ఫిబ్రవరి 11 వ తేదీన ముంబాయిలో 32 ఏళ్ళ యువ న్యాయవాది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (ఐఎపిఎల్) సభ్యుడు, కమిటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమెక్రటిక్ రైట్స్ (సిపిడిఆర్) కార్యకర్త. షాహీద్ అజ్మీని ఆయన ఆఫీసులోనే సర్కారీ హంతక ముఠా హత్య చేసింది.
పేద ప్రజల న్యాయవాదిగా ఆమాయక ముస్లిం యువకులను తీవ్రవాదులుగా ముద్రవేసిన కేసులలో పట్టుదలగా వాదించి వారిని విడిపించి అతి చిన్న వయస్సులో ముంబాయిలో ప్రముఖ న్యాయవాదిగా పేరొందాడు. గుజరాత్ లో మైనారిటీల పై దాడులలో బాధితుల పక్షం వహించాడు. సిమి విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు వాదించాడు. 1994లో 16 ఏళ్ళ వయస్సులో ఏ సాక్ష్యం లేకున్న తప్పుడు పోలీసు కన్ ఫెషన్ కారణంగా ఐదేళ్ళ టాడా శిక్షకు గురై తీహార్ జైలు జీవితం గడిపాడు. జైలు జీవితంలోనే చదువు కొనసాగించి న్యాయవాది అయినాడు . తోటి నిరక్షరాస్యులైన ఖైదీలకి ధర్మ ఆపీళ్ళు ఎన్నో రాశాడు. విడుదలైయ్యాక ముందుగా జర్నలిస్టుగా తరువాత న్యాయవాదిగా బాధ్యతాయుతమైన హక్కుల కార్యకర్తగా పనిచేశాడు. ఖైదీల హక్కులపై ముంబాయి హైకోర్టులో, ఎంసిఓసిఎ (మొకా) చట్టం క్రింద అక్రమ కేసుల చట్టాబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వాదించాడు. చిన్న వయస్సులోనే తన కన్న పెద్ద వయస్సు వారి మీద కూడా ఎంతో ప్రభావాన్ని వేసే నిబద్ధ న్యాయవాది, చురుకైన హక్కుల కార్యకర్త షాహిద్ ఆజ్మీ.