గతితార్కిక భౌతికవాదం
- ఐరా గొలోబిన్
రెండో అధ్యాయం (తరువాయి భాగం)
సామ్రాజ్యవాదపు విలువలకి వత్తాసు పలుకుతూ, చెడుతో ఉత్తుత్తి పోరాటాలు జరిపే అస్తిత్వవాదపు సామాజికధోరణికి తాత్వికమైన అంశంకూడా ఉంటుంది. జాస్పర్స్ లెక్కన తత్వధోరణి అంటే బూర్జువా తత్వమే. అందుకే అతను తత్వశాస్త్రానికీ, విజ్ఞానానికీ పొసగదని తేల్చేశాడు. ‘తత్వశాస్త్రం విజ్ఞానం కాదు…నాదే కనక కేవలం వస్తుగతధోరణి అయినట్టయితే నా తత్వశాస్త్రం ఏ మాత్రమూ తత్వశాస్త్రం అనిపించుకోదు’.65 ‘శాస్త్రీయవిజ్ఞానంగా నలుగురూ ఆమోదించే ప్రావీణ్యం తత్వశాస్త్రం కాజాలదు…’.66 ‘అన్వేషించేందుకు గమ్యమేదీ ఉండదు కనక తత్వశాస్త్రపద్ధతులకీ, వైజ్ఞానికపద్ధతులకీ తేడా ఉంటుంది…తత్వశాస్త్రపద్ధతులు అలాంటి గమ్యాలకు అతీతమైనవి’.67
ఈ విధంగా తత్వశాస్త్రాన్నీ, విజ్ఞానాన్నీ వేరు చేసిన జాస్పర్స్ విజ్ఞానం పరిమితమైనదంటాడు. ‘విజ్ఞానంలోని గుడ్డినమ్మకాలను బైటపెట్టాలి ‘. గుడ్డినమ్మకాలంటే ఏమిటి? అది ప్రపంచాన్ని సమగ్రంగా అర్థంచేసుకోవడమనే శాస్త్రీయప్రతిపాదనే. ‘అటువంటి సమగ్రజ్ఞానం పొందడం విజ్ఞానశాస్త్రానికి అలవికానిపనే’.68 అదంతా మతాలవంటి విజ్ఞానవిరోధ చింతనకే సాధ్యమని అతనంటాడు. తత్వశాస్త్రానికీ, విజ్ఞానానికీ సంబంధమే లేదు. తత్వశాస్త్రాలు విశదపరిచే సత్యాలను తెలుసుకోవడం వైజ్ఞానిక చట్రాల్లో ఇమిడితే సాధ్యంకాదు ‘.69
పంతొమ్మిదో శతాబ్దపు వర్గపోరాటాలూ, శాస్త్రీయప్రగతీ ముఖ్యంగా మార్క్స్, ఎంగెల్స్, డార్విన్ సాధించినవే. వీటివల్ల బూర్జువా మేధావివర్గంలోనూ, ప్రగతిశీల కార్మికుల్లోనూ మతఛాందసత్వం కొనసాగడం రానురాను కష్టమయింది. సాంప్రదాయక మతతత్వధోరణులు ఏ మాత్రమూ పనిచెయ్యని నేపథ్యంలో అస్తిత్వవాదాన్ని స్పష్టంగా చూడవచ్చు.70 ‘దేవుడు మరణించా’డనే నీచే ప్రకటన ఈ వైఫల్యాన్ని నాటకీయంగా తెలుపుతుంది. అలగాజనాన్ని లోబరుచుకునేందుకని దేవుడికి బదులుగా నీచే ఒక సూపర్‌మేన్, లేదా అధిమానవుణ్ణీ, ఒక అధిమానవజాతినీ ఊహించాడు. తరవాతి కాలంలో అది హిట్లర్, ‘అధినాయక ఉత్తమజాతి’గా రూపుదిద్దుకుంది.
అస్తిత్వవాదుల్లో దేవుడు లేడని వాదించేవారిలో సార్త్ ప్రథముడు. ‘దేవుడే కనక లేకపోతే దేన్నయినా అనుమతించవలసివస్తుంది’ అని చెప్పిన రచయిత దస్తయేవ్‌స్కీ మాటలు సార్త్‌కు ప్రేరణగా పనిచేశాయి. ‘అస్తిత్వవాదంలోని విభిన్నఅంశం ఇదే’ అని సార్త్ ప్రకటించాడు.71 దీని కర్థమేమిటంటే దైవశాసనం అనేదాన్ని గనక తృణీకరిస్తే మానవసంకల్పమే అన్నిటికన్న ప్రధానమై, తన ఇష్టానుసారంగా ప్రవర్తిల్లుతుంది. వస్తుగతంగా, సూత్రాలనుబట్టి నడిచే అవసరాలది పైచెయ్యి అవదు. ఇటువంటి దృక్పథం విజ్ఞానవిరోధక ధోరణిని కుటిలపద్ధతిలో, ప్రాపంచిక ముసుగుతో ప్రచారం చేస్తుంది. ఎందుకంటే దానికి ఆధ్యాత్మికవేషం తొడిగి ముతకపద్ధతిలో ప్రచారం చెయ్యడం వీలవదు.
[సార్త్‌కి గణితమన్నా, విజ్ఞానమన్నా, ముఖ్యంగా ఇంజనీరింగ్ అన్నా నచ్చేదికాదట. ఇది ఎంతదాకా పోయిందంటే ఒకసారి ఎవరో అతన్ని చూసి ఇంజనీర్‌లాగా ఉన్నాడన్నప్పుడు అదొక భరించరాని అవమానంగా భావించాడట. (స్టెర్న్ రాసిన సార్త్ అనే పుస్తకంలోని పదో పుట)]
సార్త్ అస్తిత్వవాదానికి మౌలికత లేదు. తత్వపరంగా అది సాధించినదల్లా మతాల సారానికి లౌకిక ముసుగు తొడగడమే. ఈ లౌకికధోరణి, లేదా మతసంకేతాల చింతనాధోరణికి లౌకికలక్షణాలను ఆపాదించడమే ఆధునిక అస్తిత్వవాదతత్వపు లక్షణం అనుకోవచ్చు. సార్త్ దేవుణ్ణి నమ్మనని అస్తమానమూ నొక్కిచెపుతూ, తాను మానసికంగా అటువంటి నాస్తికపరిధిలోనే ఉంటానని ప్రకటిస్తాడు. అతను తనను తానే మోసపుచ్చుకునే ఇలాంటి వైఖరితో తన లక్ష్యాలను వివరించడానికై అధిగమనధోరణిమీద మటుకు ఆధారపడతాడు.72 దేవుణ్ణి నమ్మని సార్త్‌వంటి అస్తిత్వవాదులూ, మార్సెల్‌లాగా దైవశాస్త్రాన్ని నమ్మే అస్తిత్వవాదులూ తాత్వికంగా కలవడానికి అధారసూత్రం ఇదే. దేవుణ్ణి దొడ్డిదారిన ప్రవేశపెట్టే ఉద్దేశంతో సార్త్ భౌతికవాదులు ప్రతిపాదించే పరిణామవాదాన్ని ఎద్దేవా చేస్తాడు. ‘జీవరాశి ఆవిర్భావం సాదా జీవజాతులతో మొదలై, సంక్లిష్టజాతులుగా పరిణమించిందనే సిద్ధాంతం ఒక పచ్చి అభూతకల్పన’ అంటాడు.73
అయితే సార్త్ నిజాయితీగా ఒప్పుకునేదేమిటంటే ‘అస్తిత్వవాదం ‘జ్ఞానపు’టంచులమీద ఆధారపడుతుంది. అస్తిత్వవాదం మొదట్లో ఆ ‘జ్ఞానాన్ని’ నిరాకరించినప్పటికీ, ఈనాడు దానితో కలవడానికే ప్రయత్నిస్తుంది’.74 ఇక్కడ ‘జ్ఞాన’మంటే మార్క్సిజమే. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ మార్క్సిస్ట్ తత్వశాస్త్రాన్ని నమ్ముతున్నవారి సంఖ్య పెరగడంతో సార్త్ దాన్ని దొంగదెబ్బ తీయ ప్రయత్నిస్తాడు. తత్వశాస్త్రాన్ని వినిపించే వాద్యబృందంలో అస్తిత్వవాదానిది చిన్నపీట కాదని అతను స్పష్టంచేస్తాడు. ‘మొత్తం తత్వశాస్త్రంలో అది కరిగి, అణగారినట్టుగా అనిపించడంతో అస్తిత్వ వాదానిదొక ప్రత్యేక అన్వేషణ కాకపోవచ్చుగాని అసలు అన్వేషణకంతటికీ అదే ఆధారం కాగలదు’. 75
అస్తిత్వవాదం ఇలా కరగడం మొదలుపెడితే అసలుకే మోసం వచ్చి, మార్క్సిజం కాస్తా మార్క్సిస్ట్ వ్యతిరేకశాస్త్రమై కంచె చేనును మేసినట్టవుతుంది. అటువంటి బూర్జువా లక్ష్యానికి సహాయపడతాడు కనకనే సార్త్ చేసిన ఈ ప్రకటనను సరిగా అర్థంచేసుకోవాలి. ‘పైచెయ్యి సాధించిన వర్గాల ఆలోచనలదే పైచెయ్యి అవుతుందని మార్క్స్ చెప్పినమాట అక్షరాలా నిజం’.76 బలహీనపడుతున్న తన మతప్రాతిపదికతో సతమతమయే బూర్జువావర్గానికి సహాయపడే సార్త్ ప్రవచించే పెట్టుబడిదారీ పద్ధతికి రాచబాటగా పనిచేస్తుంది.
[మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉండిన సార్త్ నిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థను సంస్కరించడానికి పోరాడిన ఒక పెటీబూర్జువా ప్రతినిధి. అయితే అతని పెటీబూర్జువా సిద్ధాంతాలుగాని, నమ్మకాలుగాని చెడు ధోరణులను అతను బలంగా విరోధించిన విషయాన్ని మరుగుపరచవు. జాతివివక్షనూ ఫాసిజాన్నీ, అల్జీరియావంటి చోట్ల వలసవాదాన్నీ అతను గర్హించాడు. అలాగే ఇవి మెచ్చుకోదగినవే అయినా అతని అస్తిత్వవాదంలోని లోపాలను విస్మరించలేము.]
విజ్ఞానానికీ, మతాలకూ ఉన్న సంబంధాన్నీ, వర్గపోరాటానికీ, వర్గసామరస్యానికీ ఉన్న లంకెనూ కార్ల్ పోపర్ ఇలా విశదం చేస్తాడు. ‘పంతొమ్మిదో శతాబ్దంలో విజ్ఞానానికీ, మతాలకూ మధ్య రేగిన చిచ్చుకు ప్రస్తుతం కాలదోషం పట్టిందని నాకనిపిస్తుంది. హేతువాదాన్ని విమర్శించకుండా ఆమోదించడం సరికాదు. అందువల్ల జ్ఞానానికీ, నమ్మకానికీ మధ్య తలెత్తేది సమస్య కాదు. అది రెండు రకాల నమ్మకాల వైరుధ్యమే…మానవజాతి అంతా ఒకటేననుకోవాలా, లేక అందులో మిత్రులూ, శత్రువులూ, యజమానులూ, నౌకర్లూ ఉంటారనుకోవాలా అన్నదే సమస్య’.77 పోపర్ లెక్కన విజ్ఞానం తత్వశాస్త్రానికి
(విమర్శకు అతీతమైన హేతువాదం) దూరంకావాలి. అప్పుడే మతానికి మార్గం సుగమ మవుతుంది. అప్పుడే అణగారినవారు తమ యజమానులను ప్రేమిస్తారు. వర్గసమాజంలో కపట ‘సర్వమానవ సౌభ్రాతృత్వం’ వీలవుతుంది.
References:
65. Jaspers, Philosophy, Vol.1 pp. 316,318
66. Jaspers, Way to Wisdom, p. 7
67. Ibid., p.161
68. Jaspers, The Perennial Scope of Philosophy, p. 178
69. Jaspers, Way to Wisdom, p. 162
70. Kaplan, The New World of Philosophy, p.100
71. Quoted in Novack, Existentialism Versus Marxism, p.156
72. Richter, Jean Paul Sartre, p. 28
73. Sartre, Literary and Philosophical Essays, p. 233
74. Sartre, Search for a Method, p. viii
75. Ibid., p. 181
76. Ibid., p. 17
77. Popper, The Open Society and Its Enemies, Vol.2 p. 246
పాత సంచిక లో వ్యాసమే మళ్ళీ వేసేరు.
సుబ్బారావు గారు,
జరిగిన తప్పుకి చింతిస్తునాం. కొత్త వ్యాసం వేసాం.
- ప్రజాకళ
సమకాలీన “ప్రగతిపర” రచయితలు సార్త్రే ఒక ప్రగతి శీల రచయిత అనే భావన పెంపొందిస్తున్నారు. ఈ పని విరసంలో చాలా మంది సభ్యులు చేస్తున్నారు. పై వ్యాసం వాస్తవాన్ని వెలికి తీస్తోంది. మంచి వ్యాసాన్ని అందిస్తున్నందుకు కృతఙ్ఞతలు