పురాణం: మీరు సినిమాల్లోనే ఎందుకు సెటిలయ్యారు
ఉద్యోగం కోసం. నేను గోల్డ్ స్మిత్ ‘వికార్ ఆఫ్ నేక్ ఫీల్డ్’ లో ప్రిమ్ రోజ్ లాగా ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటన చేసాను. ఆఖరికి మద్రాసు సినిమాలో సెటిలయాను. అది కేవలం యాక్సిడెంటల్.
పురాణం: అయితే పెద్ద కారణం లేదంటారా?
కారణం ఎందుకులేదు ? ఆర్థికమే. ‘ఆంధ్ర ప్రభ’ ఫస్ట్ బాచ్ (1938) లో నేను, నార్ల, కప్పగంతుల సత్యనారాయణ ,మల్లవరపు విశ్వేశ్వరరావు ,ఆర్టిస్టు సుబ్రహ్మణ్యం ఉన్నాం. నార్ల కొంత డీఫాక్టో .”కుర్రవాడు , ఇతడేమిటి అని, న్యాపతి నారాయణమూర్తిగారిని తీసుకొచ్చారు.అక్కణ్ణించి వారిద్దరికీ యుద్ధమే .ప్రతిరోజు నార్ల మాతో చెప్తుండేవాడు.I am carrying my resignation letter in my packet “అలాగే నెలలూ, సంవత్సరాలూ గడిచాయి.
పురాణం: నార్లకు , మీకూ తేడా లెందుకొచ్చాయి
పెద్దకారణమేమీ లేదు. ఎగ్మూర్లో ఒక ఇంటి మీది భాగంలో నేను, కింది భాగంలొ అతనూ వుండేవాళ్ళం. we were sharing that house. అతని చెల్లెలి పెళ్ళి చేశాడు. విందుకు చాలామందికి ఇన్విటేషన్లిచ్చాడు.’ఇంట్లోనే వున్నాడుగదా వీడిని వేరే ఎందుకు పిలవడం’ అనుకున్నడేమో ! నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు మరి! నేనా రోజు అవాయిడ్ చేసాను. ఒకే యింట్లో వుండికూడా ఆయనిచ్చిన విందుకు నేను వెళ్ళలేదు .సిల్లీ రీజన్!
పురాణం: ఆంధ్రప్రభ లోంచి మీరు బైటకు రావడానికి నార్లగారే కారణమా
కాదు ,కాదు వార్ టైం అప్పుడు గొయాంకా ఈ పబ్లికేషన్ ఆపేశాడు. “మీరు వేరే వుద్యోగం చేయకుండా వుంటే పత్రిక ఆపినంతకాలం కూడా మీకు సగం జీతం ఇస్తామన్నాడు.
పురాణం : అప్పుడు మీ జీతమెంత
చాలా తక్కువ. నలభై అయిదో ఎంతో. అందులో సగం ఇస్తానన్నాడు. అప్పుడే నాకు ఇమ్మీడియేట్ గా మద్రాసు ఆలిండియా రేడియాలో ఉద్యోగం దొరికింది. అది దొరికిన పదిహేనురోజులకే ఢిల్లీ వెళ్ళాను. నాలుగు నెలలు న్యూస్ చదివాను. అది చలికాలం. 1942 అనుకుంటా - స్టాలిన్ గ్రాడ్ యుద్ధాన్నంతటినీ వర్ణించాను .నా వెనకాతలే ఓ పోలీసు రిపోర్టొచ్చింది.అందులో నేను కమ్యూనిస్టుననికాదు .అప్పుడు గాంధేయుణ్ణి . వీడు కాంగ్రేస్ వాడు, చాలా డేంజరెస్ ఫేలో” అని రాశారు.
పురాణం: అయితే మీకు దేశభక్తుడుగా కొంతరావాలి.
నిజంగా నేను కాంగ్రేసే. అప్పుడు విశాఖపట్నంలో కార్యకర్తల కొరతవొచ్చింది. యూ కోర్ట్ అరెస్ట్ అన్నారు నన్ను. తెన్నేటి విశ్వనాధం గారి తమ్ముడూ- వాళ్ళు స్థానిక ప్రముఖులు . వాళ్లు జైలు కెళ్ళరు. నన్ను పంపిద్దామని చూశారు.
పురాణం: మీరు తప్పించుకున్నారా
నాకక్కర్లేదన్నాను.నాకే పార్టీతొనూ సంబంధం లేదు. అఫ్ కోర్స్ , నా సింపతీస్ కాంగ్రేస్ వైపే , అంటే సింపతీ ఎవరికుండదు? అందరికీ వుంటుంది. అలాగే నాకూవుంది .కాని ఉప్పు సత్యాగ్రహం, జైలు, అవీఇవీ లాభంలేదు. ఆ తర్వాత కాంగేస్ అభిమానం వున్నా కూడా ఐ యూజ్డ్ టు అడ్మైర్ ది టేర్రరిస్ట్. భగత్ సింగనైతే నేమిటి, జెఫ్రీ గవర్నర్ ని కాన్వొకేషన్ రోజున షూట్ చేసిన అతన్ని అయితే నేమిటి. ఇలాంటి వాళ్లంటే నాకెంతొ ఇష్టం . మన భయంకరాచారి కూడా టెర్రరిస్టే. అతనన్నా నాకభిమానమే.
పురాణం; అప్పటి సాహిత్య పరిస్థితేమిటి
నార్ల నేటి రష్యా అని పుస్తకం రాశాడు. దాన్ని బాన్ చేశారు. రష్యన్ కథలు కూడా కొన్ని ట్రాన్స్ లేట్ చేశాడు. అందులో ఛేకోవ్ కథలు కూడా వున్నాయి.
మీకు ఎవరి కథలిష్టం
నా చిన్నతనంలొ హూ ఈజ్ ది గ్రేటెస్ట్ షార్ట్ స్టోరీ రైటర్ , వెదర్ యిటీజ్ మపాసా ఆర్ ఛేకోవ్ ? అని ఓ పెద్ద కాంట్రోవర్సీ ఉండింది. చిన్నతనంలో నేను మపాసాని అభిమానించేవాణ్ణి . తర్వాత మపాసావన్నీ స్టేజ్ మానేజ్డ్, కంట్రైన్డ్ అని తెల్సుకున్నాను.కొసమెరుపు వుండేది. అది కొంత అస్వాబావికం కూడా. వేర్ యాజ్ ఛెకొవ్ లో ఇవేవీ వుండవు- జస్ట్ ఎ స్లయిస్ ఆఫ్ లైఫ్, ఇదీ జీవితం , టేకిట్ ఆర్ లీవిట్ ” అన్నట్టుగా వుంటాయి చెకోవ్ కథలు. అపుడు వాటిని ఏదో పచ్చిగా, రుచీ పచీ లేనివిగా అనుకునేవాణ్ణి. మపాసా మోస్ట్ డాజిలింగ్ గా, ఒక్కొక్క కథా బ్రహాండంగా అల్లేవాడు. అతని కంప్లీట్ వర్క్స్ చదివా - ఇంక్లూడింగ్ హిజ్ నావెల్స్.
పురాణం : మద్రాసులో ఏ పుస్తకమొచ్చినా ముందు మీ చేతుల్లో ఉండేదని అనేవారు.
అంతకు ముందు విశాఖ పట్నంలో నా చేత ఇవన్నీ చదివించింది అబ్బూరి రామకృష్ణారావుగారు. ఒక విధంగా ఆయన నాకు ద్రోణాచార్యుడి లాంటి గురువు. ఆయన దగ్గర కాలేజీలో నేను చదవలేదన్న మాటేగాని he was my mentor . లండన్ ప్రోగ్రసీవ్ రైటర్స్ మానిఫెస్టో ఆయనే లక్నో నుంచి తెచ్చిచ్చారు నాకు. ఆ ఇన్ స్పిరేషన్ తోనే ’పొలాలన్నీ హలాలదున్నీ’ రాశా . ఏమిటోయ్ మేనిఫిస్టొని యాజిటీజ్గా దించేశావ్? అని నన్ను కాంప్లీమెంట్ చేశారు.
పురాణం: దేశచరిత్రలుకు ఇన్ స్పిరేషన్ ఏమిటి?
ఇదే ప్రశ్న నిన్న ఎవరో అడిగారు కూడ. ఆ రోజుల్లో “జ్వాల” వస్తుండేది. అది ముద్దుకృష్ణ గోల .ఒక నెల “జ్వాల” లో ముద్దుకృష్ణ బ్రహ్మాండమైన ఎడిటోరియల్ రాశాడు.అదీ దేశ చరిత్రలకి ఇన్ స్పిరేషన్ . ఇంకో సంగతేమిటంటే ,
తాజ్ మహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
ఇలాంటిదే బ్రెట్ కూడా అన్నాడట.
నండూరి :బ్రెట్ లో దీనికి పారలల్ పాదం నేనుచదివాను.
కాని అప్పటికి నేను బ్రెట్ ని చదవలేదు. అటువంటి మనిషి ఉన్నాడని కూడా తెలియదు నాకు. ఒన్లీ దట్ ఐడియా. మిగిలింది మళ్ళా నాదారి వేరు. అతని దారివేరు.
పురాణం:అప్పటికి మీరు నజ్రుల్ ఇస్లాంని చదివారా
పురిపండ అప్పలస్వామికి బెంగాలీ వచ్చు . బెంగాల్లో నజ్రుల్ ఇస్లాం, విద్రోహి కవి ( విప్లవకవి). నజ్రుల్ ఇస్లాం, హరీంద్రనాధ్ ఛటొపాధ్యాయ నన్ను చాలా ఇన్ స్పయిర్ చేసారు.
‘షురు హువా హై జంగ్ హమారా’ ఙ్ఞాపకం వుందా మీకు? తర్వాత ఛటోపాధ్యాయ పోయమ్స్ కొన్ని ట్రాన్స్ లేట్ చేశాను. గార్డ్న్ ఆఫ్ ఐసోలేషన్ ని ‘శోకదేవి ‘అని తెనిగించాను.
జ్వ్వలియించు పూగుత్తి , పరిమళించెడు మట్టి
దుఃఖిత ప్రణయినీ !తొలగి చను నన్నియును.
సాంధ్య నిశ్శబ్ద తేజస్సు శాంతించు,
విలపించగా మానివేయును గాలి,
బ్రతుకొక్క కల్పనా కథవొలే ముగియి
అతని “శాడ్ బిలవ్డ్” నేను ట్రాన్స్ లేట్ చేయలేదు గాని నాకు చాలా ఇష్టమైనది.
బ్రౌనింగ్ ఉపయోగించిన మీటర్ లాగే ఒక పొడుగు లైను ఒక పొట్టి లైను రాశాడు. హరీన్ కమలాదేవిను పెళ్ళిచేసుకున్నాడు.ఆవిడేమో కన్నడం . పెళ్ళి చేసుకున్న తర్వాత ఈ పోయం రాశాడు.
ఇట్లాగ రెండు మూడు వందల లైన్లుంటాయి.ఈ మీటరు ఎపుడో రాబర్ట్ బ్రౌనింగ్ ఉపయోగించాడు.అది ఛటోపాధ్యాయ వాడుకున్నాడు.
పురాణం: కొత్తమార్గం వెదుక్కోవడానికి, విశ్వనాథ, కృష్ణశాస్త్రి ల ప్రభావం నుంచి మీరు ఎలా బయట పడ్డారు.
వీళ్ళిద్దరి ఇన్ ఫ్లూయన్స్ వదిలించుకోవడానికి నాకు పదేళ్ళు పట్టింది.అందులో విశ్వనాథ మరీను. ఆయన పద్యాలు మహబలిపురపు రాతి గోపురాలు. పాటిబండ్ల మాధవ శర్మ “వీణ” పత్రిక నడిపేవాడు. పొయట్రీ ఎడిటర్ గా నన్ను పెట్టాడు. వచ్చిన పోయమ్స్ అన్నీనాకు పంపించేవాడు.అలా రెణ్ణెల్లో మూడునెల్లో వచ్చింతర్వాత ఆ పత్రిక ఆగిపోయింది. అన్నట్లు “వీణ”కి ఫస్ట్ ఎడిటోరియల్ కూడా నేనే రాశాను. కవికొండల వెంకట్రావుగారి పోయం ఒకటి, విశ్వనాథ సత్యనారాయణ గారిదొకటి - ఇలా ఆన్నీ నేనే సెలక్ట్ చేసాను.
“నదినిండా నీరున్నదీ
నావపై పిల్లున్నదీ
పిల్లాకు ఒళ్ళున్నదీ
వళ్ళెల్ల వయసున్నదీ
ఏటీకీ మేటెక్కడా?
గోటికీ దాటైన చాల్ !
…………………….
ఊదేస్తే గాలౌతదీ
రోదిస్తే నభమౌతదీ
దరితీస్తె నీరౌతదీ
బరిగీస్తే ధరణౌతదీ
పొగకఱ్ఱ కగ్గౌతదీ
ఇక నాకు దారేదిరా?
పురాణం: మరి ‘శివరాత్రి ప్రభ’ మాటేమిటి ? ఆ గేయం మీకు గుర్తుందా?
“కాల కంఠుని నాగ సర్పము
కుబుస మూడ్చీ పడగ బుస్సుమంది
రెండు నాల్కలు
గండు మీసాలట్లు దూసింది
చెవులు మోసింది
నాగసార మూదేది యెవరోయి
రాగ మొలికించేది యెవరోయి
కాఱు నల్లని కాళరాత్రి!
నొసట గొసరిన మూడోకన్ను
నివురులూదిన కొలిమిదెగడి
నెగడి ద్రిప్పింది
పొగలు గప్పింది
కమ్మరయితే యినుము కరగ
సోమరయితే చలిని కాగ
ఎవరు వచ్చేరోయ్
ఎవరు మెచ్చేరోయ్
కాఱునల్లని కాళరాత్రి!
………………………
పందెమూ వేసేది యెవరోయి
కుందనము గాసేది యెవరోయి
కాఱునల్లని కాళరాత్రి
ఈ పద్యం వైతాళికులు లో ముద్దు కృష్ణతో చెప్పి పట్టిబట్టి వేయించాను.ముద్దు కృష్ణ కి ’సాహితీ సమితి ‘ కవులు తప్ప మిగతా వాళ్ళు కవులు కాదు. “అదేమిటయ్య , ఇది చాలా మంచి పోయం”అని నచ్చ చెప్పా. అసలు ముద్దు కృష్ణ స్వయంగా కవి. ” గడ్డిపూలు” గేయం ఎంత బాగా రాశాడో చూడండి.
పురాణం: బసవరాజు అప్పారావు మీకు బాగా సీనియర్ కదా?
అవును ఆయనోసారి మెడ్రాస్ ఒచ్చాడు. అపుడు కాలూరి నరసింగారావు, నేను ఆయనతో కలిసి ట్రాంలో ప్రయాణం చేయడం నాకు బాగా ఙ్ఞాపకం. కాని ఆయనకు ఎంకి పాటలంటే పడదు, గాలిదుమారం లో ఏకేశాడు. నండూరి సుబ్బారావుని వెనకేసుకొచ్చినవాడు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి.
పురాణం: ఎంకి పాటలంటే చెళ్ళపిళ్ళక్కూడా పడకూడదనుకుంటా?
చెళ్ళపిళ్ళతో పాటు చాలామంది తిట్టారు. ‘అంధ్రరత్న ‘ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అందర్నీ మించి తిట్టాడు.
యెంకి సరసాలలో
సంకనాకడముంది
సాప సిరగడముంది
………………………………..
నాజూకు లేదురా
నండూరి సుబ్బిగా !
పురాణం: మొత్తం మీద తెలుగువాడికి సహిష్ణత తక్కువ. ఓర్వలేనితనం
దీనిమీద భమిడిపాడి కామేశ్వరరావు గారి పర్వతాలు , పానకాలు అని రెండు పాత్రలుంటాయి. ఒకరోజు గురో అని గొల్లున ఏడుస్తాడు.
“ఎందుకేడుస్తాడు?”
“అక్షయం గాడున్నాడే……”
ఆఁ చచ్చిపోయాడా ఏమిటి?”
“లేదురా పుస్తకం రాసేశాడురా”
“నీకెందుకురా ఏడుపు?”
“ఎందుకు మానేశాం మనం ? మనకంటె గొప్పాడనుకుంటున్నాడా?”
వాడు పుస్తకం రాసినందుకు వీడికేడుపుందన్న మాట- వాడికి కీర్తి ఒచ్చేస్తోందని.
పురాణం అయితే కొత్తమార్గం వెదుక్కుంటున్నపుడు మీకు కవికొండల, బసవరాజు తారసిల్లారా?
తెలుగులో వీళ్ళే. కాని అదే సమయంలొ నాకు జాన్ ఎడ్వర్డ్ మేజ్ ఫీల్డ్ తగిలాడు. A Consecration అనే అతని పోయం మొట్టమొదట చదివాను. నా ప్రతిఙ్ఞ గేయం మీద ఆ ఇన్ ఫ్లూయన్స్ కూడ వుంది. అతను సాల్ట్ వాటర్ బాలెడ్స్” రాశాడు. వాటిల్లో ఇంగ్లీషు సెయిలర్స్ యెక్క భాష వుపయోగించాడు. ఆ బాష, ఆ యాస ఇదంతా నన్ను చాలా ఇన్ స్పైర్ చేసింది. కాని ఆ తర్వాత చాలాకాలానికి నాకు కొన్ని సంగతులు తెలిసాయి. ఎంతో ముందుగా, ఇండియాలో ఉన్నపుడే Rudyard kipling (రడ్ యార్డ్ క్లిపింగ్ ) ‘బారక్ రూం బాలెడ్స్ ‘ రాశాడు. అపుడు అది తెప్పించి చదివాను. అతను వాటిల్లో సైనికులు వాడే భాషా, బ్రిటిష్ టామీ భాష వుపయోగించాడు.మేజ్ ఫీల్డ్ ‘ సాల్ట్ వాటర్ బాలెడ్స్’ కి మాతృక, కిప్లింగ్ ‘బారక్ రూం బాలెడ్స్’ .ఇందులో ఒపెనింగ్ బ్రహ్మండంగా ఉంటుంది.when omer somte is blooming lyre
ఆ ఒక్క లైనే నాకు ఙ్ఞాపకం ఉంది.
“హోమర్ గుడ్డివాడు కద, అక్కడి కథా, ఇక్కడి కథా తీసుకుని రాసి దాన్ని పెద్ద మహాకావ్యం చేసిపడేసాడు. నేను చేసిందీ అంతే. ఆ సోల్జర్నీ ఈ సోల్జర్నీ కలిపి.హోమర్ చేసిన పనే నేనూ చేశా”అన్నాడు కిప్లింగ్.
పురాణం:ఇంతకీ మీకు కొత్తదారి చూపించిందెవరొ చెప్పారు కాదు.
గురజాడ అపారావే అనుకోండి. గురజాడ భక్తుల్లో కవికొండల కూడా ఒకడు. కాని గురజాడ ఇన్ ఫ్లూయన్స్ కవికొండల మీద డైరెక్టుగాలేదు. లేకపోయినా ప్రొలిటేరియన్ పొయట్రీ చాలా రాశాడు. ముఖ్యంగా కూలియన్నల శతకము, ఆ తర్వాత చెప్పవలసింది బసవరాజు అపారావు. ఆయన కంప్లీట్ పొయమ్స్ ఓ పుస్తకంలో వచ్చాయి . అందులో
’చలిపిడుగా గర్జింపకు !
నిలచి నాదు మనవి వినుము!…….’
పురాణం :విశ్వనాథ్ , కృష్ణ శాస్త్రి ఇంత పవర్ ఫుల్ గా వుండగా మీ దారి మీరు ఎలా వెదుక్కో గలిగారు ? దీనికి జవాబు కావాలి.
బసవరాజు, కవికొండల , చింతా దీక్షితులు, కొంతవరకు అడివి బాపిరాజు, గురజాడ వారసులు. విశ్వనాథ , కృష్ణశాస్త్రి - ఇద్దరి ఇన్ ఫ్లూయన్స్ ఒదిలిపెట్టి గురజాడ వారసుల ఇన్ ఫ్లూయన్స్ లోకి రావడం వల్ల నాగొంతుకను నేను పట్టుకోగల్గాను. తెలుగు కవులతో అటు ఇందాక నేను చెప్పిన మేజ్ ఫీల్డు, ఇంకా ఆడిన్, స్టీఫెన్ స్పెండర్ కవిత్వాలు కూడా చదివాను. అప్పటికి నాకింకా మార్క్సిజం అంటే ఏమిటో తెలీదు. కాని నన్ను ఇన్ స్పైర్ చేసిన కవులు మార్క్సిజం చేత ఇన్ స్పైరై రాసినవాళ్ళే.
నండూరి: మీరు చెప్పిన కవుల పుస్తకాలేవి కూడా 1930 దశకంలోగాని మనదేశానికి రాలా . అప్పటికే మీరు “మహా ప్రస్థానం” గేయాలు రాసేశారు. ఆ పుస్తకాలు ఇండియాకి ఎప్పుడొచ్చాయ్ , మీరెపుడు చదివారు. ఇంకెపుడు రాసానంటారు?
మహా ప్రస్థానం గేయాలు 1930-40 ల మధ్య రాశాను. మొదటి గేయం నేను సైతం (జయభేరి) 1933 లో రాశాను. అయితే అంతకు ముందే, అంటే 1929 లోనే రాసింది సుస్తాప్థికలు . ఇది గ్రాంధికంలో గీత పద్యాలుగా రాశాను. సుప్తాస్థికలు ఒక break through (బ్రేక్ త్రూ) . నా కవిత్వాన్ని ఒక మలుపు తిప్ప్పింది.
పురాణం: సుప్తాస్థికలు భారతి తిప్పి పంపిందిగదూ ?
అంతే కాదు నా ’మహా ప్రస్థానం’ గేయం కూడా తిప్పిపంపింది. post haste అంటారే అంతత్వరగా తిప్పికొట్టింది భారతి. నేను ఇవాళ ( 12-4-1934)
విశాఖపట్నం నుంచి పంపించాను. రేపు భారతి ఆఫీసుకి అందింది. రేపు సాయంత్రం భారతి తిప్పి పంపితే ఎల్లుండి మెయిల్ లో నాకొచ్చేసింది.
పురాణం: అంత త్వరగా వదిలించుకున్నారన్నమాట భారతి వాళ్ళు అటు తర్వాత ఆ గేయం ’జ్వాల’లో పడింది కదా?
అవును మహా ప్రస్థానం తో ఇన్ ఫ్లూయన్స్ అయి అడవి బాపిరాజు ’ఎగరనివ్వండోయ్ జ్వాల లెగరనివ్వండోయ్’ అని గేయం రాసాడు. ’జ్వలనా జ్వలనా…’ అంటూ నారాయణబాబు రాశాడు. ఇవికూడా ’జ్వాల’లొనే అచ్చయాయి.
నండూరి” ఇంతకీ మరి మీరు సర్రియలిజంలొకి ఎప్పుడొచ్చినట్టు?
అబ్బూరి రామకృష్ణరావుగారే నాకోపుస్తకం ఇచ్చారు,అందులో ఫ్రెంచ్ లిటరేచర్ మీద ఒక ప్రత్యేకమైన ఛాప్టరుంది . ఛాప్టర్ పేరు ’ది డాడా రివోల్ట్ అండ్ సర్రియలిస్ట్ ఎక్స్ప్ రిమెంట్’ ( tha Dada revolt and surrealist experiment) . ఇరవై ముప్పై పేజీలుంటుంది. ఆ ఛాప్టర్ చదివేసినా, ఆ పుస్తకం కొనాలనిపించింది. డబ్బులేని రోజుల్లో ఇరవై ముప్పై రూపాయలు హిగన్ బాదమ్స్ కి మనియార్దర్ చేశా. ” మీరు చెపిన పుస్తకం లండన్ నుంచి తెప్పించాలి. “యు హేవ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైం( youhave to wait for a long time) అన్నారు.” ఐ హావ్ నో అబ్జెక్షన్ టు వెయిట్ “( i have no objection to wait) అన్నా.
ఇంతలో ఆండ్రీ బ్రిటన్ రాసిన ’వాటీజ్ సర్రియలిజం’, డేవిడ్ గాస్కోయిన్ రాసిన ’ఎ షార్ట్ సర్వే ఆఫ్ సర్రియలిజం’, పొయమ్స్ ట్రాన్స్ లేషన్స్ , కొన్ని సర్రియలిస్ట్ పెయింటింగ్స్ వచ్చాయి. అప్పటికే పెంగ్విన్ నుంచి న్యూ రైటింగ్ , అమెరికా నుంచి న్యూ డైరెక్షన్స్ అని annual publications మద్రాసు యూనివర్సిటీ లైబ్రరీకి ఏటా వస్తుండేవి. ఎట్ దట్ టైం ఐవాజ్ మెంబర్ ఆఫ్ దట్ లైబ్రరీ. అప్పుడే పాల్ ఎలార్డ్ పుస్తకం కొత్తగా వచ్చింది. నేను లైబ్రరీ నుంచి తెచ్చేసరికే 4.5 పేజీలెవరో చింపేశారు. మన శిష్ట్ లా గురించి చెబుతుంటార్లే - బెనారస్ లో వుండగా మోడ్రన్ పొయట్రీ పుస్తకాలు యూనివర్సిటీ లైబ్రరీ నుంచి దొంగిలించి తెచ్చి ఇంట్లొ పెట్టుకునే వాడట.
పురాణం: ఇది బ్రహ్మ భేద్యమైన గ్రంథచౌర్యం
అతనివి విష్ణు ధనువు ‘నవమి చిలుక ‘- రెండు పుస్తకలు అచ్చయాయి. కొన్నిపాదాలు నాకు గుర్తున్నాయి.
’గూట్లో వెర్రెమ్మ
ఊళ్ళో వుందంటె
ఊరందరికీ
ఉబుసి పోద్దీ…’
ఇలా ఇంకా చాలా వున్నాయి
’నా పేరు లీల
ఆ ఊరి గోల పడలేక
నేను పొరుగూరొచ్చాను…’
పురాణం: అయితే వచన కవిత్వంలో మీ కన్నా శిష్ట్లాయే ముందంటరా?
అవును . అతనే ముందు. అయినా నాది డైరెక్ట్ గా అతని ఇన్ ఫ్లూయన్స్ కాదు. శిష్ట్ లా ఇన్ ఫ్లూయన్స్ తో ముద్దుకృష్ణ జ్వాల లో చిన్న చిన్న పోయమ్స్ రాసేవాడు. వీటి పేరు త్రింశతి . ముప్ఫై పోయమ్స్ ఉన్నాయి. వాటిని కలెక్ట్ చేశాడు కూడా. ఎక్కడో పారేసుకున్నాడు. అవి నన్ను ఇన్ స్పైయిర్ చేశాయి.కొన్ని నాకింకా గుర్తున్నాయి.
’కాయండి యువకులు
కాయండి భుజములు
కష్టంగ వుంటుంది
కాని తప్పదు మనకు
చచ్చిపోయిన తల్లి
స్తన్యమ్ము కుడుపదు…’
నండూరి : ఇది metrical గానే వుందేమరి.
అవును మరి . నేను మహాప్రస్థానం గ్రూప్ ఆఫ్ పోయమ్స్ రాస్తున్న రోజుల్లోనే జ్వాల ప్రతి సంచికలొ ముద్దుకృష్ణ గేయం ఏదో ఒకటి ఉండేది. ముద్దుకృష్ణ క్కూడా ఒక మాతృక వుందని శివశంకర్ శాస్త్రి గారంటూ వుండేవారు.
’మారో మారో మారో
ఒకటీ రెండూ మూడూ…’ అన్న గేయం వినిపించి అది శిష్ట్ లా దని చెప్పారు. అందుకే ఇన్ స్పిరేషన్ ఒకటే అయినా ఇన్ ఫ్లూయన్సస్ రకరకాలుగా ఉంటాయి.
నండూరి : మీ మీద స్వీన్ బర్న్ ఇన్ ఫ్లూయన్స్ వుంది కదా, మరి ఆయన మీద ఇన్ ఫ్లూయన్స్ ఎవరిది.
ఇన్ ఫ్లూయన్సే కాదు , ఆమాట కొస్తే బాదలేర్ ని స్వీన్ బర్న్ గురువుగా అంగీకరించాడు . బాదలేర్ చనిపొయినప్పుడు రెండు వందల లైన్ల పద్యం రాసాడు.
ఆ పద్యం పేరు AVA ATQUE VALE ఇవి లాటిన్ మాటలు.
AVA= Hail
ATQUE =And
VALE = Fare well
ఇంగ్లీషు లో అయితే Hail and Farewell అనొచ్చు
నండూరి: అయితే బాదలేర్ గురువెవరు.
ఎడ్గార్ ఆలెన్ పో, అతనంటే నాకు చాలా అభిమానమే . అతను డిటెక్టివ్ కథలకు ఆద్యుడు. ఆ గుండెల చప్పుడు , అని నేనొక కథ అనువాదం చేశాను. అది పో కథే. Tha Raven అని ఒక పోయం రాశాడు.
once upon a midnight dreary, while i pondered , weak and weary over many a quitnt and curious volume of forgotten lore while i nodded ,nearly napping , suddenly there came a tapping . as of some one gently rapping rapping , at my chamber door. ’Tis some visitor,” i muttered tapping at my chamber door , only this and nothing more.అంటూ చాలా పెద్ద పోయం అది. అంతేకాదు. The poetic principle .”అని E.A. Poe ఒక వ్యాసం రాసాడు. చాలా వరకు అందులో he drew his material from his own poem.” ఈ Raven పోయం నేనెలా రాశాను? ఒక తులం బీభత్సం , ఒక అరచటాకు భీతి - ఇది ఒక ఫార్ములా కింద కొస్తుంది” అంటూ ఈ వ్యాసంలో తన స్కీం చెప్పాడు. బాదలేర్, రాంబో వీళ్ళందరికీ ఇన్ స్పిరేషన్ E.A.Poe, E.E.Cummings సంగతి చెప్పనే అక్కర్లేదు what if a much of a which of a wind అంటూ చమత్కారంగా కవితలల్లాడు. when skies are hanged, and oceans drowned.
the single secret is still the man.ఈ రెండు లైన్లు నాకు గుర్తు . మా అమ్మాయి అమెరికన్ లైబ్రరీలో మెంబరు. E.E.Cummings కంప్లీట్ వర్క్స్ లైబ్రరీ కొచ్చాయి. అవన్నీ తీసుకిచ్చి ఒక వారం పారాయణం చేశా.
మీ గేయాల్లో మీకు బాగా ఇష్టమైందేది?
శరశ్చద్రిక . ముందు రేడియోలో చదివా (1954, దసరా) ఆ తర్వాత అది కృష్ణ పత్రిక లో అచ్చయ్యింది. నండూరి : విశాలాంధ్రలో కూడా వేశారు.
పురాణం:శరశ్చంద్రిక వచన కవిత్వమేగా? మరి వచన కవితకి కోటబిలిటీ లేదంటారే?
అది సరికాదు. వచన కవిత్వంలో బోలేడు వైవిధ్యముంటుంది .ఎజ్రాపౌండ్ వచన కవిత్వం ఇంకొలా ఉంటుంది. టి యస్ ఇలియట్ ది చాలా తమాషాగ మెట్రికల్ గా ఉంటుంది.
నండూరి : ఉన్నట్టుండి మీటర్ ని ఇలియట్ అతిక్రమిస్తాడు , అవునా?
ఇలియట్ మీటర్ ని వాడగలడు , వ్యతిరేకించగలడు. హిడజ్ నాట్ స్టికప్ టు రూల్స్. అన్ని నియమాల్ని సాధికారంగా అతిక్రమిస్తాడు. ఇంగ్లీషులో కొత్త ఎక్స్ప్ ప్రెషన్ తీసుకొచ్చాడు. గోల్డ్ స్మిత్ she stoops to conquer ని ఇలియట్ “waste land”లో పారడీ చేస్తాడు.
she turns and looks a moment in the glass,
hardly aware of her departed lover;
her brain allows one half -formed thought to pass;
well now that’s done; and i’m glad it’s over,
when lovely woman stoops to fally and
paces about her room again, alone,
she smoothes her hair with automatic hand,
and puts a record on the gramohone.
ఒకమ్మాయి తపుచేసిందంటె ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని ఆనాడు గోల్డ్ స్మిత్ రాశాడు.ఇలియట్ నాటికి అమ్మాయి ఆత్మహత్య చేసుకోకపోగా అతి మామూలుగా ప్రవర్తిస్తుంది . ఇది కాలం తెచ్చిన మార్పు.
పాలగుమి పద్మరాజు వాళ్ళంతా” ప్రజాస్వామ్య కూటమి” అని పెట్టారు గదా?
కృష్ణశాస్త్రి సంతకం పెట్టాడు. ప్రజాస్వామ్యం ఏదో సముద్రంలో కలిసిపోతున్నట్టుగా , వీళ్ళె ఉద్ధరించాలన్నట్టుగానూను.
(స్వాతి మాసపత్రిక,విజయవాడ ఆఫీసులో(25-6-1979)లో శ్రీశ్రీతో ఇష్టాగోష్టి)
’ప్రజ’-విరసం ప్రచురణల నుండి……..
పాత ఇంటర్వ్యూ మళ్ళీ ప్రచురించి అప్పటి పత్రికలు చదివే అవకాశంలేని మాబోటి వారికి ఆ అవకాశం ఇచ్చినందుకు థాంక్సు. కానీ, నా సమస్యేమిటంటే - కాస్తంత ఫార్మాటింగ్ చేస్తే, చదువుకునేందుకు కన్ఫ్యూజన్ లేకుండా బాగుండేదేమో!!