శ్రీకాకుళం, ఆగస్టు 15 (ఆన్‌లైన్): సామాజిక చైతన్యానికి సాహితీ స్ఫూర్తి నిచ్చిన మహోన్నత రచయిత కొడవటిగంటి కుటుంబరావు అని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎఎస్ ఇళంగోవన్ అన్నారు. శ్రీకాకుళంలో శనివారం సాహిత్య అకాడమీ, కథానిలయం, శ్రీకాకుళ సాహితీ సంయుక్త నిర్వహణలో కొడవటిగంటి కుటుంబరావు నూరేళ్ల సాహితీ సంబరాలు ప్రారంభమయ్యాయి.
సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇళంగోవన్ మా ట్లాడుతూ అర్ధ శతాబ్దానికిపైగా తన అక్షర్రాస్తాలతో మధ్యతరగతి, బడుగు వర్గాల సముద్ధరణ కోసం పోరాడిన కొడవటిగంటి కుటుంబరావు బహుముఖ రూపాల్లో తన సాహితీ సృజనను కొనసాగించారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సుల్లో ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు మాట్లాడుతూ పాఠకుడిని తనతో, సమాజంతో నడిపించేదే నిజమైన సాహిత్యమన్నారు.
కొడవటిగంటి చనిపోయేంత వరకు ఏ పత్రిక చూసినా ఆయన రచనలే కనిపించేవన్నారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహా సమితి సభ్యురాలు చాగంటి తులసి మాట్లాడుతూ కొడవటిగంటి రచనలన్నింటిలోనూ శాస్త్రీయ దృక్పథం అంతర్భాగంగా ఉందన్నారు. ముదిగంటి సుజాతరెడ్డి మాట్లాడుతూ తన జీవితకాలంలో జరిగిన పరిణామాలకు కొడవటిగంటి అక్షర రూపం ఇచ్చారని చెప్పారు.
ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ కొడవటిగంటి రచనల్లో మార్క్సిస్టు దృక్పథం ప్రతిబింబిస్తుందని ఇదే ఆయన సాహిత్యానికి జీవధారగా నిలిచిందన్నారు. ప్రముఖ రచయిత వెలగా వెంకటప్పయ్య మాట్లాడుతూ చందమామ సంపాదకునిగా కొడవటిగంటి అపారమైన బాలసాహిత్యానికి ప్రోత్సాహాన్ని ఇచ్చారని, బాలల్లో మానసిక వికాసాన్ని కలిగించడానికి అనేక కథలు రాశారని చెప్పారు.
కొడవటిగంటి సాహిత్యంలో స్త్రీవాదం అనే అంశంపై కేఎన్ మల్లేశ్వరి మాట్లాడుతూ సమాజంలో కుటుంబంలో స్త్రీలు వివక్షకు గురవుతున్న వైనాన్ని ఆయన చిత్రించారని అన్నారు.ప్రముఖ కథారచయిత మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ కొడవటిగంటిది విలక్షణమైన రచనాశైలి అన్నారు. సరళమైన పదాలతో సూటిగా పాఠకునికి అర్థమయ్యేలా ఆయన కథలు, నవలలు, వ్యాసాలు ఉంటాయని తెలిపారు.
ప్రముఖ సాహితీ విమర్శకులకు సీఎస్‌వి ప్రసాద్‌వర్మ మాట్లాడుతూ సామ్యవాద దృక్పథాన్ని తన రచనల్లో విరివిగా ఉపయోగించి ప్రజల మనోభావాల్లో విప్లవాన్ని తీసుకురావడానికి కొడవటిగంటి కృషి చేశారన్నారు. ప్రముఖ నటుడు, రచయిత కాకరాల మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొడవటిగంటి తనదైన ముద్ర వేశారన్నారు. తొలిరో జు కార్యక్రమాల్లో రచయితలు చింతా అప్పలనాయుడు, దాసరి రామచంద్రరావు తదితరులు కొడవటిగంటి కథలను చదివారు. ప్రముఖ రచయితలు వివిన మూర్తి, అట్టాడ అప్పలనాయుడు, నాగసూరి వేణుగోపాల్, బివిఎ రామారావునాయుడు, కవన శర్మ తదితరులు పాల్గొన్నారు.
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేదీ: 16 ఆగష్టు 2009
ప్ర జాకళ ద్వారా మీరు చేస్తున్న సాహిత్యసేవ ఎంతో అపూర్వం . నాకు ఈ వెబ్ సైటు గురించి ఆలసంగా తెలిసింది . తప్ఫ కుండా నా సహకారం అందిస్తాను. మీకు అభినందనలు. శుభాకాంక్శలు
అత్త లూరి విజయలక్శి