నడక నేర్పిన నా కవితలు
నగరాల చుట్టూ సున్నాలు చుట్టి
శూన్యంలో తలదూర్చి ఏడ్చి
ఎదిగిన ప్రపంచ పౌరుల
అపుడే పుట్టిన
పురిటింటి కేకల
ఆరని మంటల కథలు
కన్నీటి గంటల రొదలు
వినిపిస్తున్నాయ్
మంచి చచ్చి పుచ్చిన మానవతలో
శవాలుగా మిగిలిన మనుషుల
ఆశల చరమ శ్వాసల చూసి జాలిపడి
వారి వెన్ను పూసలుగా మారి
వారిని నిలబెడుతున్నాయ్
నా సమస్య ప్రపంచంలోకి నడిపిస్తున్నాయ్
విశ్వ స్మశాన వీధుల్లోచావని గాధల్లో
పసిబిడ్డల భావికాంతి స్వప్నాలలో
మనిషికోసం వెక్కి వెక్కి
తరతరాలుగా విలపిస్తున్నాయ్
సైనికులు మనుషులని
ప్రేమానురాగాల బందీలని మరచి
నిర్దయగా చీమలుగా ఎల్లలచుట్టూ నిలిపి
నలిపేసిన అధినేతల్ని కాలదన్ని
కలకాలం జగతునేలే ఆత్మలు
కాలానికి ప్రతిబింబాలు
కవులనీ కవితాగతులనీ
వినిపిస్తున్నాయ్
వెన్నెల ఉమ్ములో పూసంకిలాల మురుగులో
పురుగులుగా తిరిగే కళాప్రియుల్ని
వెన్నంటికరిచి మెడలువిరిచి
ముసుగులేని నిజంవైపు అసలు బ్రతుకు ఆశవేపు పరుగెత్తిస్తున్నాయ్
వంచనల సంకుచిత సహజీవనాల్లో
కుంచించుకుపోయి జాతీయమతాలు నెమరేసే
యుగాల రోగ పీడితుల్ని
పండితుల్ని పశువుల్ని నపుంసక భావులు
నా కవితలు
నా సమస్యా ప్రపంచంలోకి నడిపిస్తున్నాయ్