“ఇదేంది సామీ ! తలుపులు వోటికవే మూసుకున్యాయి. ఇదేందో కదిలిపోతావుండాది. ఏడికి పోతావుండాము నాయినా!”
“భయపడకు. ఏంకాదు . మనం పైకి పోతున్నాం” అన్నాను.
“పైకంటే ? అమ్మో…. బాబ్బాబు.కొంచెం నిలుపు. ఆ నామాలోడికి దణ్ణం బెట్టుకుంటా.

గోయిందా”!, నవ్వలేక “అరవకయ్యాబాబూ ! పైకి అంటే మూడవ అంతస్తులో మా స్టూడియో కి”
ఏంది యిట్టూడియోనా ? అంత పైనా ? సిత్రంగా వుండాది. మన సేతుల్లో ఏముండాది. అంతా ఆ పైవోడి లీల. ఆడే సూసుకుంటాడు. మంచీ సెబ్బరా, గుండె గెట మాదిర్తో కొటకలాడతావుంది అబయ్యా” గొణుగుడులో బెదురు.
మూడో అంతస్తు వచ్చింది.
లిఫ్ట్ ఆగింది. తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి.
నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు పట్నంమొగమెరుగని ఆ మోడులాంటి మనిషి.
“రండి నా వెనకాలే ” అంటూ నేను ఎముకలగూడు లాంటి ఆ మనిషిషిని తీసుకుని స్టూడియో లోపలికెళ్ళాను.
ఆది “సత్యం శివం సుందరం ” టీ.వి ఛానల్ ఇంటర్వూ ఛాంబర్.
కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతి.మనుషుల్ని విభ్రాంతుల్ని చేసే వింత వాతావరణం.
ఈ రంగు రంగుల చిత్ర విచిత్ర కాంతుల్లో ఎందరివో జీవితాలు కూలిపోతాయి. కాలిపోతాయి. బూడిదైపోతాయి.మళ్ళీ కొత్త జీవితాలు ననలు తిరి తొడుగుతాయి. జరివిల్లుల పువ్వులు పూస్తాయి. కొమ్మలు కొమ్మలుగా విస్తరిస్తాయి.
ఇది స్వర్గం నరకాల, చీకటి వెలుగయినా వ్యామోహమే. ఏ రసమయినా పరమార్థం ఆనందమే గదా.
“వురు….వురుయ్. ఏందబ్బోడా ! యీడ యింతసల్లంగా వుండాది”.
“అదంతే కూర్చోండి” కుషన్ ఛైర్ చూపించాను.
“నానా ? ఏడ? దీన్లోనా ?చేత్తో అదిమాడు అతడు.
“ఇది శానా మెత్తంగా వుండాదన్నా “కులుకుతూ నవ్వాడూ అతడు.
దీని మింద కూకోవాలని శానా మునాసగా వుందబ్బోడా !”
మీకోసమే అది.ఫర్వాలేదు. కూర్చోండి” భరోసా యిస్తున్నట్టు అన్నాను.
భయం . వణుకు , ఆశ వొదిగి వొదిగి కూర్చున్నాడు అతడు.
“దర్జాగా కూర్చోండి. ఆ కుర్చీ మీకే .” అన్నాను మరోసారి.
“ఎంతయిది…..యిది. పూలకుప్పామింద కూకోబెట్టేసినావ్ అబ్బయ్యా యీ సన్నాటోణ్ణి”
“ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా నిమ్మళంగా కూర్చోండి” అంటూ నేను మా రాఘవ గదివైపు చూశాను.
రాఘవ మంద్రంగా నవ్వుతున్నాడు.
“మనం ఏదయినా కొత్త ప్రోగ్రాం చేయాలి” అన్నాడు ఒకరోజు రాఘవ నాతో. రాఘవ నేనూ చిన్నతనం నుండి స్నేహితులం. ఎం.ఏ దాకా కలసి చదువుకున్నాం.
” ఏ కల్మషాలు లేని, తెలియని అచ్చమైన చిన్న లేదా సన్నకారు రైతును వెదుకు శివరాం…ఆటాడికి చదువు కూడా వచ్చి వుండకూడదు. ఏ పల్లెలోనయినా దొరికితే తీసుకోండి. ఇంటర్వ్యూ చేద్దాం. పచ్చి నిజాలెన్నో మనకు తెలియని తెలుస్తాయి” అన్నాడు రాఘవ
“మంచి ఆలోచన . అలాగే చేద్దాం ” అన్నాను.
“బాధ్యత నీదే ” అన్నాడు రాఘవ.
ఆ అన్వేషణలో లభించిన సన్న. చిన్నకారు రైతే యీ బక్కయ్య. పట్నం వాసన కూడా తెలియని యీ బక్కయ్యనే యిప్పుడు ఇంటర్వూ చెయ్యబోతున్నాను.
“ఏదీ దాచుకోకుందా నేను అడిగిన దానికి జవాబు చెప్పాలి. సరేనా? ” అన్నాను.
“యింద్రలోకంలో మా రాజులు కూకునె కుర్చీ మింద కూకోడబెట్నావ్. నీ దగ్గర దాస్తానా? అడుగు అబయ్యా”.
“అటు చూడు ” కెమెరా చూపించాను. అటు చూస్తూ మాట్టాడాలి” అన్నాను.
“అదేందబ్బా దెయ్యం మాదిర్తో వుండాది .” బెదురు గొంతుతో బక్కయ్య.”
“ఆది దెయ్యం కాదు. కెమెరా. బొమ్మలు తీస్తుంది” అన్నాను.
“అదేనా బొమ్మలు తీసేది. నా బొమ్మ కూడా తీస్తిందా సామీ ! అన్నాడు బక్కయ్య.
” నువ్వు దాన్ని చూస్తూ జవాబు చెబితేనే నీ బొమ్మ తీస్తింది. లేకుంటే….. అన్నాను.
” సర్లే అట్నే అబ్బొడా ! అడుగు. ఏమడగతావో అడుగు. సెప్తా, నాకేం బయమా?” బక్కయ్య మాటల్లో ఏదో ధైర్యం.
“మరి బక్కయ్యా!” యింకా నా వాక్యం పూర్తి కాలేదు.
“యిదే నబ్బా నీతో వచ్చిన సిక్కు, , బక్కయ్యేంది. నా పేరు ఒక్కోడు. నన్నట్టా పిలిత్తేనే నాకు కుశాలగా వుంటాది.
” సరేలే . ఆట్లాగే పిలుస్తా. చూడండి బక్కయ్యగారు !” అన్నా.
“మళ్ళా ఆగోరేంది. బక్కోడు. అంతేనబ్బా” బక్కయ్య మాటల్లోని ధ్వని ఏమిటో నా కర్థం కాలేదు, క్షణం ఆగి…… బక్కోడా ! ” అన్నాను.
ఆదీ.. అదీ.. యిప్పుడు సెవులకింపితంగా వుంది. అట్నే పిలువ్ బిడ్డా ! ” ,మురపెంగా అన్నాడు బక్కయ్య.
“బక్కోడా! నీది సెనిక్కాయల పల్లె. ఆవునా ? ! అడిగాను.
“ఔ గదా!”
“నీ కుటుంబం గురించి చెప్పు..”..బక్కోడా నాకు పిలవడానికి ఇబ్బందిగా వున్నా అలానే పిలిచా…
“ఇద్దరు . వొగమగపిలగోడు, వొక ఆడాబిడ్డె . నా సినమ్మి, నేనూ మెత్తం నలుగురు. పోయిన సంకురేతిరప్పుడు వూష్ణమెచ్చి మాయమ్మ కాలమైపోయే. మానాయిన నా సిన్నప్పుడే పొయినాడని మాయమ్మ సెప్పింది.”
బక్కోడి గొంతు నుండి జారిన సన్నటి కన్నీటి జీర.
” నాను వొక సెట్టు.యీ సెట్టుకు అండ నా బాసేలి.ఈ సెట్టుకు రెండు కొమ్మలు మొలిశాయి.అందులో వొక కొమ్మను పిదప కాలం నరికేసినాది. యింక మిగిలిందొక కొమ్మే. ఆ కొమ్మే మా సెంగల్ రాయుడు.”
ఈ మాటలు చెబుతున్న బక్కోడి కళ్ళలో కన్నీటి చుక్కల మబ్బులు కదలాడుతున్నాయి.
“కన్నీళ్ళు తుడుచుకో బక్కోడా ! ధైర్యంగా వుందాలి.కాలం ఎప్పుడూ ఒకలాగే వుండదు ” అన్నాను. సన్నగా నిట్టూర్చాడు బక్కోడు.
” ఏం కాలమో ? ఏం నాశినమో ? యింకేం వుండాది. ఏడ్చే దానికి నవ్వేదానికి తేడానే తెల్లేదబ్బోడా?”
“నువ్వు రైతువి. కష్టజీవివి. అన్నదాతవి. నీ గురించి మేమెంతో గొప్పగా చెబుతాం. మరి నువ్వేంటి? అడిగాను.
“రాత .తలరాత . మా తాత ముత్తాతల నుండీ యీ సన్నరైతు రాత మారలేదబ్బా. యగసాయం సాగాలంటే ముఖ్యంగా నీళ్ళుండాల. మా పక్క వానలు తక్కువ. మోట బావుల్లో నీళ్ళు వుండేది ల్యా.కురవాల్సినప్పుడూ వాన కురిసేదిల్యా. నీటికి కరువు, గెడ్డికి కరువు. ఎద్దు గొడ్లను సాకలేక అమీసుకున్రి. మడక గట్టే దిక్కే ల్యా. సిరిగల సావుకార్లు టాకటర్లు తెచ్చిరి. సన్నాటోడికీ అవేదికాయె. వోడేమో ఆది పెరిగె యిది పెరిగె అంటూ వొక గెంటకు ఏడు నూర్లు తీసుకుంటా వుండాడు. ఏ ఆ సామి దగ్గర్లో అప్పు దెచ్చి పైరెక్కిస్తే పతి ఏడాదీ నీళ్లపామో, కరంటు పామో కరిశా, యివన్నీ బాగుంటే ఆలిపి మాలిన రోగాలొచ్చె. మందుల ధరలా? కొండమీదుండాయి. తీరా పంట యింటికొస్తే కొనేవాడు ల్యా? ఏడదెచ్చేది రూకలు. పదేలు బెట్టి పైరు పెడితే ఆదాయం సేతికిఐదేలే వస్తావుండాది . మిగతా ఐదేలు? బక్కోడికి బరువే గదబ్బా?”
నా వైపు చూశాడు బక్కోడు.
“చెప్పండి” అన్నాను.
“అబయ్యా ! ఎవురో మారాజులు. వొందలూ, వేలూ ఎకరాలుండేటోళ్ళు. బోర్లు ఏసి సంపాయిస్తా వుండారు. గవుర్నమెంటు అలాంటోల్లకే అండగా వుందాది.” నిరాశగా అన్నాడు బక్కోడు.
“అలసిపోయినట్టున్నావు. ఇవిగో నీళ్ళు. తాగు ” అన్నాను.
గ్లాసుడు నీళ్ళు తాగిన బక్కోడు కాస్త స్థిమిత పడినట్టున్నాడు. అప్పుడు అడిగాను.
“ఎవరో వచ్చి ఏదో చేస్తారని బాధ పడేకంటే నువ్వూ వొక బోరు వేసుకోవచ్చుగా?”
కొంచెం తెపరాయించుకుని బక్కోడు ” ఆదీ జేస్తి. అప్పుజేసి వొకటిగాదు రెండు గాదు నాలుగు బోర్లు. లచ్చరూపాయలు. యీ బక్కోడి తాహతెంత? దెర్నం చేస్తి”.
కొంత సేపు మౌనంగా వున్నాడు. ఏదో బాధను అణచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుంది.
“ఇది జీవితం గదా ! వొడి దుడుకులు వుంటాయి మరి ” అన్నాను.
“పత్తెం సినబ్బా. అదురుట్టం అంటారే అది కొందరికే సొంతం . నాలుగోసారి ఏసిన బోర్లో వొకటిన్నర ఇంచీలు నీళ్ళు వచ్చె. నాయాల్ది కరంటు సంపతా వుండాదబ్బా. ఎట్నో వొకట్న ఆ ముంతడు నీళ్ళతో పైరెక్కిద్దామనుకుంటె నొక్క కూలీ నాయాలు దొరకలా సాయపడడానికి.”
“ఏంది పెద్దాయనా అట్లా అంటావు. పల్లెల్లోనే గదా పనోళ్ళు శానామంది వుండేది.” అన్నాను.
“అడిగినావూ , అయితే ఇను. ఇలాపరిగా సెప్తా. కూలోన్ని పిలిస్తే ఇన్నూరిస్తావా అంటాడు.
సరే సామీ! రారబ్బా. నీకు పుణ్ణెముంటాది. అని అడుక్కుంటే “కోర్టర్” గూడా యియ్యాలంటాడు. యీ ‘కోర్టర్’ ఏందో తెలియక సరే యిస్తాలే రా.అంటి తొలిసారి.వోడు సాయంత్రం రెండు నూర్లు తీస్కుని ‘కోర్టర్ ‘ కు ఏభై రూపాయలియ్యి ఆన్యాడు. యిదేం కోర్టర్ సామీ అంటే బాందీ తాగే దానికంట.నాకు నోట్లో మాటారాలా.యియ్యక తప్పలేదబ్బయ్యా. యింక రైతు బతికే దేంది సినబ్బా
“కూలీ జనం తెలివిమీరిపోయారు నాయ్నా. గవుర్మెంటోడు రోజుకు నూర్రూపాయలు యిస్తాడంట. కష్టింకూడా తక్కువంట. వొక్కోదినం పని గూడ వుండదంట. కేజి బియ్యం రెండు రూపాయలకే యిస్తావుండాది గవుర్నమెంటు. నీకాడ కూలీ కొచ్చి తెల్లారి నుండి సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు జేసుకోవాలా? యింకా కష్టింజేయాల్సిందేనా ? అన బట్రి కూలిజనం . నాలాంటి సిన్నా సితకారైతు బతుకు కూలీ బతుకు కన్నా కష్టిం అయిపోయె బిడ్డా!”
ఏం అడగాలో తెలియని పరిస్థితిలో పడ్డాను నేను.
బక్కోడే మళ్లీ మొదలెట్టాడు.
“కూతురు పెళ్ళీడుకొచ్చె. వూర్లో నరస మామ కొడుకు మింద మొదలు పెంచుకునే, వోడు.నరసడు . పిసినారోడు. తినే సేత్తో కుక్కను గూడా అదిలించడు. వొక ఎకరా పొలం యిస్తేనే నీ కూతుర్ని నా కోడలు సేసుకుంటాననే . మా పిలగోడు యిచ్చేయ్ నాయినా! సెల్లి సుఖంగా వుంటింది. గెడ్డి వుండే గాట్లో ఆవును కట్టేసినట్టుండాది అన్యాడు. నాసినమ్మి గూడా కొడుకు పక్కనే మాట్లాడింది.
ఇంక నేనేం జేసిది సామీ ! నువ్వే జెప్పు. నరసడు వొక ఎకరాతో పోడని నాకు భయం “
“అన్నిటికీ భయపడితే ఎట్టా? ఆడబిడ్డ సుఖం చూడాలిగదా. మంచి పనే చేశావన్నాను.”
” ఆ మంచి పనే నన్ను యీ కాడికి దెచ్చింది. అత్తింటికి బిడ్డని పంపించేటప్పటికి కాళ్ళాలో సలవలౌగమ్మె.
పెండ్లికీ, అప్పుడప్పుడూ యగసాయానికీ, పిలగోడి సదువుకీ తీసుకొనింది వడ్డీలకు వడ్డీలు పెరిగి సావుకారు దగ్గర మూడు లచ్చల అప్పుతేలే.” గట్టిగా నిట్టూర్చాడు బక్కోడు.
“సోసైటీలు తక్కువ వడ్డీకి అప్పులిస్తాయిగదా. సావుకారి దగ్గర ఎందుకు తీసుకోవాలి అప్పు” అడిగాను.
“నువ్వు ఏ కాలంలో వుండావు సామీ! సొసైటీ వోళ్ళదగ్గరికి తిరిగితి. ఆ కాగితం ఏదీ ? యీ కాగితం తేదో ? అని ఇసుగొచ్చేలా తిప్పిరబ్బా.
తీరా తెచ్చిస్తే అట్టా యిట్టా కాగితాలు తిప్పి తిప్పి సూసి ” పెద్దాయనా! నువ్వింతకు ముందే లోను తీసుకోనుండావే” అన్యాడు.
“నానా ! ఈ ఆఫీసులో యిప్పుడే గద తండ్రీ అడుగు బెడతావుండాను ” అన్యా.
” మాకేం తెలుసు . మీ వూరి ప్రెసిడెంటు నీ భూములు కూడా పెట్టిలోను తీసుకునేశాడు. వెళ్ళి ఆయన్ను అడుగు , లేకుంటే డబ్బు కట్టమని నిన్నే అడగాల, వెళ్ళు…..వెళ్ళు..” అన్యాడా దయగల తండ్రి.
“నిలువునా కుప్పకూలిపోతి. నా గోడు యినే వాడు ఎవడు ? కాళ్ళీడ్చుకుంటా పెసిడెంటు యింటికి బోతి. విసయం ఇలా సరిగా జెప్తి…..” మాట్ళాడ లేదు బక్కోడు.
“ఏమన్నాడు !” అడిగాను.
“ఏడుపు మొకం ఏసుకుని ఎందుకు నిలబడతావ్. నే కడతాబో ఆ అప్పు .” సిగరెట్టు పారేస్తూ అన్యాడు ఆ మహారాజు.”
“నిజమా ! నమ్మశక్యంగావడం లేదు ” అన్నాను.
“నిజాలు ఎప్పుడూ యీ కాలంలో నమ్మేటట్టుగా వుండవు కొడుకా!”
“పోనీ, ఏదయినా బ్యాంకులో అడగక పోయావా?” అడిగాను. బక్కోడిని.”
దణ్ణం సామీ ! సొసైటీలు బ్యాంకులు.ఆ మాట ఎత్త బాక. నాకు వుగ్రం వస్తాది.
తిరగలేక కాళ్ళు సచ్చు పడటమే కాదు తండ్రీ ! ఆడ కిందోడి నుండీ పైవోడిదాకా ఎరువు బెట్టాల్సిందే.ఏమయినా సేత్తారు. కొందరు సల్ఫేటోళ్ళు. కొందరు యూరియా వొళ్ళు. మద్దెలో పసిరెంటు. పెట్టిన పైరుకే ఎరువు ఏసే సత్తా లేనోణ్ణి. యీ సదుంకొన్నోళ్ళకు ఎరువు ఏడదెచ్చేది బిడ్డా!”
బక్కోడి గొంతు బొంగురు పోయింది.
తర్వాత ఏమడగాలో అర్థంగాలేదు.
క్షణం నిశ్సబ్దం.
“మనుషులకే వస్తాయి కష్టాలు మానులకు రావు. గట్టిగా నిలబడాలి బక్కోడా” అన్నాను.
కొంచెం తేరుకున్నట్టున్నాడు బక్కోడు.
” మాటలు నానూ సెప్పగల్ను. గుడ్డు పెట్టోకోడికి తెలిస్తింది దాని బాదేందో. కడుపు నిండినోడు లచ్చ సెప్తాడు.” ముక్కు చీదాడు. పై గుడ్డతో వొత్తుకున్నాడు.
బక్కోడి మనసులో చెలరేగుతున్న తుఫాను. కడుపులో అక్కసంతా కక్కెయాలన్న తపన.అతడి ముఖంలో స్పష్టంగా తెలుస్తూంది.
రెండు క్షణాలు - మౌన సామ్రాజ్యం.
” నీళ్ళు తాగుతావా ” అడిగాను.
“వొద్దు “అన్నడు.
“భయపడడం ఎందుకు ? బాధ ఏదయినా వుంటే చెప్పేయాలి. దాచుకుంటే అది యింకా బాధపెడుతుంది ” అన్నాను.
” ఎం చెప్పమంటావు బాబూ ! రైతుగా బతికిన నేను యిప్పుడూ రైతుకూలీ నయినాఅని సెప్పనా? సదుంకునే పిలగాణ్ని ఆటో వోణ్ణి సేసానని సెప్పనా? అత్తింట్లో వురి బాదలు పడలేక నా బిడ్డె….” బక్కయ్య గొంతులో పెల్లుబికిన దుఃఖం.
“వురిబోసుకుని సచ్చిందనిచెప్పనా ?” భోరున ఏడ్చాశాడు బక్కయ్య.
అతని వీపు నిమిరాను.”రిలాక్స్ … రిలాక్స్… కొంచెం ఓర్చుకోండి బక్కయ్యా ! ప్లీజ్ ! కొంచెం గుండె దిటవు చేసుకొండి” అన్నాను.
దెయ్యం పట్టినవాడిలా చెప్పుకు పోతున్నాడు బక్కయ్య.
“వున్న కయ్యా కాలవా అపు కింద జమసేసుకున్నా దరమపెబువులు గురించి సెప్పనా ?… ఇది సిన్మా కత గాదు . దైర్నం వుంటేరా. ఎందురో నాలాంటి బక్కోళ్ళు రైతులుగా బతికినోళ్ళు యిప్పుడు కూలీజేసుకుని పొట్టనింపుకుంటా వుండారు. సూపిస్తాను పదబ్బా. సముద్రాలు ఎన్ని గావాల వాళ్ళ కండ్ల నీళ్ళు నింపడానీకు.”
గుండెలు పగిలేలా ఏడ్చేశాడు బక్కోడు.
“కట్” అన్నాను. కెమరాలు ఆగాయి.
నీళ్ళు తెప్పించాను రెండు గుటకలు వేశాడో లేదో ఎగపోసుకుంటున్నాడు. ఆస్మా పేషేంట్ లా వూపిరి పీలుస్తున్నాడు. చెమట్లు పోస్తున్నాయి బక్కోడికి ఏసిలో లో వున్నా…. నాకు భయమేసింది
అట్లా గస పోసుకుంటూనే బక్కోడు చెప్పడం ప్రారంభించాడు. కెమరాలు కదిలాయి.
” గుట్టుగా బతకతా వుంటి సామీ! యీడికి తీసుకొచ్చి ఏల జనాల ముందు నా బతుకును పడేస్తిని. ఇది న్యాయమా! ఇంకేం మొగం బెట్టుకొని వూర్లోకి పోవాల ? యీ పాడు మోగాన్ని నా బాసేలికి ఎట్టా సూపాలి? నా పిలగోడు సూతే వోడు గుండెలు బాదుకోడు? యో ముదనట్టపు బతుకు యింకోద్దు దేముడా! ఎవడూ రైతుగా పుట్టొద్దు. అట్టా పుట్టినా వందలూ ఏలూ ఎకరాలుండే ఆసాముల యిండ్లలో పుట్టండి. సత్తవ లేని సత్తకాలపు సత్తయ్యల్లా పుట్టకండి.
చెమట్లు కారడం ఎక్కువయ్యాయి బక్కోడికి.
“బక్కోడా! బక్కోడా!…. లే పోదాం డాక్టర్ దగ్గర కెళ్దాం అన్నాను.
” మనసులూ గుండెలూ యిగిరి పోయాక డాక్టర్లు ఏంజేస్తారు బిడ్డా ! తండ్రి ! నామాలసామీ ! నన్ను సేదుకో ….సేదుకో
“అమ్మా ! ” అంటూ గుండెలు అదుముకొని కుషన్ కుర్ఛిలో తల వాల్చేశాడు బక్కోడు.కెమరాలు వాటంతటవే ఆగిపోయాయి యీ దృశ్యాన్ని చూసి.
జిగేల్ జిగేల్ మనే కాంతి స్థానంలో నైరాశ్యపు చీకటి అలుముకుంది.
“108 కు ఫోన్ చేయండి ” ప్రొడక్షన్ కంట్రోలర్ కేక.
పరుగులు …. పరుగులు….. భూమి కంపించినట్టు స్టూడియేలో వురుకులు … పరుగులు….
“ఈ యింటర్యూకు ముగింపు లేదు. “పసలేని ఒక గట్టి నిట్టూర్పు నిడిచి బక్కోడిని భూజానికెత్తుకుని లిఫ్ట్ లో కి వచ్చాను.
బక్కోడిలాంటి బడుగు జీవితాల్లాగే లిఫ్ట్ కిందికి జారుతూంది.

ఒక్క అభిప్రాయం

  1. నారాయణ 14 ఆగస్టు 2010 , 1:22 pm

    ఇది ప్రసార మాధ్యమాల తీరు పైన వదులుతున్న వ్యంగ్యాస్త్రమా, లేక గ్రామీణ పేదల యధార్థ జీవిత చిత్రణమా, లేక రెండూనా? అన్నది స్పష్టంగా లేదు. బక్కోడి పాత్ర వాడిన భాషలోని ప్రాంతీయత సహజమైనదే కావొచ్చు, కానీ కథలోని నాటకీయత పరంగా చూస్తే బక్కోడి పాత్ర చిత్రణలోనే నేటి ప్రసార మాధ్యమాల అమానవీయత ఛాయలు కనబడి, రచయితకూడా ఈ అమానవీయతకు అతీతం కాదు అన్న భావన కల్గుతుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)