బావిలో నీళ్ళు లేనప్పుడు
పెదాలు ఎండి పోతాయి
పొలాలు బీటలు వారితే
గుండెలు చిట్లి పోతాయి
ఆకాశం అలిగిన వేళల్లోనే
వర్షించే కళ్ళకి పని
పోయిలో పిల్లి పడకేసి
కడుపు మంట పెట్టుకొంటుంది
వలస పోయే కాళ్ళని
ఏ పొలిమేర అడ్డుకోదు
కాడి కర్రు కొడవలి మూలపడి
అనావృష్టి చేను దున్నుతుంది
చేతులు రెండూ తెగిపోయినట్టు
కొమ్మల్ని నిలువునా నరికేసినట్టు
గువ్వ రెక్కల్ని పెడవిరిచేసినట్టు
చేతుల వృత్తుల గురికాటకం
అరచేతిలో ముద్దలేదు
అరమోడ్పు కన్నుల్లో నిద్రలేదు
కలలు సమ్మె చేసిన రాత్రి
ఆకాశం నక్షత్ర శూన్యం
ఆకులు దులుపుకొన్న చెట్లు
అలిగిన నవనాయికల సామాన్య
నగరం కళ్ళు ఊరిని చూసిన క్షణం
ఊరికి దిష్టి తగిలింది
కళ్లాపు మరచిన గుమ్మాలముందు
మరీచికల దృత నాట్యం
మండే సూర్యుడి సింధూరం
నిన్న చీలిన అర్థరాత్రి
నెర్రెలు పడ్డ పొలం దేహంతో
కలలో కొచ్చిన ఊరు
పందు ముసలిదై పోయింది.