ఖఢ్గ సృష్టి -శ్రీశ్రీ
రెండురెళ్ళు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో
క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో
అస్వతంత్రతని జయించడానికి
అహింసాయుధం ధరించామంటూ
రక్తపాతం లేకుండానే
రాజ్యం సంపాదించామంటూ
అవినీతి భారీపరిశ్రమలో
అన్యాయాల ధరలు పెంచేసి
స్వాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని
చక్రవడ్డీ తిప్పే కామందులకు
క్షణక్షణం మారుతున్న లోకాన్ని
సరీగా అర్థం చేసుకున్న వాళ్ళంతా
పేద ప్రజల పక్షం వహించడమే
పెద్ద అపరాధమై పోయింది.
అహింస ఒక ఆశయమే కాని
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలంటే
ఆయుధం అవసరమే మరి
ఆశ యం ఉండడం మంచిదే కాని
అన్ని ఆశయాలూ మంచివి కావు
ఆశయాలు సంఘర్షించే వేళ
ఆయుధం అలీనం కాదు
అందుకే అంటున్నాను నేను
అందుకో ఆయుధం అని
ఆచరణకి దారితీస్తేనే
ఆవేశం సార్థకమవుతుంది
అందుకే సృష్టిస్తున్నాను
అధర్మనిధనం చేసే ఈ ఖడ్గాన్ని
కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది
జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది
ఈ కత్తి
బూజుపట్టిన భావాలకి
పునర్జయం ఇవ్వడానికి కాదు
కుళ్ళిపోతున్న సమాజవృక్షాన్ని
సమూలచ్చేదం చెయ్యడానికి
దీన్ని
నల్లబజారు గుండెల్లో దించు
దీనితో
కల్లకపటాలను వధించు
ఇది
సమానధర్నాన్ని స్థాపిస్తుంది
నవీన మార్గాన్ని చూపిస్తుంది
ఈ కత్తి
ఊహాసమూహాల వ్యూహాలు పన్ని
వీర విహారం చేస్తూ
రణక్షోణిలో
జనాక్షౌహిణులు కదలడానికి
అందుకే రాస్తున్నా నొకగీతి
చేస్తున్నా నొక హేతి
రావోయి లోనికి
సందేహం దేనికి ?
ఇది నిజం
నవధర్మం మానవధర్మం
అణవశక్తికన్న
మానవశక్తి మిన్న
రావోయి రావోయి లోనికి
సంకోచం దేనికి
నను చూడగా ఇదే వేళ
నా మనః కార్మికశాల
క్రక్కేది భావాగ్ని సెగలు
క్రమ్మేది దావాగ్ని పొగలు
రావోయి రావోయి లోనికి
రాసేది రవ్యుష్ట గీతి
చేసేది పవ్యుగ్ర హేతి
బాగుది