చెక్కిలి మీది కన్నీటి చుక్క
సముద్రమంత లోతు
అగాధాన్ని కొలవాలంటే
గుండెలోతుల్లోకి మునకెయ్యాల్సిందే
గాయాల్ని తడమాల్సిందే
ఘనీభవించిన మాటల తూటాల్ని
పుండై పోయిన వంచెనల వైనాల్ని
కొత్త కత్తి గాట్లనీ పర్సించాల్సిందే
ప్రియమైన వాళ్ళ హస్తల్లో
జీవితం కోల్పోయిన చిరునవ్వుల్ని
నమ్మకమైన తన వాళ్ళ దాడికి
తెగి వేలాడుతున్న శిలల్ని
ఒక్కొక్కటీ పలకరించాల్సిందే
కలసి నడిచిన చౌరస్తాల్లో
విడిపోయిన చిహ్నాల్ని గుర్తించాల్సిందే
వాగ్ధానాల వర్షంలో తడిపి
వెన్నుపోట్ల అగ్నిహోత్రంలో పేల్చిన
రక్తం కమురు వాసన పీల్చాల్సిందే
నఖశిఖ పర్యంతం అల్లుకొన్న మచ్చల్ని
తడిమి కథల్ని వినాల్సిందే
కన్నీటి చుక్క రుచి చూస్తే సరిపోదు
కొండంత బరువును
అనాయసంగా మోయగలిగి ఉండాలి
తోకలాంటి చుక్క చారిక వెంట
అనుభవల బాటసారై పయనించాల్సిందే
పెదవిపైన కాలిపోయిన పూలతోటని
మనసు కళ్ళతో అన్వేషించాలి
చారిత్రక పరిశోధకుడిలా
జీవిత ఎడారుల్లో త్రవ్వకాలు జరపాలి
కన్నీటి చుక్కంటే మాటలా
అదొక బతుకులోని శిధిలగీతం !