దిగులు లేదు
ఎంత చీకటి పడనీ
ఈ అడివి దారి
ఈ చీకటి వంతెన
అలవాటు కాకపోతేనేం?
దీన్ని దాటడానికే
ఈ శరీరాన్ని కూడదీసుకున్నా.
2
గుర్తేనా నీకు?
ఏ మునిమాపు పొలం లోనో
చెట్ల గుబురు లొ చిక్కడిపోయి
వొక వెర్రి పాట పాడుకుంటూ
చీకటిని దాటేయ్యడం?
3
వొక్కో సారి
దిక్కులు మారిన ప్రయాణంలో
వెనక్కి తిరగాల్సిన ముఖంమీద
అనేక భయాల ముడతలు
సంశయాల నీడలు
మరణమే
ఈ క్షణానికి నయమనిపించే దిగాలుతనం
గుర్తేనా నీకు?
4
మధ్యలోనే బతుక్కి
ఎర్ర జండా వూపి
వొక మిత్రుడు
మరీ భయానకమయిన ఆ పొద్దుట
రైలు పట్టాల మీద ముక్కలయి
కనిపించినప్పుడు
ఏ పదాలు రాసుకున్నానని?
వొక్క మాటా పెగల్లేదు కట్టెదుట.
5
మధ్యలోనే ప్రయాణాలు
ఆగిపోవడం
ఈ బతుక్కి కొత్త కాదు కదా?!
6
మరీ బలహీనమయిన రాత్రి
అతను - ఎవరైతేనేం ?
నిశ్సబ్దంగా పై దూలానికి
నిండయిన తన శరీరాన్ని
వేలాడ దీసి వొక చివరి నవ్వు
మా మొహాల మీద రువ్వి వెళ్ళిపోయినప్పుడు
అప్పుడయినా ఏం చేశామనీ?
వాక్యాలన్నీ చేతలుడిగిపోవడం తప్ప.
7
చిరునవ్వు
సగంలో తెగిపోవడం
అప్పటికింకా కొత్తే !
అయినా సరే..
చెయ్యడానికేమీ లేదుగా!
8
చిన్న చీకట్లు
పెద్ద మరణాలు ఎలా అవుతాయో
ఎప్పటికీ అర్ధం కాదు
కొన్ని మరణాలు
పెద్ద చీకటిలా ముసురుకోవడం
రోజూ తెలుస్తూనే వుంది.
9
నాన్నా,
చివరి సారిగా నీళ్ళతో కడగమని
అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి
నెట్టిన ఆ మరణ క్షణం నిన్న రాత్రి కలలో.
నిద్రలోంచి తెగిపడ్డాను
గాఢమయిన చీకట్లోకి.
10
ఏడుస్తూ వుండిపోయాను
తెల్లారే దాకా.
చీకటీ వంతెనా
దిగులు పొలాలూ
ఖాళీ ఆకాశాలూ
అన్నీ నువ్వే.
అనగలనా..దిగులు లేదు…అని
అలవాటు కాని చీకటిలో
నిలబడి. 2009
*
నాన్న లేనితనాన్ని భరించడం ఎవరికైనా కష్టమే.. ఆ ఒంటరితనం జీవితాంతం వెంటాడుతూనే వుంటుంది. కవితలోని ఆర్థ్రత ఆ చెమ్మతనం ఎదను భారం చేసాయి..
హ్రుదయ్యాన్ని తాకీ గొప్ప కవిత
తీరా అవతలి తీరానికి చేరాక విరిగిన వ0తెన,కవిత రాసుకున్నాక చేజారిన పదాలు,ఊరిచివరిదాకా వెళ్ళాక మళ్ళీ రమ్మన్న కబురు,బతకమని ఇంత ఊపిరి పోసాక,” ఉ0టా”నని వెళ్ళిపోయిన నాన్న..ఓ పేద్ధచ్చీఖట్ట్ని దాటుకొని చాలాబారాటి దిగులు దీపపు కీనీడలో తెల్లారితే ఏ “అమ్మ” నడిగినా చెప్పదా “నాన్న” ఎటు వెళ్ళాడో..!
“నాన్నా,
చివరి సారిగా నీళ్ళతో కడగమని
అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి
నెట్టిన ఆ మరణ క్షణం నిన్న రాత్రి కలలో.
నిద్రలోంచి తెగిపడ్డాను
గాఢమయిన చీకట్లోకి”.
………..
నిన్న రాత్రి పొద్దు పోయేదాకా
ఏవేవో కమ్మని కబుర్లు చెప్పి
తెల్లారకుండానే జివ సమాధి లోకి జారుకున్న
మా నాన్నను మళ్ళి గుర్తుకు తెప్పించి ఏడిపించటం
అఫ్సర్ జీ !మీకు భావ్యమేనా!