాధ్యులు కావాలని ప్రయత్నిస్తున్న ఆదివాసులు మరొకవైపునా ఉన్న లాల్ ఘడ్ చిత్రం ఇది. హింస – అహింసల కళ్లద్దాల లోంచి చూస్తే అది అర్థం కావడం కష్టం. – ఎన్ వేణుగోపాల్http://prajakala.org/mag/2009/07/lalgarh_venu_essay […]

  4. Ram 15 ఆగస్టు 2009 , 8:02 am

    బెంగాల్లో మాదిరి మన ఎపిలో కూడా ఎందుకు సెజ్ కు వ్యతిరేకంగా ఇతర ప్రజాతంత్రవాదులతో కలిసి సామూహిక పోరాటాలసిమావోఇస్టులు నిర్వహించడం లేదు.అభివ్రుద్ధి కార్యక్రమాల్లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే అన్నిపార్టీలు కూడా సహకరించే అవకాశాలున్నాయి.

  5. Leon Rao 22 ఆగస్టు 2009 , 8:52 pm

    శతాబ్దాలుగా మానవ సమాజము లొ అధిక భాగము దొపిడి కి గురి అవుతునె వుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)