ఆమె ఎవరై ఉంటుందీ ? ఎక్కడో చూసినట్లనిపిస్తోంది కానీ, వివరాలేం గుర్తుకు రావడం లేదు… అరగంట నుండి నా మెదడులో ఇదొక్కటే ఆలోచన తొలుస్తోంది. నలభై రెండేళ్ళకే నాకు మతిమరుపు వచ్చేసిందాని - అదో బెంగా! గొప్ప వాళ్ళింట్లో పెళ్లి జరుగుతూ ఉంటే - అక్కడ జరుగుతున్న వింతలూ , విశేషాలూ చూట్టం మానేసి కేటరింగ్ టీమ్ తో వచ్చిన లేడీ సర్వర్లలోని ఒకామెని చూసి , నేనింతగా ఆలోచించడం నాకే వింతగా ఉంది.
ఆమె వయసు ముప్ఫై - ముప్ఫై ఐదేళ్ళు మధ్యలో ఉండవచ్చు. ఏదో తెలియని ఆకర్షణ ఆమెలో ఉంది. ఎందుకోగాని ఆమె పూర్ణత్వం సిద్ధించిన స్త్రీలా అనిపించింది. మనకు కలిగే అనుభూతులన్నీటికీ తార్కికమైన కారణాలను అన్ని సందర్భాలలోనూ వెతకలేం. ఆమె మాత్రం నన్ను గుర్తించి, తప్పించుకు తిరుగుతున్నట్లుగా అనిపిస్తొంది. లేకపోతే .. నేనలా ఊహించుకుంటున్నానా?
ఇంకొంచెంసేపిలాగే ఆలొచిస్తూ ఉంటే బుర్ర వేడెక్కిపోయి కపాలం పేలిపొవచ్చనిపించింది. బలవంతంగా నా దృష్టిని పరిసరాల వైపు సారించేను.
పెళ్ళి తంతు నడుస్తూనే ఉంది. పళ్ళ రసాలూ, కూల్ డ్రింక్స్ , ఫలహారాలూ హాలులోకే సరఫరా చేస్తుండడంతో - పొట్టపూజలో అతిధిలు బిజి బిజీగా ఉన్నారు. అక్కడ జరుగుతున్న పెళ్ళి సందడి చూసినా, వచ్చిన అతిధుల హోదా చూసినా నేనిక్కడ ఉండ తగ్గవాణ్ణి కాదనిపిస్తోంది.
మా సహోద్యోగి విష్ణు పుట్టినప్పుడే రెండు చేతుల్తో నోట్ల కట్టలను పట్టుకోని, భూమ్మీద అడుగు పెట్టాడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కాబట్టి ఏదో కాలక్షేపానికి జాబ్ చేస్తున్నాడంతే ! ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదలయ్యే కొత్త మోడల్స్ - అది కారు , మొబైల్ ఫోన్, కళ్ళజోడు, పెన్ను , డ్రెస్సు.. ఏదైనా కావచ్చు - కొనేయడం, వాటిని ప్రదర్శించడానికి తను పని చేసే ఆఫీసును ఓ వేదికగా వాడుకోవడం - ఇదీ అతని హాబీ!
విష్ణు అన్నగారు అమెరికాలో చాలా కాలం క్రిందటే సెటిలై పోయేడు. ప్రస్తుతం జరుగుతున్న పెళ్ళి అతని కూతురుదే. తమ తమ సంపదనలను ప్రదర్శించడంలో అన్నదమ్ముళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు.
మధ్య తరగతికి చెందిన నాబోటి వాళ్ళు ఈ కృత్రిమ వాతావరణంలో ఇమడడం కష్టమే . ఒకసారి వాచీ వంక చూసుకున్నాను. రాత్రి తొమ్మిది దాటినా, మిరుమిట్లుగొలిపే లైట్ల వలన పట్టపగల్లా ఉంది.
ఇంకో గంటా దాటితే మా కాలనీకి వెళ్ళే ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోతుంది. ఏదో ఇంత గతికితే బయట పడొచ్చుకదాని - “భోజనాల సంగతి చూద్దాం పదండి”ని మా స్నేహితులతో అన్నాను. ఏ కళనున్నారో - వాళ్ళంతా వెంటనే సెల్లారులోని డైనింగ్ హాలు వైపు కదిలారు.
అక్కడ ఈ మంచి సూటూ బూటూ వేసుకున్నాయన వచ్చి ” వెల్కమ్ సార్ ! ఇక్కడ రాజస్థానీఛాట్, ఆ తర్వాత చైనీస్ స్పెషల్స్,థాయ్ ఫుడ్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, డిజర్ట్స్, ఐస్ క్రీం, ఫ్రూట్ సలాడ్ …” అంటూ వివరించడం మొదలు పెట్టేడు.
ఛాట్ కౌంటర్ దగ్గర రాజస్థానీ సాంప్రదాయ దుస్తులలో స్త్రీ పురుషులున్నారు. ఆంధ్రా వంటకాలు దగ్గర లంగా, ఓణీలతోనూ, చీర జాకెట్టులతో స్త్రీలూ, పట్టు పంచెలతో పురుషులూ, చైనీస్ ఫుడ్ కౌంటర్లలో చైనా అమ్మాయిలూ అబ్బాయిలూ - ఇలా దేశ విదేశాలకు చెందిన యువతీ యువకులతో ఆ ప్రాంతమంతా కళ కళ లాడుతూ ఉంది. వడ్డన పనిని ప్రధానంగా యువకులే చేస్తున్నారు. పురుష అతిథుల కళాపోషణ కోసమే అంత మంది యువతులను అక్కడికి తీసుకొచ్చినట్లునిపిస్తోంది. ఆ అమ్మాయిలంతా చేసేదేమీ లేక - నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ సందడి చేస్తున్నారు. ఆత్మ గౌరవాన్ని చంపుకొని, తమ అందచందాలను ప్రదర్శించడానికి వచ్చిన ఈ అమ్మాయిలు ఎంతటి మానసిక క్షోభను అనుభవిస్తారో కదా అని అనిపించింది నాకు.
అక్కడి వాతావరణ మంతా పరమ అనాగరికంగా అనిపించింది. తినాలని కూడ అనిపించడం లేదు.
నేను ఇబ్బంది పడటం చూసి, మా మోహన్ రావు నా వైపు తిరిగి ” తింగరాడిలా.. … ఏదిబడితే అది తినేయకు. ఒక్కొక్క కౌంటరు ముందు ఒక్కొక్క ఎటికేట్ ని పాటించాలి” అన్నడు. దాంతో మరింత భయం పుట్టి - నా చేతిలోని ప్లేటు వణకడం ప్రారంభించింది. లాభం లేదనుకుని నేను నెమ్మదిగా ఆంధ్రా భోజన స్పెషల్ కౌంటర్ దగ్గరకు జారుకున్నాను. అక్కడ వడ్డించే స్త్రీల కట్టుబాట్లన్నీ తెలుగు సాంప్రదాయానుసారంగా ఉన్నాయి.
ఆమె మళ్ళీ అక్కడ ప్రత్యక్షం కావడంతో- నాలో ఆందోళన ప్రారంభమైంది. మరీ తీక్షణంగా ఆమె వంక చూస్తే అమర్యాదగా ఉంటుందనీ, అటు ఇటూ చూసి, ఎవరూ గమనించట్లేదు అని అనిపించినప్పుడు - ఆమె ముఖంలోకి చూసి గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను… ఒక్క సారి మెరుపు మెరిసినట్లయింది. గుర్తుకొచ్చింది ! ఈమె నా ఫ్రెండు నగేష్ భార్య కదూ ! అనుమానం లేదు…… యస్… ఈమె శోభే ! పలకరింపుగా నవ్వేను. ఆమె ముఖం చిట్లించుకుంది. ఎంత ఆర్థిక ఇబ్బందులతో ఉంటె మాత్రం, పోయి పోయి ఇలాంటి పరువు తక్కువ ఉద్యోగమా చేసేదీ!
నాకు తిండి సహించలేదు. నగేష్ పదే పదే గుర్తు కొస్తున్నాడు… పదహారేళ్ళ క్రితం నేనూ నగేషూ ఓ ప్రభుత్వరంగ పరిశ్రమలో కల్సి పని చేస్తుండే వాళ్ళం. ప్రభుత్వం హఠాత్తుగా మా కంపెనీని చౌకగా అమ్మేసి, మేం పనిచేస్తున్న బస్ బాడీ విభాగాన్ని మూసి పడేసింది. దాంతో మేమంతా రోడ్డున పడ్డాం. మా యూనిట్ ను తిరిగి తెరిపించడానికి యూనియన్ తరపున మేం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నగేష్ యూనియన్లో కీలక పాత్ర వహించడం వలన - అతను మరింతగా కుంగిపోయేడు.
మా మావగారికి అధికార పార్టీ వాళ్ళతో కాస్త సత్సంబంధాలుండడంతో నాకు వెంటనే మరో మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది.
నగేష్ ఎక్కేగుమ్మం, దిగే గుమ్మంగా అనేక కంపెనీల చుట్టూ తిరిగి, తిరిగి - ఉద్యోగం ఎక్కడా దొరక్క , విసిగి వేసారిపోయాడు. ఏవో చిన్న చిన్న వ్యాపారాలు చేసి చేతులు కాల్చుకున్నాడు.
ఓ నాలుగు నెలల క్రితం నగేష్ మా ఇంటికి వచ్చేడు. మనిషి జీవకళ ఏమాత్రం లేదు. దిష్టి బొమ్మలా ఉన్నాడు. ఎంత చిన్న ఉద్యోగమైనా - ఆఖరికి అటెండరుగానైనా చేస్తాననీ , సాయం చేయమనీ నన్నెంతగానో ప్రాధేయ పడ్డాడు. వీడి అవతారం చూసేక , ఎవడు మాత్రం ఉద్యోగం ఇస్తాడులే అని మనసులోనే అనుకున్నాను. అతడి నుండి దారిద్ర్యం కంపుకొడుతొంది. వెంటనే పంపేయకపోతే అది అంటు వ్యాధిలా నాక్కూడా సోకుతుందేమోననిపించింది.
ఇదంతా గుర్తొచ్చి నగేష్ మీద మరింత కోపం వచ్చింది. తనకి ఉద్యోగం దొరక్కపోతే మాత్రం భార్యని ఇలాంటి దిక్కుమాలిన పనులకు పంపిస్తాడా ? పాపం, అందుకే ఆమె నన్ను తప్పించుకు తిరగడానికి నానా అగచాట్లు పడుతోంది.
నా అనుమానాన్ని తొలగించుకోటానికి ఆమె దగ్గరకు వెళ్ళి ఎక్సక్యూజ్ మీ, మీరు మా ఫ్రండ్ నగేష్ భార్య శోభనే కదా ! అన్నాను.
ఆమె నా వంక అదోలా చూసి “శోభా ?! మీరు పొరబడుతున్నట్లున్నారు. మనిషిని పోలిన మనుషులు లోకంలో ఏడుగురుంటారంటారు… సారీ , మేం ఇలా గెస్టులతో మాట్లాడితే - మా మేనేజరు గారు కోప్పడతారు ” అంటూ అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయింది.
మా కొలీగ్స్ తిండి యావలో పడి నన్ను పట్టించుకోవడం మానేసారు. ఆమె ఆచూకీ ఎలాగైనా కనిపెట్టాలని పట్టువదలని విక్రమార్కుడిలా - గట్టి ప్రయత్నం చేయాలనిపించింది నాకు.
పనీ పాటా లేకుండా, రాట్నంలో కండెలా అటు ఇటూ తిరుగుతున్న కేటరింగ్ మేనేజర్ని కలిసేను. ఆమెను దూరం నించే చూపించి “ఆమె పేరేమిటండీ ?” అన్నాను.
మేనేజర్ నన్ను కాస్త పక్కకి తీసికెళ్ళి ” మీది గొప్ప టేస్ట్ సార్ ! ఆమె పేరు శోభ , పక్కా ఫ్యామిలీ టైప్. మీకు రూముందా ? అది కూడా మేమే ఎరేంజ్ చేయాలా ?…..” అంటూ ఏమిటేమిటో మాట్లాడేస్తున్నాడు.
నాకు షాక్ తగిలినట్లయ్యింది. ఒక పక్క - ఆస్తులెక్కువై పెళ్ళి పేరిట ప్రదర్శించే ధనిక పురుషులు. ఇంకోపక్క - పస్తులకు తట్టుకోలే - ఒళ్ళును ప్రదర్శించే బీద స్త్రీలు. వల్గర్ డిస్ ప్లే ఆఫ్ వెల్త్ అండ్ పావర్టీ ఎట్ వన్ ప్లేస్ !
నాకు తిండి సహించక బయటకి వచ్చేశాను. నేనిప్పుడో ధర్మసంకటంలొ పడ్డాను. ఈ భయంకరమైన నిజాన్ని మా ఫ్రండ్ నగేష్ కు చెప్పాలా ? వద్దా ? చెబితే - ఈ ఘోరాన్ని జీర్ణించుకోలేక వాడు భార్యను హత్య చేసి, ఆపైన తను ఆత్మహత్య చేసుకుంటే ! రోజూ పేపర్లో ఇలాంటి వార్త లెన్ని చూడటం లేదు!
అలా అని ఈ నిజాన్ని నాలోనే దాచుకుంటే స్నేహితుడికి అన్యాయం చేసినట్లు కాదూ ! ఆలస్యంగానైనా, ఈమె అనైతిక ప్రవర్తన గురించి మరెవ్వరి ద్వారా నైనా నగేష్ కి తెలియకుండా ఉంటుందా? ….ఇలా ఎంతొ సేపు తర్జన భర్జన జరిగాక. చివరికి ఈ సంగతి నగేష్ చెవిలో వేయడమే స్నేహితుడిగా నా ధర్మమనిపించింది.
*********** *******************************************
వారాంతంలో వీలుచేసుకుని నగేష్ ని కలవాలని బయలుదేరాను. మా పాత కంపెనీ సహోద్యోగుల సాయంతో - నగేష్ ప్రస్తుతం అద్దెకుంటున్న ఓ స్లమ్ ఏరియా వివరాలు తెలిసాయి.
స్థానికుల సాయంతొ మా ఫ్రెండు ఇంటిని కనుక్కోవడం సులభమైంది. అదో రేకుల షెడ్డు. తలుపు తెరిచే ఉంది. షెడ్డులోపల - ఒంటి ఇటుకతో గోడ, దాని వెనక వంట చేసుకోవటానికి ఏర్పాటు ఉండి ఉంటుంది.రేకుల తలుపు గొళ్ళెంతో చప్పుడు చేసాను. ఆ శబ్ధానికి గోడవెనుక నుండి ఓ ఆకారం పైకి లేచింది. అతి కష్టం మీద నగేష్ ని పోల్చుకోగలిగేను.
నన్ను గుర్తుపట్టి నగేష్ నీరసంగా ఓ నవ్వు నవ్వేడు. మాసిన గెడ్డం , మురికి గుడ్డల్లో అతను నా కంటే ఓ పదేళ్ళు పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. ఆ ఇంట్లో నాకు శోభే కాదు, శోభ కూడ కనిపించలేదు.
నగేష్ ని తీసుకుని నేను బయటికి నడిచేను.కష్టమైనా ఎలాగోలా అసలు విషయాన్ని వీలైనంత క్లుప్తంగా అతనికి వివరించేను.
అంతా విన్న నగేష్ నా వంక ఎంతో అసహ్యంగా చూసి “ఏరా ! నీకిప్పుడు సంతోషంగా ఉందా ? ఎంత ప్రాధేయపడినా నాకో చిన్న ఉద్యోగం చూపించలేకపోయేవు. ఇంతకాలంగా నేను బతికానో, చచ్చేనో తెలుసుకోలేదు. నా భార్య ఒళ్ళు అమ్ముకుంటోందని తెలుసుకుని, చంకలెగరేసుకుంటూ వచ్చేవు. మా దిగజారుడుతనానికి సంతోషంగా ఉందా ?”అన్నాడు.
నాకు నగేష్ మీద బాగా కోపం వచ్చింది.నేనో మధ్యతరగతి జీవిని . వేరేవాళ్ళకి ఉద్యోగాలిప్పించేంత సీన్ నాకుంటుందా ? ఆ పని చేయ్యాల్సింది ప్రభుత్వం…..
నగేష్ నా వంక వేలు చూపిస్తూ ” కదా ! …. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలిప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పుడు - ఏ దారీ లేక జనం ఆకలి బాధ తట్టుకోలేక , ఏం చేసినా దానికీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుంది” అన్నాడు.
“ఖర్మ” ! నేను మనసులో అనుకుంటున్నాననుకుని పైకే అనేసానా, ఏమిటీ ?!
నగేష్ కింకా ఆవేశం తగ్గలేదు. ” ఏదో మార్గంలో నా భార్య ఆ మాత్రం సంపాదిస్తోంది కాబట్టే - నేనూ నా బిడ్డలూ ఇంకా ప్రాణాలతో నిలబడ్డాం. లేకుంటే - ఆకలికి తట్టుకోలేక కుటుంబం మొత్తం ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండే వాళ్ళం. భర్త ప్రాణాలను కాపాడిన సావిత్రి సాధ్వి అయినపుడు - నా భార్య మాత్రం సాధ్వి ఎందుక్కాదు? ఈ కరువు కాలంలో చావకుండా ఉంటానికి ఏం చేసినా నీతే !”
నగేష్ కళ్ళ నుండి నీళ్ళు. ” నా భార్య కంటే ముందు, ప్రభుత్వం ప్రయివేటు వాడితో వ్యభిచరించింది. దానికంటే ముందు …” ఆపైన మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడ్చేడు.
నాకు మొహం చెల్లక అక్కడ్నించి తప్పించుకుని బయట పడ్డాను. నాకు జ్వరం తగిలినట్లయింది. ఆమె ‘తప్పు ‘ చేయడానికంటే ముందు, నాతో సహా చాలా మంది వాళ్ళ విషయంలో చాలా చాలా తప్పులు చేశారు. ఆ తప్పుల్ని సవరించడానికి నా స్థాయిలో నేనేం చేయగలనా అని ఆలోచనలో పడ్డాను.
అంటలో శోభ రోడ్డు మలుపు తిరిగి, తమ షెడ్డు వైపు వస్తోంది. నన్ను చూసి ఎన్నాళ్ళయ్యిందన్నయ్యా నిన్ను చూసీ! వదినా, పిల్లలూ బావున్నారా ? అంటూ పలకరించింది.
వెంటనే నేను ” అవునమ్మా.. నిన్ను చూసి సంవత్సరాలు దాటిపోయేయి ” అన్నాను.
వాళ్ళు పరువుగా బతకటానికి నేనెలానూ సాయపడలేకపోయేను. కనీసం వాళ్ళ పరువు కాపాడటం కోసమైనా సాయపడాలి కదా !
కథ simple గా ఉన్నా కథనం, కథాగమనం బాగున్నాయి. simply superb అంటే సరిగ్గా సరిపోతుందేమో!!
తన సంపదను ప్రదర్శించడానికి విష్ణు ఆఫీసును ఒక వేదికగా వాడుకోవడం, ఒకే ప్రాంగణంలో ఒక పక్క సంపద ఎక్కువైన కారణంగా జరుగుతున్న ధనప్రదర్శన, మరో పక్క పేదరికం కారణంగా జరుగుతున్న శరీరప్రదర్శన అంటూ వర్ణించడం చాలా బాగుంది!!
కానీ నాకు catering పనిలో పరువు తక్కువ ఏముందా అని మాత్రం ఒక్కటిరెండు సార్లు అనిపించింది!! ఐనా అది కూడా సహజంగానే సరిపోయింది!! మన మధ్యతరగతి కుటుంబాల ఆలోచనాధోరణికి ఆ ఆలోచన బానే సరిపోయింది.
చివర్లో నగేష్ మాత్రం తన పేదరికానికి కారణం రచయిత తనకు ఉద్యోగం చూపెట్టకపోవడమే అన్న అర్థం వచ్చేలాగ మాట్లాడడం, మగవాడై ఉండి, కూలిపని చేసో, పాలేరు పని చేసో, ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని నడపాల్సిన నగేష్ బాధ్యతలను పెళ్ళాం మీదకు వదిలేసి తమ దుస్థితికి వేరొకళ్లను (రచయితను) బాధ్యులను చేస్తున్నట్టు మాట్లాడటం — ఇవన్నీ కూడ బాగున్నాయి. కూలోనాలో చేసి కుటుంబాన్ని పోషించకుండా పెళ్ళాం చేత వ్యభిచారం చేపించే మనిషి ఆలోచనాధోరణికి అది బాగ suit అయ్యింది!!
మొత్తంగా కథ చాల బాగుంది!! మీ నుంచి మరిన్ని కథలు ప్రజాకళలో రావాలని ఆశిస్తున్నాం!!