పచ్చటి చిరునవ్వు మీద పిడుగు పడ్డ వూహ
బతకడం కోసం పీలుస్తున్న వూపిరిలో మృత్యుక్రిమి
నదుల్లో విషం ప్రవహించడం విషాదం కాదు
నదుల్ని విషాలతో విలీనం చేయడమే నిర్యంత్రితం

వర్షం కురవని ఆకాశాన్ని నిందిస్తూ కూర్చొని
వర్షాన్నడ్డగించే కాలుష్యాన్ని పెంచుకుంటూ పోయేచోట
నింగీ నీరు నేల నిప్పూ గాలి మాత్రమే కాదు
దేహమంతా కాలుష్యపు గోడౌనైపోతుంది
వేడెక్కుతున్న వాతావరణపు వడదెబ్బ
భూగోళాన్ని తాకి జీవితం విధ్వంస ప్రవాహమైతే
నీ యేడంతస్తుల మేడ నీడనే మృత్యువు మకామేస్తుంది
పురుగుల మందులు తిని హాలాహలం నిక్షిప్తమై వుంటుంది
విన్పించుకునే చెవుల్లో గుబిలి
ఆలోచించాల్సిన మెదడు నిండా మట్టి
చూడాల్సిన కళ్ళపైన నిర్లక్ష్యపు పొర
దేహం చావుచెట్టుగా పెరుగుతున్న సజీవ చిత్రం
జాగర్తపడాల్సిన సరిహద్దు రేఖను అతిక్రమిస్తూ
ప్రమాదం అంచు మీద పుట్టిన రోజు పండగా?
కల బద్దలైపోతున్న క్షణాన్నైనా
నిద్రమేల్కోనడం మరిచిపోతే ఎలా?
నీడనివ్వని ఆకాశం కింద నిలబడ్డం కన్నా
జానెడు గుంత తవ్వి చీమంత విత్తు నాటండి
రేపటి మీ తరాన్ని వొక చెట్టుపచ్చగా ఆహ్వానిస్తుంది!

ఒక్క అభిప్రాయం

  1. thummala devarao 22 డిసంబర్ 2010 , 9:50 am

    మ్మమీ కవిథ చాలబగుంది మీ రచనల్లొ జీవిథమ వుంతుందిమ

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)