షాజహాను పెళ్లాం సమాధి తాజ్ మహల్
భగత్ సింగ్ సమాధి తీరు తేజ్ మహల్
తాజ్ మహల్ కేవలం ఒకానొక వలపుల శిల్పం
తేజ్ మహల్ మాత్రం విప్లవకారుల శరతల్పం
తాజ్ మహల్ పేదవాళ్ళ ప్రేమను వెక్కిరిస్తుందట
తేజ్ మహల్ అధికార మదాన్ని ధిక్కరిస్తుందట
తాజ్ మహల్ని పెకిలించి పారేయమన్నాడు బైరాగి
తేజ్ మహల్ని పదిలపరుచుకోమంటున్నాడు ఆరుద్ర
భాస్వరాన్ని ఎప్పుడూ నీళ్ళలోనే భద్రపరుస్తారట
భగత్ సింగ్ సమాధిని అందుకే నీళ్లమధ్యనే కట్టారు
తాజ్ మహల్ గోడలపై పలు విధాల ప్రేమసూత్రం
తేజ్ మహల్ వేదికపై ఒకే ఒక్క విప్లవ మంత్రం
ఇంక్విలాబ్ జిందాబాదంటున్నది ఈ సమాధి
ఇంక్విలాబ్ కోసమే ఇట వేసినారు పునాది
రాజగురూ సుఖదేవూ భగత్ సింగ్ కటూ ఇటూ
రాజకీయ విప్లవాగ్ని రగిలించేదీ చోటు
పరదేశం పాలనపై కత్తిగట్టె భగత్ సింగు
పరవర్గ పాలనపై పోరాడును ఎర్రదందడు
హరిత శ్వేత విప్లవాలు సాధిస్తే ఏం లాభం?
అరుణారుణ విప్లవమే భగత్ సింగ్ చిరస్వప్నం
1981 సెప్టెంబర్ 20 వ తేదీన సట్లెజ్ నదీ తీరాన్ భగత్ సింగ్ సమాధిని చూసిన తర్వాత కలిగిన భావాలను ఆరుద్ర ఈ కవితలో చిత్రించారు. ఇది ప్రజాశక్తి లో 4-10-1981 లో ప్రచురితమైంది. భగత్ సింగ్ సమాధి పై కింది చరణముంటుంది.
సర్ ఫరోష్ ఆజ్ తమన్నా హై దిల్ మే
దేఖా కిత్నా జోర్ హై బఝూ ఇ కాతర్ మే