వెంకటేశ్వరస్వామిని అమ్ముకుని బతికే పూజారులను అధికారులను మనం ఇవాళ చూస్తున్నాం. అయితే వెంకటేశ్వరస్వామిని నమ్ముకుని మాత్రమే బతికిన కవి తాళ్ళపాక అన్నమాచార్యుడు.అన్నమయ్య భక్తకవి. అయితే ఆయన ఏనాడూ సమాజాన్ని విస్మరించి మాట్లాడలేదు. ఆయనది భావవాదమే . సృష్టి కర్త మీద విశ్వాసం ఉన్న కవే.
“కుమ్మరి వాడులేకే కుండ లేబుట్టేనా
నెమ్మినీవు పుట్టించక నేనే బుట్టితినా”
“అతని మూలమే జగమంతానిది”
అని గట్టిగా నమ్మినకవి అన్నమయ్య. అన్నిటికే విష్ణువునే కర్తగా నమ్మిన అన్నమయ్య సంఘంలోని ఆనారోగ్యకర ధోరణులను ఎత్తి చూపడానికే నిరంతరం కృషి చేసాడు. సామాజిక రుగ్మతలన్నిటినే హరి భక్తే సరైన మందని భావించి, దానినే ప్రచారం చేశాడు. అది మందు అవునా కాదా అన్నాదానిమీద భావ, బౌతిక వాదుల మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. అయితే ఆరువందల ఏళ్ళ క్రితమే ప్రజల భాషలో , ప్రజల వాణిలో సామాజిక రుగ్మతలను ఎత్తి చూపిన కవిగా అన్నమయ్యను గుర్తించాలి. రోగనిదానం సరిగ్గానే చేసిన అన్నమయ్య వైద్యం దగ్గరికి వచ్చేసరికి భావవాదంలో పడిపోయాడు. అది వేరే విషయం.
హిందూమతం, మనువాదం - వీటి భౌతిక స్వరూపమైన వర్ణ - కుల వ్యవస్థ. దీనికి ఆధిపత్యం వహించే భూస్వామ్య వర్గం - దీని స్వార్థం - ఇవి సమాజానికి తెస్తున్న కీడూ - వీటిని అన్నమయ్య జాగ్రత్తగా గుర్తించాడు. ఆస్థాన కవులు కీర్తించే రాచరికాన్ని అన్నమయ్య ధిక్కరించాడు. అస్థాన కవులు కీర్తించే కుల వ్యవస్థను అన్నమయ్య తిరస్కరించలేదుగాని, కుల వివక్షను వ్యతిరేకించాడు. మనువాదం భారతీయ సమాజాన్ని కులసమాజంగా స్థిరీకరించి అధి భ్రష్టుపట్టిపోయిన దశలో, విదేశీ పాలకులు భారత దేశంలో స్థిరపడి వాళ్ళ మతాలకు అనుగుణంగా ప్రజల్ని మల్చుకొనే క్రమంలో హిందూ మతం బలహీనపడుతున్న నేపథ్యంలో, జనం కుల ప్రాతి పదికన, దైవారాధన ప్రాతిపదికన చీలిపొయి జాతి నిర్వీర్యమౌతున్న సమయంలో అనేక దైవారాధనాలతో జనం చీలిపోతున్న సందర్భంలో అన్నమయ్య చలించిపొయి కలం పట్టాడు.
ఏ దేవుని పేరు చెప్పి మనువు వర్ణ వ్యవస్థను శాశ్వతం చేశాడో, ఆ దేవుని మీది భక్తితోనే అన్నమయ్య వర్ణవివక్షను వ్యతిరేకించాడు. దేవుడు మంత్రానికి, బ్రాహ్మణులకు ఆధీనులనే వాదాన్ని తిరస్కరించి దేవుడూ భక్తాధీనుడని చాటాడు అన్నమయ్య. ఒక రకంగా అన్నమయ్య దేవుని అల్పసంఖ్యాకుల చెరనుంచి తప్పించి సార్వజనికం చేశాడు. దేవుని మానవీకరించాడు. భారత దేశ వ్యాప్తంగా మధ్య యుగాలలో భక్తి ఉద్యమం ఉప్పెన గా వచ్చింది. ఆంధ్ర దేశంలో అన్నమయ్య ఆ ఉద్యమ ప్రతినిధి. భక్తకవులు భక్తులుగా ఉంటూనే సమాజంలో సంస్కరణలను ప్రతిపాదించారు. నిలవనీటి మడుగుగా ఉన్న సమాజానికి ప్రవాహ గుణం తీసుకొచ్చాడు. అన్నమయ్య వెంకటేశ్వరుని మీద భక్తిని అన్ని రోగాలకు మందుగా ప్రచారం చేశాడు. భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న అన్నమయ్యకు అవసరం లేదు. అన్నమయ్యకు దేవుడున్నాడు .ఆయన సృష్టిలో ఆర్థిక అసమానతలు, సాంఘీక వివక్షలు, స్వార్థం వంటి రుగ్మతలకు చోటు లేదని ఆయన భావించాడు . అందుకోసం తన పదాలలో సంస్కరణ భావాలను ప్రచారం చేశాడు.
దేశంలో అనేక దేవతారాధనలు కొనసాగుతున్న సమయంలో బయటి నుంచి ఏకేశ్వరోపాసన చేసే మతం ప్రవేశించింది.అందువల్ల హిందువులలో ఏకేశ్వరోపాసనను ప్రచారం చెయ్యవలసిన చారిత్రక అవసరం ఏర్పడింది. అన్నమయ్య ఆ అవసరాన్ని గుర్తించి “బ్రహ్మమొక్కటే” అని నినదించాడు. కుల వ్యవస్థ విస్తృత రూపాన్ని సంతరించుకొని, నిరంకుశమై ప్రజల మధ్య సహజంగా ఉండవలసిన సంబంధాలు విచ్ఛిన్నమై ఆర్థిక వైరుధ్యాలు ఏర్పడిన సమయంలో అన్నమయ్య బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహించాడు.
” జంతు కులమంతా నొకటే ” అని సిద్ధాంతం చేశాడు అన్నమయ్య. “సానుజాతమయ్యే సకల కులము ” అని వేమన అనడానికి 250 ఏళ్ళకు ముందే అన్నమయ్య అన్నాడు. రాజు నిద్ర, బంటు నిద్ర ఒకటేనని , బ్రాహ్మణుడు, చండాలుడు తిరిగే నేల ఒకటేనని, దేవతలకు , పశువులకు కామ సుఖమొకటేనని, ధన వంతునికి, పేదవానికి రాత్రింబవళ్ళు ఒక్కటేనని, శిష్టాన్నానికి దుష్టాన్నానికి ఆకలి ఒకటేనని దుర్వాసనను, సువాసనను మోసే గాలి ఒకటేనని, ఏనుగు మీద, కుక్క మీద పడే ఎండ ఒకటేనని - ఇలా ప్రకృతి లో లేని వివక్ష సంఘంలో ఉండకూడదని ప్రబోధించాడు అన్నమయ్య.
కర్మ పేరు చెప్పి , దైవం పేరు చెప్పి విస్తృత మానవాళి జీవితాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకొనే పురోహితచర్యకు ప్రతి చర్య అన్నమయ్య కవిత్వం.
” బ్రహ్మమనగ వేరే పరదేశమున లేడు
తన్ను తానెరిగిన దానెబో బ్రహ్మంబు ” అని వేమన చెప్పకముందే అన్నమయ్య
“మనసున నమ్మనేర్చితే మనుజుడే దేవుడంచు
తనలోనె వున్న వాడు తావు లేని దైవము”
అని చాటాడు. ఆత్మ సకల వ్యాపకమని అనుకుంటే జాతి, కుల అభిమానాలను గురించి చర్చించవలసిన అవసరమే లేదని చాటాడు.
“కులముకన్న మిగులగుణము ప్రధానంబు” అని వేమన చాటకముందే , అన్నమయ్య
“కొంచెమును ఘనముంగనుకొననేల ? హరిందలంచు
పంచ మహాపాతకుండె బ్రహ్మణోత్తముండు”
అని ప్రకటించాడు. కులానికి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అన్నది క్రీ.శ. 15 శతాబ్దం నాటికి విప్లవాత్మకమైన ఆలోచన. నన్నయ్య తన భారతంలో ఉదంకోపాఖ్యానంతో ” నిండుమానంబు” పద్యంతో కులాన్ని బట్టి గుణ ముంటుందని చెప్పాడు. దీనిని అన్నమయ్య తిరస్కరించాడు. కుల వ్యవస్థ సృష్టించిన సంఘర్షణను తగ్గించడానికి అన్నమయ్య వెంకటేశ్వర భక్తిని సాధనంగా చేసుకున్నాడు. అగ్ర వర్ణాల వాళ్ళను ఆధిపత్య భావననుంచి, కిందికి దించి . కింది కులాల వాళ్ళను ఆత్మన్యూనతనుంచి పైకిలాగి, ఇద్దరినీ ఒకే కేంద్రబిందువు దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అన్నమయ్య.
మల్లికార్జున రాయలును, అతని పినతండ్రి కొడుకును విరూపాక్షరాయలు, ఇతనిని ఇతని పెద్ద కొడుకు, ఈ పెద్ద కొడుకును తమ్ముడు ప్రౌఢ రాయలు, ఇతనిని సాళువ నరస నాయకుడూ చంపి రాజ్యధికారాలను హస్తగతం చేసుకున్నాడు. ఈ రక్త చరిత్రను అన్నమయ్య చూశాడు. అధికారం కోసం , అందలం కోసం హత్యలకూ వెనుకాడని రాజుల దుర్మార్గాలను సహించలేదు అన్నమయ్య.
“వెఱుతు వెఱుతు నిండు వేడుక పడనిట్టి
కుఱుచ బుద్ధులనెట్లు గూడుదురయ్య
దేహమిస్తున్నవాని దివిడి చంపెడువాడు
ద్రోణి గాక నేడు దొరయట
తోడబుట్టిన వాని తొడరి చంపెడువాడు
చూడ దుష్టుడు గాక సుసృతియుట……
కొడుకు నున్నతమతిగోరి చంపేడు వాడు
కడుపాతకుడుగాక ఘనుడట
తల్లి జంపెడువాడు తలప దుష్టుడుగాక
యెల్లవారల కెల్ల నెక్కుడట….
అని అధిక్షేపించాడు అన్నమయ్య. సాళువనరసింహుని ఆఙ్ఞను ధిక్కరించిన ఘనత అన్నమయ్యది.
స్వార్థం , కపటం , అత్యాశవంటి దుష్టలక్షణాలు మన సమాజంలో అన్నమయ్య కాలానికే ముదిరిపోయాయి. ఆ సంఘాన్ని అన్నమయ్య సంస్కరింప బూనుకొని కొన్ని వందల సూక్తులను రూపొందించాడు. అప్పటి సమాజంలో కులం, ధనం సృష్టిస్తున్న వైరుధ్యాలను అన్నమయ్య గమనించాడు. ఆ రెండు ఆధిక్యతలు మంచివి కావని చాటాడు.
” కులమెంత గలిగిన కూడించు గర్వంబు
ధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు
ఘన విద్య గలిగినను కప్పు పైపై మదము
సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు”
వేదాంత ప్రవాననాల బరువుతో మన చానెళ్ళు మనల్ని గూనివాళ్ళుగా తయారు చేస్తున్నాయి. ఆచరణ సాధ్యంగాని వేదాంతం చెప్పడంలో భారతీయ వేదాంతాలు ప్రపంచంలోనే అగ్రగ్రాములు. ఆచరణలోకి వచ్చేసరికి వాళ్ళు చాలా నేలబారు మనుషులుగా మిగిలిపొతారని ఇటీవల అనేక సంఘటనలు రుజువు చేశాయి ఇలాంటి వాళ్ళను
“చెవ్ప్పుడుమాటలే చెప్పుగొనుటగాక
చెప్పినట్లు దాము సేయరెవ్వరును “
అని అన్నమయ్య ఆనాడే దెప్పిపొడిచాడు. నాటి సమాజానికి ఇదొక జాటి దెబ్బ, ఒక ములుగర్రపోటు. ఇతరులకోడును నిరంతరం కోరేవాళ్ళు, ఇతరుల కష్టాలు కలిగించే వాళ్ళు , ఇతరులకు కష్టాలు కలిగితే సంతోషించే వాళ్ళు మనకు కనిపిస్తారు. వాళ్ళలో ఈర్ష, అసూయ, ద్వేషం వంటి దౌర్జన్యాలు పుష్కలంగా ఉంటాయి.అన్నమయ్య ఈ రకం జనానికి కూడా రాత పెట్టాడు. వాళ్ళ జన్మే వృధా అనే దాకా వెళ్ళాడు అన్నమయ్య.
పరుల మనసునకు నాపదగలుగజేయ
బరితాపకరమైన బ్రదుకేలా!
సొదిదినితరుల మేలు చూసి సైపగలేక
తిరుగుచుండేటి కష్టదేహమిద్యేలా?
ఆర్థిక వైరుధ్యాలను అన్నమయ్య ఏ మాత్రం సహించనట్లు కనిపించడు. భూస్వామ్య వ్యవస్థకు ఆర్థిక సాంఘిక అసమానతలు రెండుకళ్ళు. వీటిని అన్నమయ్య నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. కొంత మంది జీవితం కష్టాలమయం , మరి కొందరికి సుఖాలజాలం కావడాన్ని ఆయన గమనించాడు.
” పాటెల్ల నొక్కచోనుండు, భాగ్యమెక్కచోనుండు
యీటువెట్టి పెద్ద తనం వెంచబనిలేదు”
“అతి సంపదలు దేహన ఙ్ఞానిసేయు
అన్న ,మదమున చిత్తమగపడదు”
అన్ని అన్నమయ్య ఆర్థిక కేంద్రీకరణ దుష్పలితాల పట్ల అనాడే హెచ్చరించాడు.
భారతీయే వేదాంతం భారత జాతిలో సోమరితనాన్ని పెంచిన మాట వాస్తవం. కర్మ,జన్మ,పునర్జన్మల సిద్ధాంతం మనిషిని కర్తవ్య విముఖున్ని చేసింది. ప్రజల శ్రమ మీద ఆధారపడి బతికిపోయే సోమరిపోతుల్ని కూడా స్పష్టించింది. కొందరు కష్టపడి సృష్టిస్తుంటే కొందరు కూర్చొని తినే వాళ్ళుగ తయారయ్యారు. అలాంటి వాళ్ళనూ చూశాడేమో అన్నమయ్య.
“మహినుద్యోగి గావలె మనుజుడైన వాడు” అని భోధించాడు. అదే సమయంలో అన్నమయ్య సుఖాల కోసం పరుగు పెట్టే భోగలాలసులకు వైరాగ్యాన్ని కూడా బోధించాడు. సంపాదన కోసం దేశాన్ని తాకట్టు పెట్టాడానికి, అమ్మేయడానికి, దేశరహస్యాలు బయట దేశాలకు అందించడానికి వెనకాడని దశకు మనం చేరుకున్నాం. పెళ్ళిళ్ళలో విందులలో దుర్భరమైన భోజనాలు, అవసరానికి మించిన అంతస్తుల భవనాలు, వేదాంతం బోధించే బాబాలకు ఎకరాల కొలదే భనవాలు , సిగ్గూ , మర్యాదలు పోయినా ఫరవాలేదు ధన వంతులైపోతే చాలు- ఇలా ఉంది నేటి మనుషుల తీరు. ఈ బాపతు జనాలకు అన్నమయ్య ఏమైనా బోధించాడా అని వెతికితే ఈ పదం దొరికింది.
అప్పులేని సంసారమైనపాటేచాలు
తప్పులేని జీతమొక్కతారమైన జాలు”
కంతలేని గుడిశెక్క గంపంతయినజాలు
చింతలేని యంబలొక్క చారడేచాలు
జంతగాని తరుణి యే జాతైన నది చాలు
వింతలేని సంపదొక్క వీసమేచాలు”
తిట్టులేని బ్రతుకొక్కదినమైన నదెచాలు
ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు
గుట్టుచెడి మనికంటే కొంచెపుమేలైనచాలు
వట్టిజాలి బడుకంటే వచ్చినంతేమేలు…..
భౌతికవనరుల మీద పెత్తనానికి దేశాలు, రాజ్యాలు , కులాలు , వర్గాలు పోటీ పడుతున్న స్వార్థపరులు ఈ పదాన్ని చదువుతారా? వెంకటేశ్వరస్వామి చుట్టూ మూగి నానాయాగీ చేస్తున్న వాళ్ళు ఆయన పేరు మీద అన్నమయ్య రాసిన ఈ పదాన్ని చదువు తున్నారా? మనిషి కోసం సంపదగాని, సంపదకోసం మనిషి కాదన్నవాస్తవాన్ని ప్రపంచీకరణ జ్వరంలో పడికొట్టుకుపోతున్న వాళ్ళు గమనిస్తారా? నాబోటి నాస్తికులకు అన్నమయ్య పదంలోని పధ్నాలుగు పంక్తులలో చివరి రెండు పంక్తులతో పేచీ ఉండవచ్చు . తక్కిన పంక్తులతో ఆయన లొకరీతినే చాటాడు.
అన్నమయ్య తాత్వికంగా భావవాది
కవిగా సంస్కరణవాది.
వ్యాసము బాగుంది.