కృతిక మనసులో ఆందోళన క్షణ క్షణానికీ ఎక్కువౌతోంది.
‘ఇప్పుడేం చేయాలి….? కడుపులో వున్నది మగపిల్లాడని చెప్పావుకదాని అత్తగారడిగితే ఇప్పుడేం చెప్పాలి…….??
స్కానింగ్ చేయించుకున్నానని అప్పుడైతే అబద్ధమాడి తప్పించుకుంది గానీ, పుట్టిన ఆడపిల్లని మగపిల్లాడుగా మార్చడం సాధ్యమా..???
ఇప్పుడు ఈ సమస్యనుంచి బయటపడడమెలాగో అర్థం కాక పిచ్చేక్కేట్టుంది! మొదటికాన్పుకె ఆడపిల్ల పుట్టిందని నానాయాగీ చేసింది అత్త. ఈ సారి ఆడపిల్లని కంటే పుట్టింటికి పంపించేస్తాననీ, కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తానని అత్తగారు వార్నింగిస్తే భయపడిపోయింది. కానీ అప్పుడే ఎదురు తిరిగి ప్రశ్నించి వుంటే ఈ సమస్య ఎదురయ్యేదికాదు. తనిలా మన్ను తిన్న పాములా వుండబట్టేకదా వాళ్లంతా ఇలా తన జీవితంతో ఆడుకుంటున్నారు? స్కాన్ చేయించుకొమన్నప్పుడే తెగేసి చెప్పేసివుండాల్సింది… ఒకవేళ కడుపులో ఆడపిల్ల వుంటే చంపేస్తారని భయపడి అబద్ధమాడింది. మరి ఇప్పుడు ..? ఇప్పుడు మాత్రం గొంతులో ఏదైనా వేసేసి చంపరని గ్యారంటీ ఏమిటి …? లేదు…. అలా జరగనివ్వకూడదు, అయినా తెలిసీ పులిబోన్లొ తలపెట్టి… ఇప్పుడు భయపడి ఏం లాభం ? పాప పుట్టి గంటైనా దాటలేదు, ఎంత అభద్రతాభావం……?’ ఆడపిల్లంటే ఎందుకీ వివక్ష…..? కళ్ళనిండా నీళ్ళు నిండాయి కృత్తికకి. పురుడైన మరుక్షణం నుంచీ కృత్తిక అలా మౌనంగా తనలో తను రోదిస్తూనే వుంది… తల్లి కవిత ఎంత ధైర్యం చెప్పినా లాభం లేకపోయింది… ఆమెకి కూతురి అవస్థ చూస్తే జాలేస్తోంది.
“కృతిక … అలా ఏడిస్తే ఎలా తల్లీ… అసలే పచ్చిబాలింతవి… ఏడ్చినందువల్ల నీ సమస్య పరిష్కారం కాదు, ఆరోగ్యమూ చెడుతుంది.. ఇలాంటిదేదో జరుగుతుండని ముందే అనుకున్నాను…….అప్పటికి ఆపదనుంచి తప్పించుకోవడానికి అబద్దమాడవు, ఇప్పటికైనా ధైర్యం చేసి అసలు విషయం చెప్పేసేయ్. ఏదైతే అదవుతుందిలే… కన్న తర్వాత కాదంటారా. అయినా ఇలాంటి అబద్ధపు తెరలు ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితినే తెచ్చిపెడతాయమ్మ. మీ అత్తవాళ్ళు మధురైనుంచి రేపు సాయంత్రం బయల్దేరతామన్నారు, ఎల్లుండి తెల్లవారి వస్తారు… ఈ లోగా ఏదైనా ఆలోచిద్దాంలే.” అంటూ కూతురి తలనిమిరింది కవిత.
“అమ్మా నీకు వాళ్ళగురించి అస్సలు తెలీదు.. ఇప్పుడు మగపిల్లాడ్ని ఎక్కడ్నుంచి తీసుకురాను? తొలికాన్పులో పాప పుట్టినందుకు ఇప్పటికీ దెప్పుతూనే వున్నారమ్మా! ఆయన కూడా అంతే.. తల్లి అలా మాట్లాడుతుంటే మొద్దురాత్చిప్పలా ఊరకుంటాడేగానీ, పల్లెత్తు మాటైనా అనడు. వాళ్ళ వంశంలో రెండో పెళ్ళి కొత్తేం కాదు, పిల్లల భవిష్యత్తు తల్చుకుంటేనే నాకు వణుకు పుడుతోందమ్మా… నా కర్మ కాలి ఆ ఇంట్లో పడ్డాను. నాకు చాలా భయంగా వుందమ్మా…” ఏడుపాగడంలేదు కృత్తికకి.
ఇంతలో అక్కడికొచ్చిన హెడ్ నర్స్ ఆమె బాధ విన్నది.
“అయినా నువ్వు అబద్ధం ఎందుకాడాలమ్మ పుట్టేది ఆడపిల్లా, మగపిల్లాడా అనేది మగవారి క్రోమోజోములపైన ఆధారపడి వుంటుందిగానీ, నిన్ను నిందించడంలో అర్థం ఏముంది, నువ్వు భయపడడంలోనూ అర్థం లేదు. ఇంతపిరికి తనం వుండబట్టే కదా అలా ఆడపిల్లల జీవితల్తో ఆడుకుంటున్నారు. ఆడపిల్లయినా మగపిల్లయినా నీ బిడ్డని కనే స్వేచ్ఛ నీకుంటుంది. అయినా వాళ్లేం చేసినా చెల్లుతుందా?…కొట్లాడి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలిగానీ….. “కృత్తిక బాధని చూసి ఆగిపోయింది.
“అది వాళ్ళకూ తెల్సిందే సిస్టర్…. వంశాకురం కావాలని వాళ్ళపోరు… ఆడపిల్లల్ని ఎక్కువమందిని కంటే వాళ్ళ ఆస్తి కరిగిపోతుందని భయం.. అందులోనూ తొలిసారి వాళ్ళింట్లో వారసుడే అడుగుపెడితే అదృష్టం అని వాళ్ళ నమ్మకం. ఇలాంటి పనికిమాలిన ఛాదస్తాలతో నా జీవితన్ని శాసిస్తున్నారు… దేనికీ ఎదురు మాట్లాడకూడాదు “అంది కృత్తిక ఆవేదనగా.
“సరేలే అయిందేదో అయింది…ఏదైనా ఆలోచిద్దాం,” అని చెప్పి కృత్తిక తల్లి కవితని బైటికి రమ్మని సైగ చేసి పక్కకి పిలిచింది. అటు ఇటూ చూసి
“మీరు సరేనంటే నేను సహాయం చేయగలను,” అని కవిత వైపు చూసింది, ‘సహాయం ‘ అన్నపదమే ఆమెకిప్పుడు చాలా మధురంగా విన్పించింది.
“నువ్వేం సహాయం చెయ్యగలవు ? నిజంగా మా కృత్తిక సమస్యకి పరిష్కారం చూపించగలిగితే ఆ రుణం వుంచుకోనులే ” అంది కవిత.
“ఇదే ఆస్పత్రి లో వైదేహి అనే డాక్టరమ్మ వుంది. ఆమె అనాధపిల్లల కోసం ఒక హోమ్ కూడా నడుపుతోంది. ఏవో కారణాలవల్ల కడుపులో పడ్డ బిడ్డ వద్దనుకున్న అభాగినుల్ని ఆమె తన దగ్గరే వుంచుకుని పురుడు పోసి పంపిస్తుంది.. తెలిసో తెలీకో కడుపుచేసుకుని తర్వాత కడిగించుకోవడమో, లేదా కనేసి వదిలి వెళ్ళిపోయేవాళ్ళు ఆమెని ఆశ్రయిస్తారు. అలాంటి వారికి రహస్యంగా పురుడు పోసి పంపిస్తుంది.. అలాంటి పిల్లల్ని ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి కావాలంటే పాతికవేలో , ముప్పై వేలో ఇచ్చి వెల్తారు…. అలాంటి డబ్బును ఆమె హోం కోసం ఉపయోగిస్తుంది. అయితే ఇదంతా రహస్యంగానే … మీలాంటి వాళ్ళకి ఆమె నిజంగా దేవతే. ఈ విషయంలో నేనామెకి సహకరిస్తుంటాను… నాకు ఎంతో కొంత ఇస్తే నా కష్టాలకి చన్నీళ్ళుగా పనికొస్తాయని ఈ పని చేస్తున్నాను. అయినా దీంట్లో నాకు తప్పేం కనిపించడంలేదు. కొందరు ఒద్దనుకుంటున్నారు ..కొందరికి అవసరం. రెండ్రోజుల క్రితమే ఒక కేసు… మగపిల్లాడే ,, రేపు ఆ అమ్మాయి వెళ్ళొపోతుంది, మీరు సరే నంటే ఆ పిల్లడ్ని మీకు అప్పగించే పూచీనాది.. ఆ పిల్లాడ్ని కన్న అమ్మాయి కేరళ అమ్మాయి. రేపు వెళ్ళిపొతుంది… కన్న తర్వాత పిల్లాడ్ని ఒకసారైనా చూళ్లేదామె. రేపటి వరకూ మీరు పరిస్థితిని మేనేజ్ చేసుకోండి… దీనికి మీరు అంగీకరిస్తే సరే, వద్దనుకుంటే ఈ సంగతి మీ కడుపులో వుంచుకుని మర్చిపోండి. మీ పరిస్థితిని చూసి ఈ విషయం చెప్పాను, చాలా జాగ్రత్తగా వుండాలి…” ఈ ఆపద సమయంలో కాదనే వాళ్లెవరు….. అందుకే విషయం ఉన్నదున్నట్టు చెప్పేసింది.
ఇది విని కవితకి నమ్మాలా వద్దా అర్థం కాలేదు. ఇలాంటి వాళ్ళుంటారు… ఈ కాలం పిల్లలి అన్నిటినీ తేలిగ్గా తీసుకుంటారని అనుకుందిగానీ, చివరికి శారీరిక సంబంధాలు , ఆ తర్వాత బిడ్డని కనేసి నిర్దాక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోవడాలూ, …. నమ్మశక్యంగా అన్పించడం లేదు.
అదే అడిగితే…”తప్పదమ్మా ..అందరూ అలాంటి వారే అనుకోకండి..కొందరికి బతుకుభారమై ఒద్దనుకుంటారు. కొందరు మొసగించబడి కడుపుతెచ్చుకుంటారు…. ఇలాంటి వాళ్ళు కనేదాకా బతికుండి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా వున్నాయి.. కొందరు రేప్ కి గురై గర్భం వస్తే.. ఆ బిడ్డను కడుపులో చంపడం ఇష్టంలేక ఇలా కని వదిలేసి తమదారి చూసుకుంటారు….. ఇలాంటి వాళ్లంతా ఆత్మహత్యా మార్గమే పడుతున్నారు.మరో వైపు డేటింగ కల్చర్ యువతను చెడగొడుతోంది…. పెళ్లికి ముందే సరదాలు తీర్చుకోవాలంటే ఆరాటంతో ఒకటౌతారు… తర్వాత ఏముంది? కథ మామూలే .. అబార్షన్ చేసుకోవడం కుదరకపోతే రహస్యంగా కంటారు… అలాంటి వాళ్లకి ఆ పిల్లల భవిష్యత్తు పట్టదు.. ఆడపిల్లలూ మగపిల్లలూ కలిసి మెలిసి చదువులు , ఉద్యోగాలు చేస్తున్న కాలం… కట్టడి చేసే అవకాశం వుండదు, స్నేహాలు కలుస్తాయి. అలాంటప్పుడూ తొందరపడి ఆవేశానికిలోనై ఇలాంటి చిక్కులే మిగుల్తాయి..పైగా ఇప్పుడు సినిమాలూ టీవీలూ చేస్తున్న పని తక్కువేంకాదు .ఇప్పుడు ఈ సొసైటీలో బాగుపడ్డానికీ ఎన్ని అవకాశాలున్నాయో, చేడిపోవడానికి అన్ని అవకాశాలు అందుబాటులో వున్నాయి.. అయినా అందరూ అలా వుంటారా? ఒకనోక రోజుల్లో పిల్లల కదలికల్ని కనుసన్నల్లో వుంచుకునే వాళ్ళు పెద్దవాళ్ళు . ఇప్పుడా అదుపు లేకుండాపోయింది… తప్పు జరిగాక అబార్షన్ చేయించుకున్న కేసులేన్నో ..” చెప్పి భారంగా నిట్టూర్చింది.
భయంకరమైన నిజాలు తెలియకుండా వుంటేనే మంచిదేమో….. తెలిసింతర్వాత సమాజం పోకడ గురించి ఎక్కడ లేని భయం పట్టుకుంటుంది … అనుకుంటూ కవిత నిట్టూర్చింది…..
ఏదైతేనేమి…….. ఇప్పుడు తన కూతురు భవిష్యత్తుముఖ్యం. ఎక్కువ సమయం కూడా లేదు. ఈ పరిస్థితిలో ఒప్పుకోవడమే న్యాయమనిపించింది కవితకి; ఇంకాలస్యం చేయలేదామె.
“ఈ పని గనుక చేస్తే నీ రుణం వుంచుకోం… ఇప్పటికి నా దగ్గర ఇవే వున్నాయి . పనిఅయ్యాక నీకు తృప్తిగానే ఇస్తాలే…….. నాకూతురు బతుకు కంటేనా చెప్పూ……..” ఇంకా తన పర్సులోంచి రెండొందలు తీసిచ్చింది.
ఎవరైనా చూస్తూన్నారేమోనని ఇటూ అటూ చూసి , డబ్బు జేబులొ పెట్టుకుని “ఏం చెయ్యనమ్మా… చాలీ చాలని జీతం ఎలాగో బతకాలి కదా ! అందుకే తప్పడంలేదమ్మా”అనేసి అక్కడ్నుంచి గబగబా వెళ్ళిపోయింది నర్సు.
కూతురితో ఈ విషయం ఇప్పుడే చెప్పదల్చుకోలేదు, పూర్తిగా నిర్ధారించుకున్నాకే చెప్పాలని నిర్ణయించుకుంది. పిల్లాడు చేతికొచ్చేదాకా నమ్మకం ఏమిటి ? ఒకవేళ ఆ పిల్లాడ్ని ఎవరైనా ఈ పాటికే తీసుకెళ్ళిపోయింటే ? అందుకే కూతురికి ఇప్పుడే చెప్పకూడదని నిర్ణయించుకుని భర్త రామ్మోహన్ కి ఫోన్ చేసింది.
“మీతో ఓక విషయం మాట్లాడాలి, అర్జంటుగా రాగలరా ?”
ఎప్పుడూ భార్య అంత తొందరపెట్టదు. ఏం జరిగిందోనని కంగారు పడ్డాడు…
“ఏం జరిగింది ? పాపెలా వుంది.. కృత్తిక ఆరోగ్యం పర్వాలేదు కదా !”అడిగాడు భార్యని.
“భయపడాల్సిందేమీ లేదుగానీ, ఒక ముఖ్యమైన విషయం అర్జంటుగా మాట్లాడాలి. ఇలా ఫోన్లో ఒద్దులేండి. వీలైనంత వరకు వెంటనే రండి”అంది కవిత.
“పావుగంటలో అక్కడుంటాను.” అనిఫోన్ పెట్టేశాడు.
ఆస్పత్రి ఆవరణలో ఎవరూ లేకుండా ఓ మూల కూర్చున్నారిద్దరూ. భర్తతో విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది.
“ఎందుకిదంతా… వున్నదున్నట్టు చెప్పెస్తే కాస్సేపు తిడాతారు. తర్వాతదే సర్దుకుంటుంది కదా! ఇదంతా బైటపడితే ఇంకో సమస్యగా మారచ్చు. అవసరమా చెప్పు?” అన్నాడాయన.
“అలాకాదండీ….అసలే వాళ్ళు ఛాదస్తం మనుషులు … ఇప్పుడే సవాలక్ష సమస్యలతో బాధపడుతోంది… రేపు ఇదో కొత్త సమస్య …ప్చ్………ఎంత గారాబంగా పెంచాం . దానిబతుకిలా అవుతుందనుకోలేదు.
కనీసం ఈ సమస్యనుంచి మనం దాన్ని గట్టెక్కిస్తే దాన్ని అభద్రతా భావం నుంచైనా తప్పించగలమేమో కదా !” అంది దిగులుగా.
“సరే … కవితా నాకిష్టం లేకపోయినా మీ ఇద్దరికోసం సరే అనాల్సి వస్తోంది… కానీ రేపేమైనా జరిగితే దాని కాపురం కూడా మంటగలిసిపోతుంది కదాని నాభయం “అంగీకరిస్తూనే అయిష్టతని తెలిపాడతను.
“ఈ విషయం మూడో కంటికి తెలియదు…. మనిద్దరం ఆమెతో మాట్లాడతాం….”భర్త ఒప్పుకోవడమే చాలన్నట్లుగా.
ఈ విషయాలేవీ తెలియని కృత్తిక మనసులో ఎలాగైనా, ఏం చేసైనా ఈ సమస్యకి పరిష్కారం వెతుక్కోవాలనే ఒక వివేకరహిత ఆలోచన….
అప్పటికప్పుడు ఆమె మనసులో పుట్టిన ఒక దుర్మార్గపు ఆలోచనకి మెరుగులు దిద్దుతోంది… ఇప్పుడా అమ్మాయికి ఈ సమస్యనుంచి బైటపడడమే కావాలి… అందుకోసమే ఏమైనా చేయగల వెర్రి ఆమెని ఆవరించింది.
రాత్రి పన్నెండు….
వార్డులో నర్సు కునికి పాట్లు పడుతోండి.. కృత్తిక ముందుగనే ప్లాన్ చేసుకున్నట్టుగా పిల్లిలా జనరల్ వార్డులోకి నడిచింది…..ఎక్కడి వాళ్ళక్కడ గాఢ నిద్రలో వున్నారు.
నాలుగో నంబరు బెడ్డుమీద గాయత్రి పక్కన మగశిశువు తల్లి పక్కన ఆదమరిచి నిద్రపోతున్నాడు. ముందుగానే అనుకున్న విధంగా
మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ బాబుని ఎత్తుకుని గబగబా అక్కడ్నుంచి బైటికి నడిచింది. తల్లి దగ్గరికెళ్ళి మెల్లిగా
“అమ్మా ….పాపని ఎత్తుకునిరా . ఇంటికెళ్ళిపోదాం” కంగారు గొంతుతో గుసగుసగా అంది….
కవిత కేమీ అర్థం కాలేదు.
“ఇప్పుడు ఇక్కడ్నుంచి వెళ్ళకపొతే ప్రమాదం…పోదాం పదమ్మా” తొందరపెట్టింది.
“ఏం జరిగింది ? పాపనిటివ్వు ” అని అందుకోబోయి వేరే బిడ్డ కూతురి చేతుల్లో వుండడం చూసి విషయం అర్థమై షాకయ్యింది కవితకి.
“ఏమిటే… పాపేది.ఈ పిల్లాడ్ని ఎక్కాడ్నుంచి తెచ్చావే. ..”అంటోన్న తల్లి నోటిని చేత్తో మూసేస్తూ….
“ష్…! అరవకమ్మా . నాకు వేరే దారి కనిపించలేదు. ఇప్పుడు మనం ఇక్కడ్నుంచి వెంటనేవెళ్ళకపోతే కొంపమునుగతుంది…పద ! అన్నీ బ్యాగులు సర్దేశాను…. పాపనెత్తుకుని, బ్యాగుతీసుకుని వచ్చేసేయ్ ! తొందరగా …..” అంటూ తల్లిని తొందర పెట్టింది కృత్తిక.
అయ్యో!…ఎంత పని చేశావే… ఇప్పుడు నువ్వే ముంచుకుంటున్నావు……. ఇది రహస్యంగా వుంటుందని ఎలా అనుకున్నావే… పిచ్చి గానీ పట్టింగానీకు ? అయినా నీ కోసం ఎప్పుడూ చేయని పని చేయడానికి నేను సిద్ధమైయ్యాను… ఈ లోగా నువ్వీ మతిలేని పని చేసి కొంపమీదకి తెచ్చావు…” అంటూ కూతురికి తను నర్సుతో మాట్ళాడిన విషయాన్ని క్లుప్తంగా చెప్పింది కవిత.
తెలిసో తెలియకో చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి గానీ, మరో తప్పు చేయడం వల్ల జీవితానికే ముప్పు కృత్తికా…. నీ స్వార్థం కోసం మరో తల్లికి గర్భశోకాన్ని కల్గిస్తావా….. నీకిలాంటి బుద్ధేంటే ? ఇంత బలహీనం గా ప్రవర్తిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు.అందులోనూ ఇది బైటికి తెలిసిందంటే అప్పుడేంటి నీ పరిస్థితి ? ఎప్పుడైనా ఊహించావా ? తప్పుని ఎప్పుడూ సమర్థించుకొకు.. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొ తప్పు చేయడం అంతకంటే నేరం… అందరికీ తెలియక ముందే వెళ్ళి ఆ బాబుని అక్కడ పెట్టేసి రా… తొందరగా వెళ్ళు..” కాస్త కరుకుగానే హితబోధ చేసింది కూతురికి…
అంతవరకూ ఏదో ఆవహించినట్టుగా వున్న కృత్తిక తల్లి మాటలకి కదిలిపోయింది. తను చేస్తున్నదేమిటో బోధపడించా అమ్మాయికి. మరుక్షణం కృత్తిక ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఇప్పుడు పూర్తిగా తెలివిలోకి వచ్చేసింది… కళ్లముందు పొరలు కొంచెం కొంచెం వీడిపోయాయి. ఏం చేస్తోంది తను? కేవలం అత్తగారికి భయపడేనా ? ఇదేంటి … ఎన్నడూ లేనిది ఇంతగా కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి… క్షమించరాని నేరం చేసింది.. మరో తల్లి కన్న బిడ్డని ఎత్తుకొచ్చేసింది… ఇప్పుడు అందరికీ తెలిస్తే…? ఇంతబతుకూ బతికి.. భగవంతుడా… నన్ను క్షమించకు… ఇలా చేసేకన్నా ఆత్మహత్యా చేసుకున్నా సరిపోయేది….. తన బిడ్డే తనకి కావాలి… అదే మాట అత్తగారితో ధైర్యంగా చెప్పి ఆ తర్వాత వచ్చే సమస్య ఎలాంటిదైనా దాన్ని ఎదుర్కోవాలి….. అవును ఈ నిర్ణయమే ఇంతకుముందు తీసుకున్నట్టయితే తన వల్ల ఇలాంటి ఘేరమైన తప్పు జరిగి వుండేది కాదు. ఇంక ఆలస్యం చేయకూడదు…’కృత్తిక ముఖంలో ఇప్పుడు తెగింపు కనిపిస్తోంది. తెలివి తక్కువ తనమో, పిరికి తనమో తన చేత ఈ పని చేయించింది. ఇప్పుడు పశ్చాత్తాపంతో తిరిగి ఆ పిల్లాడ్ని యధాస్థానంలో వుంచాలని గబగబా అక్కడికి వెళ్ళింది.
ఏదైతే జరక్కూడదనుకుందో అదే జరిగింది.
దగ్గరదాకా వెళ్ళిన క్షణంలో చేతిలో పిల్లాడు. ‘కేర్’మని ఏడుపందుకున్నాడు. అంతా లేచారు. హఠాత్పరిణామానికి కృత్తిక నవనాడులా స్పందించడం మానేశాయి.. .చేతిలో పిల్లాడితో శిలలా అలాగే నిలబడిపోయింది.
“దొంగ…దొంగ…పట్టుకొండి ….”అంటూ అరిచారెవరో.
గబగబా ఆ తల్లి కృత్తిక చేతిలో తన పసివాడ్ని లాక్కుంది. కృత్తిక ఇంకా షాక్ లోనే వుంది. ఏదేదో గొణుక్కుంటోంది.
“పిల్లాడ్ని ఎత్తుకెళ్ళడానికి నీకు చేతులెలా వచ్చాయే..(బూతు తిట్టు)
ఎవరో కృత్తికని రెండు దెబ్బలు వేశారు.
“కొట్టకండి…. ! పొలీసుల కప్పగిస్తే సరి… బాగా బుద్ధి చెపుతారు”మరెవరో సలహా.
ఈ సందడి విని కవితకేదో అనుమానం వచ్చి అటువైపు పరిగెత్తుకొచ్చింది. అక్కడ్ని దృష్ట్యాన్ని చూసి జరిగింది వెంటనే అర్థమైంది..
‘అంతా ఐపోయింది.. ఇప్పుడేం చేయను ? భగవంతుడా… నా బిడ్డని నువ్వే కాపాడాలి’ అక్కడికి చేరుకుని, కూతుర్ని వారినుంచి విడిపించి, వాళ్ళని బతిమాలుకునే ధోరణితో
“అమ్మా .. అయ్యా… ! తప్పుగా అనుకోకండి .. ఇది నా కూతురే .. దానికి మతిస్థిమితం లేదు.ఏం చేస్తుందో తనకే తెలీదు .. దాన్నొదిలేయండి మీకు దణ్ణం పెడతాను” అంటూ అక్కడున్న వారందరికీ చేతులెత్తి మొక్కుతూ కళ్ళనీళ్ళ పర్యంతమైంది కవిత.
తప్పించుకోవడానికి ఇలాగే అంటారు.. ఎవరూ చూడకపోయివుంటే ఏమైవుండేది? పిల్లాడ్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు… ఇప్పుడు విషయం బయటపడేసరికి ఇలా అబద్ధాలతో తప్పించుకోడానికి చూస్తారు.. ఎంతమందిని చూళ్లేదు?”అందొకామె.
కవిత మాత్రం కూతురి కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలుతునే వుంది.
అప్పటికే కృత్తిక పరిస్థితి అయోమయంగా మారింది.. ఎవర్నీ గమనించకుండా తనలో తాను ‘చేసిన తప్పుకి నాకిలా జరగాల్సిందే దేవుడా… నన్ను క్షమించకు…’ అని గొణుక్కుంటోంది.అప్పటికే విషయం మిగతా వార్డుల్లోకి పొక్కింది… తల్లులు తమ బిడ్డల్ని పొత్తిళ్ళలోకి అదుముకున్నారు. ఎవరో పోలీసులకి ఫోన్ చేశారు.అంతా క్షణాల్లో జరిగిపొయింది…
పోలీసులు రంగప్రవేశం చేశారు….ఇంక పరిస్థితి తన చేతిలో లేదని అర్థమై భర్తకి ఫోన్ చేసింది .ఆ తల్లి మూగబాధ చీకటిలో కలిసిపోయింది.
“ఏం చేయాలి? ఇప్పుడెలా..కృత్తిక బతుకు సర్వనాశనం అయిందే.. అన్నిటికీ చెడిపోయింది… ఇంతకన్నా అందరూ కట్టగట్టుకుని ఇంత విషం తాగినా సరిపోయేది కదా !’కవిత మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధ. పోలీసులు కృత్తికని ఏదో అడుగుతున్నారు.. కృత్తిక మాత్రం ‘ దేవుడా నన్ను క్షమించకు.’ అంటూ గొడుగుతూనే వుంది.. ఆమెకిప్పుడు ప్రపంచం కన్పించడంలేదు. .. మునుపటి కృత్తికలా లేదామె…
ఇంతలో కృత్తిక తండ్రి అక్కడికి చేరుకున్నాడు.. ఏడుస్తూ పోలీసులతో ఏదో బతిమాలుతున్నాడు.
:”స్టేషన్ కి వచ్చి మాట్లాడవయ్యా .. నువ్వేం చెప్పుకోవాలన్నా అక్కడే చెప్పుకోవాలి”అంటూ చేతనమూ అచేతనమూ కాని స్థితి లో వున్న కృత్తికని నడిపించూకుంటూ తీసుకెళ్ళి జీపెక్కించారు.. ఆమె తండ్రి వాళ్ళతో పాటే వెళ్ళి జీపులో కూర్చున్నాడు…
ఆస్పత్రిలో కవిత పసికందుతో ఒంటరిగా మిగిలిపోయిన కవిత శోకదేవతలా వుంది…. అంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది… తనేమీ చేయలేకపోయాననే బాధ .. కూతురి భవిష్యత్తు కళ్ళముందే నాశనమైపోతుంటే చూస్తూ .. ఆమె మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న .. తప్పెవరిది???
బాగుంది