జూలై 10 వ తారీకున “పౌరహక్కుల నాయకులు కన్నాభీరాన్, బుర్రా రాములు సంస్మరణ సభ” ను సామాజిక చైతన్య వేదిక, తెలంగాణ డెవలప్ మెంటు ఫోరం మరియు యువ రేడియో సంయుక్తంగా డల్లాస్ నగరంలో వాలీరాంచ్ లైబ్రరీ లో నిర్వహిస్తున్నాయి. యీ కార్యక్రమంలో “పౌరహక్కుల ఉద్యమం పై కన్నాభీరాన్ ముద్ర” వాసిరెడ్డి నవీన్, కథాసాహితి సంపాదకులు, “భారత దేశ మానవహక్కుల చరిత్ర లో కన్నాభీరాన్”-నర్రిసెట్టి ఇన్నయ్య, సీనియర్ పాత్రికేయులు, మానవహక్కుల ఉద్యమంలో బుర్రా రాములు పాత్ర-కేసీ, ఏడో సారా కథ: పరిచయం-దినేష్, “ప్రజా ఉద్యమాల పైన మిలటరీ ప్రయోగం”-సాజీ గోపాల్ మరియు చంద్ర కన్నెగంటి ప్రసంగం.
“24 గంటలు” పుస్తకం పైన చర్చ వుంటుంది. ప్రజాస్వామికవాదులకు, డల్లాస్ నగర వాసులకు ఇదే మా ఆహ్వానం.
ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించి, పోలీసు దౌర్జన్యాలను నిలదీసి, మానవహక్కుల ఉద్యమాన్ని నిర్మించటం లో కన్నాభీరాన్ కీలకపాత్ర వహించారు. పౌరహక్కుల ఉద్యమంలో 50 సంవత్సరాలు నిరంతరం పోరాడుతూ, ప్రజాస్వామిక హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ కాపాడుతూ, అణగారిన వర్గాల గొంతుక అయ్యారు. ప్రభుత్వ నిర్భంధాన్ని సవాళ్ళు చేస్తూ కోర్టులలో 600 రిట్ పెటిషన్లు వేసారు. కళ్ళ ముందు జరిగే అన్యాయాలను ప్రశ్నించటం, న్యాయస్థానాలలో ఎండగట్టడం ద్వారా మానవహక్కుల భావజాలన్ని ఆచరణాత్మకంగా విస్తరించారు.
“రాజకీయాలను నేరంగా పరిగణిస్తున్నారు. ఎప్పుడైతే రాజకీయాలు నేరం అవుతాయో, అప్పుడే చట్టాల దుర్వినియోగం మొదలు అవుతుంది. హింసకు పాల్పడటానికి, చట్టం ఒక కుంటిసాకు అవుతుంది. ఎప్పుడైతే రాజకీయ ఉద్యమకారులను చంపుతారో, అప్పుడే మానవహక్కులు అంతం అవుతాయి.”
- కె.జీ. కన్నాభీరాన్ అధ్యక్షుడు – పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం
వరంగల్ ప్రజాస్వామ విప్లవ విదార్ధి ఉద్యమాలనుండి మానవహక్కుల నాయకుడిగా బుర్రా రాములు ప్రస్థానం చేసారు. ప్రభుత్వ నిర్భందాన్ని ఎదుర్కొంటూ, క్లిష్ట పరిస్థితులలో వరంగల్ జిల్లాలో హక్కుల ఉద్యమంలో బుర్రా రాములు కీలక పాత్రను పోషించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్రంలో ప్రొఫెసరు గా పనిచేస్తూ, చుట్టూ జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటిస్తూ, బూటకపు ఎన్ కౌంటర్లను వ్యతిరేకిస్తూ, సమాజాన్ని చదువుతూ, మానవహక్కుల కోసం నిరంతరం పోరాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక హక్కుల ఉద్యమం గా తలచి వరంగల్ జిల్లాలో పల్లె పల్లె తిరిగి మమైక్యమైనారు.
“హక్కులు చట్టాల ద్వారా రక్షింపబడవు. సమాజం, సామాజిక నైతిక స్పృహ ద్వారా మాత్రమే రక్షింపబడతాయి. చట్టాల్ని (హక్కుల్ని) అమలుపర్చుకోవడానికి సిద్ధపడే సామాజిక స్పృహ ఉండాలి అన్న అంబేద్కర్ మాటల్ని దృష్టిలో పెట్టుకొని హక్కుల అజెండాను నిర్దేశించుకోవాలి. .. ఏ కాలమైనా, ఏ వ్యవస్థ అయినా మానవహక్కుల్ని నిరాకరించినప్పుడు, నిరోధించినప్పుడు, నిర్మూలించినప్పుడు పోరాటం చేయడం పనిగా పెట్టుకోవాలి. “
– ప్రొఫెసర్. బుర్రా రాములు, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్
పౌరహక్కుల ఉద్యమ నిర్మాణంలో డాక్టరు రామనాధం, జాపా లక్ష్మారెడ్డి, అడ్వకేటు పురుషోత్తం, టీచర్ ఆజం అలీ ప్రభుత్వ హింస వల్ల హత్యకు గురయ్యారు. ఎన్నో త్యాగాలతో నిర్మితమైన మానవహక్కుల ఉద్యమాన్ని అద్యయనం చేసి, నేటి సమకాలీన పరిస్ఠితులు అన్వయించి, ప్రజాస్వామిక హక్కులు, భావప్రకటనా స్వేచ్చ, మానవతా విలువలు కాపాడుకోవటానికి ఉద్యమించాల్సిన అవసరమున్నది.
సామాజిక చైతన్య వేదిక
(Forum for Scientific Thought)
http://prajakala.org/PDF/Kannabiran_Ramulu_Commemoration_EN.pdf
http://prajakala.org/PDF/Kannabiran_Ramulu_Commemoration_TE.pdf