boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

sri_sri_2.jpeg

కవిత్వంలో శ్రీశ్రీ చేసినన్ని ప్రయోగాలు బహుశా ఇంకెవరూ చేసి వుండరు. ఒక వేళ చేసినా, ప్రయోజన దృష్టితో చేసుండకపోవచ్చు. ‘ప్రభవ’ పద్యాలతో మొదలైన శ్రీశ్రీ, ‘మహాప్రస్థానం ‘ గీతాలతో మహాకవై, , అభ్యుదయ కవిత్యోద్యమానికి నాయకత్వం వహించాడు. ఆ తర్వాత ప్రాస క్రీడలు,లిమఋక్కులతో రన్నింగ్ కామెంటరీలు రాసి, ఒక వైపు ‘ఖడ్గసృష్టి’తో బాటు మరోవైపు అధివాస్తవిక కవితల్నీ సృష్టించాడు.


1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడ్డాక నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల ప్రభావంతో విప్లవ కవితలు రాసి విప్లవ కవితోద్యమంలో భాగస్వామి అయ్యాడు. అందుకే ‘సిప్రాలి’కి రాసిన ముందు మాటలో “శ్రీశ్రీ అలుపు లేని అన్వేషి, వెనుదిరగని సాహసి. నిరంతర ప్రయాణికుడు. ఏ మజిలీ దగ్గరైనా ఆగుతాడు కాని అక్కడే ఆగిపోడు” అని చలసాని ప్రసాద్ అన్న మాటలు నూటికి నూటిరవై పాళ్ళు నిజం.

ప్రయోగాలు చేశాడు గాని శ్రీ శ్రీ ప్రయోగవాది కాదు. ప్రయోగాలు చెయ్యడం వేరు, ప్రయోగవాదం వేరు. శ్రీశ్రీ ఏ కవితా ప్రయోగం చేసినా దానికో ప్రయోజనం ఉంటుంది. ప్రయోగం కోసం ప్రయోగం చెయ్యలేదు. సామాజిక ప్రయోజనం లేకపోయినా కవితా ప్రయోగాలు చెయ్యడం, ఆ ప్రయోగాల ద్వారా గొప్పకవిగా పేరుపొందాలనుకోవడం, ప్రయోగాల పట్ల వ్యామోహం ఉండడం ప్రయోగవాదం అవుతుంది. శ్రీశ్రీ కవిత్వంలో ప్రయోగాలున్నాయిగాని,ప్రయోగవాదం లేదు.. ఒక ప్రయోగం దానంతటది అవలక్షణం కాదు. దాన్ని అవలక్షణంగా మార్చగల శక్తి కొందరు కవులకుంటుంది. శ్రీశ్రీ తన కవితా ప్రయోగాలను ప్రయోజనకరంగా తీర్చి దిద్దాడు.

మహా ప్రస్థాన కవితలు రాశాక 1940 ల నుంచీ 1980 ల దాకా శ్రీశ్రీ తన కవితా ప్రయోగాన్ని ప్రయోజనకరంగా కొనసాగిస్తునే వచ్చాడు.సిరిసిరి మువ్వ పద్యాలు,రుక్కుటేశ్వర శతకం,ప్రాసక్రీడలు,పంచపదులు,లిమఋక్కులు,మొదలైనవి ఆ ప్రయోగాలు.

సిరిమువ్వ శతకం,రుక్కుటేశ్వర శతకం 1945-50 మధ్య కాలంలో రాసినవి.భారత దేశంలోనే చెప్పుకోదగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం జరిగిన కాలంఅది.అయితే ఈ శతకాలలో ఆ ప్రస్తావనే లేదు.చలసాని ప్రసాద్ అన్నట్లూ శ్రీశ్రీ ఆ మజిలీ దగ్గర ఆగాడు.తెలంగాణా పోరాటం గురించి రాయలేదనే ఆరోపణలకు శ్రీశ్రీ గురయాడు.ఇదొక్కటే శ్రీశ్రీ జీవితంలో మచ్చగా మిగిలి పోయింది.ఇతర ఏ ప్రజా ఉద్యమాల విషయంలోనూ శ్రీశ్రీ ఇలా దూరంగా లేడు.

సిరిసిరి మువ్వ,రుక్కుటేశ్వర శతకాల్లో తెలంగాణా పోరాటం ప్రస్తావనే ఉండే అవకాశం లేదు.తెలంగాణా గురించి రాయదలుచుకుంటే రాయవలసింది శతక పద్యాలలోకాదు.మాత్రా చందస్సున్న గేయాలలోనో,వచన కవితలలోనో రాయాలి.వస్తువుకు తగ్గ రూపాన్ని,శిల్పాన్ని ఎంచుకోవడంలో శ్రీశ్రీ అందె వేసిన చెయ్యి.ఈ శతక పద్యాలు ఎక్కువగా సరదాకు రాసినవి.అయితే కొన్ని పద్యాల్లో హాస్యం,వ్యంగ్యం,విమర్శ,కొన్ని అ భిప్రాలేయాలు లేకపోలేదు.

“పెసలో,బొబ్బర్లో వే
రు శనగలో విక్రయించి రూపాయలు బొ
క్కసమున కెక్కించడమా
సిసలైన కవిత్వ రచన?సిరిసిరి మువ్వా!”
అన్న పద్యంలో కవిత్వ రచన ధన సంపాదన కాదన్నాడు.ధన సంపాదన కోసం కాదని సూచించాడు.

“పందిని చంపినవాడే
కందం రాయాలటన్న కవిసూక్తికి నా
చందా ఇస్త్తానా?రా
సేందుకయో షరుతులేల?సిరిసిరిమువ్వా!” అన్న పద్యంలో రుషుల వంటి వారే కవిత్వం రాయాలన్న ప్రాచినుల అభిప్రాయాన్ని ఖండించాడు.భావ కవిత్వంపై శ్రీశ్రీ విసిరిన వ్యంగ్య భాణం సిరిసిరి మువ్వ పద్యాలలోనే ఉంది-
“ఉగ్గేల తాగుబోతుకు?
ముగ్గేల తాజ్ మహలు మునివాకిటిలో?
విగ్గేల కృష్ణ శాస్త్రికి?
సిగ్గేల భావకవికి?సిరిసిరిమువ్వా!”

సిరిసిరి మువ్వ పద్యాలు ప్రధానంగా 1945 , 46 సంవత్సరాలల్లో రాసాడు శ్రీశ్రీ. శ్రీ అనేది సంస్కృత శబ్దం. దానికి తెలుగు ‘సిరి’ . సిరి అంటే సంపద. ఈనాడు ఈ తెలుగు పదాన్ని విడిగా వాడడం లేదు. సమాసాల్లోనో, సామెతల్లోనో, జాతీయాల్లోనో మిగిలిఉంది. సిరిసంపదలు , నడమంత్ర పు సిరి మొదలైన విధంగా శతకాలలో మకుటం ఉంటుంది కాబట్టి శ్రీశ్రీ తన పేరు మీదనే ‘సిరిసిరి మువ్వ’ అని ప్రయోగించాడు.

సిరిసిరి మువ్వ పద్యాలు రాసేనాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు. బ్రిటీష్ పరిపాలన తుది దశలో ఉంది. బ్రిటీష్ హయాంలొనే నామమాత్రపు ఎన్నికలు జరిపించే వారు. పేరుకు ప్రజాప్రతినిధులుగా భారతీయులుండేవారు.అపుడే ఎన్నికలు ఎలా ప్రహసనంలా జరిగేవో శ్రీశ్రీ గమనించాడు.

“తలకాయలు తమతమ జే
బుల లోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజులు వస్తే
సెలవింక డెమెక్రసీకి సిరిసిరిమువ్వా!”
పరిపాలనలో డెమెక్రసీని గురించి రాసిన ఈ పద్యం ఈ నాటికీ సరిపోతుంది.

“మునుపటివలేకాదంటా
మన లోకం రూపమసలే మారిందంటా
వెనుకటి గొప్పలు తలపో’
సిన లాభం బండిసున్న సిరిసిరిమువ్వా!”

ఇలా సిరిసిరిమువ్వా పద్యాలలో వీలయినంతవరకు ఆధునిక భావాలు వ్యక్తం చేశాడు.

1947లో మదరాసు రాష్ర్ట ప్రభుత్వం ప్రజారక్షణ ఆర్డినెన్స్ ఒకటి జారీ చేసింది. దీనిని ప్రకాశం ఆర్డినెన్స్ అనేవారు.అప్పటి మదరాసు రాష్ట్ర్ర ప్రధానమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. అప్పట్లో రాష్ట్ర్ర ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అనేవారు. ప్రకాశం ఆర్డినెన్స్ కింద రాష్ట్ర్ర మంతటా కమ్యూనిస్ట్ లను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు.ఈ ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా శ్రీశ్రీ ‘ఉపాలంభనం’ పేరుతో పది సిరిసిరి మువ్వా పద్యాల్ని రాశాడు. అవి 1947 వ తేదీ ఆనందవాణి వార పత్రిక లో అచ్చయ్యాయి. వాటిలో ఒకటి-

” దేవుడి పేరిట ఏవే
వో వెధవ పనుల్ పొనర్చుటున్నదెకద , హిం
సావాదం గాంధీజీ
సేవకులే చేయలేదె ! సిరిసిరిమువ్వా!”

రెండో ప్రపంచ యుద్ధం పూర్తయ్యాక రష్యా కమ్యూనిస్ట్ పార్టీకీ,అంతర్జాతీయంగానే కమ్యూనిజానికి ప్రతిష్ట పెరిగింది.రష్యా పైకి దండెత్తి వచ్చిన హిట్లర్ ను, స్టాలిన్ సైన్యాలు మట్టికరికరిపించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ఫాసిస్టు హిట్లర్ ను ఓడింఛడానికి సోవియట్ యూనియన్ సైనికులుగానీ, ప్రజలు గానీ ఎందరో బలిదానం చేశారు. ఆ విధంగా ప్రపంచాన్ని హిట్లర్ ఫాసిజం నుండి కాపాడారు. హిట్లర్ కు వ్యతిరేకంగా పోరాడవలసిన అమెరికా గోడమీద పిల్లిలాగా దాగుడుమూతలు ఆడసాగింది. హిట్లర్ ,స్టాలిన్ లలో ఎవరు ఓడిపోయినా అమెరికాకు ఆనందమే. హిట్లర్ ఎలాగూ ఓడిపోయాడు కాబట్టి ఇక ఓడించవలసింది కమ్యూనిజాన్ని . ప్రపంచంలో కమ్యూనిజం వ్యాపించకుండా ఉండడం కోసం అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్రయత్నాల్లో మార్షల్ ప్రణాళిక ఒకటి. అమెరికా దేశీయాంగ కార్యదర్శి జార్జి మార్షల్ ఈ పథకాన్ని 1947 లో ప్రవేశ పెట్టాడు. అంతకు ముందే 1946 లో అమెరికాలో జరిగిన ఆర్థిక మహాసభలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF), వరల్డ్ బ్యాంక్ (WB) స్థాపించాలనే నిర్ణయాలు ఈ సభలోనే తీసుకున్నారు. మన దేశాన్ని సామ్రాజ్యవాద దేశాలకు తాకట్టు పెట్టాలనే కుట్రకు ఇది నాంది అయింది. అమెరికాలో జరిగిన ఈ ఆర్థిక మహాసభకు భారతదేశ ప్రతినిధిగా షణ్ముఖం చెట్టియార్ హాజరయ్యారు. 1941 -42 లో అమెరికాకు పంపిన వాణిజ్య ప్రతినిధి వర్గానికి ఇతనే నాయకుడు. ఈ సంధర్భాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశ్రీ రుక్కుటేశ్వరశతకం లోని కొన్ని పద్యాల్ని రాశాడు. చదవేస్తే ఉన్న తెలివి పోయినట్టుగా పదవులో రావడంతో భారతీయ మంత్రులకు మతి చెడిందన్నాడు. కాంగ్రెస్ వారి పాలన అయినా, ఆంగ్లేయుల రాజ్యమైన ఆంధ్రుల కొకటే అన్నాడు. కోళ్ళు తినేవాళ్ళ బదులు గొర్రెల్ని తినే వాళ్లు వచ్చారన్నాడు.

“మార్షలు ప్రణాళికకు మన
సర్షణ్ముఖ చెట్టియారు స్వాగతమిస్తే
హర్షద్దామని కొందరు
వర్షానికి చాతకాలవలె కలరు జరూ !”

సర్షణ్ముఖ చెట్టియారు- సర్ షణ్ముఖ చెట్టియార్. వర్షానికి చాతక పక్షులు ఎదురు చూసినట్టుగా మార్షల్ ప్రణాళిక కోసం భారత మంత్రులు ఎదురు చూడడాన్ని శ్రీశ్రీ నిరసించాడు.
( ’జరూ’ అన్నది రుక్కుతేశ్వర శతకానికి మకుటం. శ్రీశ్రీ కవితలకు ప్యారడీలు రాసి ప్యారడీ శాస్త్రి గా ప్రసిద్ధి పొందిన వారు జలసూత్రం రుక్మణీనాథ శాస్త్రి, సంక్షిప్తంగా జరుక్ శాస్త్రి రాసింది)

సిరిసిరి మువ్వ, రుక్కుటేశ్వర శతకాల్లోని హాస్యం కేవలం నవ్వించాడానికే పనికొస్తుందని చలసాని ప్రసాద్ ‘సిప్రాలి’ ముందుమాటలో అన్నాడుగానీ, అది పాక్షిక సత్యం మాత్రమే అనితెలుస్తుంది. ఈ శతకాల్లోని 30 - 40 శాతం పద్యాలు ఆనాటి సాహిత్య , సామాజిక , రాజకీయ , అంతర్జాతీయ విషయాలపై చెణుకులుగా కనిపిస్తాయి. తర్వాతి కాలంలో రాయబోయే నిప్పుకణికల్లాంటి ప్రాస క్రీడలకూ, లిమఋక్కులకూ ఇవి తొలిరూపాలుగా , రిహార్స్ ల్స్ గా అనిపిస్తాయి.

సిరిసిరిమువ్వ , రుక్కుటేశ్వర శతకాలకంటే కూడా ప్రాసక్రీడలకూ , లిమఋక్కులకూ మంచి పేరొచ్చింది. దానిక్కారణం ఇవి గొప రాజకీయ ప్రయోజనాన్ని సాధించడమే. వీటిల్లో శ్రీశ్రీ ప్రయోగశాలిగానే కాదు, ప్రయోజన శీలిగా కూడా కనిపిస్తాడు. ఇవి సరదగా రాసినవి కావు, సీరియస్ గా రాసినవే. హాస్యం వ్యంగం అన్నా, వాటి పరమార్థం సామాజిక రాజకీయ ప్రయోజనమే. ఇవి సమకాలీన సంఘటనలపై ప్రజాస్వామ్యం పేరుతో ఉన్న బూర్జువా నియంతృత్వ రాజకీయాలపై సునిశితమైన వ్యంగ్యబాణాలు. ఆశ్చర్యం ఏమిటంటె - ప్రాస క్రీడలు, లిమబుక్కులు సెటైర్ రాయడానికి ఎంత బాగా పనికొస్తాయో, ఉదాత్తమైన విషాయాన్ని చెప్పడానికి అంతే బాగా పనికి రావడం ! శ్రీశ్రీ వీటిని ఈ రెండు రకాలుగానూ సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు.

ప్రాస క్రీడల్లో ఉన్నది మాత్ర ఛందస్సు. మాత్రా ఛందస్సుల్లో కవి కుండే స్వేచ్ఛ మరే ఛందస్సులోనూ ఉండదు. మాత్రాఛందస్సులు గణబద్ధ ఛందస్సుల్లాగా ముందుగానే స్థిరీకరించబడి ఉండవు. కవి తన ఇష్ట ప్రకారం తనకు నచ్చిన లయలో , తాను మెచ్చిన యతి ప్రాసలతో మాత్రాఛందస్సులో స్వైరవిహారం చెయ్యొచ్చు. శ్రీశ్రీ చేసిన ఈ స్వైర విహారమే ప్రాసక్రీడలయ్యాయి. ప్రాస, క్రీడ అనే రెండు శబ్దాలూ పాతవే, కానీ’ ప్రాస క్రీడ’ అనే పద బంధం మాత్రం శ్రీశ్రీది. క్రీడ అంటే ఆట . శ్రీశ్రీ గొప్పదనం ప్రాసలతో ఆడుకోవడంలొనేకాదు, వాటిని భావ బంధురంగా మలచడంలో కూడాఉంది.

మాత్రా ఛందస్సుల్ని గూర్చి వివరిస్తూ శ్రీశ్రీ ఛందస్సులన్నిటినీ మూడు రకాలుగా వర్గీకరించాడు. అవి - సాగదీయడానికి వీలు లేనివీ,కొంతవరకు సాగేవి , బాగా సాగగలవి. అంటే rigid, semi - elastic metres అని ఆంగ్ల పరిభాషలో కూడా వివరించాడు. గణబద్ధ ఛందస్సులైన వృత్తాలు సాగదీయడానికి వీలు లేనివనీ, తేటగీతి , ఆటవెలది , సీసం మొదలైనవి కొంతవరకు సాగేవనీ, మాత్ర ఛందస్సులు బాగా సాగగలవి అనే సొదాహరణంగా చెప్పాడు. అందువల్ల మాత్ర ఛందస్సులు స్వాభావికాలని సూచించాడు. అంటే ఇవి సహజ సౌందర్యంతో స్వేచ్ఛాయుత లయ కలిగి ఉంటాయని అర్థం.

ప్రాస క్రీడల్ని శ్రీశ్రీ రెండు విడతలుగా రాశాడు. మొదటి విడత 1953-55 మధ్య కాలంలో , రెండో విడత 1970- 74 మధ్యకాలంతో ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు మద్రాసులో 1952 అక్టోబర్ లో ఆమరణ నిరాహర దీక్ష ప్రారంభించాడు. 1952 డిసెంబర్ 15 తేదీ న దీక్షలోనే ప్రాణాలు వదిలాడు. ఉపవాసాలు ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చెయ్యలేవని అన్న నెహ్రు చివరకు ఆంధ్ర రాష్ట్ర ఇవ్వక తప్పలేదు. 1953 అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.కర్నూలును రాజధాని చేశారు. బెజవాడను రాజధానిని చెయ్యకపోవడానికి అది కమ్యూనిస్టుల కేంద్రం కావడం మినహా మరేకారణమూ లేదు. 1954 నవంబర్ లో ప్రభుత్వం పడిపోయింది. 1955 ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఒక్క శ్రీశ్రీ తప్ప రచయితలందరూ , చాలామంది అభ్యుదయ రచయితలు సైతం, కమ్యూనిస్టు వ్యతిరేక ముసాయిదాలో సంతకాలు చేశారు. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీని గెలిపించమని శ్రీశ్రీ ఒక్కడే ఆంధ్ర రాష్ట్ర్రం అంతా తిరిగాడు. ఈ అన్ని సందర్భాల్లోనూ కాంగ్రేస్ ఆడింది కపట నాటకాలే. ఈ సంఘటనలన్నీ శ్రీశ్రీ ప్రాస క్రీడల్లో రికార్డు చేశాడు. ఉద్యమాలకు స్పందించిన శ్రీశ్రీ, ప్రజారాజకీయాల్తో మమేకమైన శ్రీశ్రీ , కాంగ్రేస్ ప్రజావ్యతిరేక ధోరణిని కళ్లారా చూసిన శ్రీశ్రీ ఈ ప్రాస క్రీడల్లో మూర్తీభవించాడు.

“ఆంధ్ర రాష్ట్ర జన్మదినం / అక్టోబరు ఫస్టు
అది త్వరలో వదలు విశా / లాంధ్రానికి ట్రస్టు ” ( 4.9.1953) 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర్రం ఏర్పాటవుతుందని ప్రభుత్వం ప్రకటించాక రాసిందది. అయితే ఇది మద్రాసు రాష్ట్ర్రం నుండి విడగొట్టిన కోస్తా, రాయలసీమ జిల్లాలకే పరిమితం. త్వరలో తెలంగాణ జిల్లాలనూ కలుపుకొని విశాలాంధ్ర ఏర్పడుతుందన్న ఆశను కూడా శ్రీశ్రీ వ్యక్తం చేశాడు.

తొలి అసెంబ్లీ సమావేశం 1953 నవంబర్ 23 న జరగవలసి ఉంది. అపుడు రాజధాని విషయమై సరైన నిర్ణయం అసెంబ్లీ తీసుకుంటుందని అందరూ ఆశించారు. ’
“కర్నూలే రాజధాని / కావడమది తథ్యం
మర్నాడే కాంగిరేసు / పోవడమది సత్యం”
అని సెప్టెంబర్ లోనే శ్రీశ్రీ ‘తెలుగు స్వతంత్ర’ వార పత్రికలో ఒక ప్రాస క్రీడలో ఊహించాడు. శ్రీశ్రీ ఊహ ప్రకారమే కర్నూలు రాజధాని అయింది.
టంగుటూరి ప్రకాశం పంతులుతో సహా నీలం సంజీవ రెడ్డి , తెన్నేటి విశ్వనాధం మొదలయిన ఏడుమందితో తొలి మంత్రి వర్గం ఏర్పడింది.
“ఏర్పడింది మంత్రివర్గ / మేడితలల పాం
నిలువ నీడ లేనిచోట / నేల విడిచి సాం”
అని ఆ మంత్రి వర్గంపై శ్రీశ్రీ విసిరిన చెణుకు.
” పాల కడలి త్రచ్చినపుడు/ మొదటిది హాలాహలం
రాష్ట్రమొకటి వచ్చినపుడు /రాక్షస కోలాహలం”అని ఆ మంత్రివర్గంపై విసిరిన చెణుకు.
కాంగ్రేసు లోని కీచులాటల వల్ల సంవత్సరానికే ప్రభుత్వం పడిపోయి ప్రకాశం పంతులు పదవి ఊడిపోయింది.అందుకే కాంగ్రేసు నాయకుల కీచులాటలను రాక్షస కోలాహలం అన్నాడు. ఆ హాలాహలాన్ని మింగి ప్రజల్ని కాపాడ్డానికి అప్పుడు శివుడున్నాడు కాని, ఈ రాక్షస కోలాహలం నుంచి ప్రజల్ని కాపాడ్డానికి ఎవరూ లేరు. అందుకే —
” ఈ మంత్రుల హయాంలోనే / రామరాజ్యమెప్పుడు ?
పడమటి దిక్కున సూర్యుడు / పొడుచుకొచ్చినప్పుడు”
అని కుండబద్దలు కొట్టి చెప్పాడు.
రెండో విడతగా - అంటే 1970 - 74 మధ్య కాలంలో కూడా శ్రీశ్రీ ప్రాస క్రీడలు మరింత పదునైనవిగా కనిపిస్తాయి.
” ఈ పదవులు ఈ బ్రదుకులు
శాశ్వత మని భ్రమించకు
ఎరుపెక్కిన తూర్పుదిక్కు
అపరాధుల క్షమించదు” ( జూన్ 1971)

నక్సల్ బరీ, శ్రీకాకుళ పోరాటాల ప్రభావంతో తూర్పు దిక్కు ఎరుపెక్కిందనీ అపరాధులకు శిక్ష తప్పదనీ హెచ్చరించాడు.
ప్రజాస్వామ్యం ఫాసిజంగా మారుతోందనీ, ఎన్నికలు కపట నాటకం అనీ అన్నాడు.

“పోలీసుల రాజ్యమిది / పోలింగొక బూటకం
ఫాసిజమై మారుతోంది / ప్రజాస్వామ్యనాటకం”
ఇలా హాస్య,వ్యంగ్యాలతో ప్రాస క్రీడలాడిన శ్రీశ్రీ ఆ ప్రాస క్రీడలనే సీరియస్ భావాలు చెప్పడానికే ఉపయోగించుకున్న తీరు ఆయన మాటల్లోనే ‘అనితర సాధ్యం’ .

“కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్దులు
పేర్లకి,పకీర్లకీ,పుకార్లకీ నిబద్ధులు
………………………………………………
కొంతమంది యువకులు,రాబోవుయుగం దూతలు
పావన,నవజీవన బృందావన నిర్మాతలు….”

’లిమఋక్కులు’అన్న పదబంధం కుడా శ్రీశ్రీ సృష్టించిందే.ఇంగ్లీషులోని లిమరిక్కులు,సంస్కృతంలోని ఋక్కులూ కలసి లిమఋక్కులు అయ్యాయి.చలసాని ప్రసాద్ ఇచ్చిన సమచారం ప్రకారం ఐర్లాండ్ లోని ఒక ప్రాంతం పేరు లిమరిక్. సైనికుల బృందగానం ఈ లిమరిక్ కు మూలం.వీటిని విరివిగా రాసిన కవి ఎడ్వర్డ్ లియర్(1812-1888).1820 లో ఇంగ్లీషులో తొలి లిమరిక్కుల సంకలనం వెలువడింది.

శ్రీశ్రీ ’లిమఋక్కు’లలో ఐదు పాదాలు ఉంటాయి.అంత్య ప్రాస ఉంటుంది.ప్రాస క్రీడల్లో లాగానే హాస్యం, వ్యంగ్యం ప్రధానం.
1960లలో పంచపదుల పేరుతో 70 లలో లిమఋక్కుల పేరుతో రాసినా -వీటన్నిటినీ లిమఋక్కులుగానే వ్యవహరించవచ్చు.వీటిలోని విషయాలు -జాతీయ,అంతర్జాతీయ కమ్యునిష్టు పార్టీలు,వాటి పరిణామాలు,స్థానిక సాహిత్య,రాజకీయ విషయాలు మొదలైనవి.

“నా ఇంటిపేరు ప్రపంచం
ప్రజలే నా కుటుంబం
వెదజల్లుతా దిగ్దిగంతం
అభ్యుదయ సుగంధం
అపుడు నాజీవితమే ఒక ప్రబంధం”

విప్లవకారుల చిత్తశుద్ధి గురించి రాస్తూ ,వారి హింస, హింస కాదనీ;మానస సరోవరహంస అనీ అంటాడు.

“విప్లవకారుల విధ్వంస
బీభత్స కాండకు నాప్రశంస
అదెన్నడూ కానేరదు హింస
అది నూతన చేతనా రిరంస
మానవ మానస మాన సరోవర హంస”

ప్రాస క్రీడలు అభ్యుదయ సాహిత్యోద్యమ దశలో రాసినవైతే,లిమఋక్కులు విప్లవ సాహిత్యోద్యమ దశలో రాసినవి.
సామాజిక చైతన్యం,రాజకీయ నిబద్ధత శ్రీశ్రీ ప్రయోగాలకు ప్రాణం.ప్రాంతీయ,జాతీయ,అంతర్జాతీయ రాజకీయ పరిణామాలూ,సంఘటనలూ,వాటి శరీరం.మార్క్సిస్టు దృక్పథం గుండెకాయ.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)