| డాక్టరు డి.యం.ప్రేమావతి , పద్మావతి ఉమెన్స్ కాలేజీ లో తెలుగు శాఖలో లెక్చరర్ గా పనిచేసారు. తెలుగు శాఖ అధిపతిగా రిటైర్ అయ్యారు . ఆమె స్త్రీలకు సంబంధించిన వివిధ సమస్యలపై స్త్రీ చైతన్యంతో పలు ఉపన్యాసాలు ఇచ్చారు. వివిధ సాహిత్య వ్యాసాలు స్త్రీవాద దృక్పధంతో రాసి ప్రచురించారు. సాహిత్యాభిలాషి సంస్కరణాభిలాషి. |
|
సాంఘీక జీవితంలోనూ ఆ జీవితాన్ని ప్రతిబింబింప చేసే కళా రంగంలోనూ ఎన్నో మౌలికమైన మార్పులు చోటు చేసుకొంటున్నాయి.సాహిత్యాన్ని అర్థం చేసుకోవాల్సిన తీరులో ఒక కొత్త దృష్టి వచ్చింది. పునాదుల్ని కదిలించే చర్చ యివ్వాళ సాహిత్యంలో ప్రవేశించింది. స్త్రీల గురించిన ఆలోచన, ఆవేదన సమాజంలో స్పష్టంగా కన్పిస్తోంది. అలాంటి సాహిత్యంలో ఒక భాగంగా మనం ‘ మహిళా మార్గం’ ప్రచురించిన ‘ ఒంటరిగాలేం మనం ‘ కథల సంపుటిని పరిశీలించాలి.
గత చరిత్రను మనం క్షణం ఆలోచిస్తే స్త్రీల స్థితిగతులలో మార్పు కన్పిస్తుంది.ఒకప్పుడూ స్త్రీలు దిగువ మధ్య ఉన్నత ఆటవిక దశలలో చాల గౌరవనీయమైన స్థానాల్లో ఉన్నారు. అది మాతృస్వామ్య వ్యవస్థలో జరిగింది. అక్కడ స్త్రీ ప్రముఖ స్థానాన్ని నిర్వహించింది. అయితే పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ కి గౌరవం పోయింది. స్త్రీలపై అణచివేత ప్రారంభమైంది. కేవలం పిల్లల్ని కనే యంత్రంగా స్త్రీ మిగిలిపోయింది. ఒక బానిస అయింది . ఒక భోగ్య వస్తువు అయింది. స్త్రీ శ్రమ శక్తికి, సామాజిక గుర్తింపు లేదు. విస్తరించిన పరిశ్రమలు స్త్రీని కుటుంబంలో నుంచి బయటికి లాగి శ్రమ మార్కెట్ లోకి తీసుకొని వచ్చాయి. క్రమంగా దేశానికి స్వాతంత్ర్యం రానే వచ్చింది. స్త్రీకి మరింత దీన స్థితి, అణచివేత తప్పలేదు. ఒకటేమిటి ఎన్నో సమస్యలు ? ఆ సమస్యల వలయంలో యివ్వాళ స్త్రీలు ఊపిరాడక సతమతమవుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏభైఏళ్ళు గడిచినా యింకా మహిళాభ్యుదయం, మహిళాభివృద్ధి అంటూ ప్రభుత్వ పధకాలు స్త్రీలను వెక్కిరిస్తున్నాయి.సమాజాభివృద్ధికి స్త్రీలు కీలకపాత్ర వహిస్తున్నా, నేటికీ అసమానతలు , దోపిడీ వారిని వెన్నాడుతూనే ఉన్నాయి. బహుముఖ దోపిడీ వారిపై ఎక్కువవుతూనే ఉంది.
గ్రామీణ పేద మహిళల ఆర్థిక, సాంఘీక పరిస్థితులు పురుషులకంటే హీనంగా ఉన్నాయి. ఎక్కువ శాతం స్త్రీలు వ్యవసాయ కూలీలుగా పడరాని పాట్లు పడుతూ ఉన్నారు. సమాన వేతనాలు కాదు కదా కనీస వేతనాలు కూడా కరువయ్యాయి. తక్కువ కూలి ఎక్కువ శ్రమకి మహిళలు ఈడ్వబడుతున్నారు. పైగా కుటుంబ బాధ్యతలూ ఎక్కువ భాగం స్త్రీలే చూసుకుంటున్నారు. భూమిపైన యాజమాన్యపు హక్కులేదు. నిరక్షరాస్యత, ఆహార లోపం, వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవటం , లైంగిక హింస అత్యాచారాలు , కుల వివక్ష, లింగ వివక్ష లాంటివి గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపధ్యంలో ‘ఒంటరిగా లేం మనం ‘ సంపుటిలోని కథలు గ్రామీణ మహిళలకు చేయూతనిచ్చేవిగా, ధైర్యాన్నిచ్చేవిగా, స్పూర్తినిచ్చేవిగా ఉన్నాయి. స్త్రీల చైత్యన్యం ప్రధానంగా అవసరం.ఆ దిశలో పై కథల సంపుటిలో అన్ని కథలు చైతన్య పూరితమైనవే. ప్రస్తుత సమాజంలో స్త్రీని చైతన్యపరిచి, ఎందులోనూ స్త్రీ పురుషునికి తీసిపోలేదని చెప్పే కథలున్నాయి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని నమ్మి మోసపోవద్దని జాగృతం చేస్తాయి. సమాజం ఒక గచ్చ పొద. సమస్యలు పలు రకాలు. ఒక్కో సమస్య ఒక్కో తీరుగా ఉంటుంది. పరిష్కారం ఒకే తీరుగా ఉండదు.ఎలా స్పందించి సమస్యను ఒక్కోతీరుగా ఉంటుంది. పరిష్కారం ఒకే తీరుగా ఉండదు. ఎలా స్పందించి సమస్యను పరిష్కారింఛుకొవాలో ప్రతి కథా ఒక ఉదాహరణ.ప్రతి స్త్రీ తనకు తానే నిర్ణయం తీసుకోవాలన్న సందేశం ఉంది. ఆలోచించి ధైర్యంగా సమస్యను ఎదుర్కోనే శక్తి స్త్రీలకు ఉందని చూపిన కథలే. ఒంటరిగా కంటే అందరం కలిసి పోరాడాలన్న సూచన ప్రధానమైంది. రకరకాలుగా స్త్రీల తలరాతలు మారనిపరిస్థితి కథల్లో స్పష్టంగా చూపబడింది. అందుకే స్త్రీలు తమని తామే రక్షించుకోవాలన్నది పరిష్కార మార్గమనీ. సాహసంతో సంఘటితమైతే స్త్రీ శక్తికి ఎదురుండదని కథలు నిరూపించాయి. ఈ సంపుటిలోని అన్ని కథలు వాస్తవిక జీవితాలకు ప్రతి రూపాలే . జీవితం తనను తానే రాసుకుంది. స్త్రీ పాత్రలు జీవితంలోంచి నడచివచ్చినవే. ఒక సామాజిక అవసరంగా పైకథలు పరిశీలించాల్సినవే. సీతమ్మ, దుర్గ , తాయమ్మ పార్వతి , విమల, భాగ్యమ్మ , మాధురి ఒకరేమిటి స్త్రీలందరూ జీవితంలో మనకు కనిపించేవారే. బాగా తెలిసినవారే. జంతువులకంటే హీనంగా వాళ్ళనుభవింవిన హింస సభ్య సమాజం తలదించుకొనేలా చేస్తుంది.కథ సంపుటిలో ప్రతిదానికి వచ్చేదే. అయితే మచ్చుకు కొన్ని మాత్రం యిక్కడ పరిశీలిద్దాం. ‘సిగ్గు పడాల్సిందెవరు ?’ అన్నది మొదటి కథ. గ్రామంలో మరుగుదొడ్లు లేవు. స్త్రీలకు స్నానాలు చేయడం పెద్ద సమస్య. “రొమ్ములపైదాక లంగా కట్టి మొయిన్ రోడ్డు పక్క మురుగు కాలువ పక్కన బోరింగు దగ్గర ఒళ్ళు రుద్దుకొంటూ స్నానాలు చేస్తున్న ఆడవాళ్ళని ఆబగా , ఆశగా ,చీదరగా వింతగా , అలవాటుగా చూస్తూ పోతుంటారు ఆవూరి జనం ఇది ఏళ్ళ తరబడి ఆ వూరి స్త్రీలు పడే అవమానం, బాధ ఇబ్బంది .”ఏం చేయాలో ఆలోచించే తీరిక వాళ్ళకు లేదు. ఇంట్లో మగాళ్ళు ఆడోళ్ళు యిబ్బందుల్ని పట్టించుకోరు. అందుకే అవసరంగా ఆ వూరి స్త్రీలు ఒక ఆందోళనా సంఘాన్ని పెట్టుకుంటారు. ఓట్లు కోసం, వచ్చే రాజకీయ నాయకుల్ని నిలదీయాలనుకొంటారు. మరుగుదొడ్లు కట్టించి యిచ్చాకే ఓట్లు ఏత్తాం’ అని అందరూ ఒక మాటమీద నిలబడాలని మాట్లాడుకొంటారు. ఇలా స్త్రీలందరూ కూడబలుక్కోవడం, వారిలో వచ్చిన చైతన్యానికి తార్కాణం. రాబోయే విజయానికి నాంది.
‘ఒంటరిగా లేం మనం’ అనేది మరో కథ. తాగుబోతు భర్తతో కాపురం చేయలేక సీత పడే అగచాట్లు అన్నీ యిన్నీ కావు. మందుల కంపెనీ లో వారికి పని. ఆ మందుల కంపెనీ వాళ్ళు స్త్రీలకు జ్వరం వచ్చినా చిన్న మాత్రలు యివ్వరు. ఇంటా బయటా స్త్రీలకు క్షణం తీరికలేని ఆలోచన ఆ వూరి స్త్రీలకు ఆ పరిస్థితిలే కల్పించాయి. ఒక్కరుగా వెళ్ళి అడగడం కంటే ‘మనందరం కలిసి అడుగుదాం’ అన్న వారి ఆలోచన ఆచరాణాత్మకమైందిగా ఉంది. అందుకోసం స్త్రీలందరూ కలసి ఒక యూనియన్ పెట్టారు. నినాదాలు చేసి సమ్మెకు దిగారు. ప్రతిగా గూండలతో ఆడవాళ్ళను కొట్టిస్తారు. తిరుగుబాటును అణచి వేయాలన్న యాజమాన్యపు ఆలోచనని ఆడవాళ్ళంతా గట్టిగా ఎదుర్కోంటారు. స్త్రీ తిరగబడాలేకాని స్త్రీశక్తికి తిరుగుతుండదని నిరూపించుకొంటారు. హక్కుల కోసం పోరాడ్డం నేర్చుకొంటారు..చేతికి దొరికిన ఆయుధాల్ని సొంతం చేసుకుంటారు. ఆమరణ నిరహార దీక్షను చేస్తారు. యాజమాన్యాన్ని గట్టిగా హెచ్చరిస్తారు. స్త్రీ సంఘటితం కావాలన్న సూచనతో కథ ముగిస్తుంది.
‘ఎర్ర కలువ’ అన్న కథలో గున్నమ్మ ఒక విప్లవ వనితగా ఎలా మారిందో , పరిస్థితులకు ఎదురు తిరగడం ఎలాగో కథలో చూపబడింది. ఋణాలు తీర్చలేక, మిల్లు లాకౌట్ ప్రకటిస్తే బతుకు భారంలో గున్నమ్మ లో ఎలాంటి చైతన్యం వచ్చిందో కథ చక్కగా చూపింది. వారసులు కొట్టిన దెబ్బలకు గున్నమ్మ ఎదురుతిరిగి తన జీవితాన్ని తానే చక్క దిద్దుకోవాలనుకొంటుంది. తన జీవితమే తనను ఎదురు తిరగమని నేర్పించి. జీవితం నేర్పిన చైతన్యం అది. గుడిసెల్లో స్త్రీలందరూ గున్నమ్మతో పోరాటానికి దిగుతారు. గున్నమ్మ రైలును వేళ్ళనీకుండా తన ఎర్ర రవికని విప్పి రైలు పట్టాలపై జెండాగాఎత్తి పట్టుకుంటుంది.గున్నమ్మ వెనక వెయ్యి మంది స్త్రీలు ఉద్యమాన్ని నడుపుతారు. అడుగు ముందుకు రైలు కదలనీయరు. “కరువు బతుకు మీద ఎంత దాడి చేసినా ఇన్నాళ్ళు లేనిదేదో యిప్పుడూ గున్నమ్మకు తెలిసింది.” అదే తన బతుకుని నడిపిస్తుందనీ గున్నమ్మ గ్రహించింది. ఊరంతా గున్నమ్మ దారిలో నడిచారు. గున్నమ్మ లాంటి స్త్రీలు సమాజానికి అవసరం కాదా మరి!
కెరటం కథలో దానియమ్మ అమాయకత్వం, నిస్వార్థం మార్గదర్శకాలు. ఊళ్ళో పిల్ల, పిల్లాడు లేచిపోతే ఎవరికొచ్చినట్లు వాళ్ళు వాగుతుంటారు. దానియమ్మ అలా కాదు. సూటిగా సునాయాసంగా, అందంగా ఒక మాట దానియమ్మ నోట వింటాం మనం. “పెళ్ళి చేసుకోవడానికే కదండీ ఆళ్ళెళ్ళిపోయిందీ”.పనిమనిషి దానియమ్మకున్న సంస్కారం చదువుకొన్న వాళ్ళకి ఎంతమందిలో ఉంటుంది? ఈ అనుభవం మరొకరికి ఉపయోగపడాలి యిదే జీవిత సత్యం. అంతే కాదు చదువు, డబ్బు ఉన్న వారిలో, లేనిది దానియమ్మలో ఉంది.
‘తాయమ్మ కథ’ ఒక మంచి పెద్ద కథ. గుండె కదిలించే కథ.” ఏం బతుకు నాది ,పుట్టి పెరిగిన కాన్నుంచి ఎన్నడన్న నిమ్మలంగా లేదు.ఆనాడు మేనమామిం ట్ల, పెండ్లయిన కాన్నుంచి ఈడ ఎన్నడు కష్టాలేనాయె. ఈ పెండ్లి ముదనష్టాం కాను. పెండ్లైన కాన్నుంచే మరీ ప్రాణానికి సుఖం లేకుండా పోయింది” తాయమ్మ మాటలు మన హృదయాన్ని ఎలా తాకుతాయో చూడచ్చు. స్త్రీ జీవితానికి , పెళ్ళి కి కష్టాలు ఎలా ముడిపడి ఉన్నాయో తాయమ్మ కథ సజీవ సాక్ష్యం.”పెండ్లంటె ఏందో తెల్వకుంటనే పెండ్లయిపోయింది”. తలదువ్వుకుంటే, చీర కట్టుకుంటే అనుమానాలు.పతివ్రతా తనాన్ని నిరూపించుకోవడానికి కాలే నూనెలో పైస తీయాలి. చాకిరికీ స్త్రీ ఎలా బలి అయిందో తాయమ్మ ఒక ఉదాహరణ. కొడుకులు, కోడళ్ళు , మనవలు ఎన్ని తరాలు మారినా మారని స్త్రీల బతుకులకు తాయమ్మ ఒక నిదర్శనం. ఇల్లు , మిల్లు అమ్మేశారని విన్న తాయమ్మకు ఆశనిపాతమైంది. రక్తం సలసల కాగింది. ” కడుపుల అగ్ని గుండాలు పేల్నయి’ అన్న తాయమ్మ ఆవేదన అర్థం చేశుకోవాల్సిందే, భర్తను, అల్లుణ్ని, ఆడబిడ్డ మొగుణ్ణి కసితో కొట్తుంది. గూట్లో ఎర్రమట్టి కసిగా తీసి వాళ్లమీద దోసిళ్ళతో గుప్పింది. పొరకతో చితక బాదింది. ధైర్యంగా ఎదురు తిరిగి అందర్నీ చితకబాదినా చివర్లో దుఃఖం ఆపుకోలేక అమ్మతో తన వేదనను విన్న వించుకుంటుంది. తాయమ్మ కథ చాలా కాలం మనల్ని వెంటాడుతుంది. స్త్రీ పిల్లిగా బతుకు ప్రారంభించి పులిగా ఎలా మారిందో తాయమ్మ కథే సాక్ష్యం. ‘పనికి (రాని) సగం ‘ మరో ఆసక్తి కరమైన కథ. ముకుందం, పార్వతి మంచి దంపతులు. బిడ్డలు , మరుదులు వాళ్ళ చేతుల్లో పెరిగారు. ముకుందం షష్టి పూర్తి యిల్లంతా హడావిడి. ఏర్పాట్లుజోరుగా సాగుతాయి. అందరూ ముకుందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. పార్వతి మనసు చివుక్కు మంటుంది. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని ఆదుకుంటే అందరూ ముకుందాన్ని మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతుంటే పార్వతి మనసులో ఎన్నో ప్రశ్నలు , ఎన్నో ఆలోచనలు . ‘అన్నయ్య లేకపోతే ‘ అంటున్నారే కాని ఒక్కరూ వదిన లేకుంటె అనరు. అందుకే దెబ్బ తిన్న పార్వతి ముకుందం షష్టి పూర్తి లో పాలుపంచుకోదు. పక్కన కూర్చోదు. తన మనసును అర్థం చేసుకున్న భర్త మాత్రం ఆందోళనకు గురి అవుతాడు. ఆడవాళ్లకు షష్టి పూర్తి చేయరెందుకని పార్వతి ప్రశ్నిస్తుంది. ఆచారాలు ఎంత అర్థం లేనివో, స్త్రీని ఆటబొమ్మగా చూసే పరిస్థితిని పార్వతి నిరసించింది. పార్వతి తన కోడళ్ళను పిలిచి తన అనుభవం చెప్పి కనీసం వాళ్ళు అయినా వాళ్లకంటూ ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకోమంటుంది. ప్రశ్న చిన్నదే అయినా అలోచన చాలా పెద్దది. జవాబు కోసం వెతుక్కొనే ప్రశ్న అది. పార్వతి ముందు తరానికి చైతన్యం.
లోతుగా ఆలోచింపజేసే మరో మంచి కథ ‘అమ్మ కోసం’ . ఇంట్లో అమ్మ శ్రమ దోపిడీకీ ఎలా చిహ్నంగా వుందో చూపే కథయింది. విద్య యింట్లో వాళ్లందరికీ గిప్ట్స్ కొంటుంది. నాన్నకు ట్రాన్సి స్టర్ , చెల్లికి వాక్ మన్ , అమ్మకు మిక్సీ కొంటుంది. అమ్మకు మాత్రం అందరికీ ఉపయోగపడే మిక్సీ ఎందుకన్న ప్రశ్న ఒక కొత్తదారికి పునాది. అమ్మలకు అభిరుచిలుండవా? అభిరుచులు చంపుకొన్నాకే అమ్మ అవుతుందా ? అమ్మకు ప్రపంచాన్ని తెలియచెప్పే పుస్తకాలు కొనాలన్న ఆలోచన కొత్తది. అమ్మ వ్యక్తిత్వం కాపాడాలి. ఆమెకూ గుర్తింపు అవసరం. స్త్రీలు కేవలం ఇంటి పనికే అంకితం కాకుడదన్న ఙ్ఞానం కథకు ప్రాణం. ‘భాగ్యమ్మ ‘
కథ ప్రతి స్త్రీ ఆలోచించి , అనుసరించాల్సిన కథ. ప్రతి యింట్లో జరిగేది యిదే - అందుకే ప్రతి స్త్రీ చదివి ఆలోచించాలి. నాబతుకులో అంగుళం అంగుళం అరిగితే వీళ్లు యింత వాళ్లయినారు. ఇంటి కోసం నా ఒంట్లో రక్తం ధారపోసాను. ఇవి భాగ్యమ్మ మాటలు మాత్రమే కాదు. ప్రతి స్త్రీ హృదయ ఆవేదనయిది. ముసలి భర్త ఆరోగ్యం కోసం ఆస్పత్రి ఖర్చులకు బిడ్డలు భాగ్యమ్మ పొలం అమ్మమంటారు.ఎందుకంటే తల్లి ఆస్తి అమ్మి తండ్రిని కాపాడుకోవాలని బిడ్డలు ఉచితసలహా యిస్తారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఆలోచించి తల్లి ఆస్తి అమ్మమంటారు. అందుకే భాగ్యమ్మ ఆస్తి అమ్మడానికి అంగీకరించదు. భర్త మీద యిష్టంలేక కాదు. భర్త పోయాక తన గతి ఆలోచించి ఆ నిర్ణయానికి వస్తుంది. గతం , వర్తమానం , భవిష్యత్తు కలగలిపి కెరటాల్లాగ ఎగసిన మానసిక ఘర్షణ యిది. జానెడు పొలం పోతే తన ఉనికి ఏమౌతుందనే భయం ఆ తల్లి మనసును పీకుతుంది. ఆస్తి పోతే ఆత్మ హత్య కూడ చేసుకోలేక జీవచ్చవంగా బతికే దృశ్యం ఆవిడ కళ్ళముందు కదిలాడుతుంది. రెండు రోజు లు యింట్లో ఎవ్వరితో భాగ్యమ్మ మాట్లాడదు. మౌనం ఆ సమాధానం. వందరెట్ల దుఃఖాన్ని అనుభవించినా భాగ్యమ్మ నిర్ణయం అందరికీ ఆదర్శం. అనుసరణీయం. వయసు మీరిన ప్రతి తల్లి తండ్రీ ఆలోచించాల్సిన కథ.
పెళ్ళి జీవితానికి అవసరమే కాని పెళ్ళే జీవితం కాదని తెలియచెప్పే మంచికథ ‘జీవిన మాధుర్యం’. తనకు నచ్చి, వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తి దొరికినపుడే పెళ్ళి చేసుకోవాలన్న సందేశాత్మక కథ.
ఇలా అన్ని కథల్లోనూ ఏదో ఒక సమస్య. స్త్రీ ఎలా స్పందించాలో సూచించే కథలే . కేవలం స్త్రీలు బానిసలుగా కొయ్య బొమ్మలుగా మిగిలి పోకుండా తామూ జీవమున్న మనుషులమని నిరూపించుకోవాలనే తపన కథల్లో దాగి వుంది. ఆత్మ విశ్వాసం ఆడవాళ్ళకు అవసరమని నిరూపించే కథలు యివన్నీ. తాగడానికి గుక్కెడు గంజి లేని పేద స్త్రీల కథలు యివి. ప్రకృతి సిద్ధమైన శారీరిక మార్పులను ఆడపిల్ల బలికాకూడదని గ్రహించుకోవాలి. స్త్రీలకు స్త్రీలే మార్గదర్శకులు.వాళ్ళకు వారే దారి చూపుకోవాలి. జనాభాలో సగభాగమున్న స్త్రీలు చైతన్యవంతులైతే గాని సమాజాభివృద్ధి జరగదనది సత్యం. అందుకే స్తీలు పురుషులతో సమానంగా బతకాలి. ఎవరికంటే ఎవరూ తీసిపోరూ. ఈ సత్యాన్ని గ్రహించి, పాటించి ఆచరించగలిగితే ఆరోగ్యకర సమాజం మన కళ్ళ ముందుంటుంది.