గుప్పెడు మట్టిని కలగంటున్నాను
పెద్దగా కలలుకనే వాడిని కాకపోయినా
పెద్ద పెద్ద కలలు నా దరికి చేరకపోయినా
బంగారంలాంటి గుప్పెడు మట్టిని కలగంటున్నాను
మట్టిపాదాలూ మట్టిచేతులూ మట్టి వూహలూ
వుత్త మట్టిమనిషిని కదా
ఉప్పర తట్టలో మట్టిని మోస్తున్నట్లు
ఊహల్లో గుప్పెడు మట్టిని కలగంటున్నాను
మట్టి కలలోకి రావడం పెద్ద ఆశ్చర్యంగా కాదుగానీ
ఆ మట్టి నుండి నూతిలోని గొంతుకలా
సన్నగా నీరవ నిశ్శబ్దంగా ఒకటే రోదన
వుత్త మట్టి గొట్టు ఏడుపు!
స్నానం చేసిన తర్వాత
ఏనుగు తొడంతో యింత మట్టిని తీసుకొని
తలమీద పోసుకున్నట్టు
నేనూ ఇంత మట్టిని తీసుకుని
మంచిగంధంలా వంటిపై పూసుకుంటున్నాను
నాలుగు తొలకరి చినుకులు రాలగానే
నేలంతా నెలల్ బాలెంత అయిపోయి
పులకరించే మట్టి పరిమళాన్ని ఆస్వాదించడానికి
కేవలం ముక్కు మాత్రమే వుంటే సరిపోదు
మొత్త శరీరాన్నంతా నాసిక చేసుకోగల
గొప్ప రసజ్ఞత వుండాలి!
మొక్కకే కాదు
మనిషికీ క్షేత్రం మట్టే
ఎండిన విత్తనాన్ని గుండెల్లో దాచుకుని
చినుకు పదును రాగానే
మొలకగా భూమి పైకి పంపే
గుప్పెడు మట్టిని కలగంటున్నాను
చిన్నప్పుడు పెరట్లో జామచెట్టుకింద
కుంకుడు పులుసు తలంటు స్నానం తర్వాత
భూమిలోచి విసవిసా బయటకొచ్చిన
వానపాముల నేలను కలగంటున్నాను
వేసవిలో ఎండిపోయిన చెరువును తవ్వి
గట్టుమీదపోసిన నల్లమట్టి
వర్షాకాలంలో మా పసి పాదాలకు
మట్టి బూట్లులా అమరిన
గుప్పెడు మట్టిని కలగంటున్నాను
సిమెంటు రోడ్లూ
కాంక్రీటు కీకారణ్యాల దురాక్రమణల మధ్య
మిగిలిన చారెడు నేలలోనూ
మురిపెంగా చెంగలగడ్డిని మొలిపిస్తున్న
గుప్పెడు మట్టిని కలగంటున్నాను
సతత హరిత వనాలను నిర్దాక్షిణ్యంగా నరికేసి
మిగిలిన వాటిని మరుగుజ్జు వృక్షాలను చేసి
మామిడాకులకు బదులు
ప్లాస్టిక్ తోరణాలను వేలాడదీసుకున్నందుకు
కుమిలి కుమిలి రోదిస్తున్న
గుప్పెడు మట్టిని కలగంటున్నాను
మా చిన్నప్పుడు చంకల్లో
చేతులేసి నెలమీదకు దించబొతే
మట్టీ మట్టీ అని అరికాళ్ళను పైపైకి ముడుచుకొనేవాళ్ళం!
ఇప్పుడు దించుదామన్నా నేలలేని పసిపాదాలను చూసి
నీళ్ళు నిండిన కళ్ళతో గుప్పెడు మట్టిని కలగంటున్నాను
చెరువు వొడ్డునుండి ఇంత బంక మన్నును తెచ్చి
బొమ్మను చేయబోతే
బొమ్మరాకపోతే నేనెక్కడ ఏడుస్తానోనని
తనకు తానే మైనపు ముద్దయి బొమ్మగా మారిన
మా ఆదియాంద్ర పేట చెరువు గట్టుమీది
మిసమిసలాడే గుప్పెడు
నల్లని మట్టిని కలగంటున్నను
ఎప్పుడు ఎవరికోసమో ఎందుకు?
ఎప్పుడైనా నాకే అవసరం రావచ్చని
గుప్పెడు మట్టిని గుట్టుగా
గుప్పెట్లో దాచి పెట్టుకున్నానుచెరువు వొడ్డునుండి ఇంత బంక మన్నును తెచ్చి
బొమ్మను చేయబోతే
బొమ్మరాకపోతే నేనెక్కడ ఏడుస్తానోనని
తనకు తానే మైనపు ముద్దయి బొమ్మగా మారిన
మా ఆదియాంద్ర పేట చెరువు గట్టుమీది
మిసమిసలాడే గుప్పెడు
నల్లని మట్టిని కలగంటున్నను
ఎప్పుడు ఎవరికోసమో ఎందుకు?
ఎప్పుడైనా నాకే అవసరం రావచ్చని
గుప్పెడు మట్టిని గుట్టుగా
గుప్పెట్లో దాచి పెట్టుకున్నాను
చాలా బాగుంది మీ కవిత.
మీ గుప్పిట్లొ దాచుకున్న “మట్టి” పరిమళి0చింది.
చాలా బాగుంది ఈ కవిత. రచయిత కు అభినందనలు.. రాజు
మథి రాసిన కవిథ చాల బావుంది మీకు దన్యవాదములు మీ అబిమాని ….తుమ్మల దెవరావు 9059096421
మీ కవిత చాలా బాగుంది.
మీకు అభినందనలు.