అది జూలై 14వ తేదీ. ఉద్దానం బీల భూముల్లో నెత్తురింకిన రోజు. జనం మూకుమ్మడిగా, ఉప్పొంగుతున్న సముద్రంలా పవర్ ప్రాజెక్టు గూండాల్నీ, అన్యాయంగా విరుచుకుపడ్డ పోలీసుల్నీ ఎదుర్కొన్న రోజు. తెలుగువాళ్ళు పోరాటాల పురిటిగడ్డ సిక్కోలును గుర్తుచేసుకున్న సందర్భం.

uddanam.JPG

కళింగ సీమ ఎర్రమట్టినేల. తెలుగునాట అడవులూ, కొండలూ, బీల భూములు ఎక్కువగా ఉన్న చోటు ఇదే. జమిందారీ ప్రాంతమూ ఇక్కడే ఎక్కువ. ప్రజల్లో బీదరికమూ ఎక్కువే. దోపిడీ పెచ్చుపెరిగివుంది. కనుక ప్రతిఘటన కూడా తీవ్రస్థాయిలో జరిగిన చరిత్ర యీ సీమకుంది.

తెల్ల షావుకార్ల చెప్పుల్లో నల్ల షావుకార్లు కాళ్లు పెట్టుకుని ఇవాళ మన మీద దాష్టీకం చేస్తున్నారు. ఈ నల్ల షావుకార్లు అమెరికావాడి అడుగులకి మడుగులొత్తుతున్నారు. ఈ దోపిడీలో భాగంగానే అణు విద్యుత్ కేంద్రాలూ, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు ప్రజల జీవనాధారాలయిన తంపర, బీల (చిత్తడి) భూముల్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

తంపర భూముల వల్ల తాగునీరు, సాగునీరు పుష్కలంగా దొరుకుతుంది. వరి రెండుపంటలు పండుతుంది. మత్స్య సంపదతో మత్స్యకారుల బతుకులు వెళ్ళమారుతాయి. కాని ఈ ప్లాంట్ల నిర్మాణం వల్ల మత్స్యకారులకీ బతుకు భారమే అవుతుంది. ఈ పరిశ్రమలు విద్యుత్ ఉత్పత్తి కోసం సముద్ర జలాల్ని వాడుకుని తిరిగి సముద్రంలోకి వదిలేస్తాయి. కాని ఆ వేడినీటిని జలచరాలు భరించలేవు. అంతేకాదు ఈ నీటిని సముద్రంలోకి వదిలే చోటు అల్లకల్లోలంగా మారుతుంది. దాని వల్ల జలచరాల పునరుత్పత్తి తగ్గిపోతుంది.

ఈ ప్రాజెక్టుల దగ్గర్లోనే తేలినీలాపురం పక్షుల అభయారణ్యం ఉంది. ఏటా కొన్నివేల రకరకాల పక్షులు దేశ దేశాల్నుంచీ ఇక్కడకి వస్తాయి. వాటికి తంపరలో దొరికే చేపలూ, క్రిమికీటకాలే ఆహారం. ఈ ప్రాజెక్టుల వల్ల అవి దొరకడం అసాధ్యం. పర్యావరణం నాశనమవుతుంది. పర్యావరణ పరిరక్షణ సమితి ఈ విషయంలో ఆందోళన చేస్తోంది. పబ్లిక్ హియరింగ్‌లో మహిళలు, రైతులు, చిన్న దుకాణదార్ల దగ్గర నుంచీ పెద్ద వ్యాపారస్తుల దాకా ముక్తకంఠంతో ‘ఈ ప్రాజెక్టులు మాకొద్దు. మా జీవనాధారం పోతుంది’ అని ఎలుగెత్తి చాటారు. పబ్లిక్ హియరింగ్ అనేది పెద్ద ఫార్సుగా మారింది. ప్రజాభిప్రాయాన్ని పాలకులు ఎప్పుడు ఖాతరు చేశారు గనుక?

మోసపూరితంగా ఈ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. చేపల చెరువులు తవ్వుతామని చెప్పి రైతుల్ని మభ్య పెట్టి, కొన్నిభూముల్ని కొన్నారు. ఇది మోసమని గుర్తించి మిగిలిన రైతులు భూములు అమ్మ లేదు. ఈ లోగా నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సిసి) భూమి కొలతలు సోంపేటలో ప్రారంభించిన రోజున వాళ్ళ డేరాలను ప్రజలు తగులబెట్టారు. పోలీసులు అరెస్ట్ చేసి తప్పుడు కేసులుపెట్టారు. జూలై 14 ఎన్‌సిసి భూమిపూజ చేసి, పునాదులు తవ్వేందుకు తయారయ్యారు.

విశాఖ చుట్టు పక్కల్నుంచీ 600 మంది కిరాయి గూండాల్నీ పోగుచేసి, అన్నిసౌకర్యాలూ (!) అమర్చి తర్ఫీదిచ్చారు. రెండు రోజుల ముందు నుంచీ వేలాది పోలీసులు వీధుల్లో కవాతు చేస్తూ భయానక వాతావరణాన్ని కల్పించారు. పోలీసులు ఒక కరపత్రం వేసి, జనాన్ని ఆయుధాలు (కర్రలు వగైరా) లేకుండా శాంతియుతంగా బీల భూమి దగ్గర కొచ్చి మాట్లాడమని ప్రచారం చేశారు. స్కూలు పిల్లలకి కూడా పంచారు. 246 గ్రామాల ప్రజలు నిరాయుధంగా తమ సంప్రదాయం ప్రకారం చేతులు జోడించి నమస్కారాలు పెడుతూ వెళ్ళారు.

ఇంతమంది జనాన్ని చూసి అధికారులు దిమ్మతిరిగి తిరిగి పొమ్మని ఆదేశించారు. ‘మేం వెళ్ళం, చావో బతుకో తేల్చుకోవాల్సిందే’ నన్నారు. ఎన్‌సిసి గూండాలూ, పోలీసులు కర్రలతో చావమోదారు. ఆడవాళ్ళని తొడల దగ్గరనుంచీ చీల మండల దాకా నిర్దాక్షిణ్యంగా బాదారు. మగవాళ్ళని తల మీదా, భుజాల మీదా కాళ్ళ మీద తీవ్రంగా నెత్తురు కారేదాకా కొట్టారు. బాష్పవాయువు ఒదిలారు. ఈ లోగా జనం పక్కనున్న సరుగుడు చెట్లకర్రలు సంపాదించి తిరగబడ్డారు. దాంతో పోలీసధికారులు తెల్ల జెండా ఊపి ‘పనులు ఆపేసి అందరం వెళ్ళిపోదాం’ అని ప్రకటించారు.

నిజమే కాబోలు అనుకుని దెబ్బల్ని తడుముకుంటూ కుంటుకుంటూ జనం రోడ్డెక్కారు. ఈ లోగా జీపుల్లో వెళ్తూన్న పోలీసధికారులు, శాంతియుతంగా వెళ్తూన్న జనం మీద గుళ్ళు పేల్చారు. గున్న జోగారావు చెవిలోంచి తూటా దూసుకుపోయి రెండోచెవిలోంచి బయటకొచ్చింది. ఆస్పత్రికి తీసుకుపోగానే ప్రాణాలు విడిచాడు. లక్కవరం వాస్తవ్యుడు గొనప కృష్ణమూర్తికి కూడా గుండు తగిలి మరణించాడు. ఇది జూలై 14న జరిగిన సంఘటన.

విశాఖ నుంచి ఆరుగురం నిజనిర్ధారణ బృందంగా ఈ నెల 18న సోంపేట వెళ్ళాం. ముందుగా పలాసపురం పోయాం. కాల్పులకి గురయిన గున్న జోగారావు ఇంటికి పోయాం. అతను కూలిపని చేసి సంసారాన్ని పోషించేవాడు. అతని భార్య జగదాంబ. కూతురు స్రవంతి డిగ్రీ రెండవ సంవత్సరం, కుమారుడు నవీన్ ఇంటర్ రెండవ సంవత్సరం బారువా కాలేజీలో చదువుతున్నారు. ఊళ్ళో చాటింపు వేశారు- బీలకి అందరూ రావాల్సింది అని అందుకని పనిలోంచి ఇంటికి రాగానే జోగారావు బీలకి వెళ్ళాడు.

అందరితో కలిసి తిరిగి వస్తుంటే పోలీసధికారి కాల్చడంతో మరణించాడు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే కాంపెన్సేషన్ చెక్కు ఇవ్వబోతే జగదాంబ ‘ఈ సొమ్ములు నా భర్త ప్రాణాన్ని ఇవ్వలేవు. నా కొద్దు’ అన్నదట. పిల్లలకి చదువులు, ఉద్యోగాలు కూడా యిప్పిస్తానని ఆవిడ హామీ ఇచ్చిందట. ‘నా భర్త జనంకోసం చనిపోయాడు. అయినా ఇప్పటికీ పవర్ ఒద్దనే అంటాను. నా భర్త విగ్రహం పెట్టి తరతరాలు చెప్పుకోవాలి. పవర్ మాత్రం ఒద్దు. నా పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లల మంచి కోసమే పవరొద్దు’ అని నిబ్బరంగా చెప్పింది జగదాంబ.

‘మాది ఓదార్పు యాత్ర కాదమ్మా. సంఘీభావ యాత్ర. మీకు తోడు గా మేముంటాం’ అన్నాం. అక్కణ్ణుంచీ సోంపేట ఆస్పత్రికి పోయి క్షతగాత్రుల్ని పలకరించాం. మండే శరత్‌చంద్రుడు- కమిటీ ప్రెసిడెంట్. పెద్ద వయసు. ఆయన్ని ప్రత్యేకంగా పట్టుకుని గూండాలు, పోలీసులు కొట్టారు. తంబే తాతయ్య- 70ఏళ్ళ వృద్ధుడు. సోంపేట వాసి. భార్య రాజమ్మతో కలిసి ఆస్పత్రికి వస్తుంటే కొట్టారు. ‘మాకేం ఫర్వాలేదమ్మా. దెబ్బలు తగిలినా చచ్చిపోయినా ప్లాంటు రాకుండా చూడండి బాబూ’ అని తాతయ్య అంటే మా కళ్ళు చెమ్మగిల్లాయి.

పిన్నింటి లక్ష్మీనారాయణ (17) పలాసపురం యువకుడు. తొడలో గుండు దూసుకుపోయింది. తూటా తీసి కట్లు కట్టారు. బండి నాగేశ్వరరావు (48) పలాసపురం వాసి. చేతుల మీద, కాళ్ళ మీద లాఠీ దెబ్బలు. దేవళ గోపాలరావు (32) రిక్షా కళాసి; ఏలేటి పైడయ్య (50) తాపీ కార్మికుడు; భానుమూర్తి పాణిగ్రాహి (55) వంటపుట్టి గ్రామస్తుడు. కొంచెం వ్యవసాయం ఉంది.

ఈయన తలమీద లాఠీలతో బాగా మోదారు. తలనుంచి ముఖం మీదకి నెత్తుటి ధారలు కట్టాయి. లక్కవరం స్త్రీలు- తెమలి పార్వతి, సిరిమమ్మలను ఒళ్ళంతా కమిలిపోయేలా కొట్టారు. సోంపేట వాసులు కె.రాజు, కె.రమేష్, పత్తిరి రవి-ఈ మొత్తం పదముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ఒక్కసారే రొట్టె పెడతారు. రాత్రివేళ ఏమీ ఇవ్వరు. తిండి, మందులు సరిగా సమకూర్చలేని పాలకులు ప్లాంటులు కట్టి, ప్రజల జీవితాలకు భరోసా కల్పిస్తారట! నమ్మాల్సిన నిజాలేనా ఇవి? ఒక్క గొల్లగొండి గ్రామంలోనే 60 మంది స్త్రీలని దారుణంగా కొట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

రెక్కల కష్టం మీద బతికే వీళ్ళ కాళ్ళ చేతులకి తగిలిన కవుకు దెబ్బలతో ఎలా పనిపాటలు చేసుకోగలరు? డేరాలు తగులబెట్టిన సందర్భంలో 40, 50 మంది కిరాయి ఫోటోగ్రాఫర్లని అధికారులు తీసుకొచ్చారు. వాళ్ళు మీడియా వాళ్ళనుకుని జనం భ్రమించారు. వాళ్ళు ఫోకస్ చేసిన ప్రకారం ప్రజల్ని అరెస్టు చేసి కేసులు పెట్టారు.

అందువల్ల ఈసారి (14న) వచ్చిన ఫోటో గ్రాఫర్ల (మీడియా) కెమెరాల ను వీళ్ళూ కిరాయి వాళ్ళనుకుని విరగ్గొట్టారు. ఎన్‌సిసి వాళ్లు మీడియా వాళ్ళకి లంచమిచ్చిన మోటార్ సైకిళ్ళని కసి కొద్దీ తగల బెట్టారు. ‘సింహాద్రి పవర్ ప్లాంట్ విశాఖపట్నం నడిబొడ్డున కట్టాం. ఒక్కళ్ళ ప్రాణాలు పోలేదే! ప్లాంటుల వల్ల మనుషులు చచ్చిపోతారని ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం ప్రజల వలసలను ఆపడానికి ప్లాంటులు కడుతున్నాం. వాళ్ళ కి ఉద్యోగాలొస్తాయి. మేమేమీ వాళ్ళ భూములు తీసుకోలేదు.

వాళ్ళ బతుకులు బాగుపడడానికే ఇవి నిర్మిస్తున్నాం’ అని మంత్రివరేణ్యులు దంగిరి మాటలు సెలవిచ్చారు. పరవాడ వెళ్ళి చూడండి. అన్నం వండుకున్నాక తినేముందు మూత తీసి చూస్తే ప్లైయాష్ (బూడిద) నల్లగా ఒకపొర పేరుకుని వుంటుంది. ఆరోగ్యాల్ని పాడుచేస్తూ రకరకాల జబ్బుల్ని మోసుకొస్తుంది. కేన్సర్, పసిపిల్లల పెరుగుదలకి ఆటంకం, ఆక్సిజన్ కొరత భోపాల్‌లోలాగ శాశ్వతరోగాల బారిన పడతారు. అభివృద్ధి, సంక్షేమం ఇలాగ కలగచేస్తాయి యీ ప్రభుత్వాలు!

ఇంతవరకు బాధితుల్ని పరామర్శించనైనా పరామర్శించని పాలకుల్ని సోంపేట ప్రజలు విశ్వసించగలరా? అసలు బీల, తంపర భూముల్ని బాధ్యత గల మంత్రులూ, ముఖ్యమంత్రి పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవలసిన పనిలేదా? ‘అత్యాచారాన్ని ప్రతిఘటించడమే హింస అయితే, చెమటోడ్చి పండించుకున్న పంట బూడిద కాకుండా రక్షించుకోవడం హింస అయితే, పేదవాడి గుండె కొట్టుకోవడం కూడా హింసే’ నని ప్రఖ్యాత ఉర్దూ రచయిత కిషన్ చందర్ అన్నాడు. హింసకి పాల్పడే పాలకులు ‘హింసాయుతంగా కాకుండా శాంతియుతంగా రమ్మని’ సోంపేట ప్రజల్ని కోరి హింస ని ప్రయోగించడం ఏమి న్యాయమని పిలుద్దాం?

- కృష్ణాబాయి

సౌజన్యం: ఆంధ్రజ్యోతి సంపాదకీయం

3 అభిప్రాయాలు

  1. pAlana 17 ఆగస్టు 2010 , 1:41 am

    ప్రతి దానికి అమెరికాని, అమెరికావాడ్ని తిట్టడం ఇండియా వాడికి ఓ పరిపాటైపోయింది. అది చేతకాని తనం. ముందు మీ బంగారం బాగుందో లేదో చూసుకోకుండా, కంసాలినెందుకు తిట్టడం? అన్నింటికీ అమెరికా కావాలి. అమెరికా డాలర్లు కావాలి. కొడుకులు అమెరికా వెళ్ళాలి. అమెరికా అళ్ళుల్లు కావాలి. అమెరికా కార్లు కావాలి. అమెరికా ఇండియా నట్టింట్లో ఉండాలి. మీ రాజకీయ నాయకులు (గౌతు లచ్చన్న లాంటి ముదనష్టపు)మిమ్మల్ని అమ్ముకుంటున్నారు, తాకట్టు పెడుతున్నారు, తారుస్తున్నారు. వాళ్ళ వీపులు సాపుచెయ్యండి ముందు. ఎక్కడ సరిపెట్టాలో అక్కడ సర్దండి. అనవసరంగా మీ పెన్నులో సిరాని, మీ మెదడులో తెలివిని, మీలో శక్తిని వృధా చెయ్యవద్దని ప్రార్ధన.

    –పాలన

  2. sivalakshmi 26 ఆగస్టు 2010 , 11:42 am

    పాలన గారికి,
    మీరు పొరబడ్డారని చెప్పటానికి చింతిస్తున్నాను.
    మీరు చెప్పిన డాలర్లు ,కార్లు , నట్టింట్లో అమెరికా కావాలనుకునేవారు
    ఆర్ధికంగా కాస్తంత ఎదిగి తమ పిల్లల్ని చదివించుకోగలిగిన మధ్యతరగతివారు.కాని అక్కద సోంపేట లో పోరాడుతున్నది రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.బాధ్యత గల పౌరులు వాళ్లతో కలిసి ప్రశ్నించాలి.లేకపోతే కనీసం మద్దతు గా వాళ్ల పక్షాన నిలబడాలి.ఆ ప్రజల జీవనాధారాల్ని అన్యాయం గా నాశనం చేస్తున్న కంపెనీ ల మూలాలు ఎక్కడున్నాయో చెప్తే తప్పెలా అవుతుంది? అందులో అమెరికా ని తిట్టడం ఏముంది?
    క్షమించండి.మీరనుకున్నట్లు ఈ రచయిత్రి కొడుకులూ,అల్లుళ్లూ ఎవరూ అమెరికా లో లేరు.అమె కూతుళ్లూ-అల్లుళ్లూ అక్కడే ఉండి అన్ని రకాలు గా పేదల తోనే ఉన్నారు ఆమె కు డాలర్లు తెలియదు.కార్లు అంతకన్నా లేవు.డేబ్భై ఏళ్లు పై బడిన వయసు లో, రక రకాల బాధల్లో ఉండి కూడా నిజ నిర్ధారణ కమిటీ లో ఒకరు గా వెళ్లి ప్రజల గోడు విని రాశారు.ఏ.పి. లో ఎవరైనా నాలాంటివారే కాదు,రజనీ(శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు),చే.రా.మాస్టారు లాంటి వారినెవరినడిగినా అమె నిజాయితీ,నిబద్ధత ల గురించి చెబుతారు.
    చివరిగా మా రాజకీయ నాయకుల వీపులు సాపు చెయ్యడం ఏ ఒక్కరి చేతిలోనూ ఉండదు.అందరికీ చైతన్యం రావాలి.

  3. roshni 23 సెప్టెంబర్ 2010 , 12:52 pm

    బాగ చెప్పావు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)