పుట్టిందీ, పెరిగిందీ సనాతన సంప్రదాయ యఙ్ఞ యాగాదులు చేసుకునే కుటుంబంలోనే అయినా, అభ్యుదయ భావాలతో జీవించి అనేక ఉద్యమాల్లో పాల్గొని, ఆ జీవిత సారాంశాన్ని అందిస్తున్నట్లుగా అనేక నవలలు రాసిన రచయిత మహీధర రామ మోహనరావు.

తూర్పుగోదావరిజిల్లా కోనసీమ ప్రాంతంలోని ముంగండలో 1909 న మహీధర రామ మోహనరావు జన్మించారు. వీరి తాత ముత్తాతలు అందరూ వేద పండితులు. తండ్రి బ్రహ్మ సమాజ ప్రభావం గలవాడు కావడం వల్ల తన కొడుక్కి రామమోహనరావు అనే పేరు పెట్టుకున్నాడు. ఆ తండ్రి దగ్గరే రామమోహనరావు ఎక్కువగా చదువుకున్నారు. తరగతి గదుల కంటే గ్రంథాలయాల్లోనే ఎక్కువగా గడిపేవారు. గాంధీజీ సహాయ నిరాకరణ పిలుపు ప్రభావంతో హైస్కూల్ విద్య మధ్య లోనే ఆగి పోయింది. దానితో ఉద్యమాల వైపు అడుగులేశారు. ఆ ఉద్యమాలే విద్యాలయాలుగా హిందీ, రష్యన్, ఇంగ్లీష్, ప్రెంచ్, బెంగాలీ మొదలైన భాషల్ని నేర్చుకున్నారు. మొదట కాంగ్రెస్ వాదిగా, ఆ తరువాత కాంగ్రెస్ సోషలిస్టుగా, చివరికి కమ్యునిష్టుగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు.

మహీధర రామ మోహనరావు సుమారు 15 నవలల్నిరాశారు. అనేక రచనల్ని అనువదించారు. 1954 లో రథ చక్రాలు; 1956లో ఓనమాలు; 1957 లో మృత్యువునీడల్లో; 1959l లో ఎవరికోసం;1960 లో కత్తుల వంతెన; 1965 లో కొల్లాయిగట్టితేనేమి?; 1969 లో స్వయంవరణం; 1972 లోఅగ్ని గుండం; 1984 లో దేశంకోసం; 1993 లో జ్వాలాతోరణం నవలల్ని గ్రంథ రూపంలో వెలువరించారు. రథ చక్రాలు నవల 1948 లోనే రాసినా అది 1954 కి గాని గ్రంథ రూపంలోకి రాలేదు. మిగిలిన రచనలు కూడా వివిధ పత్రికల్లో సీరియల్ గా వచ్చినా, గ్రంథరూపంలోకి రావడం మాత్రం ఆలస్యమైంది. వీటితో పాటు ” ఆ కథ అంతే” వంటి కథలను రాశారు. మబ్బుతెర, పరిష్కారము వంటి నాటకాల్నికూడా రాశారు. మరికొన్ని అభ్యుదయ రచనలను అనువదించారు. తన స్వగ్రామం ముంగండలో విశ్వసాహిత్యమాలను స్థాపించి, దాని ద్వారా మార్క్సిస్టు గ్రంథాలను అనువాదం చేసి, ఆ భావాల్ని ప్రచారం కల్పించేవారు. కమ్యూనిస్టు నిషేధ కాలంలో రాయలసీమలో రహస్య జీవితాన్ని గడిపారు. పీడితుల పక్షాన నిలబడిన మహీధర రామమోహన రావు తాను పుట్టి పెరిగిన ప్రాంతం కాకపోయినా, తెలంగాణాలో జగిరిన సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ, ఆ చారిత్రక నేపథ్యాన్ని ఓనమాలు నవలలోఎంతో విపులంగా రాశారు. ఆయన రాసిన రచనలన్నీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమ పరిస్థితుల్ని, నాటి ప్రజల పోరాట పటిమనీ కళ్ళకు కట్టినట్లు వివరిస్తాయి.

మహీధర నవలల్లోని ముఖ్యాంశాలు:
“తూర్పు గోదావరి జిల్లాలోని ఒక విస్మృత ప్రాంతంలో తాను భాగస్వామిగా ఉండిన పరిణామాలు కేంద్రంగా స్వాతంత్రోద్యమ తీరుతెన్నుల్ని, ఆ ప్రాంత తెలుగు సమాజంలో కలిగిన సామాజిక చలనాన్ని స్వాతంత్రానంతరం కాలంలోమహీధర ” కొల్లాయి కట్టితే్నేమి”, “దేశం కోసం”, “జ్వాలా తోరణం” అనే నవలాత్రయంగా రచించార'’ని ఆ రచనల గురించి రాస్తూ ప్రముఖ విమర్షకుడు బి. సూర్య సాగర్ పేర్కొన్నారు ( ప్రజాసాహితి, జులై 2000;13 )

” కొల్లాయి గట్టితేనేమి” 1920 వ సంవత్సరంలో గాంధీ సహాయ నిరాకరణోద్యమ నేపథ్యాన్ని, “దేశం కోసం” 1935-39 కాలానికి, “జ్వాలాతోరణం” 1939 -45 కాలానికి చెందిన ఇతివృత్తాలతో కూడిన నవలలు. ప్రపంచ యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాత్ర, అంతర్జాతీయ ప్రభావం వంటి వన్నీ వీటిలో కనిపిస్తాయి. మరింత స్పష్టంగా చెప్పుకోవాలంటే, గాంధీ సంస్కరణ వాదం “కొల్ల్లాయి గట్టితినేమి” లోనూ, కమ్యూనిస్టు పోకడల్ని”దేశం కోసం” లోనూ, సామ్యవాద వాస్తవికతను “జ్వాలా తోరణం” లోనూ ఆయన వివరించారు. “కొల్లాయి గట్టితేనేమి” లో కథానాయకుడు రామనాథం ఆ సంస్కరణ భావాల ప్రభావంతో నాడు హరిజనులని పిలిచే దళితులకు తన తోటలోని మంచినీటి బావిని తాగునీటి కోసం కేటాయిస్తాడు. రామనాథానికి, గాంధీ ఉద్యమం కోరేదేమిటో స్పష్టంగా తెలియక పోయినా, గాంధీ సంస్కరణ భావాల్ని ఆచరించే పాత్రగా కనిపిస్తాడు. ఈ నవల లక్ష్యాన్ని వ్యాఖ్యానిస్తూ బి.సూర్య సాగర్ ఇలా అన్నారు.” కొల్లాయి గట్టితేనేమి ” లో సంస్కరణ వాదము కేంద్ర దృక్పథంగా ఉన్నది.స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ మార్గం యొక్క నిస్సారతను ఆ నవలలో పసికట్టడం కష్టమేమి కాదు. అయితే ఆ నిస్సారతను వెల్లడించడం మహీధర లక్ష్యం కాక పోవచ్చు (ప్రజాసాహితి , జూలై .2000 14) అందువల్లనే మౌలికమైన మార్పుల్ని గాంధీ సంస్కరణ వాదం కలిగించ లేక పోయిందనీ, రామనాథం దళితులుకు బావిని కేటాయించినా, దానిపై హక్కుని సాధించలేక పోయారని స్పష్టంగా దీన్ని బట్టి తెలుస్తుంది.
ఓనమాలు నవలలో కథావస్తువు:

తెలంగాణలో జరిగిన విప్లవ పోరాటాన్ని మూడు దశలుగా విభజించు కోవచ్చు.1930 నుండి 1944 వరకు ఆంధ్ర మహాసభ పరిణామం చెందుతూ, భాషా సాంస్కృతిక ఉద్యమం తో పాటు రైతాంగ సమస్యలపై ఆందోళన, పోరాటం చేసే స్థితికి, ఆ తరువాత మిలిటెంటు ఉద్యమ స్థాయికీ అభివృద్ధి చెందిన మొదటి దశ
నిజాం రెవెన్యూ పోలీసుల అధికారుల దౌర్జన్యాలు, దేశంలో భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోలీసు, రజాకార్లను, ఎదుర్కొనటం, సాయుధంగా దున్నేవానికే భూమిని రైతాంగమే అమలు పరచుకుంటూ, గ్రామ రాజ్యాలను ఏర్పరచు కోవటం, ఈ దశలోనే సుమారు 3000 గ్రామాలలో నిజాం ప్రభుత్వం లేకుండా స్థానిక స్వరూపాలను నెలకొల్పుకోవటం జరిగింది. ఇది 1944 నుండి 1948 సెప్టెంబర్ లో యూనియన్ సైన్యాలు పోలీసు యాక్షన్ పేరుతో ప్రవేశించే దాకా సాగింది. ఇందులో రెండు సంవత్సరాలు సాయుధంగా సాగింది. దీన్ని రెండవ దశగా చెప్పుకోవచ్చు. మూడవ దశ భూమిని కాపాడుకొంటూ యూనియన్ సైనిక బలాన్ని ఎదుర్కొంటూ, గెరిల్లా రైతాంగ పోరాటం వరకు సాగినదశ మూడవది. అది 1948 నుండి 1951 వరకు సాగింది. దీనిలో మొదటి దశకు చెందిన నవల ఓనమాలు. దీన్ని 1956 లో రాశారు. రచయితే దీనిలోని కథావస్తువుని ఇలా వివరించారు.
” …నాటి తెలంగాణ ఒక అగ్ని గుండం. దుస్సహనమైన జాగీర్దారీ వ్యవస్థను నిర్మూలించగల పోరాటాల్నిప్రజానీకం కొనసాగిస్తుంది. వాటినన్నింటినీ ఒకే జెండా కిందికి తెచ్చి, రాజకీయ నాయకత్వం సమకూర్చడానికై ఆంధ్రమహా సభా, కమ్యునిష్టు పార్టీ సన్నహాలు సాగిస్తున్నాయి.

రెండో వైపున విదేశీ పాలనకు, సంస్థానాధీశుల నిరంకుశ పాలనకూ వ్యతిరేకంగా జాతీయ ప్రజాతంత్ర పోరాటాలు తెలంగాణాని అలుము కుంటున్నాయి. ఈ దశలో ……. విచ్చిన్నమై పోతున్న జాగీర్దారీ వ్యవస్థను రక్షించ గల శక్తి నిజాము ప్రభుత్వానికి లేదని గ్రహించిన భూస్వామ్య వర్గం, నూతన నాయకత్వం కొరకు వెతుకులాడుతూ జాతీయోద్యమంలో తనకు రక్షణ ఇవ్వగల శక్తుల్ని చూసుకుంది. సమాజంలో నిజాము సర్కారు తనకున్న బలం క్రమంగా క్షీణించి పోతూంటే కూలి పోతున్న తన అధికారాన్ని పరిరక్షించు కొనేటందుకై మత వాదుల్ని, రౌడీల్ని సమీకరించీ విధ్వంస కాండకు పూనికొంది. ప్రజానీకానికీ, ప్రగతినిరోధక శక్తులకు మధ్య జరిగిన ఈ ఘర్షణలతో తెలంగాణా ఒక అగ్నిగుండమే అయ్యింది. ఆనాటి సంఘర్షణలే యీ నవలకు కథావస్తువు”

“ఓనమాలు” కథా సారాంశం :
తనకంటగట్టిన రోగిష్టి భర్త పెళ్ళైన ఏడాది తిరగకుండానే చనిపోవడంతో వితంతువవుతుంది సత్తెమ్మ. తన పొలంలో పనిచేసే వెంకటయ్యను కొన్నాళ్ళ తర్వాత ఇష్టపడి పెళ్ళి చేసుకుందామనుకుంటుంది. తల్లి పేరమ్మ, తమ్ముడు రంగయ్యలకు అది ఇష్టం లేదు. గ్రామం కూడా ఆ పెళ్ళిని వ్యతిరేకిస్తుంది.
‘వెంకటయ్య ‘ ఆంధ్ర మహా సభలో సభ్యుడు. ఆ సభని ‘ సంగం ‘ అని పిలుస్తుంటారు. దాన్ని దొరల, జాగిర్దారీల పోలీసుల దురాగతాల్ని వ్యతిరేకిస్తున్నందువల్ల ఆ సంగం నాయకుడు, మరి కొంతమంది సభ్యులు్ కలిసి సత్తెమ్మ చేసే బోళ్లపొలంలో సమావేశమవుతుంటారు. నిజాం ప్రభుత్వం ఎన్ని నిర్భంధాలు పెట్టినా, అక్షరాలు నేర్చుకునే ఓనమాల పుస్తకాల్ని కూడా తగల బెట్టినా రహస్యంగా అక్షరాలు నేర్చుకునేవారు. ‘ప్రజాశక్తి’ పత్రికను రహస్యంగా చదువుకునే వారు. అందులో వెట్టినిర్మూలన గురించి రాసే వార్తలు ‘ సంగం’ సభ్యులకెంతో ఆనందాన్ని కల్గించేవి.
దొర శివరామిరెడ్దిని అందరూ పెద్దరెడ్ది అని పిలుస్తారు. అతనికి రమణారెడ్డి, రఘునందనుడు అనే ఇద్దరు కొడుకులున్నారు. సుమిత్ర కూతురు. పెద్ద కొడుకు సర్కిల్ ఇనస్పెక్టర్. అతడు చాలా దుర్మార్గుడు. రెండవ కొడుకు రఘునందనుడు. తాను అమెరికా ప్రభావం గల ఆర్ధికవేత్తగా కావాలని ఆశపడుతుంటాడు. యంత్రాలతో వ్యవసాయం చేసి దేశాన్ని బాగు చేయాలనే దేశభక్తి అతనిది. దున్నే వానికి భూమి దక్కాలని కమ్యూనిస్టులంటుంటే, యంత్రాలతో ఎన్ని వేల ఎకరాలైన దున్నించగల సమర్థత తనేకే ఉందని అందువల్ల తనకే వేలాది ఎకరాలు దక్కాలంటూ మార్క్స్ సిద్ధాంతాన్ని వక్రీకరించగలిగిన సామర్థ్యం గలిగిన వాడు.
అప్పటికే, సత్తెమ్మ తమ్ముడు రంగయ్య ‘లా’ చదివాడు. అతడూ సంస్కరణల గురించి మాట్లాడుతుండే వ్యక్తే. కానీ, ఇంట్లో అలాంటి సంస్కరణల్ని అమలు చేయాటానికి ఇష్టపడడు.అందుకే తన అక్క సత్తెమ్మ, పాలేరు వెంకటయ్యని పెళ్ళి చే్సుకోవాలనుకుంటే వ్యతిరేకిస్తాడు. మధ్యతరగతి మేధావిఆలోచనలన్నీపుణికి పుచుకున్నవాడు. సమయానుకూలంగా ప్రవర్తించగలిగే నేర్పున్నవాడు.
సత్తెమ్మే ఏకైక దిక్కై పొలం చూసుకొనేది. వాళ్ళ తాత ముత్తాతలకు ‘దొర’ గారి తాతలు ఇచ్చిన ఆ భూమిని శ్రద్దగా బాగు చేయించేది. వెంకటయ్యతో ‘సంబంధం’ చెడిపోయినా, ఆ తర్వాత పొలం గురించి పట్టించుకోక పోయినా, వెంకటయ్య సూచన మీద సరయ్యను పాలేరుగా పెట్టి, అప్పుడపుడు పొలం చూసి వచ్చేది. సరయ్య పాలేరుగా ఉండటం వల్ల వెంకటయ్య, వాళ్ళ’ సంగం’ సభ్యులు రాత్రి వేళలో అక్కడ మీటింగులు పెట్టుకోవడానికి వీలు చిక్కేది. త్వరలో కూలీ రాజ్యం వస్తుందని అప్పుడు అందరి సమస్యలు తీరిపోతాయాని చర్చించుకుని సంతోషపడేవారు.
నైజాము అండను చూసుకొని పోలీసులు, ఉద్యోగులు, గ్రామ ప్రజల ధన, మానాల్ని దోచుకునేవారు.
ఆచారం పేరుతో కట్నకానుకల్నిబలవంతంగా వసూలు చేసే వారు. ఇవ్వకపోతే శిక్షించేవారు. గొల్లల దగ్గర పాలు, మేకలు లాక్కునేవారు. గ్రామాల్లో కనీస అవసరాలు కూడా కల్పించే వారు కాదు. పాఠశాల, ఆసుపత్రి వంటి సౌకర్యాలేమీ కల్పించే వారు కాదు.
మరో వైపు దొర కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఆ బాధ్యతలు నిర్వహించడం నచ్చక, వాటిని మానేసి యంత్రాలతో వ్యవసాయం చేయించాలనుకుంటారు. చిన్న కమతాలు ఉండటం వల్లే దేశాభివృద్ధి జరగడం లేదంటారు. దాన్నే తండ్రి ప్రోత్సహిస్తుంటాడు.
ఒక రోజు రంగయ్యని పిలిపించి దేశాభివృద్ధి కోసం తామంతా పెద్ద పెట్టున పాటు పడాలని భావిస్తున్నట్లు చెప్పి, తమ తాత ముత్తాతలు వాళ్ళకిచ్చిన భూమిని తిరిగి ఇచ్చేయమంటాడు. అంతవరకు ఆ వ్యవసాయాన్ని చేసుకోవడం వల్లే వాళ్ళ కుటుంబమంతా అభివృద్ధిలోకి వచ్చిందని చెప్తాడు. ఆ విధంగా రంగయ్య చదువుకోవడానికి, వాళ్ళ కుటుంబం అభివృద్ధిలో ఉండటానికి తమ తాతలిచ్చే భూమే కారణమని స్పష్టం చేస్తాడు. ఇంక ఆ భూమిని తిరిగి ఇచ్చేస్తే దేశాభివృద్ధికి పాటు పడతానంటాడు. దాంతో రంగయ్య ఖంగు తింటాడు.
దొర తమ పొలం తిరిగిచ్చేయమనడానికంతటికీ సత్తెమ్మ రెండో పెళ్ళి చేసు కోవాలనుకోవటమే కారణమై ఉంటుందని తల్లి వీరమ్మ చెప్తుంది. అందుకు పరిహారంగా కొంత ఏదైనా ఇచ్చి క్షమించమని అడగాలని కూడా సలహా ఇస్తుంది. ముందు అది నిజమను కుంటాడు రంగయ్య. కానీ, ఆచారాల పేరుతో కట్న కానుకల్ని బలవంతంగా లాక్కునే అలవాటు దొరలకు మామూలే కదా అని తన స్కూలు నాడు బహుమానాల్ని బలవంతంగా తీసుకోవడాన్ని, తాను వాటిని వ్యతిరేకించి రోజుల్ని గుర్తుచేసుకుంటాడు.
ఈ సంగతి విని సత్తెమ్మ పెద్దరెడ్ది (దొర)నే అడిగేయాలనుకుంటుంది. వాళ్ళింటికి వెళుతుంది. ఇంటిలో దొర లేక పోయినా, వాళ్ళమ్మాయి సుమిత్ర ఉంటుంది. దొర కొడుకులుంటారు. సుమిత్రకు విషయాన్ని చెప్తుంది. వాళ్ళు ఎంత కష్టపడి ఆ పొలాన్ని బాగుచేసుకున్నారో ఆమె వాళ్ళన్నయ్యలకు చెప్పి, ఆ పొలాన్ని మళ్ళీ మనం లాక్కోవాలనుకోవడం సరికాదని చెప్పాలనుకుంటుంది. కానీ, వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ తండ్రి బాటాలోనే నడుస్తుంటారు.
మరో వైపు రంగయ్య తన లాయరైన మామగారు గోపాలరావుని కలిసి కోర్టుకి వెళ్ళాలను కుంటారు. కానీ, గోపాలరావు అది అంత సులువుగా తేలే విషయం కాదని అనేక ఉదాహరణలతో వివరిస్తాడు.
ఇంటికి వచ్చే లోగా తమ పొలాన్ని దొర మనుషులు స్వాధీనం చేసుకోవటానికి వచ్చినట్లు, దాన్ని తన అక్క సత్తెమ్మ, ఊరి ప్రజలు కలిసి ఎదుర్కొన్నట్లు విని సంతోషడతాడు.
దొర ప్రజల తిరుగుబాటుని గమనించి, తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. వెంకటయ్యని పిలిచి సత్తెమ్మకే ఆ పొలం ఇవ్వాలనుకుంటున్నాననీ, ఆ విషయం ఆమెతో చెప్పక పోవడం వల్లనే ఆమె అపార్థం చేసుకుందనీ చెప్తాడు దొర. సత్తెమ్మను వెంకటయ్య పెళ్ళి చేసుకుంటే సహకరిస్తానని హామీ ఇస్తాడు తప్ప, గతంలో వాళ్ళదగ్గర లాక్కున్న భూమినిస్తానని మాటమాత్రం కూడా అనడు.
ఆ మాటల్లోని కుట్రను వెంకటయ్య గమనిస్తాడు. ఈ లోగా ఖాశీం రజ్వీ ముస్లిము ల కోసం పోరాడుతున్న గొప్ప వ్యక్తి అనీ, హిందువుల నుండి ముస్లిము లు రక్షించబడాలంటే, నైజాం ప్రభుత్వమే ఉండాలని, లేకపోతే ముస్లిము లు బతకలేరని, అందుకనే “ఆజాద్ హైదరాబాదు” కావాలని తామంతా పోరాడుతున్నట్లు తామంతా ముస్లిముల రక్షణ కోసమే జీవిస్తున్నట్లు బుడాన్ ప్రచారం చేస్తుంటాడు .
మరో వైపు ఇండియన్ యూనియన్ లో కలవకుండా “హైదరాబాదు ఒక ప్రత్యేక దేశం” గా ఉండాలని నిజాం భావించడం, దాన్ని వ్యతిరేకించే ప్రజల్ని భయ భ్రాంతుల్ని చేయటానికి ఢిల్లీ నుండి ఆయుధాల్ని రప్పించి అల్లకల్లోలం చేయడం వంటి అకృత్యాలు చేయిస్తుంటాడు.
ఖాశీం రజ్వీ ప్రజల్ని భయ భ్రాంతులకు గురి చేస్తున్నా, చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది నైజాం ప్రభుత్వం.
ఒక రోజు కొంత మంది ఊరి మీదకు ఆయుధాలతో వచ్చి ఊరేగింపు చేసి, అందరిచేత ” ఆజాద్ - హైదరాబాదు” అని బలవంతంగా నినాదాల్ని ఇప్పిస్తుంటారు.
రోడ్డు పక్కన ఉన్న ఒక ముసలి వాడైన ముష్టివాడ్ని కూడా అలాగే చెప్పమంటారు. అతడికి నోరు తిరగదు. అయితే అతను వ్యతిరేకిస్తున్నాడనుకుని, తాగేసి చిందులు తొక్కుతున్న ఆ ఊరేగింపులోని ముస్లిము లు ఆ ముసలి వాణ్ణి నరికేస్తారు.
రక్తం కారడం చూసి, అతను చనిపోయాడని తెలిసి, ఆ ఊరేగింపులోని కొంత మంది వెనక్కి పరుగుతీస్తారు. అది చూసి ఊళ్ళో ప్రజలు ఆ ముసలివాడి దగ్గరకు వెళ్ళడం, ఆ జనాన్ని చూసి ఊరేగింపు చేస్తున్న జనం తమని కొట్టడానికొస్తున్నారని అనుకొని పారిపోతారు. ఆ తర్వాత ఆ ముసలి వాడి శవాన్ని ఊరేగింపుగా తీసుకెళతారు. ఆ ఊరేగింపులో సంగం నాయకులు కూడా పాల్గొంటారు. ప్రజలకు నైజాం వైపు వ్యతిరేకతను, యూనియన్ ప్రభుత్వం పట్ల సానుకూలతను కల్గిస్తారు.ఈ సంఘటన జరిగిన తర్వాత దొర పెద్ద కొడుకు సర్కిల్ ఇన్ స్పెక్టర్ కొంత మందిని అరెస్టు చేసి, వారిని హింసిస్తుంటాడు. వెంకటయ్యను అరెస్టు చేస్తాడు. ” సంగం” నాయకులు ఎక్కడుంటారో చెప్పమని వేధిస్తుంటాడు.
ఈ లోగా సత్తెమ్మ, కొంతమందిని వెంటేసుకొచ్చి వాళ్లందరితో తిరుగుబాటు చేస్తుంది.చాకలి మంగమ్మ అక్కడున్న తుపాకీని తీసి దొరలపై గురి పెడుతుంది. జనం ఏకమవుతారు. దొరలు పారిపోతారు. నవల ముగుస్తుంది.

ఓనమాలు నవల ప్రత్యేకత:
తెలంగాణ ప్రాంతంలో నైజాం ప్రభుత్వం, దాన్ని బూచిగా చూపి పోలీసులు, జాగీర్థారులు, కొంతమంది ముస్లింలు చేసే అకృత్యాలు, దుర్మార్గాల్ని అవగాహన చేసుకోడానికి ‘ఓనమాలు’ నవల ఎంతగానో సహకరిస్తుంది. అప్పుడు జరిగిన చారిత్రక సంఘటనలన్నీ సన్నివేశాలుగా, పాత్రలుగా రూపొందించటంలో రచయిత మహీధర రామ్మోహనరావు ప్రదర్శించిన సృజనశీలత ప్రశంసనీయం. ఒక కుటుంబంలో జరుగుతున్న కథనే చెప్తున్నట్లున్నా, ఆ సంఘటనల తీవ్రతను అద్భుతంగా వర్ణించి ఆ సమస్యల్ని ఒక కుటుంబానికే పరిమితమైనవి కాదని పాఠకుడు గ్రహించేటట్లు, ఆనాటి చారిత్రక సంఘటనల్ని అర్థంచేసుకునేట్లు నవల్ని అద్భుతంగా కొనసాగించారు.

తెలంగాణలో ఉర్దూ, పారశీక భాషల ఆధిపత్యం మధ్య నలిగిపోయిన తెలుగు భాష “ఓనమాలు'’ నేర్చుకోవాలన్నా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుందో దొంగబాటుగా “ఓనమాలు” పుస్తకాన్ని తెచ్చుకొని, సత్తెమ్మ చేసే బోళ్ల పోలంలో సంగం సభ్యులు రహస్యంగా చదువుకోవటం తెలుపుతుంది. ఆ పుస్తకం కూడ దొరల మనుషులు చింపేస్తుంటే కొన్ని కాగితాలు దాచుకున్నారట! నిజానికీ నవలలో ఓనమాలు అక్షరాలు నేర్చుకోవడానికి పడిన ఇబ్బందులను చెప్పడానికే కాదు. తెలంగాణా పోరాటానికి ఓనమాలు దిద్దిన సంఘటనలను చెప్పడం నవల ప్రధాన ఉద్దేశ్యం.

నాడు ఆంధ్ర మహాసభ కల్గించిన చైతన్యం విప్లవాత్మకమైంది. పేద వర్గాల సమస్యల్ని పోరాట పంథాలో భాగం చేయ గలగడం వల్ల మరింత శక్తివంతంగా ” సంగం” సామాన్య జన వ్యవహారంలోకి రాగలిగింది. చిలుకూరులో వెట్టి వ్యతిరేక తీర్మానం చేసినా, దాన్ని భువనగిరి మహాసభ కార్య రూపంలో పెట్టిన తర్వాత సంగం సామాన్య జనంలోకి చొచ్చుకుపోగలిగింది. అనేక ప్రాంతాల్లో జరిగిన వెట్టి వ్యతిరేక పోరాటాల్ని “సంగం” ప్రోత్సహించింది. ఆ వార్తల్ని ప్రజాశక్తి పత్రికలో అందిస్తుంటే, వాటిని రహస్యంగా మరో వారం రోజుల తర్వాత నైనా చదివి చైతన్యం పోందే వారంటే సంగం, ఆ పత్రికలు తెచ్చిన చైతన్యం ఎంత గొప్పదో తెలుస్తుంది.
“సంగం” అన్ని కుల వృత్తుల వాళ్ళనీ ఐక్యం చేసి నిర్భంధ చాకీరి నుండి విముక్తి కలిగించాలని ప్రయత్నించింది. “సంగం” సభ్యుల మీద ఎన్నినిషేధాలు ఉన్నా చాకలి మంగమ్మ వంటి వాళ్ళు ఆ నాయకుల్ని కాపాడేవారని తెలుస్తుంది. ఆ నాయకులు కూలీరాజ్యం వస్తుందనే వారు. అప్పుడు అణగారిన వర్గాల వారే పాలకులవుతారని, వారి సమస్యల్ని వాటి పరిష్కారాల్ని వారి చేతనే చెప్పించటం వలన సంగం సభ్యులు ఎలాంటి కార్యా చరణను కొనసాగించే వారో అర్థమవుతుంది. వెంకటయ్యను సత్తెమ్మ రెండో పెళ్ళి చేసుకోవాలనుకోవటం, సావిత్రి తల్లి, అనసూయమ్మ, ముంతాజ్ వంటి స్త్రీల అక్రమ సంబంధాలు విషయంలో నాటి పాలకుల, ప్రజల విధానాల్ని, ఆకాంక్షల్ని అర్థం చేసుకోవచ్చు.
బుడాన్ పొద్దున్నుండి రాత్రి వరకు అనసూయమ్మ ఇంటి దగ్గరుండి, ఓ దొర నరిసిరెడ్డి లాగేసుకున్న ఏభయ్యెకరాల భూమిని మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఖాసీం రజ్వీ అనుయాయీ, పెద్ద జాగీర్థార్ ఖాజీ మహమ్మద్ రసూల్ తో మాట్లాడానని చెప్పి, అత్తా కో్డళ్ళను మోసగించి కోడల్నిశారీరకంగా అనుభవించే సంఘటల్ని చదివినప్పుడు, ప్రజలెలా మోసపోయేవారో అర్థమవుతుంది. నాడు ప్రభుత్వం, కోర్టులు, చట్టం, పట్టించుకోని భూవ్యాజ్యాల్ని పరిష్కరించుకోవటానికి “అక్రమ'’ సంబంధాల్ని కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించవలిసి వచ్చేదని, అది ప్రజులకు తెలిసి పరువు, ప్రతిష్ఠల్ని కోల్పోవలసి వచ్చేదని స్పష్టమవుతుంది.

వ్యక్తిగతంగా హిందూ-ముస్లింల మధ్య కుటుంబాల్లోకలిసి మెలిసి ఉండే సంబంధాలున్నా, నైజాము నవాబుల పాలనలో హిందువుల పట్ల నిర్లక్ష్యం, ఖాశీం రజ్వీ పోషించే రజాకారుల దురాగతాల వల్ల ముస్లింలంతా వ్యవస్థీకృతంగా హిందువుల్ని వ్యతిరేకించే భావన కలిగించగలిగే వారని తెలుస్తుంది. అది ముస్లిము అయినా ముంతాజ్ ఇంటికి సత్తెమ్మ వెళ్ళటం, ఆమె ఇంటికి వెంకటయ్య రావటం, బుడాన్ ” ఆజాద్ - హైదరాబాద్ ” ప్రచారం వంటి వాటి వల్ల స్పష్టమవుతున్నాయి.

తెలంగాణాలో నైజాం ప్రభుత్వం ఢిల్లీపాలకులతో, అసాంఘిక శక్తులతో సంబంధాలు పెట్టుకొని రహస్యంగా ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటూ, వాటిని అన్ని ప్రాంతాల్లో హిందువుల పై జరిగే అల్లర్లలో ఉపయోగించుకోవడానికి సహకరించేదని తెలుస్తుంది. అలాంటి అయుధాల్ని వెంట పెట్టుకుని కొంతమంది లారీల్లో ఊరేగింపుగా వచ్చి, జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి, ముసలి వాడ్ని చంపేస్తారు. కారుతున్న రక్తం చూసి, అతడు చనిపోయాడని గమనించి, ఊరేగింపు చేస్తున్నవాళ్ళు పారిపోతారు. వాళ్ళు పారిపొతున్నారని ఊళ్ళో ప్రజలు తెలిసి కొని, ముసలివాడి దగ్గరకు వస్తారు. వాళ్ళని చూసి వచ్చిన ఆదోళన కారులంతా పారి పోతారు. అలాగే అంతకు ముందు కూడా సత్తెమ్మ కర్ర తీసుకుని బోళ్ళబావి పొలాన్ని స్వాధీనం చేసుకోబోతున్న దొర మనుషుల్ని కొట్టడానికి వెళ్ళినపుడు కూడా ప్రజలు చాలా మంది తిరగబడాలనే ఉద్దేశంతో వెళ్ళిన వారు కాదు. అయినా గుంపులుగా వస్తున్న మనుషుల్ని చూసి దొర పని మనుషులు పారిపోయారు. కాబట్టి దొరలు నైజాము ప్రభుత్వం, పోలీసుల పట్ల భయం ఉన్నా అవకాశం వస్తే తిరగబడాలనే ఆకాంక్షే ఉందని స్థానిక ప్రజలకు స్పష్టమవుతుంది. అదే పద్ధతి నవల ముగింపులోనూ కనిపిస్తుంది

తెలంగాణాలో సాయుధ పోరాటం జరగడానికి వెనక ఎంతో నేపథ్యం ఉంది. సాయుధ పోరాటం ఒక్కసారిగా ఎగిసి పడలేదు. అది ప్రజల కష్టనష్టాలనుండి వచ్చింది. పాలకుల వల్ల, పాలకుల ఉదాసీన వైఖరి వల్లా, పాలకులను ఆశ్రయించుకున్న హిందు జాగి్ర్దారీ పీడనను అవగాహన చేసుకోవాలంటే ఓనమాలు నవల చదివి తీరాల్సిందే.
తెలంగాణా సాయుధ పోరాటం జరగడానికి ముందు సమాజం స్పష్టంగా వివిధ వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భూస్వాములు, ఉన్నత వర్గం, మధ్యతరగతి, పేదవర్గంగా వాళ్ళు విడిపోయారు.కులం, వారి వృత్తులతో సంబంధం లేకుండా అందరూ ఒకేరకమైన పీడనను అనుభవించినట్లు నవలలో కనిపిస్తుంది. బహుశా, కులసమస్య ఉన్నా, పీడన ప్రధానమైనప్పుడు దాన్నుండి రక్షించుకోవడానికి కొన్ని కులాలు ప్రయత్నించేవని కూడా అర్థమవుతుంది. అయితే రచయిత మాల, మాదిగలను ముస్లిములుగా మార్చుకోవడాన్ని మరోలా వివరించేప్రయత్నంచేశారు.

సిలారు ముస్లిము అయినా, హిందువుల పట్ల బుడాన్ లాంటి ద్వేషం ఉన్నవాడు కాదు. బుడాన్ ఒక సారి పందినీ, ఒక హిందువునీ చంపిన వాడు. ఆ తర్వాత ఖాసీం రజ్వీ ముఠాలో చేరినవాడు. ఆ దుర్మార్గం చూసిన తర్వాత బుడాన్ ని తన అల్లుడుగా సిలార్ అంగీకరించలేదు. అలాంటిబుడాన్, ఒకరోజు నమాజ్ చేసుకొనే సమయం లో సిలార్ దగ్గరకొచ్చి ముస్లింల స్థితిగతుల గురించి వివరిస్తాడు. నిజాము నవాబుల పాలననూ, ఖాసీం రజ్వీ సేనల అవసరాన్నీ చెప్తున్న సందర్భంలో రచయిత ఇలా వ్యాఖ్యానిస్తాడు.
” సిలారుకు అవన్నీతెలీదు, పల్లెటూళ్ళలో మాల మాదిగలకు ఇతర దళిత జాతులకూ తురక మతం ఇప్పంచి వారిని ఇతర కులాల మీదికి ఎగతోలేటందుకే ఖాజీ తీవ్రమైన వుద్యమం సాగిస్తున్నాడు. ఆ విధంగా మతం మార్చుకున్న వాళ్ళ మీద పెద్ద కులాల వాళ్ళు ఆర్థిక ఆంక్షలుపయోగించి లొంగదోసుకొంటున్నారు. ఆర్య సమాజం వారి ద్వారా వారిని శుద్ది చేస్త్రున్నారు.

ఖాజీ ముస్లిం మత ప్రచారానికి తీసుకున్న శ్రద్ద మూలంగానే ఆయన భూముల్ని రైతులు వదలకుండా చేయిస్తున్నారని బుడన్ చెప్పేడు.” ( ఓనమాలు, తృతీయ ముద్రణ , 1980 :163) కులం చేత సమాజంలో అవమానాలు ఉన్నా, రచయిత ఆ కోణం నుండి చూడడం కంటే, వర్గ దృక్పథంతోనే వివరించే ప్రయత్నం చేశాడు.
ప్రముఖ విమర్శకుడు దివికుమార్ ఒక వ్యాసంలోవ్యాఖ్యానించినట్లు బ్రిటీషు వలస వాదులు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమ విభిన్న దశలను, పరిణామాలను, తొలి కమ్యునిష్టు ఉద్యమ కృషినీ, వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట నేపథ్యాన్ని, పోరాటాన్ని, కోస్తా జిల్లాలలో జమిందారీ వ్యతిరేక పోరాట కాలం నాటి రాజకీయ ఉద్యమ సంఘర్షణాత్మక చరిత్రను మహీధర రామ మోహనరావు అక్షర బద్దం చేయడంలో ఎంతగానో కృతకుత్యులయ్యారు. ఆ చరిత్రను, సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఆయన రచనలం, ముఖ్యంగా ఓనమాలు నవల ఎంతగానో సహకరిస్తుందడంలో సందేహాం లేదు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)