బాల్యంలో నిన్ను చూపిస్తూ అమ్మ నాకు గోరుముద్దలు పెట్టింది
కౌమారంలో నాన్న తెలుపంటే అదే అంటూ నీ వెన్నెలని చూపించాడు
యవ్వనంలో నీ నవ్వు ఇలా ఉంటుందంటూ రవి నీ చల్లదనాన్ని చూపించాడు
అందుకేనేమో నేనెదుగుతున్నాకొద్దీ నాతోనే ఎదుగుతోంది నీపై అనురాగం…..

అమ్మ మీద అలిగి తోటలో నక్కి కూర్చున్నప్పుడు నువ్వు నవ్వుతూ నన్ను ఆహ్వానించలేదూ……
రవిమీద కోపం వచ్చినప్పుడల్లా నీ వెన్నెల నా గుండెలమీద అల్లరిగా చిందులేస్తూ చక్కిలిగిలి పెట్టలేదూ…
ఒంటరిగా వేపచెట్టు కింద నులకమంచం మీద పడుకుంటే నీ బింబం నాతో జతకలుపలేదూ
ధారలు, ధారలుగా , జల్లులు, జల్లులుగా కురిపిస్తోన్న వెన్నెల నాచుట్టూ దోమతెర కడితే మైమరచి నిన్నేచూశా
కళ్ళప్పగించి నీ సౌందర్యాన్ని వీక్షిస్తుంటే దిష్టి తగలకుండా నల్లని మేఘాలు నిన్నావరించాయి…..
నిరాశగా నిట్టూరుస్తూ, మేఘాలను ఎన్ని విధాలుగా శాపనార్థాలు పెట్టానని .. అందుకే
మేఘాలని చెదరగొడుతూ చిరునవ్వుతో నీ చేతుల అప్యాయంగా ఆహ్వానించాయి…
ఇంకొంచెం పెద్దదాన్నయాక వస్తానని నీకు ప్రమాణం చేశానా….
ఇంతలోకే శాస్త్రవేత్తలట ఏవో పరిశోధనంటూ నీ దగ్గరకు పయనమయారు
వెన్నెలాలేదు…..వెలుగూ లేదు…. అన్నీ రాళ్ళు రప్పలంటూ నా ఆశలమీద నీళ్ళు చల్లారు
రాముడుకు అద్దంలో కనిపించి అలుకదీర్చింది నీవు కాదట .. కృష్ణుడికి పాలల్లో కనిపించి అపనిందలపాలు చేసింది నువ్వుకాదట
నీవున్నదీ ఓ లోకమట నీ బింబం ఆ లోకం ప్రతిబింబమట…….
నిజమేనా ? ఎలానమ్మను?
తారకలతో సరసాలాడే శశాంకవు నీవు కాదంటే ఎలా నమ్మను ?
కృష్ణశాస్త్రి గీతంలో కమ్మని రాగం నీవు కాదంటే ఎలా నమ్మను ?
నమ్మలేను…. ఎవరేం చెప్పినా నమ్మలేను…. అయినా ఎవరేమంటే నాకేం….
నాదృష్టిలో ఎన్నటికీ అందాల జాబిల్లివి .. చలువల పందిరివి ….వెన్నలదిన్నెవి..
అందుకే నీకిచ్చిన మాటకన్నా ముందే
నా కలల సౌధానికి పునాదులు వేసుకోవడానికి నీ వెన్నెల ముద్రలని వెంబడిస్తూ పయనమయా…
ఇంతలో ఏదో అలజడి … మరేవో శబ్దాలు .. నా కళ్ళముందు అకస్మాత్తుగా అలముకున్న చీకటి
అవినీతి, అక్రమాలు, అధర్మాల , అసమానతల కాలుష్య మేఘాలు అంధకారం పరిచాయి.
అయ్యో నేస్తమా ! నా చంద్రమా! ఈ అంధకారం ఛేదించి నిన్ను నేను చేరేదెలా ?
నీ వెన్నెల జలపాతాల్లో జలకాడేదెలా? దోసిళ్ళతో ఆ అమృతాన్ని తాగేదెలా?
కృంగిపోయిన మనసుతో నిస్సహాయంగా నిలిచిన నన్ను నీ బింబం ఓదార్చింది… రా,రా రమ్మంటూ చేతులు సాచింది.
అంతే నిస్సత్తువగా కూలిపోయిన నా అణువణువునా ఏదో అపూర్వమైన శక్తి ..ఏదో ఉత్సాహం
శాస్త్రవేత్తలకు నువ్వేదైతే నాకేం.. నాకు మాత్రం కృష్ణశాస్త్రి కవితవి…………
మధురమైన పాటని.. మల్లెల సౌరభానివి… మరపించి మత్తుజల్లే చల్లని చంద్రుడిని
నాకోసం నువ్వు నిర్మించిన వెన్నెల మెట్ల వైపు అడుగులు వేశా…
ఒక్కోమెట్టే ఎక్కుతూ నీ చల్లని నీడన చేరతా.. చిరస్మరణీయమైన కావ్యాన్నవుతా……………

ఒక్క అభిప్రాయం

  1. raju 11 మే 2010 , 6:12 pm

    బాగుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)