నల్లమలలో ‘ చెంచు’ ఆదివాసీలు ఉన్నారు. ఈ నల్లమల మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాలో విస్తరించి ఉన్న నల్లమల అడవిలో ఎక్కువగా ఉన్నారు. నల్లమల తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి పోరాటకారులకు అండదండగా ఉన్నది, పోరాట కేంద్రంగా కూడా ఉన్నది . అక్కడి గిరిజనులు అన్నలను తమ గుండెల్లో పెట్టి దాచుకున్నారు. ఆ తర్వాత నక్సల్బరీ అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో పుంజుకున్న నక్సలైట్లనూ నల్లమల చెంచులు కాపాడుకుంటూ వస్తున్నారు.

అడివిని ఖాళీ చేయించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రభుత్వం ‘అభివృద్ధి’ పేర, చెంచుల స్థితి గతుల పేర వారికి రోడ్డు వెంట ఇండ్లు నిర్మించి వారిని అడవి నుంచి బయటికి రప్పించింది. ఆ ఇండ్లకు గాలీ వెలుతురు లేకుండా ఉండే ఒకే ఒక గది మాత్రమే. వారు ఆ ఇండ్లల్లో ఉంటూ అటవీ ఉత్పత్తుల కోసం అడవికి వస్తుంటారు. చాలా మంది అడవిలోనే ఉంటుంటారు . నల్లమలలో ముఖ్యంగా నీటికి కొరత.
నల్లమల చెంచులు ప్రధానంగా వేట మీద మాత్రమే ఆధారపడి జీవిస్తుంటారు. మిగతా కుంకుడుకాయలు , తేనే వంటి అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడతారు. కానీ బస్తర్ ఆదివాసులు ప్రధానంగా వ్యవసాయంమీద ఆధారపడుతూ వేట కూడా చేస్తుంటారు. ఒక రకంగా బస్తర్ గోండు ఆదివాసీల కంటే కూడా, రహదారులకు దగ్గరగా ఉండి కూడా ఇక్కడి చెంచులు వెనుకబడి ఉన్నారు . నల్లమల నిజంగా రాళ్లమయం. చాలా కొద్ది భూమి సాగుకు యోగ్యంగా ఉంటుంది. ఉన్న భూమికి కూడా నీరు ఉండరు. నల్లమలలో వర్షాలు చాలా తక్కువ.
చెంచు స్త్రీల కష్టాలు పుట్టుకతోనే మొదలయ్యే కష్టాలు. చిన్నతనంలో తల్లీ, తండ్రీ అడవికి వెళితే 4,5 సంవత్సరాల వయసు నుండే తమ్ముళ్లను చెల్లెళ్ళను ఎత్తుకుని ఆడిస్తారు. 9,10 ఏళ్ళు వచ్చేసరికి వంట కూడా చేయడం మొదలు పెడతారు. సాధారణంగా పెద్ద మనిషి అవ్వగానే పెళ్లి చేస్తారు. వద్దని ఏడ్చి మొత్తుకున్నా వినేవారుండరు. విల్లంబులు ఎక్కు పెట్టి మరీ పెళ్ళిచేస్తారు.
చెంచు ఆదివాసీ స్త్రీల ప్రధాన సమస్య ఇష్టంలేని పెళ్ళి చేయడం, భర్తల అనుమానం, ఎంత కష్టం చేసినప్పటికీ ఏమాత్రం ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం, పురుషులతోపాటు అడవి అంతా గాలించి గడ్డలు, కుంకుడు వంటి అటవీ ఉత్పత్తులు ఏరుకొచ్చి మళ్లీ వంట పనులు, పిల్లలపనులు తనే చేసుకుంటుంది. పురుషుడు తను సంపాదించగా వచ్చిన డబ్బులతో సారాయి తాగుతాడు. తన సంపాదన సరిపోక భార్యను కొట్టి మరీ తీసుకుంటాడు. అట్లాగా స్త్రీలు కుటుంబ భారాన్ని దాదాపు స్త్రీనే మోయాల్సి రావడం, శుభ్రంగా తాయారైనా అనుమానించే భర్తలుండడం , అన్నింటికి మించి ఆ అనుమానంతో పురుషులు తమ భార్యలను చాలా సులభంగా చంపడం. భర్తకు అనుమానంతోనో, కోపంవస్తేనో బండరాయి నెత్తి ఆమె మీద వేయగలడు. లేదా బాణం వేసి చంపగలడు. దెబ్బలైతే చాలా సర్వసాధారణం. ఇలాంటి వాటిమీద ఆ సమాజంలో కూడా శిక్షించిన దాఖలాలు చాలా తక్కువ. స్త్రీల మీద అనుమానంతో భర్త ఊరి పెద్దలను సంప్రదిస్తే వెంటనే పంచాయితీ ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల ఉత్పత్తులను, వారి భూములను దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రభుత్వాలకు వారిని బాగు చేయడంలో ఉండదు.
చదువు అనేది చెంచు స్త్రీల దరిదాపులకు రాలేదనే చెప్పాలి. పురుషుల చదువే అంతంత మాత్రం. చదువుకుని ఉద్యోగాలు చేసేవారి సంఖ్య బహు అరుదు.
ఆదీవాసీ స్త్రీల గురించి రాయాలంటే పుట్టుక నుండి ప్రతి సమస్య మీద పోరాడవచ్చు, సాహిత్యాన్ని రాయవచ్చు. కానీ వారిలో చదువుకున్న వారి సంఖ్యనే బహుఅరుదు. అందులో సాహిత్యం చదివేవారు చాలా తక్కువ. ఇక రాయాలనే ఆలోచన వచ్చినవారి సంఖ్య వుందా….. అంటే సందేహమే . అయితే ఆదివాసుల సాహిత్యాన్ని బయటివారు కొంతమేర రాయగలిగారు. సృష్టించవలసింది చాలా ఉంది.
ఉదా: ఒక చెంచు ఆదివాసీ మహిళ గురించి.
చాలామంది చెంచు అమ్మాయిల్లాగే లక్ష్మి అమ్మాయికి కూడా ఇష్టంలేని పెళ్ళి చేసారు . ఎన్ని దెబ్బలైనా తినేదికానీ భర్తకు లొంగేది కాదు. అత్తింటివారు, తల్లిగారింటివారు ఎవరు ఎంత తిట్టినా, కొట్టినా వినలేదు. ‘ ఎందుకు వినదు. వింటది. కాళ్ళు చేతులు కట్టేసి ‘దారి’లోకి తెచ్చుకొమ్మ’ని చెప్పిన సలహాతో భర్త ఆ అమ్మాయి రెండు చేతులను వెనక్కి విరిచి కట్టేసి, రెండు కాళ్లను చెరోవైపు విడదీసి కట్టి దారిలోకి తెచ్చుకున్నాడు- ఆ ఒక్క రాత్రికి . ఆ అమ్మాయి పెట్టిన అరుపులు ఇతరులను కదిలించినవట. మేక మీద పులి పడినపుడు అరిచే భయంకరమైన, హృదయవిదారకరమైన అరుపులట. ఆ అమ్మాయి అరుస్తుంటే విపరీతంగా కొట్టాడు భర్త. తెల్లారేసరికి ఈ అమ్మాయి తల భుజాల మీద ఒక పక్క వాల్చేసి స్పృహ తప్పి పడిపోయి వుంది. బట్టలు కూడా సర్దుకోడానికి లేదు, రెండు చేతులు కట్టేసి వుండడం వల్ల . తెల్లవార్లూ అలా రెండు కాళ్ళూ పంగలు చాచి కట్టేసే వున్నాయి. రాత్రి ఈ అమ్మాయి అరుపులు విన్న యువతులు వెళ్ళేసరికి పై స్థితిలో వుంది. అతనేమో హాయిగా నిద్రపోతున్నాడు. ఈ యువతులు వెళ్లి బట్టలు సర్ది, కట్లు విప్పేసారు.
ఈ అమ్మాయికి కొద్దిగా ఓపిక రాగానే అడవిలో పడ్డది. వేటకు పోయినట్టుగా మొగాళ్ళందరూ విల్లంబులు చేతబట్టి అడవికి పోయి ఈ అమ్మాయిని పట్టుకొచ్చారు. విపరీతంగా కొట్టి , ఇంట్లోకి నెట్టి భర్త మొలతాడుకు, ఆమె లంగా బొందెలతో ముళ్ళు వేసారు.వాడు పడుకున్నాక ఈ అమ్మాయు నడుముల వరకు తలను వంచి , పళ్లతో లంగా బొందెను కొరికి తెల్లారేసరికి అడవిలో పడింది. మళ్ళీ మామూలే . పట్టుకొచ్చారు.
నడిబజారు ఈడ్చుకొచ్చారు. జనం అంతా పోగయ్యారు.’ నిజం చెప్పు, ఎవరైనా ఇష్టపడ్డావా’, ‘మొగుడంటే ఎందుకు ఇష్టముంటలేదు’. ఎన్నాన్నా ఈ అమ్మాయి మౌనంగా వుండిపోయింది. ‘ నిన్ను ఏమీ అనం. నీ మనసుల వున్న మాట చెప్పితే నువ్వు ఇష్టపడ్డోనికే పెళ్ళి చేస్తం.నీకీ తిప్పలన్నీ ఎందుకు ‘ అని నమ్మబలికారు.
పాపం ! నమ్మిన ఈ అమ్మాయి ‘ఫలానా వ్యక్తి అంటే ఇష్టం ‘ అని చెప్పడంతోనే పిడి గుద్దులు గుద్దారు - పెద్దమనుషులు, అత్తింటి వాళ్లు. వేరే వాని మీద మనసుపడి మొగునితో కాపురం చేస్తలేదని, మా పరువు తీసిందని అన్న, తండ్రి , తల్లి అందరూ కొట్టారు. అంతేకాకుండా ఇంటింటికి తిరిగి కొట్టడానికి రమ్మని పిలచారు. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిని కొట్టే హక్కు అందరికీ వుంటాది. ఈ అమ్మాయి నిలబడితే ఒక్కొక్కడు గుండెల మీద ఎగిరెగిరి తన్నారు. పడిపోతే ఎక్కి తొక్కారు. చేతిలో అమిరే సైజులో వున్న కట్టెలు విరిగేంత వరకు కొట్టి ‘ ఇప్పుడు చెప్పు , మొగుడంటే ఇష్టమా, వాడంటే ఇష్టమా ‘ అని అడిగారు. ( నిజానికి ఈ అమ్మాయి ఇంకో అబ్బాయిని ఇష్టపడింది తన మనసులో . అంతే కాని అతనితో ప్రేమ వ్యవహారం నడిపిందీ లేదు. నిజంగా అలా ప్రేమించుకుంటే ముందు చెప్పినట్లు ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళి కాపురం పెట్టేవాళ్లు.)
ఆ దెబ్బలకు తాళలేక మొగుడంటే ఇష్టమని చెప్పింది. ‘అయితే నీ మొగుణ్ణి ఎత్తుకో ‘ అన్నారు. ఈ అమ్మాయి కంటె బరువున్న అతన్ని దెబ్బలు తినీతినీ వుండి , తిండిలేక అడవిలో తిరిగీతిరిగీ బలహీనంగా ఆ అమ్మాయి మొగున్ని కొద్దిగా లేపి తనూ పడిపోయింది. దాంతో ‘దీనికి మొగుడి మీద ప్రేమ లేద’ని తేల్చారు. మొగుని మీద ప్రేమ వుంటే ఎత్తుకుని వుండేది అని వాళ్ళ మూఢవిశ్వాసం.
తర్వాత అతనితో ఈ అమ్మాయిని ఎత్తుకోమన్నారు. అతను సులువుగా ఈ అమ్మాయిని ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. దాంతో వాడికి పెళ్ళాం అంటే ప్రేమ వుందని, దీనికే లేదని తేల్చి ‘నీ పెళ్లాన్ని ఇంట్లకు ఎత్తుకుపో . అది ఈ సారి ఎట్లా తప్పించుకుంటదో చూద్దాం ‘ అని పంచాయితే చేసి వెళ్ళిపోయారు పెద్ద మనుషులు, వూరి వాళ్ళు.
చెంచుల్లో భార్యను వదిలి ఎక్కడికీ పోరు. స్నానానికి పోయినా, మొగుడూ వెంటపోతాడు . ఇలాంటి పరిస్థితుల్లోనయితే ఎక్కడికయినా తప్పించుకుంటాదేమోనని అసలు ఒంటరిగా వుండనివ్వరు.
ఒక వారం, పదిరోజులుండి వీలుచూసుకునిమళ్లీ అడవిలోకి జారుకుంది ఈ అమ్మాయి. వాళ్ళు ఎంత వెదికినా దొరకలేదు . ఆకలికి అడవిలో దొరికే కాయలు, పండ్లూ తింటూ బతికింది. ఆకలి తీరకపోతే ఆకులు తిన్నది . కాళ్ళకు చెప్పుల్లేక పగలనక, రాత్రనక తిరిగితిరిగీ పాదాలు పగిలి, పత్తిత్తుల్లాగా విచ్చుకున్నాయి. రక్తాలు ఓడాయి. అయినా అలాగే తిరిగిందీ - ఒక్కత్తీ ఆ అడవిలో . పగలైనా చెంచులు ఒక్కరూ అడవిలోకి వెళ్ళరు. అలాంటిది ఈ అమ్మాయి, అమావాస్యపు చీకటి రాత్రుల్లో కూడా ఒంటరిగా గడిపింది. ఆ అడవిలో పులులు, చిరుతలు , ఎలుగబంట్లు రకరకాల జంతువులు. అయినా దేనికీ భయపడలేదు.
పెద్ద పెద్ద గుట్టల మీదున్న చెట్లమీద మంచెకట్టుకునేదట. దానిమీద పడుకునేదట. ఏ మాత్రం అలికడయినా లేచేది. నిరంతరం అలర్ట్ గా వుం డేది. పగలు ఎప్పుడూ సెంట్రీలాగానే వుండేది . ఎప్పటికప్పిడు డేరాలు మారుస్తుండేది.గెరిల్లాలు కూడా అంత అలర్ట్ గా వుండరు. ఒకటే ఆలోచన తను వాళ్ళకు దొరకకూడదు. ఇట్లాగే ఈ అడవిలో ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఎన్ని కష్టాలైనా పడ్తననుకునేది.అడవిలో వేటకు వచ్చినవాళ్లు తనని చూసి ఆగమని అంటే పెద్దపెద్ద గుట్టలని పరుగుతో ఎక్కి మాయ మయేదట. ఒకోసారి పైకి రాళ్లు రువ్వేదట వాళ్ల మీదకి. ఎప్పుడూ అడవిలో తిరిగే చెంచులు కూడా ఆ గుట్టలను ఆమెంత వేగంగా ఎక్కలేక వెనుదిరిగేవారు. తిండీతిప్పలు సరిగాలేక నీరసం తో వుండే ఆ అమ్మాయికి అప్పుడు అంత బలం ఎక్కడి నుండి వచ్చేదో!
బట్టలు ఏనాడో చీలికలు పేలికలైపోయాయి. నల్లమలలో విపరీతమైన కంపచెట్లు వుంటాయి. ఒంటి మీద నూలు పోగయినా లేకుండా నెలల తరబడి ఆ అడవిలో తిరిగింది. వానొస్తే పెద్ద పెద్ద బండరాళ్ల కిందనో, గుహల్లోనే పడుకుంది.
అడవికి మేకలు కాయడానికి వచ్చిన అమ్మాయిలు పిలిచినా పరుగెత్తేది . రాళ్ళు , కట్టెలు రువ్వేది వారి మీదకి, ఎన్నోసార్లు ఆ అమ్మాయిలు తన గురించి చెప్పమని కేకలేసి చెప్పగా, చెప్పగా వాళ్ళను నమ్మి దగ్గరికి వచ్చింది. అదీ ఒకరిద్దరు వాళ్ళ వూరి అమ్మాయిలు దగ్గరికే , వాళ్ళు కట్టుకొచ్చిన సద్దిమూట ఇస్తే తినేది. తువ్వాలూ, లుంగీ ముక్కో ఇస్తే తీసుకోకపోయేది. తీసుకున్నా కట్టుకోకపోయేది. మళ్ళీ సారి కనిపించినపుడు ఎప్పట్లాగే తల్లికడుపు లోంచి వచ్చినట్టుగా వుండేది. ‘ఎందుకు కట్టుకోవు’ అని అడిగితే ‘ఇవి కట్టుకుంటే చాలా దూరం కనిపిస్తా, మళ్ళా వచ్చి పట్టుకుపోతారు’ అని భయంగా చెప్పేది. తలకు నూనెలేక , దువ్వక చింపిరి జుట్టుతో కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని ఉండేది. ఒంటిమీద బట్టల్లేక , ఎముకల మీద మట్టి గొట్టుకపోయిన చర్మంతో ఉండేది. నీళ్ళ దగ్గర కూడా ఎక్కువసేపు ఉండలేకపోయేది. నీళ్ళ దగ్గర మాటుగాస్తారని నీళ్ళు తాగి గబగబా వెళ్ళి పోయేది. ఇంక స్నానమెక్కడ ? వానొస్తే పెద్ద పెద్ద బండరాళ్ళ కిందనో, గుహల్లోనే పడుకునేది. అలా లచ్చిమి నెలల తరబడి అడవిలో గడిపించి. ఇంకా ఎన్నో కష్టాలు పడింది. నాకు తెలిసినవి కొన్ని మాత్రమే. ఏ అండాలేనివారు ఎక్కడికి చేరాలో చివరికి అక్కడికే చేరింది లచ్చిమి.
ప్రధానంగా స్త్రీలకు ఉయ్యాల శిక్షలు వేస్తుంటారు.
దీపావళి పండుగకు చెంచులు ప్రతి ఒక్కరూ వుయ్యాలలు కట్టుకుని వూగుతారు. అందరిలాగే ఈ మహిళ కూడా ఉయ్యాల ఎక్కగానే పెద్దమనుషులు పక్కనున్న స్త్రీలకు ఉయ్యాల మీంచి దిగమని సైగ చేస్తారు. భర్త కుట్ర తెలియని ఈ మహిళ వుయ్యాల వూగుతుంటది. వెనకవైపు, ముందరివైపు నలుగురైదుగురు వాటమైన కట్టెలు పట్టుకుని నిలబడి , ఉయ్యాలను గట్టిగా వూపుతూ , ఉయ్యాల వెనుకకు వచ్చినపుడు వెనుకవాళ్ళు, ముందరకు వచ్చినపుడు ముందరివాళ్ళూ కర్రలతో బలంకొద్దీ కొడాతారు. కర్రలు విరిగిపోతాయికానీ వాళ్ళు కొట్టడం ఆపరు. ఆమె వుయ్యాల దిగడానికి వీలుండదు. ఉయ్యాల మీంచి దూకుదామంటే అంత స్పీడుగా వూగుతున్న ఉయ్యాల మీంచి దూకుతే చావడమో, కాళ్లూ చేతూలూ విరగడమో జరుగుతది. కొన్నిసార్లు వుయ్యాల వూపుతూ కొట్టే దెబ్బలకు చనిపోతుంటారు .
ఇంతేకాక కొన్నిసార్లు బలవంతంగా చేతులు ఉయ్యాల తాళ్ళకు కట్టేసి, కాలివేళ్ళ సందుల్లో ఎండుగడ్డిని పెట్టి, అగ్గితో ముట్టించి ఉయ్యాలను వేగంగా వూపుతూ వుంటరు. ఆ గాలికి మంట ఇంక ఎక్కువగా మండి పాదాలతో పాటు కాళ్ళూ కొంతమేరకు కాలిపోతాయి. ఇదంతా చేసేది కేవలం అనుమానంతోనే. ఏమన్నా అంటే, దీన్ని ఉయ్యాల వూపాలనో , ఉయ్యాల ఎక్కించాలనో అంటుంటారు మొగాళ్లు.

5 అభిప్రాయాలు

  1. sunilbharat 11 ఆగస్టు 2010 , 8:31 am

    నిజమే నేను ఆంధ్రజ్యోతి లొ చదివాను అసలు చెంచుల గురించి పత్తించుకునెవారు లెర గిరిజన సంక్షేమ శాఖ ఎం చెస్తొంది

  2. kcube 12 ఆగస్టు 2010 , 10:25 am

    ఇంత భయానకమైన శిక్షగురించి ఇప్పుడే చదివాను. చెంచుల జీవన విధానం గురించి బాగా వివరించారు. స్త్రీ ఎక్కడైనా ఒకేలా బాధాగ్రస్తురాలవుతోందన్నదానికి ఇది సజీవ సాక్ష్యం. కరుణ అంటే తాయమ్మ కరుణేనా?

  3. gajulamallik 12 ఆగస్టు 2010 , 1:28 pm

    చాల భయన్కర వాస్తవాలు తెలిసాయి

  4. నారాయణ 14 ఆగస్టు 2010 , 12:46 pm

    ఇటువంటి అంశాలు చదివాక చెంచుల్ని “సంస్కరించటం” అర్జంటుగా చేయాలనిపిస్తుంది ప్రగతికాముకులెవరికైనా. అయితే కొంచెం ఆగి, ఇలాంటి అంశాల గురించి “ప్రాజెక్టులు,పోలీసులు చెంచుల సంస్కృతిని నాశనం చేస్తున్నారని, వారి స్వయంనిర్ణాయక హక్కుల్ని కాలరాస్తున్నారని” విశ్వసించే వాళ్లేమంటారో వినాలి, తొందరపడకూడదు.

    భారతదేశంలో సతీ సహగమనాన్ని నిషేధించిన బ్రిటిషర్లు రాజారామమోహన రాయి వంటి ప్రగతిశీలవాదులను మంచిచేసుకున్నారు. ఇలాంటి భయానక వాస్తవాల నివేదికల ఆధారంగా ప్రభువులు “సంస్కరణలు” చేపట్టేసి, ఎవరెవరిని తమలోకి చేర్చుకుంటారోనని భయం వేస్తున్నది.

  5. hameed 19 నవంబర్ 2010 , 6:36 am

    ఇది చాలా దుర్భరమయన ఆచారము,బ్రథుకు - వెంతనె సంస్కరించాలి

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)