కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు-ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులు

ఏ భాషలోనైనా తమ తమ రచనలతో తమకొక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. తెలుగు భాష చేసుకున్న అదృష్టమేమోగాని తెలుగు సాహిత్యంలో విశేషంగా కొనియాడదగ్గ అసమాన ప్రతిభావంతులు ముగ్గురు కొద్ది నెలల తేడాలో వంద సంవత్సరాల క్రితం పుట్టారు. వారే కొడవటిగంటి కుటుంబరావు (కొకు), శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), త్రిపురనేని గోపీచంద్.

ఈ సంవత్సరమంతా తెలుగు నాట అంతటా ఈ ముగ్గురి తెలుగు సాహిత్య కృషిని గుర్తుచేసుకునేందుకు ఎన్నో సాహితీ సమావేశాలు ఇంచుమించు నెలనెలా జరుగుతున్నాయి. వారం మధ్యలో వచ్చే పండగను కూడా వారాంతంలోనే జరుపుకొనే మనకు అంత అవకాశం ఎలాగూ ఉండదు గనుక, డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (DTLC) ముగ్గురి శతజయంతుల్నీ కలిపి ఈ సంవత్సరం సెప్టెంబరు చివరి వారాంతం, అనగా సెప్టెంబరు 26, 27 (శనివారం, ఆదివారం) తేదీల్లో సాహితీ సమావేశాలతో గుర్తు చేసుకునేందుకు తలపెట్టింది. ఇదే సమావేశాల్లో, తెలుగు సాహిత్యానికి విశేషంగా సేవ చేసిన హేమాహేమీలు, నార్ల వెంకటేశ్వరరావు, మగ్దుం మొహియుద్దీన్, చక్రపాణి, మహీధర రామమోహనరావు, రోణంకి అప్పలస్వామి, సుంకర సత్యనారాయణ మొదలైన సాహితీవేత్తల శతజయంతులను కూడా గుర్తు చేసుకుందాం. ఉత్తర అమెరికాలోని తెలుగు సాహిత్యాభిమానులందరికీ డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ తరపున ఈ సమావేశాలకు ఇదే మా ఆహ్వానం!

స్థూలంగా సమావేశ వివరాలు ఇవి: రెండు రోజుల్లో మొత్తం ఐదు సమావేశాలు జరుగుతాయి. ముందు సమావేశం శనివారం (సెప్టెంబరు 26, 2009) ఉదయం ముగ్గురి రచయితల జీవిత విశేషాలపై ఉంటుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి ముగ్గురి రచయితల వారసులూ వస్తున్నారు. ఆ తర్వాత ఒక్కొక్క రచయిత సాహిత్యంపై ఒక్కొక్క సమావేశం శనివారం మధ్యాహ్నం, ఆదివారం ఉదయం జరుగుతాయి. చివరిగా ఆదివారం మధ్యాహ్నం, ఈ ముగ్గురి రచయితల సాహిత్యం, నాటి సమాజం, ఎలాంటి పరస్పర ప్రభావం కలిగి ఉన్నాయన్న విషయంపై చర్చ ఉంటుంది. కొకు సాహిత్యంపై సమావేశానికి ఆచార్య గోపరాజు లక్ష్మి, శ్రీశ్రీ సాహిత్యంపై సమావేశానికి శ్రీ వెంకటయోగి నారాయణస్వామి, గోపీచంద్ సాహిత్యంపై సమావేశానికి కన్నెగంటి చంద్ర గార్లు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రసంగించడానికి, పాల్గొనడానికి ఉత్తర అమెరికా నలుమూలల నుండి, భారత దేశం నుండి కూడా ఎందరో తెలుగు సాహిత్యాభిమానులు రానున్నారు.

గత సంవత్సరం సెప్టెంబరులో మా డిట్రాయిట్ లిటరరీ క్లబ్ పది సంవత్సరాల పండుగ సమావేశాలకొచ్చిన సాహితీ మిత్రులందరికి అభివందనాలు తెలుపుకుంటూ, ఈ సెప్టెంబరులో మళ్ళీ రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకూ మా సమావేశాలకు రావడానికి అవకాశం కలగని మిత్రులకు, వచ్చి వట్టి హృదయాలతో వెళ్ళరని మాత్రం హామీ ఇస్తున్నాం! ఇంటర్నెట్ పత్రికలు, రచ్చబండ వంటి సమూహాల్లో ఎలక్ట్రానిక్ గా పరిచయమైన మిత్రుల్ని ముఖతః కలుసుకునే అవకాశం వదులుకోరని విశ్వసిస్తున్నాం.

తెలుగు భాషాభిమానం తప్ప, ఈ సదస్సుల్లో పాల్గొనడానికి ఎలాంటి ప్రత్యేక అర్హతా, రుసుమూ కూడా అవసరం లేదు. భోజన వసతితో సహా సమావేశాలు, శనివారం (సెప్టెంబరు 26, 2009) సాయంత్రం జరిగే విందు, వినోద కార్యక్రమాలు కూడా (డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సహకారంతో) తెలుగు సాహిత్యాభిమానులకు ఉచితమే. పైగా డిట్రాయిట్‌కు దూర ప్రాంతాలనుండి వచ్చే సాహిత్యాభిమానులకు వీలైనంతలో ఆ రెండు రోజులూ సభ్యుల ఇళ్ళలో గృహ వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఐతే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడనికిగాను వచ్చేవారు మాకు సెప్టెంబరు 10, 2009వ తేదీ లోగా తెలియజేయాలి. వీలైనంత త్వరలో రిజిష్టరు చెయ్యండి. మీరు రిజిష్టరు చెయ్యడానికి వీలుగా క్రింద లింకు ఉంది. విందు, వినోద కార్యక్రమాల్లో ప్రత్యేకతగా స్వీయ రచనా పఠనం కూడా ఉంటుంది. స్వీయ రచనా పఠనం చెయ్యదల్చుకున్నవారు సెప్టెంబరు 10 లోగా తెలియజేయాలి. అన్ని వివరాలకు detroittelugu@comcast.net కు ఈమెయిల్ చెయ్యండి. మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరు రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.

మరిన్ని కార్యక్రమ వివరాలు, త్వరలో ….

డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)